నెహ్రూ లేదా బోస్ – భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఎవరి పాత్ర గొప్పది అనే అంశంపై చాలాకాలంగా రాజకీయ చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నాయకుల భావజాలాల మధ్య ఉన్న తేడాలను భగత్‌సింగ్ 1928లో రాసిన వ్యాసం ఆధారంగా మరోసారి పరిశీలిద్దాం.
దాదాపు ఒక శతాబ్దం క్రితం భారత జాతీయ కాంగ్రెస్‌కు ఇద్దరు యువ స్వాతంత్ర్య సమరయోధులు ప్రముఖ నాయకులుగా ఎదిగినప్పటి నుంచి స్వాతంత్ర్యోద్యమానికి ఎవరు ఎక్కువ కృషి చేశారు అనే అంశంపై రాజకీయ చర్చలు, తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారిలో ఒకరు జవహర్లాల్ నెహ్రూ అయితే మరొకరు సుభాష్ చంద్రబోస్.
1930వ దశకం చివర్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, సింగపూర్‌లో భారత జాతీయ సైన్యం (INA) బాధ్యతలు చేపట్టిన కారణంగా సుభాష్ చంద్రబోస్‌ను చాలామంది తరచుగా ఒక “విప్లవకారుడిగా”, “కార్యశూరుడిగా” చూస్తుంటారు. దీనికి భిన్నంగా కాంగ్రెస్‌లోనే కొనసాగి, “మాటల మనిషిగా” ముద్రపడిన స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి నెహ్రూను చూడవచ్చు.
భగత్‌సింగ్‌ను కూడా ఒక “విప్లవకారుడిగా”, “కార్యశూరుడిగా” పరిగణిస్తారు. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌ల రాజకీయ భావజాలాల గురించి ఆయన ఏం చెప్పారో ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు.
భగత్‌సింగ్ రాసిన ఈ వ్యాసం మొదటగా 1928 జూలైలో ‘కీర్తి’ పత్రికలో “నయే నేతాఓంకే అలగ్ అలగ్ విచార్” (కొత్త నాయకులు – విభిన్న భావజాలాలు) అనే శీర్షికతో ప్రచురితమైంది.
ఆధునిక దృక్పథం కలిగిన యువ నాయకులు
సహాయ నిరాకరణ ఉద్యమ (1920-22) వైఫల్యం, ఆ తర్వాత దశాబ్దకాలం పాటు హిందూ-ముస్లింల మధ్య చెలరేగిన మత ఘర్షణల అనంతరం భారతీయులు ఆశ, సంకల్పం ఎలా కోల్పోయారో వివరిస్తూ భగత్‌సింగ్ తన వ్యాసాన్ని ప్రారంభిస్తారు. కానీ ఆధునిక దృక్పథం కలిగిన ఎందరో కొత్త నాయకులు ఆవిర్భవించడం, యువజన ఉద్యమాలు విస్తరించడంతో, అగ్రశ్రేణి అనుభవజ్ఞులైన నాయకులను వెనక్కి నెట్టివేస్తూ “కేవలం యువ నాయకులు” మాత్రమే దేశభక్తి గల భారతీయుల దృష్టిని ఆకర్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అందరిలోనూ ప్రత్యేకంగా ముందుకు వస్తున్న ఇద్దరు నాయకులను భగత్‌సింగ్ తన వ్యాసంలో ప్రస్తావిస్తారు. వారిలో ఒకరు “బెంగాల్‌కు చెందిన గౌరవనీయుడైన సుభాష్ చంద్రబోస్” కాగా మరొకరు “ప్రముఖ నాయకుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ”.
వారిద్దరూ భారత స్వాతంత్ర్యం కోసం రాజీపడకుండా పోరాడిన నాయకులు. ఇద్దరూ మేధావులు, నిజమైన దేశభక్తులు. అయినప్పటికీ వారి రాజకీయ భావజాలాలు రాత్రికీ పగలుకీ ఉన్నంత భిన్నంగా ఉంటాయని భగత్‌సింగ్ రాశారు.
“వారిలో ఒకరు భారతదేశ ప్రాచీన సంస్కృతికి భక్తుడిగా, దాని పరిరక్షకుడిగా గుర్తింపు పొందితే, మరొకరు పాశ్చాత్య నాగరికతను గట్టిగా అనుసరించే వ్యక్తిగా ముద్రపడ్డారు. ఒకరిని మృదుస్వభావి, సున్నిత మనస్కుడిగా భావిస్తే, మరొకరు అసలైన విప్లవకారుడిగా పేరుపొందారు” అని భగత్‌సింగ్ పేర్కొన్నారు.
ఈ ఇద్దరు నాయకుల భావజాలాల మధ్య ఉన్న తేడాలను ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుని, వాటిపై తమ సొంత అభిప్రాయానికి రాగలిగేలా చేయడమే తన ప్రయత్నమని భగత్‌సింగ్ అంటారు. అందుకోసం వారిద్దరి రాజకీయ భావజాలాలను విడివిడిగా ప్రజల ముందుంచుతున్నట్లు ఆయన వివరిస్తారు.
నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌ల గురించి భగత్‌సింగ్ ఏమన్నారు?
ఈ వ్యాసం కోసం భగత్‌సింగ్ ఆ ఇద్దరు నాయకులు అప్పట్లో చేసిన ప్రసంగాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. వారిద్దరినీ కాంగ్రెస్‌లోని “తీవ్రవాద” వర్గానికి చెందిన నాయకులుగా పరిగణించేవారని, ఇద్దరూ పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్ర్యం) కోసం వాదించారని ఆయన గుర్తుచేస్తారు.
అయితే ఈ ఇద్దరు నాయకుల ఆలోచనా విధానాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని భగత్‌సింగ్ స్పష్టం చేస్తారు.
భగత్‌సింగ్ అభిప్రాయం ప్రకారం, బొంబాయిలో(ప్రస్తుత ముంబై) జరిగిన ఒక సమావేశంలో ఈ ఇద్దరు నాయకుల ప్రసంగాలను విన్న తర్వాత, వారి మధ్య ఉన్న భావజాలపరమైన తేడాలు “పట్టపగటి వెలుగులా స్పష్టమయ్యాయి.”
భగత్‌సింగ్ “చాలా భావోద్వేగాలకు లోనయ్యే బెంగాలీ” అని పేర్కొన్న సుభాష్ చంద్రబోస్, భారతదేశం ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందించగలదని, మానవాళికి ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక గొప్ప పాఠాన్ని నేర్పగలదని తన ప్రసంగంలో అన్నారు.
భారతీయులు తిరిగి వేదాల బాట పట్టాలని బోస్ చేసిన వాదనను ప్రస్తావిస్తూ, భగత్‌సింగ్ దానిని “అదే పాత కాలపు రొమాంటిసిజం”, “పూర్తిగా భావోద్వేగపూరితమైన ఆలోచన”గా అభివర్ణించారు.
“బోస్‌కు భారతదేశ ప్రాచీన గతం పట్ల అపారమైన విశ్వాసం ఉంది. ఆ ప్రాచీన కాలంలో ఆయనకు గొప్పతనం మాత్రమే కనిపిస్తుంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గానీ, ప్రజల పాలనలో గానీ కొత్తదనమేమీ లేదని ఆయన భావిస్తారు. ఇవన్నీ భారతదేశంలో చాలా ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని చెబుతారు. కమ్యూనిజం కూడా భారతదేశానికి కొత్తదేమీ కాదని చెప్పేంతవరకు ఆయన వెళ్తారు” అని భగత్‌సింగ్ రాశారు.
దీనికి పూర్తిగా భిన్నమైన దృక్పథం నెహ్రూకు ఉందని భగత్‌సింగ్ వివరిస్తారు. తన ప్రసంగంలో నెహ్రూ ఇలా అన్నారు:
“ప్రతి దేశానికీ ప్రపంచానికి అందించడానికి ఒక ప్రత్యేకమైన సందేశం ఉందని ఆ దేశం భావిస్తుంది. కానీ నా దేశానికి మాత్రమే ప్రత్యేకంగా చెందినది ఏదీ ఉందని నేను అనుకోవడం లేదు.”
ప్రతి యువకుడు కేవలం రాజకీయ రంగంలోనే కాకుండా సామాజిక, ఆర్థిక, మత రంగాల్లో కూడా తిరుగుబాటు చేయాలని నెహ్రూ అన్నారు. “ఫలానా విషయం ఖురాన్లో ఉంది అని నా దగ్గరకు వచ్చి చెప్పే వ్యక్తితో నాకు పెద్దగా పనిలేదు. వేదాలు, ఖురాన్లలో దానికి ఆధారం దొరికినా సరే హేతుబద్ధంగా లేని ప్రతిదాన్నీ తిరస్కరించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
హృదయంతో పాటు మేధస్సుకూ పదును పెట్టాలి
భగత్‌సింగ్ అభిప్రాయం ప్రకారం నెహ్రూ ఆలోచనలు ఒక “నిజమైన విప్లవకారుడి” ఆలోచనలు. కానీ బోస్ ఆలోచనలు ఒక పాలనా వ్యవస్థ స్థానంలో మరో పాలనా వ్యవస్థను తీసుకురావాలని కోరుకునే వ్యక్తి ఆలోచనలుగా ఉన్నాయని ఆయన విశ్లేషించారు.
“మన పాత వ్యవస్థలు ఎంతో గొప్పవని ఒకరు భావిస్తుంటే, ఆ వ్యవస్థలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని మరొకరు నమ్ముతున్నారు. అయినప్పటికీ తిరుగుబాటు గురించి మాట్లాడుతున్న వ్యక్తిని భావోద్వేగపరుడిగా, సున్నిత మనస్కుడిగా పిలుస్తున్నారు. పాత వ్యవస్థలనే సమర్థిస్తున్న వ్యక్తిని మాత్రం సమాజాన్ని సమూలంగా మార్చే విప్లవకారుడిగా అభివర్ణిస్తున్నారు” అని భగత్‌సింగ్ రాశారు.
