(మదురో పాలన తర్వాత, ప్రభుత్వ ఆధిపత్యంలో ఉన్న వెనిజులా సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ, ప్రైవేట్ పెట్టుబడులు, మార్కెట్ ఆధారిత వృద్ధి, ప్రభుత్వ పాత్ర వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఎన్‌డబ్ల్యూఎస్ క్షేత్రస్థాయి కథనం).
తూర్పు కరాకస్‌లోని పేటారే అనే ఒక పేద ప్రాంతంలో శాన్ బ్లాస్ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ‘కాత్యుస్కా కమర్గో’ అనే మహిళ గత పద్నాలుగేళ్లుగా తన ప్రజల సమస్యల కోసం పనిచేస్తోంది.
ఇక్కడ జనాలకి చాలా ఏళ్ల నుంచి మంచినీళ్లు సరిగ్గా రావడం లేదు. కానీ ఈ ఏడాది జనవరి 3 నుంచి మంచినీళ్ల సరఫరా క్రమం తప్పకుండా రావడం ప్రారంభమైంది.
నీటి సమస్య కాస్త మెరుగైనా, ఆమె మిగతా కష్టాలేవీ తీరలేదు. ఆమె తోబుట్టువులలో ఇద్దరికి ఆపరేషన్లు అవసరం, దానికి దాదాపు పదిహేనొందల డాలర్ల వరకు ఖర్చవుతుంది.
వెనిజులాలో అధికారికంగా నెలకు కనీస వేతనం ఇప్పటికీ కేవలం నూట ముప్పై బొలీవర్లు మాత్రమే. ఈ ఏడాది సెప్టెంబర్ నాటి లెక్కల ప్రకారం ఇది సుమారు 15 పైసలు డాలర్లతో సమానం.
అయితే ప్రభుత్వ ఉద్యోగులకు అదనపు బోనస్‌లు ఇవ్వడం వల్ల వారి మొత్తం ఆదాయం కాస్త పెరుగుతుంది. వాళ్లకు సహాయం చేయడం కోసం కాత్యుస్కా ఇప్పటికీ డబ్బుల కోసం వెతుకుతూనే ఉంది.
“ఈ వచ్చే డబ్బులు దేనికీ సరిపోవడం లేదు” అని ఆమె అంటోంది.
అక్కడికి కొద్ది కిలోమీటర్ల దూరంలో, అరవై ఐదేళ్ల క్లారా రోసా హెర్నాండెజ్ టోర్రెస్ పరిస్థితి మరోలా ఉంది. ఆమె పదకొండేళ్లుగా ఒక చిన్న వాహనాల మెకానిక్ షాప్ నడుపుతోంది.
“2018కి ముందు నాకు రోజుకు పాతిక నుంచి ముప్పై వాహనాలు బాగు చేయడానికి వచ్చేవి. కానీ ఇప్పుడు పది నుంచి పదిహేను మాత్రమే వస్తున్నాయి, కొన్ని రోజులైతే కనీసం రెండైనా రావడం కష్టంగా ఉంది. జనం దగ్గర డబ్బులు లేవు, పైగా స్పేర్ పార్ట్స్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి” అని ఆమె తన సమస్యలని చెబుతోంది.
మార్పుల్లో అసమానతలు
జనవరి 3న నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించినప్పటి నుంచి వెనిజులాలో మార్పులు ఎంత నెమ్మదిగా, అసమానంగా జరుగుతున్నాయో వీరిద్దరి అనుభవాలు చెప్తున్నాయి.
దేశంలో కొన్ని మార్పులైతే వచ్చాయి కానీ, పాత ప్రభుత్వ యంత్రాంగం ఎక్కువ భాగం అలాగే ఉంది. ప్రస్తుతం డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చమురు, పెట్టుబడులు, ఆర్థిక సాయం కోసం అమెరికాతో చర్చలు జరుపుతోంది.
త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని కూడా మాటిస్తోంది. ఇంకోవైపు వందలాది మంది రాజకీయ ఖైదీలను విడుదల చేశారు, రాజకీయ కార్యకలాపాలపై ఉన్న ఆంక్షలను కూడా కాస్త తగ్గించారు.
