మరణం ప్రతి మనిషినీ ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది: ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఎందుకంటే, శవాన్ని అలాగే వదిలేయలేక, ప్రతి నాగరికత కూడా మృతదేహాన్ని పంచభూతాల్లో ఏదో ఒకదానిలో కలిపేయడానికి కొన్ని సంప్రదాయాలను సృష్టించుకుంది.
అగ్ని రూపంలో మార్పు; నేల రూపంలో భద్రత; నీటి రూపంలో కరిగిపోవడం; ఆకాశం రూపంలో విముక్తి లభిస్తాయి. శరీరాన్ని మళ్లీ ప్రకృతికి అప్పగించడం ద్వారా, మనుషులు ఒక సాధారణ అవసరాన్ని ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉన్న చర్యగా మారుస్తారు.
జల సమాధి ఆచారం.. సోనియా కఠిన నిర్ణయం
తన ఆత్మకథైన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’లో సోనియా గాంధీ తన మొదటి సంతానం అంత్యక్రియలకు సంబంధించిన కష్టమైన నిర్ణయాలు, నిశ్శబ్ద ఆచారాల గురించి ఇంతకుముందు ఎవరికీ తెలియని కొన్ని విషయాలను పంచుకున్నారు. 1969లో సోనియా గాంధీ, రాజీవ్ గాంధీలకు జన్మించిన బిడ్డ పుట్టిన కొద్దిసేపటికే కన్నుమూశాడు.
సంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం, పుట్టిన శిశువుకు దహన సంస్కారాలు చేయరు. సాధారణంగా పవిత్ర నదిలో ముంచేస్తారు. దీనిని జల్ ప్రవాహ్ లేదా జల సమాధి అంటారు.
రెండేళ్ల లోపు పిల్లలకు చితి పేర్చరు. ఎందుకంటే వారు అప్పటికే పవిత్రంగా ఉంటారు. వారికి ఎలాంటి లౌకిక బంధాలు, పాపాలు ఉండవని నమ్ముతారు. గర్భిణులు, పెళ్లి కాని అమ్మాయిలు, హత్య, ఆత్మహత్య, హింస, నీట మునగడం, పాము కాటు వంటి అకస్మాత్తుగా లేదా అసాధారణంగా మరణించినవారు, అలాగే ఇటీవల కొవిడ్ వల్ల చనిపోయినవారికి కూడా దహన సంస్కారాలు చేయరు.
తీరని కోరికలతో ఆగిపోయిన జీవితాలను సంప్రదాయం ఒక ఆధ్యాత్మిక ఆటంకంగా చూస్తుంది. వారి శరీరాలకు బరువైన రాళ్లు కట్టి, పవిత్ర నది మధ్య ధారలో ముంచేస్తారు.
భారతీయ సంప్రదాయంలో పెరిగిన రాజీవ్ గాంధీకి, ఆయన కుటుంబానికి నది అనేది ఒక సున్నితమైన సరిహద్దు. మృతులను ఒక లోకం నుంచి మరో లోకానికి తీసుకువెళ్తుందని నమ్మే ఒక పురాతన ప్రవాహం అది. అయినప్పటికీ సోనియా తన బిడ్డను నీళ్లలో వదలలేకపోయారు.
నీళ్లలో కాకపోతే, మతం పేరుతో చావును కూడా కచ్చితంగా వేరు చేసే నగరంలో ఆ చిన్నారి ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో మరణంలో కూడా శవాలను వారి మతపరమైన గుర్తింపును బట్టి వేరు చేస్తారు. దీనివల్ల లౌకిక, మతాంతర వివాహం ద్వారా పుట్టిన బిడ్డకు స్పష్టంగా విశ్రాంతి తీసుకునే స్థలం దొరకదు.