భగత్‌సింగ్ మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. నెహ్రూ, బోస్ ఇద్దరూ పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్ర్యం) కోరుకున్నప్పటికీ, అందుకు వారు చెప్పిన కారణాలు భిన్నంగా ఉన్నాయని వివరిస్తారు.
భగత్‌సింగ్ విశ్లేషణ ప్రకారం బోస్ పూర్ణ స్వరాజ్‌ను కోరుకోవడానికి కారణం “బ్రిటిష్ వారు పాశ్చాత్య దేశస్థులు, మనం తూర్పు దేశస్థులం” అనే భావన. అంటే విదేశీయుల పాలన నుంచి విముక్తి పొందాలన్నది ఆయన ప్రధాన దృక్పథం.
అయితే నెహ్రూ అభిప్రాయం భిన్నంగా ఉంది. “సమాజపు నిర్మాణాన్నే సమూలంగా మార్చడానికి మనకు మన సొంత పాలన అవసరం” అన్నది ఆయన ఆలోచన.
కార్మికవర్గం పట్ల బోస్‌కు సానుభూతి ఉందని, వారి పరిస్థితులను మెరుగుపరచాలని ఆయన కోరుకున్నారని భగత్‌సింగ్ పేర్కొంటారు. కానీ నెహ్రూ మాత్రం “విప్లవాన్ని తీసుకొచ్చి, ప్రస్తుతం ఉన్న వ్యవస్థను పూర్తిగా మార్చివేయాలని” కోరుకున్నారని వివరిస్తారు.
“సుభాష్ చంద్రబోస్ భావోద్వేగాలకు, ఆదర్శవాదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. ఆయన యువతకు హృదయానికి హత్తుకునే ఆలోచనలను మాత్రమే అందిస్తున్నారు. మరోవైపు నెహ్రూ ఒక యుగాన్నే మార్చగలిగిన నాయకుడు. ఆయన యువతలో హృదయాన్నే కాదు, మేధస్సును కూడా ఉత్తేజపరుస్తున్నారు” అని భగత్‌సింగ్ రాశారు.
ఆ తర్వాత భగత్‌సింగ్ పాఠకులను, ముఖ్యంగా పంజాబ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఒక పంజాబీ పత్రిక సుభాష్ చంద్రబోస్‌ను ఆకాశానికెత్తుతూ ప్రశంసించిందని, అదే సమయంలో నెహ్రూ వంటి తిరుగుబాటు భావాలు కలిగిన నాయకులు “రాతికి తల బాదుకుంటూ తమను తామే నాశనం చేసుకుంటారు” అని వ్యాఖ్యానించిందని ఆయన ప్రస్తావిస్తారు.
ఇలాంటి ప్రశంసలకు, విమర్శలకు ప్రభావితమై తొందరపడి ఒక అభిప్రాయానికి రావద్దని పాఠకులకు సూచిస్తారు. ఈ సందర్భంగా ఆయన ఒక విషయాన్ని గుర్తుచేస్తారు:
“పంజాబ్ ప్రజలు ఎప్పుడూ కొంత ఎక్కువ భావోద్వేగాలకు లోనవుతుంటారు. ఇక్కడ ప్రజల ఉద్వేగాలు చాలా త్వరగా పెరుగుతాయి. అంతే త్వరగా చల్లారిపోతాయి కూడా. నురుగులా క్షణాల్లో ఉబికి వెంటనే మాయమైపోతాయి.”
గుడ్డిగా ఎవరో ఒక నాయకుడిని అనుసరించవద్దని హెచ్చరిస్తూ, భగత్‌సింగ్ తన వ్యాసం చివరలో పంజాబ్ యువతకు ఒక పిలుపునిస్తారు.
విప్లవానికి అసలైన అర్థం ఏమిటో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దానికి ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవాలంటే నెహ్రూ ఆలోచనలతో కలిసి నడవాలని ఆయన సూచిస్తారు.
“సుభాష్ చంద్రబోస్ యువతకు మేధోపరమైన ఆలోచనలను అందిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన అందిస్తున్నది హృదయానికి హత్తుకునే భావోద్వేగపూరితమైన ప్రేరణ మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో పంజాబ్ యువత విప్లవ భావజాలాన్ని అర్థం చేసుకుని, దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో పంజాబ్‌కు కావాల్సింది మేధస్సుకు పదును పెట్టే ఆలోచనలు. అవి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర మాత్రమే లభిస్తాయి” అని భగత్‌సింగ్ రాశారు.
వ్యాస రచయిత అభినవ్ చక్రవర్తి రాసిన ఈ వ్యాసాన్ని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో అందిస్తున్నాము. అనువాదం: కె మనోహర రాజు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
