తెలుగు వారి చరిత్రకు కాలహద్దుల్లో అయినా, భౌగోళిక హద్దుల్లో అయినా తూర్పున వంచిన విల్లులా ఉన్నది సముద్ర తీరం. ఆ విల్లును పట్టి పిడికిలి బిగించి ధనుస్సును సారించే మధ్య స్థానంలో ఉన్నది కృష్ణా మండలం.
ఏమిటి దీని ప్రత్యేకత? సమయమూ సందర్భమూ ఏదయినా చరిత్ర తన భౌగోళికతను వెతుక్కుంటుంది అనేదే ముందుకు వస్తున్నది.
ఎక్కడో దేశానికి వాయవ్యంగా గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో ఉంటూ అక్కణ్ణించే తన జాతీయ ఉద్యమాన్ని రూపొందించిన గాంధీజీ 1921 ఏప్రిల్ నాటికి దేశానికి పూర్తిగా ఆగ్నేయ మూలన ఉన్న బందరు రావడం ఎలా సాధ్యమయింది?
ఆయన రావడానికి ముందు, ఇక్కడ జాతీయ భావనలతో ఎంత క్రియాశీలతతో ఎంత సామాజిక రాజకీయ నిర్మాణం జరిగితే, ఆయన సందర్శనకు అనువైన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉంటాయి?
ఎంత సాంద్రమైన జాతీయ భావాల పరిపక్వత ఇక్కడ నెలకొని ఉండివుంటే, ఏదో ఒకరోజు ఈ దేశానికీ ఒక జాతీయ పతాక అవసరమవుతుందని అనుకోవడం గాని, దానికి ఒక నమూనా తయారు చేద్దాం అనే సంకల్పం గానీ ఇక్కడ పింగళి వెంకయ్య అనే ఓ పేదింటి యువకునికి కలుగుతుంది?
ఇవన్నీ జరిగి ఇప్పటికి వందేళ్ళు కావచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనభై ఏళ్ళు ఎటూ అయింది. ఇక ఈ కాలంలో ఎవరి అనుభవాలు వారికి ఉన్నాయి, ఎవరి అభిప్రాయాలూ వారికి ఉన్నాయి.
తెలుగు భాష రాష్ట్రంగా ఏర్పడిన అరవయ్యేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రెండు అయింది.
అయితే అది రెండు అయిన తర్వాత ఒక్క జాతీయ స్థాయి ఆంగ్ల పత్రికల కాలమిస్టులు ఎవ్వరూ ఈ రాష్ట్రం గురించి ఇప్పటి వరకు రాయలేదు.
జస్టిస్ చలమేశ్వర్ మూలాలు – విద్యా ప్రాప్యత
ఇది ఇలా ఉంటే, దేశమంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉండగానే, జనవరి 2018 రెండవ వారంలో తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతి ముందు ఏపీకి చెందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆకస్మాత్తుగా వార్త అయ్యారు. ఎవరీయన?
ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. అంటే హైదరాబాదా కాదే, మరెవరు? తెలంగాణా నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రాంతంలో కృష్ణాజిల్లా వాసి. ఎక్కడ మొవ్వ మండలం.
అదెక్కడా క్షేత్రయ్య పదాలు రాసిన చోటు, సిద్దేంద్ర యోగి కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన స్థలం, వాటికీ సమీప గ్రామం చినముక్తేవి ఆయన పుట్టిన ఊరు. మరి మిగిలినవారు? జస్టిస్ చలమేశ్వర్ది దేశానికి దక్షిణంలో ఆగ్నేయమైతే, జస్టిస్ కురియన్ జోసఫ్ పశ్చిమాన నైరుతిలో కేరళ వారు, జస్టిస్ మదన్ లోకూర్ ఉత్తరంలో దేశ వాయవ్యంలో ఢిల్లీ వాసి, ఇక జస్టిస్ రంజన్ గొగోయ్ తూర్పున ఈశాన్య రాష్ట్రమైన అస్సాం వాసి.
అయితే ఒక చారిత్రక సంధి కాలంలో ఈ నాలుగు దిక్కుల్ని ఒక్కటి చేసినవాడు జస్టిస్ జాస్తి చలమేశ్వర్.
