ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. ఆర్వెల్ ‘యానిమల్ ఫార్మ్’లోని పందులు, వాగ్దానాలు, ప్రచారాల ప్రతిరూపాలు ఎలా కనిపిస్తున్నాయి?
యానిమల్ ఫార్మ్ నవల చదివిన తర్వాత, అందులోని అనేక విషయాలు మనకు బాగా పరిచయమైనవేనని గుర్తించినప్పుడు, మనసులో తీవ్ర అసౌకర్యం కలిగించే ఒక వాస్తవం అర్థమైంది. విప్లవం దేనిని అంతం చేయాలని బయలుదేరిందో, క్రమంగా అదే రూపాన్ని సంతరించుకోవడం ఈ కథలోని భయానకమైన అంశం.
ఈ మార్పు ఎంత నెమ్మదిగా, ఎంత సూక్ష్మంగా జరుగుతుందంటే, అది జరుగుతున్న విషయాన్నే చాలామంది గుర్తించలేరు.
నెపోలియన్ విప్లవం విఫలమైందని ఎప్పుడూ ప్రకటించడు. అసలు సూత్రాలను, నియమాలను ఒక్కొక్కటిగా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పోతాడు. చివరికి మొదట్లో ఆ నియమాలు ఎలా ఉండేవో కూడా ఎవరికీ సరిగ్గా గుర్తుండని పరిస్థితి కల్పిస్తాడు.
కొన్ని జంతువులు మరింత సమానం
2014లో బీజేపీ ఎన్నికల ప్రచార నినాదం “సబ్కా సాథ్, సబ్కా వికాస్” (అందరి తోడ్పాటుతో, అందరి అభివృద్ధి) మీకు గుర్తుండే ఉంటుంది. 2014 నుంచి భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణనీయంగా పెరిగిందనడంలో సందేహం లేదు.
అయితే, ఇక్కడ అసౌకర్యం కలిగించే అసలు ప్రశ్న ఏంటంటే, నేడు దేశంలో ఈ ఆర్థిక వృద్ధి ద్వారా లభించిన ప్రయోజనాలు అందరికీ ఎంతవరకు పంపిణీ అయ్యాయి? ఆ వృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకూ సమానంగా అందాయా? లేక కొందరికే పరిమితమయ్యాయా?
ప్రపంచ అసమానతల నివేదిక(World Inequality Report) 2024 అంచనాలను నిశితంగా పరిశీలిస్తే, భారతదేశ జనాభాలో అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది చేతుల్లోనే దేశ సంపదలో 40.1 శాతం ఉంది. మరోవైపు, జనాభాలో దిగువన ఉన్న 50 శాతం మంది వద్ద ఉన్న సంపద కేవలం 6.4 శాతం మాత్రమే.
అలాగే, దేశ జాతీయ ఆదాయంలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది 58 శాతం ఆదాయాన్ని పొందుతుంటే, జనాభాలో పేదలైన దిగువ 50 శాతం మందికి దక్కుతున్నది కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే.
అవును, అభివృద్ధి జరిగింది. కానీ యానిమల్ ఫార్మ్ కథలో మాదిరిగానే, ఇక్కడ ప్రధాన ప్రశ్న వ్యవసాయ క్షేత్రంలో ఆహార ఉత్పత్తి పెరిగిందా లేదా అన్నది కాదు. ఆ పెరిగిన ఆహారాన్ని చివరికి తినే అవకాశం ఎవరికి దక్కిందన్నదే అసలు ప్రశ్న.
మనుషుల ఇంట్లో పందుల పాగా
‘యానిమల్ ఫార్మ్’లో పందులు తామే కొత్త ఉన్నత వర్గంగా మారుతున్నట్లు ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించవు. కానీ పాత పాలకవర్గం పొందిన సౌకర్యాలు, ప్రత్యేక హక్కులను ఒక్కొక్కటిగా అనుభవించడం ప్రారంభిస్తాయి.