అయితే, ఈ మార్పుల క్రమం దేశమంతటా ఒకేలా లేదు. రాజధాని కరాకస్‌లో వ్యాపారాలు తెరవడం, అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవడం ఒకవైపు జరుగుతుంటే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనీసం ప్రజలకి కనీస అవసరాలు తీరక, రోజువారీ జీవితాన్ని గడిపే ఆదాయాలు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు.
జనవరి 3కి ముందే వెనిజులా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. పేదరికం, విపరీతమైన ధరల పెరుగుదల(ద్రవ్యోల్బణం) వల్ల 2013 నుంచి 2021 మధ్య స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 75 శాతానికి పైగా పడిపోయిందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది.
అమెరికా ప్రభుత్వం 2017లో వెనిజులా అధికారులపై, 2019లో వారి జాతీయ చమురు కంపెనీ(పీడీవీఎస్ఏ)పై ఆంక్షలు విధించింది. కానీ అంతకంటే ముందే వెనిజులా ఆర్థిక వ్యవస్థ క్షీణించింది.
చమురు ధరలు పడిపోవడం, అవినీతి పెరగడం, ఉత్పత్తి తగ్గడం వల్ల వెనిజులా పరిస్థితి దిగజారింది. ఆ తర్వాత అమెరికా ఆంక్షల వల్ల ఈ సంక్షోభం మరింత పెరిగిందా లేదా అనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.
చమురు ద్వారా వచ్చే ఆదాయం ఎలా ఉపయోగిస్తారు?
కొత్తగా పెట్టుబడులు వస్తాయని ఆశలు ఉన్నప్పటికీ, వాటికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి.
ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ బాల్జా ప్రకారం, వెనిజులా పెట్టుబడులను ఆకర్షించగలదా లేదా అన్నది కాదు ప్రశ్న కానీ ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తుంది అన్నదే అసలు ప్రశ్న.
“దేశం కోలుకుందని చెప్పడానికి ఇది చాలా తొందరపాటు అవుతుంది” అని ఆయన అంటారు.
కేవలం చమురును ఎగుమతి చేస్తే సరిపోదని బాల్జా అంటారు. ఆ చమురు ద్వారా వచ్చే డబ్బుతో ప్రజా సేవలను, రోడ్లు-మౌలిక సదుపాయాలను ఎలా మెరుగుపరుస్తారు? మిగతా రంగాల్లో ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు? అనేదే ముఖ్యమంటారు ఆయన.
బాల్జా అభిప్రాయం ప్రకారం, ఎంత చమురు ఉత్పత్తి చేస్తున్నారు లేదా ఎంత ఎగుమతి చేస్తున్నారు అనేది సమస్యలో ఒక భాగం మాత్రమే.
ఈ కొత్త మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా ఉపయోగించాలి, ప్రజలకు అవసరమైన సేవలకు, రోడ్లు-మౌలిక సదుపాయాలకు నిధులు ఎలా కేటాయించాలి, ఏళ్లతో పోలిస్తే బాగా దెబ్బతిన్న ఇతర వ్యాపార రంగాలు తిరిగి పుంజుకునేలా ఈ చమురు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎలా ఉపయోగించాలి అనేది వెనిజులా స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
“కేవలం ఉన్న వనరులను ఎగుమతి చేయడం ఒక్కటే ముఖ్యం కాదు. చమురు ఉంది కదా, చమురు రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి కదా, చాలా డబ్బు వస్తుంది కదా అంటే సరిపోదు. ఆ డబ్బును ఎలా పంపిణీ చేస్తారు, దానివల్ల ఇతర రంగాల్లో కొత్త వ్యాపారాలు లేదా ఉపాధి ఎలా పెరుగుతుందని మనం ప్రశ్నించుకోవాలి” అని ఆయన ఎన్డబ్ల్యూఎస్తో చెప్పారు.
మరోవైపు, ఆహారం దొరకక ఇబ్బంది పడుతున్న పేద వర్గాల కోసం రెండు వందల నలభై కంటే ఎక్కువ సామూహిక వంటశాలలను నిర్వహిస్తున్న ‘అలిమెంటా లా సోలిడారిడాడ్’ అనే ఎన్జీవోలో హ్యుమానిటేరియన్ రెస్పాన్స్ డైరెక్టర్, కెమికల్ ఇంజనీర్ అయిన ఆల్బెర్టో కబ్బాబే మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో తనకు పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదని చెప్పారు.