జననం 1953, తల్లి అన్నపూర్ణమ్మ, తండ్రి లక్ష్మీనారాయణ. చలమేశ్వర్ తండ్రి వకీలుగా పనిచేసిన బందరులో 1841 నాటికి అంటే చలమేశ్వర్ జన్మించడానికి 112 ఏళ్ల ముందే డచ్చిదొర రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ప్రారంభించిన హైస్కూల్ ఉంది.
స్థానిక బ్రాహ్మణులకు మాత్రమే ఆ పాఠశాలలోకి ప్రవేశం ఉండేది. శూద్రులకు అడ్మిషన్లు ఇవ్వడానికి అనుమతి కొరకు అప్పట్లో నోబుల్ దొర మద్రాస్ ప్రెసిడెన్సీకి, అక్కడి నుంచి ఇంగ్లాండ్‌కు సుదీర్ఘ కాలం పాటు ఉత్తరాలు రాయాల్సి వచ్చింది.
ఒక ప్రాంతంలోని వనరులు ఆ సమాజంలో అందరికీ అందుబాటులోకి రావడం అనేది ఎన్ని అడ్డంకులు దాటితే అది సాధ్యం అవుతుంది, అనేది చెప్పడం కోసం ఈ ప్రస్తావన.
ఒక జీవ నదిని ఆనుకుని, ఒక ఓడరేవు పట్టణం పక్కన ఉన్న ఊళ్ళు ఏళ్ళు గడిచాక, కడకు ఏమవుతాయి?
సామాజిక కుదుపు గురించి, ఆంధ్రప్రదేశ్ తెలుగు సమాజం గురించి, మంచిచెడు దేశం మాట్లాడుకోవడానికి ఇంతకు మించిన సందర్భం ఉండదు.
అయితే ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం సుప్రీం కోర్టులో జరిగింది ఇప్పుడు మళ్ళీ చర్చకు ఎలా సందర్భం అయింది?
సుప్రీంకోర్టులో చారిత్రాత్మక పత్రికా సమావేశం
అందుకోసం 2018 జనవరి 12న గార్డియన్ పత్రిక రాసిన పంక్తులు కొన్ని చూడాలి “జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నాయకత్వంలో ఢిల్లీ పాత్రికేయులతో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన అనూహ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పరిస్థితులు సరిగాలేవు, ఈ వ్యవస్థలను భద్రపర్చుకుంటే తప్ప, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు” అన్నారు.
గార్డియన్ ప్రతినిధి మైఖేల్ సాఫీ ఈ వార్త రాస్తూ, అందులో అప్పట్లో చేసిన వ్యాఖ్యలో “జస్టిస్ దీపక్ మిశ్రా వైఖరికి వ్యతిరేకంగా కొన్ని నెలలుగా అక్కడ తిరుగుబాటుకు అనువైన వాతావరణం ఏర్పడుతూ ఉంది” అని వ్యాఖ్యానించారు.
“మీరు చీఫ్ జస్టిస్‌ను ఆ పదవి నుంచి తొలగించాలి అనుకుంటున్నారా?” అని జర్నలిస్టులు చలమేశ్వర్‌ను అడిగితే, “ఆ నిర్ణయం ఏదో అది ఈ దేశం తీసుకోవాలి” అన్నారు.
“నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆగస్టులో జస్టిస్ మిశ్రాను చీఫ్ జస్టిస్‌గా నియామకం చేశాక, జరిగిన ఈ పరిణామంపై ఎటువంటి స్పందన లేదు. కానీ ప్రభుత్వం అటార్నీ జనరల్‌ను కలుస్తున్నట్టుగా తెలిసింది”
నాటకీయంగా ఈ పత్రికా సమావేశం ముగింపులో చలమేశ్వర్ మాట్లాడుతూ “ఇకముందు రాబోయే ఇరవై ఏళ్లలో జ్ఞానం ఉన్న ఏ ఒక్కరు కూడా మా గురించి అంటే చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకూర్, కురియన్ జోసఫ్‌లు తమ ఆత్మలను అమ్ముకుని, రాజ్యాంగం నిర్దేశించిన మార్గంలో వారు నడవలేకపోయారు అనుకోవడానికి వీల్లేదు” అన్నారు.