ఫామ్‌హౌస్‌లోకి మారడం, మంచాలపై నిద్రించడం, మనుషులతో కలిసి మద్యం తాగడం, వారితో వ్యాపారాలు చేయడం వంటివి మొదలుపెడతాయి.
విమర్శకులు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం (క్రోనీ క్యాపిటలిజం) గురించి మాట్లాడేటప్పుడు ఉద్దేశించేది ఇదే. అంటే రాజకీయ పలుకుబడి, ప్రైవేట్ సంపద పరస్పరం మరింతగా పెనవేసుకుపోయే వ్యవస్థ.
భారతదేశంలో ఇదే పరిణామం- అత్యధిక సంపద కలిగినవారే రాజకీయ అధికారానికి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులుగా మారితే, ఒక ప్రజాస్వామ్య దేశానికి ఏమవుతుంది? అనే అసౌకర్యకరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది.
గౌతమ్ అదానీకి, మోదీకి మధ్య సంబంధం 2014 కంటే ముందే ఉంది.
మోదీ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన ఉపయోగించిన ప్రైవేట్ విమానాన్ని కూడా అందించిన అదానీ, మొదటి నుంచీ మోదీకి బహిరంగంగా మద్దతు ఇచ్చినవారిలో ఒకరు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ వ్యాపారం అభివృద్ధి చెందిందన్న విషయం మాత్రమే ఇక్కడ గమనించాల్సిన అంశం కాదు. అనేక కారణాల వల్ల వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.
అయితే ఆ అభివృద్ధి ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లోనే కేంద్రీకృతం కావడమే అసలు విశేషం.
ఎందుకంటే ఈ రంగాల విస్తరణకు ప్రభుత్వం మాత్రమే అందించగలిగే భూమి, అనుమతులు, క్లియరెన్సులు, కాంట్రాక్టులు అవసరం.
కథలో పందులు ఫామ్‌హౌస్‌ను దొంగిలించాల్సిన అవసరం ఉండదు. లోపలికి ఆహ్వానం పొందే స్థాయికి అవి చేరుకుంటాయి.
స్క్వీలర్ చేతికి మీడియా సామ్రాజ్యం చేరింది
స్క్వీలర్ ప్రధానమైన పని ఏమిటంటే, మిగతా జంతువులు తమ కళ్లతో చూసిన విషయాలు కూడా నిజంగా అలా జరగలేదని, తాము చూసింది తప్పని నమ్మించేలా చేయడం.
భారత్‌లో విమర్శకులు ‘గోడీ మీడియా’ అని పిలిచే వార్తా సంస్థలు, జర్నలిస్టుల ద్వారా ఇదే పని జరుగుతోందని అంటారు.
మోదీ ప్రభుత్వానికి మితిమీరిన మద్దతు ఇస్తున్నాయని భావించే మీడియా సంస్థలు, జర్నలిస్టులను ఉద్దేశించి ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
నిజం చెప్పాలంటే, ఇక్కడే మీడియా యాజమాన్యం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ ప్రస్తుతం 70కి పైగా మీడియా సంస్థలను కలిగి ఉంది.
ఇవి వందల మిలియన్ల మంది భారతీయులకు వార్తలను చేరవేస్తున్నాయి. అంతేకాదు, 2022లో గౌతమ్ అదానీ గ్రూప్ ఎన్డీటీవీలో 64.71 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.
ఈ నేపథ్యంలో, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో 180 దేశాలకు గాను భారత్ 157వ స్థానానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించదు.
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ, భారతదేశంలోని మీడియా సంస్థల్లో అధిక భాగం కొద్దిమంది శక్తిమంతమైన వ్యాపారవేత్తల చేతుల్లోనే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. వారిలో కొందరికి ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.