“దుకాణాల్లో సరుకులు అందుబాటులో ఉన్నంత మాత్రాన అందరికీ ఆహారం దొరికినట్లు కాదు. వాటిని కొనేంత డబ్బులు జనాల దగ్గర ఉండాలి. ఆరోగ్యం, చదువు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చుకోగలగాలి” అని ఆయన చెప్పారు.
చావెజ్‌కు ప్రజల మద్దతు ఎందుకు లభించింది?
ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోవాలంటే, ఒకప్పుడు హ్యూగో చావెజ్ హయాంలో వారికి ఏమి దొరికిందో చూడాలి.
చావెజ్ తన ప్రారంభ పాలనలో ఉచిత విద్య, వైద్యం వంటి అనేక సామాజిక పథకాలను ప్రవేశపెట్టి, సామాన్య ప్రజలను ప్రభుత్వానికి దగ్గర చేశారు.
అరవై ఏడేళ్ల యుబిరిస్ సోలెడాడ్ వెనిజులా పర్వత ప్రాంతమైన యాండిస్లో నివసిస్తూ, ఒక బడిలో ఊడ్చే పనిచేస్తోంది.
చావెజ్ తెచ్చిన పథకం ద్వారానే ఆమె చదువుకుంది. ఆమె కొడుకు కూడా ఉచితంగానే సాంకేతిక శిక్షణ పొందాడు.
“నాకు, నా కుటుంబానికి చదువుకునే అవకాశం ఇచ్చినందుకు చావెజ్‌కు ఎప్పుడూ రుణపడి ఉంటాను. కానీ అది 2000ల కాలంలో జరిగింది. ఇప్పుడు ఆ పథకాలు ఎలా నడుస్తున్నాయో నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరూ వాటి ద్వారా చదువుకుంటున్నట్లు వినడం లేదు” అని ఆమె అంటోంది.
యుబిరిస్ ఇప్పటికీ తన కమ్యూనిటీ కౌన్సిల్(స్థానిక సమాజ సంఘం)లో పాల్గొంటోంది. స్థానిక ప్రాజెక్టులు, వనరులను నిర్వహించడంలో ప్రజలు నేరుగా భాగస్వాములు కావడానికి హ్యూగో చావెజ్ పాలనలో ఈ సంస్థలు రూపుదిద్దుకున్నాయి.
ఆమె ఉంటున్న ప్రాంతంలో, ఈ కౌన్సిల్ ద్వారానే ఆమెకు ఇప్పటికీ కొన్ని సహాయాలు అందుతున్నాయి. ఇందులో ‘కమిటీస్ ఫర్ సప్లై అండ్ ప్రొడక్షన్’(దీనినే క్లాప్ అని పిలుస్తారు) ద్వారా ఇచ్చే తక్కువ ధర రేషన్ ఆహార ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
ఆగస్టు 2026లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 40 శాతం మంది వెనిజులా ప్రజలు ఏదో ఒక సమయంలో ఈ కమ్యూనిటీ కౌన్సిళ్లలో పాల్గొన్నారని తేలింది.
ఈ కౌన్సిళ్లు ప్రారంభ రోజుల్లో స్థానిక వనరులను, ప్రాజెక్టులను ప్రజలే స్వయంగా నిర్వహించుకోవడానికి సహాయపడ్డాయని, ఇవి చావెజ్‌కు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చిపెట్టడానికి కూడా కారణమయ్యాయని పరిశోధకులు కనుగొన్నారు.
అయితే 2014 తర్వాత దేశంలో ఆర్థిక సంక్షోభం రావడం, రాజకీయాధికారమంతా ఒకే చోట కేంద్రీకృతమవ్వడంతో, ఈ కౌన్సిళ్ల ఆర్థిక సాయం చేసే ప్రాముఖ్యత తగ్గిపోయి, ఇవి కేవలం రాజకీయ ప్రచారం చేసే సాధనాలుగా మారిపోయాయి.
సోలెడాడ్ భర్త అయిన ఆంటోనియో రోజాస్ ఒక రైతు. ఆయన కార్మిక ఉద్యమంలో కూడా చురుగ్గా పనిచేశారు. ఆయన తనను తాను ఒక సోషలిస్ట్‌గా చెప్పుకుంటారు, కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న పాలనా వ్యవస్థ తాను కోరుకున్న సోషలిజం కాదని అంటున్నారు.