జరిగిన దానిపై నాటి గార్డియన్ పత్రిక వార్తా కథనం ఇలా సాగింది.
ఇది జరిగిన ఎనిమిదేళ్ళ తర్వాత, మళ్ళీ ఇప్పుడు 2026 గాంధీ జయంతి మర్నాడు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఏ డైలాగ్ విత్ స్వాతి పాడ్‌కాస్ట్‌లో, ఆమె ఆ నాటి వారి పత్రికా సమావేశం విషయం అడిగినప్పుడు, “దాని పర్యవసానం తెలిసి, అందుకు చెల్లించాల్సిన మూల్యం కూడా తెలిసే ఆ రోజున ఆ పని చేశాము” అన్నారు.
పరిణామాలు – న్యాయవ్యవస్థపై సమీక్ష
ఆ తర్వాత జరిగింది తెలిసిందే, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తన పదవీకాలం పూర్తి అయ్యాక ఆ పోస్ట్ నుంచి తప్పుకున్నారు. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో న్యాయం ఎంత న్యాయంగా జరుగుతున్నదో దేశ ప్రజలకు వెల్లడి అయ్యే ప్రయత్నం అయితే జరిగింది.
ఏకశిలా సదృశ్యం అనుకునే దేశ అత్యున్నత రాజ్యాంగ సంస్థలు అయినా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి అనే ఎరుకతో పాటు, అవసరమైనప్పుడు సమీక్షకు అవేమీ అతీతం కాదు అని ఈ సంఘటన నిరూపించింది.
తొలిగా బీట పడిన ఎంతటి శిలకైనా, ఇక ఆ బీటను పెద్దవిగా పలు పగుళ్లుగా చేయడం ఏమంత కష్టం కాదు. కాకుంటే అందుకు తెగువ ఉండాలి. అప్పట్లో అటువంటి కొనసాగింపు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగింది.
2020 అక్టోబర్ 6న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ గురించి చీఫ్ జస్టిస్ కు ఉత్తరం రాశారు.
ఆ జడ్జి ఏపీ హైకోర్టులోని కేసుల కేటాయింపు రోస్టర్ విషయంలో జోక్యం చేసుకుని, ఇక్కడ తమ ప్రత్యర్ధి పార్టీ టీడీపీకి మేలు చేస్తున్నారని ఆ ఫిర్యాదు చేశారు.
ఏపీలో నిశ్శబ్దం – రాజ్యాంగ విలువలపై ప్రశ్నలు
తిరిగి 2024 ఎన్నికలు తర్వాత మరో ప్రధాన రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల కమిషన్ పనితీరు సమీక్షకు గురి అయింది.
ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా చేసుకుని గణాంకాలతో సహా కొందరు ఆ విషయంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు.
అయితే ఢిల్లీ, బొంబాయి, తర్వాత ఇప్పుడున్న ఉద్యమ వాతావరణంలో ఏపీలో ఏ విజయవాడ వంటి నగరం నుంచో ఈ నిరసన దక్షిణ భారత దేశం గొంతుకగా ఇప్పటికే నమోదు కావాలి. కానీ అది జరగలేదు సరి కదా కనుచూపు మేరలో ఆ ఛాయలు ఇక్కడ కనిపించవు.
మరి ఇదే సమయానికి ఇక్కడి నుంచే బయటకు వెళ్ళిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గంటకు పైగా ఇచ్చిన ఇంటర్వ్యూలోని విషయాలు ఈ ప్రాంతంలోని సామాజిక రాజకీయ ముఖచిత్రంలో మచ్చుకైనా ఎందుకు కనిపించడం లేదు?
చలమేశ్వర్ వంటివారు చెబుతున్న రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి ఆలోచనల మీద దుప్పటి కప్పి, నిరంతర స్పృహతో వాటిని ప్రజలకు చేరకుండా చూసేది ఎవరు అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికి జవాబు లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
