ఏజేసీ బోస్ రోడ్డులోని ప్రమోద్ దాస్‌గుప్తా స్మారక ట్రస్ట్ ఆడిటోరియంలో కార్యక్రమం
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న కోల్‌కతాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్(EZCC), సీతారాం ఏచూరి ఫౌండేషన్ నిర్వహించనున్న ఒకరోజు సదస్సు వేదిక బుకింగ్‌ను రద్దు చేసింది. నవంబర్ 22న జరగాల్సిన ఈ కార్యక్రమానికి కేవలం ఐదు రోజుల ముందు ఈ నిర్ణయం తీసుకుంది.
ఏజేసీ బోస్ రోడ్డులోని ప్రమోద్ దాస్‌గుప్తా స్మారక ట్రస్ట్ ఆడిటోరియంలో ఇప్పుడు ఈ కార్యక్రమం జరగనుంది.
2024లో మరణించిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ ఎంపీ స్మారకార్థం సీతారాం ఏచూరి ఫౌండేషన్ ఏర్పాటైంది. ఈ ఏడాది జులైలోనే ఈజెడ్సీసీకి నిర్ణీత రుసుము చెల్లించి వేదికను బుక్ చేసుకుంది.
నవంబర్ 22న జరగాల్సిన కార్యక్రమానికి ముందు, నవంబర్ 16న ఈజెడ్సీసీ డైరెక్టర్ ఫౌండేషన్‌కు పంపిన ఈ-మెయిల్లో ఎలాంటి నిర్దిష్ట కారణాలు పేర్కొనకుండా కేవలం “అనివార్య కారణాల వల్ల” రద్దు చేస్తున్నట్లు తెలిపారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలపాలని ఫౌండేషన్ చేసిన విజ్ఞప్తికి కూడా ఆ సంస్థ స్పందించలేదు.
ఈజెడ్సీసీ ఛైర్మన్‌గా బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి ఉన్నారు.
సదస్సులో పాల్గొనే ప్రముఖులు వీరే..
రోజంతా జరిగే ఈ సదస్సులో భాగంగా మొదటి సెషన్లో యువ కార్యకర్తలు అయిషే ఘోష్, దీప్సిత ధర్, సఖి పాల్గొనే చర్చాగోష్ఠి ఉంటుంది. దీనికి ‘ది వైర్’ ఎడిటర్ సీమా చిస్తీ సంధానకర్తగా వ్యవహరిస్తారు. ఆమె ఈ ఫౌండేషన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు.
రెండో సెషన్లో సామ్రాజ్యవాదంపై జరిగే సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రసంగిస్తారు. ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, మేధావి మాలినీ భట్టాచార్య, భారత్‌లో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సెన్ అగ్విలెరా, నవలా రచయిత ముకుల్ కేశవన్ ఇందులో ప్రసంగిస్తారు. ఈ సెషన్‌కు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అధ్యక్షత వహిస్తారు.
ఆ రోజు ఉదయం జరిగే కార్యక్రమంలో ‘సామ్రాజ్యవాద కొత్త యుగం’ అనే అంశంపై తొమ్మిది మంది యువ పరిశోధకులు తమ అభిప్రాయాలను వినిపిస్తారు. 160 మందికి పైగా దరఖాస్తుదారుల నుంచి వీరిని ఎంపిక చేశారు.
“పార్లమెంట్ వేదికగా, అధికార కేంద్రాల్లో, మేధావి వర్గాల్లో, విద్యా రంగాల్లో, అలాగే కార్మికులు, రైతులతో కలిసి వీధుల్లో సీతారాం ఏచూరి ఎంతో నిబద్ధతతో నిలబెట్టి, పోరాడిన ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది” అని ఒక ప్రకటనలో పేర్కొంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

