నా పరిసరాల్లోని పెద్దమనుషులు ఉదయం నడక పూర్తి చేసి, ఎంతో ఉద్వేగంతో, నైతిక ఆగ్రహంతో వార్తల గురించి చర్చించుకుంటున్నారు.
గొడవ పడుతున్న వార్తలను, విషయాలను పంచుకోవడానికి నేను వారిని ఒక కప్పు కాఫీ కోసం లోపలికి ఆహ్వానించాను.
జముయ్, ఢిల్లీలలో ఇటీవల జరిగిన సంఘటనల పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
‘పితృస్వామ్య పర్వేజ్’ వ్యంగ్యంగా నవ్వుతూ, యువతీ యువకులు నిర్మానుష్యంగా ఉండే పార్కులకు ఎందుకు వెళ్తారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.
“అందుకే నా కూతురిని కనీసం సాయంత్రం ఏడు గంటలకల్లా ఇంటికి వచ్చేయమని చెబుతాను” అని ‘నైతిక మంజునాథ్’ తీవ్ర అసమ్మతితో తల ఊపుతూ సన్నటి గొంతుతో గొణుక్కున్నాడు.
అప్పుడే గదిలోకి వచ్చిన ‘కమల’ ఆ పురుషుల మధ్యలో కుదురుగా కూర్చుంది. “మరి మీ కొడుకులకు మీరేం చెబుతున్నారు?” అని ఆమె సూటిగా ప్రశ్నించింది.
ఏనాడూ ఒక మహిళ నుండి అలాంటి ప్రశ్న ఎదుర్కొనని మంజునాథ్, విలేకరుల సమావేశంలో ఉన్న రాజకీయ నాయకుడిలా అయోమయంలో పడిపోయాడు.
“చూడమ్మా, చివరికి అమ్మాయిలే దీనికి బాధ్యులు” అని ‘బాధితులనే నిందించే విశ్వనాథ’ ఆ మంటకు మరింత ఆజ్యం పోశాడు. వారి మాటలను ఆపడానికి నేను గాంధీజీ మూగ కోతిలా సైగలు చేస్తూ తీవ్రంగా ప్రయత్నించాను. కానీ వారు జాగ్రత్తగా ‘కాళజీ’ అనే ముసుగు కప్పిన తమ అనాలోచిత స్త్రీద్వేషపూరిత మాటలను కొనసాగిస్తూనే ఉన్నారు.
మా చర్చ ప్రమాదకరంగా యువతులు వేసుకునే దుస్తుల వైపు మళ్లింది.
ఆ సమయంలో మా ఆవిడ నా వైపు కోపంగా చూసింది — ఆ తర్వాత ఏం జరగబోతుందో నాకు అర్థమైంది.
గదిలోని వాతావరణాన్ని గ్రహించి ఆ పురుషులు సిగ్గుతో తలదించుకోగా, అందరికీ స్పష్టంగా వినిపించేలా కమల తన గొంతు పెంచి మాట్లాడింది.
“ఉదయం పాలు కొనడానికి వెళ్లేటప్పుడు మా ఆయన వేసుకునే సిగ్గులేని పొట్టి లాగులు మీరు చూశారా? ఏ ఒక్కరూ ఆయనను ఎలాంటి బట్టలు వేసుకోవాలో అని అడగరు. అలాగే ఈ పొరుగున ఉన్న మహిళలెవరూ ఆయనను దృష్టిలో ఉంచుకుని తదుపరి శృంగార కథల ఘట్టాన్ని ప్రణాళిక చేయడం లేదు.” యావత్ దేశం అనుభవిస్తున్న సిగ్గు, ఆగ్రహాల తుఫానులో నేను నిస్సహాయంగా కొట్టుకుపోయాను.
‘అందరూ మగవాళ్ళూ అలా కాదులే’ అని చెప్పి మా ఆవిడ కోపాన్ని శాంతింపజేసే సాహసం నేను చేయలేకపోయాను — ప్రస్తుత పరిస్థితిలో అది ఆవిడలో మరింత ఆవేశాన్ని రగిల్చే ప్రమాదం ఉంది.
“మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలా మాట్లాడాలి, గర్భం దాల్చిన తర్వాత బరువు ఎప్పుడు తగ్గాలి అని మనం వారికి ఎందుకు చెబుతున్నాం? చీకటి పడిన తర్వాత పురుషులను బహిరంగ ప్రదేశాల్లో నిషేధిద్దాం, మహిళలను నిండు బట్టలతో కప్పుకోమని అడిగే బదులు పురుషుల కళ్లకు గంతలు కడదాం.”
నేను రహస్యంగా నా లుంగీని మోకాళ్ల వరకు కిందికి లాక్కుని, చొక్కా కింద ఉన్న నా బనియన్ పట్టీని సరిచేసుకున్నాను. నైతికత లేని పోలీసుల పట్ల పరిస్థితులు ఖచ్చితంగా తిరగబడాలి. ద్రౌపది సభలో భయం లేకుండా తిరుగుతున్నప్పుడు, గాంధారి తన కంటి గంతలను దుశ్శాసనుడికి, దుర్యోధనుడికి తొడిగే సమయం వచ్చిందేమో. అదే జరిగితే నిజంగా ఒక అద్భుతం అవుతుంది కదూ — అసలైన అంతిమ కురుక్షేత్రం.
ఏక్ కచోరీ దో సమోసా. ఇన్ మర్దోం కా క్యా భరోసా?
(ఒక కచోరీ, రెండు సమోసాలు. ఈ మగవారిని ఎలా నమ్ముతాం?)
అనిల్ అబ్రహాం
(అనువాదం: కె సత్యరంజన్)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