ప్రజలు ఏమి చూడాలి, ఏమి వినాలి, పౌరులు దృష్టి సారించాల్సిన ముఖ్యమైన వార్తలుగా ఏ కథనాలు మారాలి అనే విషయాలను ఎవరు నిర్ణయిస్తున్నారన్నది ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా ప్రాధాన్యం కలిగిన అంశం.
మీడియా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, అసలు ఏం జరుగుతుందో మీకు స్పష్టంగా తెలిసే అవకాశం కూడా లేనప్పుడు, ప్రభుత్వాన్ని దాని చర్యలకు ఎలా జవాబుదారీగా నిలబెట్టగలరు?
పదే పదే నిర్మించే గాలిమర
గాలిమర అనేది నెపోలియన్ చేపట్టిన భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. అది నిరంతరం నిర్మితమవుతూ, మళ్లీ మళ్లీ పునర్నిర్మాణమవుతూనే ఉంటుంది.
కథలో దానిని అభివృద్ధికి నిదర్శనంగా చూపుతారు. అయితే, జంతువుల రోజువారీ జీవితాలను మెరుగుపరచడంలో మాత్రం అది పెద్దగా ఎలాంటి మార్పునూ తీసుకురాదు.
భారతదేశంలో ఈ గాలిమర 2014లో ఇచ్చిన ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) హామీ.
ఏటా 2 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం ఇందులో భాగమే.
అయితే, ఈ రెండు లక్ష్యాలూ ప్రకటించిన గడువులోగా నెరవేరలేదు. అయినప్పటికీ, వాస్తవంగా కొలవాల్సిన ప్రమాణాలనే మార్చేస్తే, అభివృద్ధి కథను ప్రజలకు నమ్మించడం మరింత సులభమవుతుంది.
2025 వార్షిక పీఎల్ఎఫ్ఎస్ నివేదిక ప్రకారం భారతదేశ అధికారిక నిరుద్యోగ రేటు 3.1 శాతం.
వినడానికి ఇది బాగానే ఉంటుంది, కానీ ఆ శాతం వెనుక అసలు కథ తెలిస్తే అలా అనిపించదు.
ఉపాధి పొందుతున్నవారిలో సగానికి పైగా జీతం వచ్చే ఉద్యోగాల్లో కాక “స్వయం ఉపాధి” వర్గంలో ఉన్నారు.
వీరిలో చాలామంది కుటుంబ వ్యాపారాల్లో లేదా ఇతర అసంఘటిత పనుల్లో ఉంటారు. అక్కడ పని ఉన్నంత మాత్రాన స్థిరమైన ఆదాయం ఉన్నట్లు కాదు.
కాబట్టి నెపోలియన్ గాలిమరను చూపిస్తూ “చూడండి, మనం పురోగమిస్తున్నాం” అని చెబుతూనే ఉండొచ్చు, కానీ జంతువులు మాత్రం తమ జీవితాలు నిజంగా మెరుగుపడే రోజు కోసం ఎప్పటికీ ఎదురుచూడాల్సి వస్తుంది.
జిగురు ఫ్యాక్టరీ వైపు బాక్సర్
బాక్సర్ ఒక నమ్మకమైన బండి గుర్రం. తాను మరింత కష్టపడి పనిచేస్తే, ఆ పొలం తనకు వాగ్దానం చేసినవన్నీ నిజమవుతాయని అతను నమ్ముతాడు.
చివరకు కఠినమైన శ్రమ కారణంగా అతను కుప్పకూలిపోతాడు. అతన్ని జిగురు తయారీ కర్మాగారానికి అమ్మేస్తారు. అయితే, అతను ఆసుపత్రిలో ప్రశాంతంగా మరణించాడని మిగతా జంతువులకు చెబుతారు.
ఈ నవలలోనే ఇది అత్యంత విషాదకరమైన ఘట్టం. అయితే ఇది నమ్మకద్రోహానికి సంబంధించిన కథ కాదు.
ఖాళీ వాగ్దానాలను నమ్ముతూ, తుది వరకు వాటిపైనే ఆశలు పెట్టుకున్న ప్రజలకు చివరికి ఏమి జరుగుతుందనే దాని గురించి చెప్పే కథ.
