భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర అనేకమంది త్యాగధనుల జీవితాలతో నిండి ఉంది. కొందరు విప్లవ మార్గంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సవాలు చేశారు. మరికొందరు స్వదేశీ పరిశ్రమలను స్థాపించి, ఆర్థిక రంగంలో బ్రిటిష్ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇంకొందరు కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడారు. అలాంటి మహనీయుల్లో బటుకేశ్వర్ దత్, వీఓ చిదంబరం పిళ్లై ప్రముఖులు.
బటుకేశ్వర్ దత్ భగత్‌సింగ్‌తో కలిసి బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా విప్లవ పోరాటంలో పాల్గొంటే, వీఓ చిదంబరం పిళ్లై బ్రిటిష్ వాణిజ్య గుత్తాధిపత్యానికి సవాలు విసురుతూ భారతీయుల సొంత నౌకాయాన సంస్థను స్థాపించారు. వీరిద్దరి జీవితాలు భారత స్వాతంత్ర్య ఉద్యమంలోని విభిన్న పోరాట రూపాలను మనకు పరిచయం చేస్తాయి.
బటుకేశ్వర్ దత్
బటుకేశ్వర్ దత్ 1910 నవంబర్ 18న అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీలోని ఖండఘోష్ ప్రాంతంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పశ్చిమ బెంగాల్‌లోని పూర్వ బర్ద్వాన్ జిల్లాలో ఉంది. ఆయన కుటుంబం మధ్యతరగతి నేపథ్యానికి చెందినది. చిన్నతనం నుంచే దేశభక్తి భావాలు, బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత ఆయనలో పెరిగాయి.
భారతదేశం బ్రిటిష్ వలస పాలనలో ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య ఆకాంక్షలు బలపడుతున్నాయి.
ఒకవైపు మహాత్మా గాంధీ నాయకత్వంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన వంటి ప్రజా ఉద్యమాలు సాగుతుండగా, మరోవైపు యువతలో విప్లవ భావాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు బటుకేశ్వర్ దత్ రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేశాయి.
విప్లవోద్యమంలో ప్రవేశం
బటుకేశ్వర్ దత్ యువకుడిగా ఉన్నప్పుడే విప్లవకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్ఆర్ఏ) కార్యకలాపాల ద్వారా ఆయన విప్లవోద్యమంలోకి ప్రవేశించారు. తర్వాత ఈ సంస్థ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్ఎస్ఆర్ఏ)గా రూపాంతరం చెందింది.
ఈ సంస్థలో భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి యువ విప్లవకారులు కీలక పాత్ర పోషించారు.
వీరి లక్ష్యం కేవలం బ్రిటిష్ పాలన నుంచి రాజకీయ స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే కాదు. దోపిడీ, అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలనే సోషలిస్ట్ భావజాలం వీరి ఆలోచనల్లో ప్రధానంగా ఉండేది.
బటుకేశ్వర్ దత్‌కు భగత్‌సింగ్‌తో సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు.
పార్లమెంట్లో బాంబు ఘటన
బటుకేశ్వర్ దత్ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1929 ఏప్రిల్ 8. ఆ రోజు ఢిల్లీలోని పార్లమెంట్లో భగత్‌సింగ్‌తో కలిసి ఆయన బాంబులు విసిరారు. ఈ ఘటనకు నేపథ్యం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నించిన రెండు చట్టాలు: 1. పబ్లిక్ సేఫ్టీ బిల్లు, 2. ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు.
ఈ చట్టాల ద్వారా కార్మిక సంఘాల కార్యకలాపాలను, కమ్యూనిస్ట్ ఉద్యమాలను, ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ చర్యలను అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విప్లవకారులు భావించారు. ఈ నిరసనను దేశవ్యాప్తంగా వినిపించడానికి భగత్‌సింగ్, బటుకేశ్వర్ దత్ పార్లమెంట్లో బాంబులు విసిరారు.