ఆ పసికందును ఏదైనా ప్రభుత్వ లేదా క్రైస్తవ శ్మశానవాటికకు తీసుకెళ్తే, వ్యక్తిగత సమయాల్లో కూడా ప్రముఖులపై చూపించే ప్రత్యేకమైన నిర్దయకు గురికావాల్సి వస్తుందని సోనియాకు తెలుసు. పార్సీ సమాధి స్థలాలను ఆశ్రయించినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. రాజీవ్ తండ్రి ఫిరోజ్ గాంధీ పార్సీ మతంలో పుట్టినప్పటికీ, ఆయన ఆ మత ఆచారాలను పాటించలేదు.
యమునా తీరంలో చేదు జ్ఞాపకం
సోనియా నదిలో శవాన్ని వదలడానికి నిరాకరించడానికి కారణం, భరించలేని ఒక చేదు జ్ఞాపకం ఆమెను వెంటాడటమే. ఆ ఘటనకు కొద్ది రోజుల ముందు, యమునా నదిలోని ఓక్లా బ్యారేజ్ వద్ద ఆమె ఒక భయంకరమైన దృశ్యం చూశారు. ఉబ్బిన ఒక మృతదేహం చెత్త కుప్పల మధ్య తేలుతూ ఉండగా, ఒడ్డున ఉన్న వీధి కుక్కలు దానిని లాగుతున్నాయి. అప్పుడు సాంత్వననిచ్చే పవిత్ర నది అనే భావన పోయి, కేవలం నీటి ప్రవాహం, చెత్తాచెదారం, శవాలు పీక్కునే జంతువులు మాత్రమే ఆమె కంటికి కనిపించాయి.
ఎలాంటి ఆచారాల రక్షణ లేకపోతే శరీరం మళ్లీ అభద్రతతో కూడిన ప్రకృతిలో కలిసిపోతుందని ఆమె గ్రహించారు. యమునా నదిలో తాను చూసిన ఆ భయానక దృశ్యాన్ని సోనియా ఎప్పటికీ మరువలేకపోయారు. పుట్టగానే కన్నుమూసిన తన పసికందును అలా నదిలో వదలడం అస్సలు ఇష్టం లేదని, బిడ్డ పట్ల అలా వ్యవహరించడం క్రూరమైన పద్ధతిలా అనిపించిందని ఆమె స్వయంగా చెప్పారు.
ఓక్లా వద్ద సోనియా భయపడి వెనక్కి తగ్గడానికి కారణం హిందూ మతం కాదు. నదిలో శవాన్ని విడిచిపెట్టిన తర్వాత జరిగే ఆ భయానక వాస్తవం, నదిని నమ్మే పద్ధతికి, అక్కడ నిజంగా జరిగేదానికి ఉన్న వ్యత్యాసమే ఆమెను కలిచివేసింది.
భారతదేశంలో ఒక పవిత్ర నది అనేది కేవలం ఒక్కటే కాదు. కుల వ్యవస్థ, ఆచారాలు, బతకడానికి చేసే పోరాటం అన్నీ నీటి కింద కలిసే ఒక క్లిష్టమైన ప్రదేశం అది.
గోతాఖోర్ల జీవన సంఘర్షణ.. ఆచారాల వెనుక వాస్తవం
గోతాఖోర్లు అంటే మల్లా కులానికి చెందిన అనుభవజ్ఞులైన ఈతగాళ్లు, మత్స్యకారులు. సోనియాను ఓక్లా వద్ద భయపెట్టిన ఆ భయానక నిజాల మధ్యే వారు బతుకుతుంటారు. జల ప్రవాహం ద్వారా మృతదేహాలు మాయం కావు కాబట్టే వీరు అక్కడ ఉండాల్సి వస్తోంది.
పవిత్ర ఆచారాల వెనుక ఉన్న బయటకు చెప్పని నిజం ఏమిటంటే, ఆత్మను దేవుడికి అప్పగించినప్పటికీ, ఆ మృతదేహాల బరువును మోసే పనిని మాత్రం కుల వ్యవస్థ ఆధారంగా కొన్ని చేతులకే అప్పగిస్తారు.