ఆయన ప్రకారం, ఈ పరిస్థితి మారాలంటే కొత్త నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్(ఎన్నికల సంఘం), కొత్త ప్రభుత్వ అధికారులతో కూడిన వ్యవస్థాగత మార్పు రావాలి, అలాగే రాజకీయాన్ని, ప్రభుత్వాన్ని అర్థం చేసుకునే విధానంలో కూడా మార్పు రావాలి.
“ఇది ఇకపై రాజకీయ జెండాల రంగుల గురించి కాదు. నా దృష్టిలో కొన్నేళ్ల క్రితమే మనం పాత పద్ధతిలో రాజకీయం గురించి మాట్లాడటం మానేశాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదల్లా, నా ఇంట్లో రోజుకి దాదాపు ఐదు గంటల పాటు కరెంట్ ఉండటం లేదనే నిజం గురించి, అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే దవాఖానా సామాన్లన్నీ బయట కొనుక్కోమని చెప్తున్నారని, అసలు రోగం బారిన పడకపోవడమే మంచిదనే పరిస్థితి గురించి” అని ఆయన అంటారు.
అసంపూర్ణ రాజకీయ మార్పులు
ఈ మార్పుల వల్ల వెనిజులాలోని ప్రతిపక్ష నాయకులు పనిచేసే వాతావరణం కూడా మారింది. మారియా కొరినా మచాడో నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీ ‘వెంటే వెనిజులా’ సభ్యుడు, అలాగే ‘సియుడాడానియా సిన్ లిమిటెస్’ అధ్యక్షుడు అయిన జెసస్ అర్మాస్ పద్నాలుగు నెలల పాటు జైలు నిర్బంధంలో ఉన్నారు.
జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కరాకస్‌లో స్థానిక ప్రజలను సంఘటితం చేయడం, అలాగే విద్యుత్, నీరు వంటి ప్రజా సేవలు, ఇంధన రంగాన్ని పర్యవేక్షించే పనుల్లో ముమ్మరంగా ఉన్నారు.
అర్మాస్ అభిప్రాయం ప్రకారం, జనవరి 3 తర్వాత రాజకీయ, సామాజిక కార్యకలాపాలకు, మీడియాకు కొంత స్వేచ్ఛ దొరికింది కానీ, తాము కోరుకున్న లోతైన రాజకీయ మార్పు మాత్రం ఇంకా రాలేదు.
“ఎటువంటి సందేహం లేకుండా, జనవరి 3 అనేది మన దేశానికి, బహుశా ఈ ప్రాంతానికి కూడా ఒక పెద్ద మలుపు అని, దీనివల్ల స్వేచ్ఛ పెరిగిందని నేను భావిస్తున్నాను. కానీ మరోవైపు, మేము ఇన్నాళ్లూ చాలా వేగంగా, మూలాల నుంచి వచ్చే ఒక పెద్ద మార్పు కోసం పోరాడాము. కానీ నిజమేమిటంటే, ఇప్పటి పరిణామాలు మమ్మల్ని ముందుగా చర్చల ద్వారా మాత్రమే సాగే ఒక చిన్నపాటి సంస్కరణల వైపు నెట్టివేస్తున్నాయి” అని ఆయన ఎన్డబ్ల్యూఎస్తో చెప్పారు.
“ఇళ్లకు మంచినీళ్లు రావాలి, కరెంట్ సరఫరా జరగాలి. అలాగే రోజువారీ అవసరమైన ఆహార సరుకులు కొనుక్కోవడానికి, ఒక సాధారణ జీవితం గడపడానికి సరిపడేంత మంచి ఆదాయం ప్రజలకు దక్కాలి.”
రాజకీయ ఖైదీల పరిస్థితి
జనవరి 3 తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయో చెప్పడానికి అక్కడ ఉన్న రాజకీయ ఖైదీల పరిస్థితే ఒక స్పష్టమైన నిదర్శనం.
‘కమిటీ ఫర్ ది ఫ్రీడమ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్’ సభ్యుడైన డియెగో కాసానోవాకు ఈ కష్టం ఏంటో తన సొంత కుటుంబం ద్వారా బాగా తెలుసు.