సభలోని సభ్యులను హతమార్చడం కాదు, ప్రాణనష్టం కలగని విధంగా పొగ, శబ్దం సృష్టించి తమ నిరసనను వ్యక్తం చేయడమే వారి ఉద్దేశం.
బాంబులు విసిరిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించకుండా అక్కడే నిలబడి విప్లవ నినాదాలు చేశారు. “ఇంక్విలాబ్ జిందాబాద్” – “సామ్రాజ్యవాదం నశించాలి” అనే నినాదాలు మారుమోగించారు.
విప్లవ ప్రకటనలు, కరపత్రాలను సభలో వెదజల్లారు. అనంతరం ఇద్దరూ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. వారి చర్యను దేశవ్యాప్తంగా రాజకీయ నిరసనకు వేదికగా ఉపయోగించుకున్నారు.
జైలు జీవితం – రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాటం
అరెస్ట్ తర్వాత బటుకేశ్వర్ దత్‌కు జీవిత ఖైదు విధించారు. భగత్‌సింగ్‌తో కలిసి ఆయనపై విచారణ జరిగింది. జైళ్లలో భారతీయ రాజకీయ ఖైదీలకు బ్రిటిష్ ప్రభుత్వం అమానుషమైన పరిస్థితులు కల్పించేది.
యూరోపియన్ ఖైదీలతో పోలిస్తే భారతీయ ఖైదీలకు ఆహారం, దుస్తులు, పరిశుభ్రత, వైద్య సదుపాయాల్లో తీవ్ర వివక్ష ఉండేది. దీనికి వ్యతిరేకంగా భగత్‌సింగ్‌తో పాటు ఇతర విప్లవకారులు నిరాహార దీక్ష చేపట్టారు.
రాజకీయ ఖైదీలుగా గుర్తింపు కల్పించాలి, నాణ్యమైన ఆహారం అందించాలి, చదువుకోవడానికి పుస్తకాలు, పత్రికలు ఇవ్వాలి, గౌరవప్రదమైన దుస్తులు సమకూర్చాలి, అమానుషమైన జైలు శ్రమ నుంచి విముక్తి కల్పించాలి, భారతీయ, యూరోపియన్ ఖైదీల మధ్య వివక్ష తొలగించాలి అనేవి వారి ప్రధాన డిమాండ్లు.
ఈ నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ పోరాటంలో జతిన్ దాస్ 63 రోజుల నిరాహార దీక్ష అనంతరం 1929 సెప్టెంబర్ 13న మరణించారు. ఆయన త్యాగం యావత్ దేశంలో తీవ్ర స్పందనకు కారణమైంది. బటుకేశ్వర్ దత్ కూడా జైలు పోరాటంలో పాల్గొని తీవ్ర కష్టాలను ఎదుర్కొన్నారు.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల ఉరిశిక్ష – దత్‌పై ప్రభావం
1931 మార్చి 23న లాహోర్ కుట్ర కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది.
బటుకేశ్వర్ దత్‌కు జీవిత ఖైదు విధించడంతో ఆయన ఆ ముగ్గురితో పాటు ఉరిశిక్షకు గురికాలేదు. తన సన్నిహిత మిత్రుడు భగత్‌సింగ్‌ను కోల్పోయినప్పటికీ ఆయన పోరాట పంథా పట్ల నిబద్ధతను కొనసాగించారు.
తర్వాత ఆయనను అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు తరలించారు. అక్కడ కూడా రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాడారు. జైలు నిర్బంధం, కఠినమైన శిక్షలు, అనారోగ్య సమస్యలు ఆయన శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అనంతరం ఆయన విడుదలయ్యారు.
స్వాతంత్ర్యం తర్వాత బటుకేశ్వర్ దత్ జీవితం
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బటుకేశ్వర్ దత్ జీవితం ఆశించిన స్థాయిలో సుఖమయంగా సాగలేదు.
