♦ కనీస వేతనం రూ.42 వేలు.. పెన్షన్ రూ.21 వేలు ఇవ్వాలి
♦ నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి
♦ స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి
♦ లక్షలాది మంది కార్మికులతో పార్లమెంట్ ముట్టడి
♦ సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు
నల్లగొండ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఏఆర్ సింధు తెలిపారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారని వెల్లడించారు. ఇందులో మహిళా కార్మికులు 50 శాతం వరకు ఉంటారని అంచనా వేసినట్లు చెప్పారు.
బుధవారం నల్లగొండలోని జీఎం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తప్పుబట్టారు. ఈ కోడ్స్ అమలుతో కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికుల నిజ వేతనాలు తగ్గిపోతున్నప్పటికీ కనీస వేతనాలను పెంచకుండా కొత్త చట్టాల ద్వారా మరింత భారాన్ని మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల ప్రయోజనాలకు సంబంధించిన త్రైపాక్షిక చర్చల వ్యవస్థను కూడా కేంద్రం నిర్వీర్యం చేసిందన్నారు.
స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలేవీ?
అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం తదితర రంగాల్లో పనిచేస్తున్న కోట్లాది మంది స్కీమ్ వర్కర్ల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఏఆర్ సింధు అన్నారు.
45వ భారత కార్మిక మహాసభ సిఫారసులు ఉన్నప్పటికీ 2018 తర్వాత వారి వేతనాలను పెంచలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు గ్రాట్యుటీ అమలు చేయడం లేదని విమర్శించారు.
స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా శాశ్వత ఉద్యోగాలను సైతం కాంట్రాక్ట్, నిర్ణీత కాల ఉద్యోగాలుగా మార్చుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం వంటి సేవలను ప్రైవేటీకరించడం వల్ల సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ ఆస్తులను అప్పగించే విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. అమెరికా, యూరప్ దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
కార్మిక సంఘాల ఐక్య పోరాటం
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గ్రామీణ కార్మికులకు పని అవకాశాలు తగ్గి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. కార్మిక సంఘాల హక్కులను కాపాడటంతో పాటు ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు.
చలో ఢిల్లీ కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయని చెప్పారు. ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
♦ కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం ప్రకటించాలి.
♦ ఉద్యోగ విరమణ చేసిన వారికి, స్వయం ఉపాధి పొందుతున్న వారికి నెలకు రూ.21 వేల పెన్షన్ ఇవ్వాలి.
♦ నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి.
♦ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి పటిష్ఠంగా అమలు చేయాలి.
♦ స్కీమ్ వర్కర్లను పర్మినెంట్ చేసి కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి.
♦ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.
♦ కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి.
♦ ఎస్ఐఆర్ విధానాన్ని రద్దు చేసి, ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి.
చుక్క రాములు మాట్లాడుతూ..
సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు మాట్లాడుతూ కార్మికుల శ్రమను కార్పొరేట్లు, బహుళజాతి సంస్థలు దోచుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తోందని విమర్శించారు.
కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసే నియామక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అసంఘటిత, స్కీమ్, భవన నిర్మాణ రంగ కార్మికులను సమీకరించి చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా కదులుతోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి అన్నారు.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఢిల్లీలో జరిగే చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం చలో ఢిల్లీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. వెంకటేశ్, తుమ్మల వీరారెడ్డి, ఈశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శులు పి. మధు, శ్రీకాంత్, యాట సోమన్న, నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బికార్ మల్లేశ్, చినపాక లక్ష్మీనారాయణ, దండంపల్లి సత్తయ్య, పట్టణ కన్వీనర్ రవీందర్, యంగ్ వర్కర్స్ జిల్లా కో-కన్వీనర్ భీమగాని గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