గోతాఖోర్ల బతుకులు నదికి సంబంధించిన ఆచారాల్లో ఎన్నో విరుద్ధమైన పరిస్థితుల మధ్య సాగుతుంటాయి. కుల వ్యవస్థలో అందరికంటే కింది స్థాయిలో పుట్టిన వీరు, తమ జీవితాన్ని, గుర్తింపును, బతుకుదెరువును ఆ నదితోనే ముడిపెట్టుకున్నారు. నదికి పైన వీరు భక్తులను, పూజారులను పడవల్లో దేవాలయాలకు, పవిత్ర ప్రదేశాలకు చేరుస్తుంటారు.
సమాజంలో తమకు గౌరవప్రదమైన హోదా లేకపోయినా, పవిత్రతను పంచే ఆచారాలకు మాత్రం వీరే సేవలు అందిస్తుంటారు. ఇక నది లోపల మాత్రం ప్రమాదకరమైన, అందరూ అసహ్యించుకునే పనుల్లో నిమగ్నమవుతారు.
నదిలో తేలియాడే శవాలను వెలికితీయడం, లేదా సరైన అంత్యక్రియలకు నోచుకోని మృతదేహాలను నీటిలో ముంచేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇటువంటి పనుల నుంచి కాస్త ఉపశమనం పొందడానికి వారికి దక్కేది కొన్ని చిల్లర డబ్బులు, చౌకైన మందు మాత్రమే.
నదిని రక్షించడానికి ప్రభుత్వాలు తెచ్చిన నిబంధనల వల్ల, వాళ్ల ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. చేపలు పట్టడం, నది ఒడ్డున వ్యవసాయం చేయడం, ఇసుక తవ్వకాలు వంటి వాటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. వేరే దారి లేక వాళ్లు బతకడం కోసం మళ్లీ నదినే నమ్ముకోవాల్సి వస్తోంది.
భక్తులు తమ పాపాల భారాన్ని వదిలించుకోవడానికి, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా నదిలో నాణేలు విసురుతుంటారు. నది అడుగున వెతికి తీసే ఆ నాణేలపైనే గోతాఖోర్ల బతుకుదెరువు ఆధారపడి ఉంటుంది.
ఎన్ని పర్యావరణ చట్టాలు తెచ్చి నిషేధించినా, జల ప్రవాహ ఆచారం మాత్రం అలాగే సాగుతూనే ఉంది. ఎందుకంటే పవిత్ర నదిని ప్రజలు ఒకేసారి రెండు వ్యతిరేకమైన పనులకు వాడుతున్నారు. ఒకటి ప్రతి ఆత్మను పవిత్రం చేసే దైవంగా భావిస్తే, మరొకటి తక్కువ ఖర్చుతో శవాలను వదిలే శ్మశానవాటికగా చూస్తున్నారు.
చితికి దూరంగా ఉన్నవారికి అదే సరైన చివరి మార్గంగా భక్తులు నమ్ముతారు. అలాగే దహన సంస్కారాలకు సరిపడా కట్టెలు కొనుక్కోలేని పేదవారికి, కాలని శవాన్ని నీటిలో వదలడమే మిగిలిన ఏకైక, చౌకైన మార్గంగా మారుతోంది. దీనివల్ల నదిలో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.
చివరకు ప్రతి నాగరికతను కూడా, అది శవాన్ని ఎలా గౌరవించి సాగనంపుతుందనే దానిని బట్టే అంచనా వేస్తారు. బతికి ఉన్నవారి కోసం మనం రాజకీయాలు, చట్టాలు, కళలతో సమాజాన్ని నిర్మించుకుంటాం, కానీ మృతదేహాలతో ఆ సమాజం ఎలా ప్రవర్తిస్తుంది అనేదే ఆ సంస్కృతి విలువలను, కుల వ్యవస్థలను, దాని నిజాయితీని పూర్తిగా బయటపెడుతుంది.
అనువాదం: శృంగవరపు రచన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