స్వాతంత్ర్యం కోసం తన యౌవనాన్ని, ఆరోగ్యాన్ని, జీవితంలోని అత్యంత విలువైన సంవత్సరాలను త్యాగం చేసినప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత లభించలేదు.
జీవనోపాధి కోసం వివిధ పనులు చేయాల్సి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడిగా ఆయన ఎదుర్కొన్న కష్టాలు మన చరిత్రలో బాధాకరమైన అంశం.
1965 జూలై 20న ఢిల్లీలో ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియలను భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల సమాధులున్న హుస్సేనివాలా వద్ద నిర్వహించారు.
§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§§
వీఓ చిదంబరం పిళ్లై
కప్పలోట్టియ తమిళన్ – బ్రిటిష్ వాణిజ్య గుత్తాధిపత్యానికి సవాలు విసిరిన స్వదేశీ ఉద్యమ నాయకుడు
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రాజకీయ పోరాటంతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటానికి విశేష ప్రాధాన్యం ఉంది.
బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని కేవలం రాజకీయంగా మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా దోచుకున్నారు. భారతీయ పరిశ్రమలు, వాణిజ్యం, నౌకాయానం వంటి రంగాలపై తమ ఆధిపత్యాన్ని నెలకొల్పారు.
ఈ ఆధిపత్యానికి వ్యతిరేకంగా భారతీయులే సొంత పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించాలనే స్వదేశీ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో వీఓ చిదంబరం పిళ్లై అగ్రగణ్యులు.
తమిళ ప్రజలు ఆయనను ప్రేమతో కప్పలోట్టియ తమిళన్ (నౌక నడిపిన తమిళుడు) అని పిలుస్తారు. జైల్లో ఆయనతో చేయించిన కఠిన శ్రమ కారణంగా సెక్కిళుత్త సెమ్మల్ అనే బిరుదుతో కూడా గుర్తిస్తారు.
బాల్యం – కుటుంబ నేపథ్యం
వీఓ చిదంబరం పిళ్లై పూర్తి పేరు వల్లినాయకం ఒళగనాథన్ చిదంబరం పిళ్లై. 1872 సెప్టెంబర్ 5న తమిళనాడులోని ఒట్టపిడారం ప్రాంతంలో జన్మించారు. ఆయన తండ్రి ఒళగనాథన్ పిళ్లై ప్రముఖ న్యాయవాది. చిన్నతనం నుంచే విద్య పట్ల ఆసక్తి కలిగిన చిదంబరం తమిళం, ఆంగ్ల భాషల్లో మంచి పట్టు సాధించారు.
న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. ఆయన వృత్తిపరమైన జీవితంలో సాధారణ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి న్యాయం అందించడానికి ప్రాధాన్యమిచ్చారు.
స్వదేశీ ఉద్యమం వైపు ప్రయాణం
1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనకు పాల్పడింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించడం, భారతీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ పరిశ్రమలను స్థాపించడం ఈ ఉద్యమంలోని ప్రధాన అంశాలు.
బాలగంగాధర తిలక్, లాలా లజపతిరాయ్ వంటి జాతీయ నాయకుల ఆలోచనలు చిదంబరం పిళ్లైపై ప్రభావం చూపాయి.
ఆయన తమిళనాడులో స్వదేశీ ఉద్యమాన్ని విస్తరించడానికి కృషి చేశారు. ఈ క్రమంలో ప్రముఖ జాతీయవాద కవి సుబ్రహ్మణ్య భారతి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య శివ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారి సహకారంతో తిరునెల్వేలి, తూత్తుకుడి ప్రాంతాల్లో ప్రజలను స్వదేశీ ఉద్యమం వైపు సమీకరించారు.
స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ స్థాపన
చిదంబరం పిళ్లై జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ స్థాపన. ఆ రోజుల్లో తూత్తుకుడి నుంచి శ్రీలంకలోని కొలంబోకు నౌకాయాన సేవలపై బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఆధిపత్యం ఉండేది.