కనీస మద్దతు ధరలకు సంబంధించి మరింత బలమైన హామీలు కల్పించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్న భారతీయ రైతులతో పోలికలు రాకుండా ఉండవు. వారు ఇప్పటికీ అప్పుల భారంతో, అస్థిరమైన ఆదాయాలతో సతమతమవుతున్నారు. నేటికీ భయానక సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు.
జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్సీఆర్బీ) 2024 నివేదిక ప్రకారం, ఆ ఏడాది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న 10,546 మంది ఆత్మహత్య చేసుకున్నారు.
వీరిలో 4,633 మంది రైతులు, సాగుదారులు కాగా, 5,913 మంది వ్యవసాయ కూలీలు. అంటే సగటున ప్రతి గంటకు ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లే.
వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే ఇక్కడ అసలు విషయం అది కాదు.
వాస్తవంగా శ్రమించి పనిచేసే వారిని తరచుగా పట్టించుకోనవసరం లేని వారిగా చూసే వ్యవస్థకు వ్యతిరేకంగా ఇది ఒక తీవ్రమైన నేరారోపణ.
బహుశా అందుకే, నేటి భారతదేశ పరిస్థితుల నేపథ్యంలో యానిమల్ ఫామ్ నవలను చదువుతున్నప్పుడు మనకు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తుంది.
ఈ విషయాల్లో ఏ ఒక్కటి కూడా తీసుకున్నంత మాత్రాన, మన దేశం ఏదో ఒక విధంగా ఆర్వెల్ చిత్రించిన పొలంగా మారిపోయిందని చెప్పడానికి సరిపోదు.
భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్య దేశమే. ప్రజలు ఇప్పటికీ ఓటు వేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికీ మారుతున్నాయి.
వాస్తవమైన ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉన్నాయని ప్రభుత్వం కూడా చెప్పుకోగలదు.
కానీ అసలు విషయం అది కాదు.
ఈ మొత్తం పరిణామాల మధ్య నెమ్మదిగా ఏం జరుగుతుందన్నదే అసలు విషయం.
అసమానతలను ఎలా తొలగించాలన్నదానికంటే, వాటిని ఎలా సమర్థించుకోవాలన్నది సులభంగా మారినప్పుడు; రాజకీయ, ఆర్థిక అధికారాలు క్రమంగా ఒకదానికొకటి మరింత దగ్గరైనప్పుడు; ప్రశ్నించాల్సిన మీడియా, ఎవరిని నిలదీయాలో వారితోనే విడదీయలేనంతగా కలిసిపోయినప్పుడు; నెరవేర్చని హామీల స్థానంలో మరింత ఆకర్షణీయంగా కనిపించే గణాంకాలను చూపించినప్పుడు; వాస్తవంగా పని చేస్తున్న ప్రజలను మాత్రం ఇంకొంతకాలం ఓపిక పట్టాలని అడుగుతూనే ఉన్నప్పుడు — ఇదంతా నెమ్మదిగా జరుగుతుంది.
విప్లవం విఫలమైందని నెపోలియన్ ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.
గోడ మీద రాసి ఉన్న నినాదాల పదాలను, వాటి అర్థాలను అందరికీ తెలియకుండా నెమ్మదిగా మారుస్తూ పోయాడు.
చివరకు ఆ పదాలకు వాస్తవంగా ఏ అర్థం ఉండేదో ప్రజలందరూ మరిచిపోయేలా చేశాడు.
యానిమల్ ఫామ్‌లో నన్ను అత్యంత కలచివేసే విషయం బహుశా ఇదే: పందులు మనుషులుగా మారిపోయాయన్నది కాదు, మిగతా వారందరికీ ఆ విషయం గుర్తించడానికి ఇంతకాలం పట్టిందన్నదే.
అనువాదం: కె. మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