2024 జూలై 28న జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల తర్వాత ఆయన సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరగువా రాష్ట్రంలోని టోకోరాన్ జైలుతో సహా దాదాపు ఏడు నెలల పాటు ఆయన జైలులోనే గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత క్షమాభిక్ష(ఆమ్నెస్టీ) ద్వారా ఆయన విడుదలయ్యారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత ఎక్కువ మంది ఖైదీలు విడుదలవుతారని కాసానోవా ఆశిస్తున్నారు, కానీ ఈ ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోందని ఆయన చెప్తున్నారు.
“ఖైదీలందరినీ విడుదల చేస్తారనే పెద్ద ఆశ ఉండేది. ఆ సమయంలో కొందరిని విడుదల చేసినప్పటికీ, రోజులు గడిచేకొద్దీ ఇది చాలా నెమ్మదిగా సాగే ప్రక్రియగా మారిపోయింది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి ఇదే. అప్పటి నుంచి విడుదలలు చాలా ఎంపిక చేసిన విధంగా, ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతున్నాయి” అని ఆయన ఎన్డబ్ల్యూఎస్తో చెప్పారు.
‘ఫోరో పెనాల్’ అనే వెనిజులా మానవ హక్కుల సంస్థ అందించిన గణాంకాలు ఖైదీల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు చూపుతున్నాయి, అయితే ఈ సమస్య పూర్తిగా అంతం కాలేదని స్పష్టం చేస్తున్నాయి.
జనవరి 8 నుంచి ధృవీకరించబడిన 302 మంది విడుదలల తర్వాత, జనవరి 28 నాటికి ఆ సంస్థ వద్ద 711 మంది రాజకీయ ఖైదీల లెక్క ఉంది.
సెప్టెంబర్ 14 నాటికి ఆ సంఖ్య 344కి తగ్గింది. సెప్టెంబర్ నివేదిక ప్రకారం కొత్తగా ఎవరినీ జైలులో పెట్టలేదు, ఏడుగురు విడుదలయ్యారు, 23 మందిని కొత్తగా రాజకీయ ఖైదీలుగా నమోదు చేశారు.
అదే సమయంలో పదికొండు వేల కంటే ఎక్కువ మంది ప్రజలు తమ స్వేచ్ఛపై ఇతర రకాల నిర్బంధాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ అనుకూల వర్గాల వైపు నుంచి చూస్తే, మార్పుల వేగంపై అలెక్సిస్ సోసా మరొక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జైళ్ల వ్యవస్థతో అనుబంధం ఉన్న సలహాదారు అయిన ఆయన మాట్లాడుతూ, రాజకీయ స్వేచ్ఛ క్రమక్రమంగా విస్తరించిందని, ఈ ప్రక్రియ ఇలాగే ఇదే వేగంతో ముందుకు సాగాలని వాదించారు.
అలాగే ప్రభుత్వ పరిపాలనలో కూడా పెద్దగా మార్పులేమీ లేదని, జనవరి 3కి ముందు ఉన్న అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, వ్యవస్థలు ఇప్పటికీ యథాతథంగా అమలులో ఉన్నాయని ఆయన భావిస్తున్నారు.
“దేశ పాలనా నిర్వహణలో నాకు పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేదు. చాలా వరకు నిర్వహణ ప్రణాళికలన్నీ అధ్యక్షుడు మదురో ఏర్పాటు చేసినవే. మారినదల్లా అమెరికాతో ఏర్పడిన కొత్త సంబంధాలు, మన దేశంపై ఉన్న ఆంక్షలు తొలగిపోయే అవకాశం మాత్రమే. అది గనక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వెనిజులా స్వయంప్రతిపత్తిని గౌరవించడానికి తోడ్పడితే, అది మంచిదే” అని ఆయన ఎన్డబ్ల్యూఎస్తో చెప్పారు.
ప్రస్తుతానికి, ఇక్కడి పరిస్థితులు వేర్వేరు దిశలను సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. వెనిజులాలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పారు.
అదే సమయంలో డెల్సీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. తమ దేశం “పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం” వైపు పయనిస్తుందని చెప్పారు, అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే, ఈ మార్పులు చాలా అసమానంగా జరుగుతున్నాయి.
అనువాదం: రచన శృంగవరపు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