భారతీయ వ్యాపారులు, ప్రయాణికులు బ్రిటిష్ కంపెనీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. ఈ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టాలంటే భారతీయులే సొంత నౌకాయాన సంస్థను స్థాపించాలని చిదంబరం పిళ్లై నిర్ణయించారు.
1906 అక్టోబర్ 16న స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ అధికారికంగా ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన ఉమ్మడి మూలధన సంస్థ. భారతీయుల పెట్టుబడులను సమీకరించి, భారతీయులే నిర్వహించే నౌకాయాన సంస్థగా అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. ఈ కంపెనీ నౌకలను కొనుగోలు చేసి తూత్తుకుడి–కొలంబో మధ్య ప్రయాణికులు, సరుకుల రవాణా ప్రారంభించింది.
దీంతో బ్రిటిష్ నౌకాయాన సంస్థకు ప్రత్యక్ష పోటీ ఏర్పడింది. బ్రిటిష్ కంపెనీ ఈ పోటీని ఎదుర్కోవడానికి ప్రయాణ ఛార్జీలను తగ్గించడం వంటి చర్యలకు దిగింది. అయినప్పటికీ చిదంబరం పిళ్లై వెనక్కి తగ్గలేదు.
ప్రజలు స్వదేశీ సంస్థను ఆదుకోవాలని, భారతీయుల డబ్బు భారతీయుల అభివృద్ధికే ఉపయోగపడాలని ఆయన ప్రచారం చేశారు.
ఈ ప్రయత్నం కేవలం ఒక వ్యాపార సంస్థను ప్రారంభించడం మాత్రమే కాదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆర్థిక పునాదులకు సవాలు విసరడం కూడా. అందుకే ఆయనకు తమిళ ప్రజలు కప్పలోట్టియ తమిళన్ అనే బిరుదు ఇచ్చారు.
కార్మిక ఉద్యమానికి నాయకత్వం – కోరల్ మిల్స్ సమ్మె
చిదంబరం పిళ్లై పోరాటం స్వదేశీ పరిశ్రమల స్థాపనతోనే ఆగిపోలేదు. కార్మికుల హక్కుల కోసం కూడా ఆయన గళమెత్తారు. తూత్తుకుడిలో బ్రిటిష్ యాజమాన్యానికి చెందిన కోరల్ మిల్స్ అనే వస్త్ర పరిశ్రమ ఉండేది. ఆ పరిశ్రమలో కార్మికుల పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉండేవి.
ఉదయం సుమారు ఐదు గంటలకు పని ప్రారంభించి రాత్రి ఏడు గంటల వరకు పనిచేయాల్సి వచ్చేది. తక్కువ వేతనాలు, అధిక పనిగంటలు, దుర్భరమైన పని పరిస్థితులు కార్మికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేవి.
1908లో ఈ మిల్లులో 1,695 మంది కార్మికులు పనిచేసేవారు. వారిలో 59 శాతం మంది 14–16 సంవత్సరాల వయసు కలిగినవారే కావడం అప్పటి కార్మిక పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తుంది.
ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా 1908 ఫిబ్రవరి 27న కార్మికులు సమ్మె ప్రారంభించారు. పనిగంటలను తగ్గించాలి, వేతనాలు పెంచాలి, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించాలి, వారి పట్ల యాజమాన్యం గౌరవప్రదంగా వ్యవహరించాలి అనేవి వారి ప్రధాన డిమాండ్లు.
చిదంబరం పిళ్లై కార్మికుల పక్షాన నిలబడ్డారు. సుబ్రహ్మణ్య శివతో కలిసి కార్మికులకు మద్దతుగా ఉద్యమాన్ని నడిపించారు. ఈ సమ్మెకు స్థానిక ప్రజల నుంచి కూడా విస్తృత మద్దతు లభించింది. చివరకు యాజమాన్యం కార్మికుల కొన్ని డిమాండ్లను అంగీకరించాల్సి వచ్చింది.
బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధం
చిదంబరం పిళ్లై స్వదేశీ ఉద్యమం, కార్మిక సమ్మె కారణంగా బ్రిటిష్ అధికారుల్లో ఆగ్రహం పెరిగింది. ఆయనపై రాజద్రోహ ఆరోపణలు మోపి 1908 మార్చిలో అరెస్ట్ చేశారు. ఆయనకు మొదట రెండు జీవిత ఖైదులకు సమానమైన కఠిన శిక్ష విధించారు. తర్వాత మద్రాస్ హైకోర్టు అప్పీల్లో శిక్షను తగ్గించింది.
జైల్లో ఆయనకు అప్పగించిన పని అమానుషంగా ఉండేది. సాధారణంగా ఎద్దులతో తిప్పించే నూనె గానుగను ఆయనతో లాగించారు. చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసి కఠినమైన శారీరక శ్రమ చేయించారు.
న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా గౌరవప్రదమైన జీవితం గడిపిన వ్యక్తిని బ్రిటిష్ ప్రభుత్వం ఈ విధంగా అవమానించడం వారి కక్షపూరిత వైఖరికి నిదర్శనం. అయినప్పటికీ ఆయన తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ జైలు శిక్ష వల్లే ఆయనకు సెక్కిళుత్త సెమ్మల్ అనే బిరుదు ప్రసిద్ధి చెందింది. 1912 డిసెంబర్ 24న జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదల తర్వాత జీవితం
జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయనకు సాధారణ న్యాయవాద వృత్తిని కొనసాగించడంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై విధించిన ఆంక్షలు, ఆర్థిక కష్టాలు ఆయన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ఒకప్పుడు స్వదేశీ నౌకాయాన సంస్థను స్థాపించి వేలాది మందికి స్ఫూర్తినిచ్చిన నాయకుడు, తన చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో జీవించాల్సి వచ్చింది.
తన జీవనోపాధి కోసం చివరకు తన వద్ద ఉన్న న్యాయశాస్త్ర పుస్తకాలను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆయన దేశభక్తి, స్వదేశీ భావజాలం చివరి వరకు తగ్గలేదు.
తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవలు
చిదంబరం పిళ్లై కేవలం రాజకీయ నాయకుడు, న్యాయవాది, పారిశ్రామికవేత్త మాత్రమే కాదు. గొప్ప తమిళ పండితుడు, రచయిత కూడా. తమిళ భాషా సాహిత్యానికి అనేక రచనల ద్వారా సేవలందించారు.
మేయ్యరమ్, మేయ్యరివు, తిరుక్కురళ్పై వ్యాఖ్యానం, తొల్కాప్పియంపై పరిశోధన, వ్యాఖ్యాన రచనలు, స్వీయ చరిత్ర ఆయన ముఖ్యమైన కృతులు.
జైలు జీవితంలోనే తన ఆత్మకథను పద్య రూపంలో ప్రారంభించారు. విడుదల అనంతరం దానిని పూర్తి చేశారు. తమిళ సాహిత్యంపై ఆయనకు ఉన్న పాండిత్యం, భాష పట్ల ప్రేమ ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
జైలు జీవితం, ఆర్థిక ఇబ్బందులు, నిరంతర పోరాటాల వల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. 1930వ దశకంలో కోవిల్పట్టిలో అప్పుల బాధలతో జీవనం సాగించారు. అయినప్పటికీ దేశం పట్ల ఆయనకున్న ప్రేమ, స్వాతంత్ర్య ఆకాంక్ష చివరి వరకు కొనసాగాయి.
1936 నవంబర్ 18న తూత్తుకుడిలోని భారత జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మరణించారు. తన జీవితాన్ని భారత స్వాతంత్ర్య ఉద్యమానికి అంకితం చేసిన ఈ మహనీయుడి మరణం తమిళనాడులో జాతీయవాదులకు తీరని లోటుగా మిగిలింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
