క్రైస్తవ పాఠశాలలు, ఆసుపత్రులపై కురిపించే ప్రశంసలను మర్యాదపూర్వకంగా స్వీకరించవచ్చు; కానీ క్రైస్తవుల హక్కులు ఆ సంస్థలపై ఆధారపడి లేవు.
క్రైస్తవులపై దాడులు, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో శ్మశాన వాటికలకు స్థలం నిరాకరించడం, సామాజిక బహిష్కరణలు, బెదిరింపులు, మౌనంగా ఉండాలని నిశ్చయించుకున్న చోటల్లా రాజ్యం వహిస్తున్న మౌనం నేడు నిత్యవార్తలుగా మారిపోయాయి.
ఇలాంటి వార్తల అనంతరం వెలువడే ఎన్నో సదుద్దేశపూరిత వ్యాఖ్యానాలు క్రైస్తవ సమాజాన్ని సమర్థించే క్రమంలో— ఆ సమాజం నడుపుతున్న పాఠశాలలు, ఆసుపత్రులు, అక్షరాస్యతా ఉద్యమాలు, ఆదరణ లేనివారికి అందిస్తున్న సేవల జాబితాను ఏకరువు పెడుతుంటాయి. అలా చేయడం ద్వారా, హక్కులు అనేవి సంపాదించుకోవాల్సినవని, దేశంతో ఒక సమాజానికి ఉన్న లాభనష్టాల బ్యాలెన్స్ షీట్‌పైనే దాని భద్రత ఆధారపడి ఉంటుందనే సంఘ్ ప్రతిపాదనను ఆ వ్యాఖ్యాతలు తెలియకుండానే అంగీకరిస్తున్నారని నా అభిప్రాయం.
భారతీయ క్రైస్తవులకు భద్రత పొందే హక్కు కేవలం పౌరసత్వం, చట్టం, మానవ గౌరవంపైనే ఆధారపడి ఉంది తప్ప, మరే ఇతర అంశాలపైనా కాదు.
ఒక సమాజం ఉపయోగపడినంత కాలం మైనారిటీ హక్కులను ఒక రాయితీగా కొనసాగించే వస్తుమార్పిడి ఒప్పందం చేసుకోవాలని భారతీయ క్రైస్తవులు ఏమాత్రం కోరుకోవడం లేదు. పాలు ఇచ్చేంతవరకు పాడి ఆవును, గుడ్లు పెట్టేంతవరకు కోడిని ఇంట్లో ఉంచుకున్నట్లుగా ఈ వ్యవహారం ఉండకూడదు. పశువుల దొడ్డి సూత్రాల ఆధారంగా పౌరులను పాలించలేరు; ముఖ్యంగా 2026లోనైతే అసలే కుదరదు.
ఇక అసలు విషయానికి వద్దాం. మేము ప్రార్థన చేసుకోవడానికి ముందు మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మరో సమాజం తన విశ్వాసాన్ని ఎలా ఆచరించాలనే దానిపై రాజకీయ లేదా మతపరమైన మెజారిటీకి ఎలాంటి అధికారం లేదు. ఒక పౌరుడు తన సొంత దేశంలోనే— ఏ ఎన్నికలోనైనా ఖాళీ చేయమని నోటీసు అందుకునే స్థితిలో ఉన్న అద్దెదారులా బతకాల్సిన దుస్థితి రాకూడదు.
బలవంతపు మతమార్పిడి ఆరోపణ ఏదైనా వస్తే, చట్ట ప్రకారం నిష్పక్షపాత విచారణ జరగాలే తప్ప అల్లరి మూకల దాడులకు తావుండకూడదు. అలాగే శ్మశాన వాటిక కోసం చేసే అభ్యర్థన అనేది సమాన పౌరసత్వానికి సంబంధించిన అంశం; దానిని ఒక దయగా మంజూరు చేసే లేదా నిలిపివేసే హక్కు ఏ ఇరుగుపొరుగు వారికీ లేదు.
రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులు
ఈ విషయాలన్నింటిపైనా రాజ్యాంగం అత్యంత స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత స్వేచ్ఛను, మతాన్ని స్వీకరించే, ఆచరించే, ప్రచారం చేసే హక్కును కల్పిస్తోంది. ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వాన్ని హామీ ఇస్తోంది. ఆర్టికల్ 15 మత ప్రాతిపదికన వివక్షను నిషేధిస్తోంది. ఆర్టికల్ 29, 30 మైనారిటీల సాంస్కృతిక, విద్యా హక్కులను కాపాడుతున్నాయి. వీటిలో దేనికీ సంతృప్తికరమైన పనితీరు కనబరచాలనే షరతును రాజ్యాంగం విధించలేదు; వేటికీ గడువు తేదీని నిర్ణయించలేదు; దేశాభివృద్ధికి ఒక సమాజం అందించే తోడ్పాటుపై ఏ హక్కునూ ఆధారపడేలా చేయలేదు.
ఒక క్రైస్తవుడు తమ ఆత్మీయులకు అంత్యక్రియలు నిర్వహించడానికి, ఊరి బావి నుంచి నీళ్లు తోడుకోవడానికి లేదా ఒక చర్చి నిర్మించుకోవడానికి ముందు—తన ఉపయోగాన్ని నిరూపించుకోవాలని గానీ, మరెవరో నిర్దేశించిన జాతీయవాద నియమావళికి కట్టుబడి ఉన్నట్లు చూపాలని గానీ రాజ్యాంగం అడగడం లేదు. రాజ్యం వారిని సమాన పౌరులుగా రక్షించాలని మాత్రమే రాజ్యాంగం కోరుతోంది.
సమాజానికి చేసిన సేవలను చూపి హక్కులను సమర్థించుకునే వాదనలో ఒక నైతిక చిక్కు కూడా ఉంది. ఎందుకంటే అది దానికి వ్యతిరేక వాదనను నిశ్శబ్దంగా అంగీకరించినట్లవుతుంది. ఉపయోగం ఆధారంగానే హక్కులు వస్తాయని ఒప్పుకుంటే—ఆ ఉపయోగం వివాదాస్పదమైనప్పుడు, తగ్గినప్పుడు లేదా ఇకపై అవసరం లేదని ప్రకటించినప్పుడు ఆ హక్కులను వెనక్కి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. అప్పటికే ఆ సమాజం తనను ఏ నిబంధనల ప్రకారం పక్కన పెట్టవచ్చో ముందే అంగీకరించినట్లవుతుంది. రాజ్యాంగ ప్రవేశిక ఉత్పాదకత ఉన్నవారికి, లేనివారికి మధ్య ఎలాంటి భేదం చూపదు; గణతంత్ర రాజ్యంలో సమాన సభ్యత్వానికి పునాదిగా ప్రాథమిక హక్కులను ఉంచుతూ, అది అందరికీ గౌరవాన్ని వాగ్దానం చేస్తోంది.
మైనారిటీల భద్రతను ఒక రాయితీగానో, ప్రత్యేక బహుమతిగానో భావించే మెజారిటీ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి నెడుతుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తును హెచ్చరించారు. ఒప్పించడం, నిర్దిష్ట కార్యక్రమాల ఆధారంగా ఏర్పడి, తదుపరి ఎన్నికల్లో కరిగిపోయే అవకాశం ఉన్న ‘రాజకీయ మెజారిటీ’కి; పుట్టుకతో స్థిరపడి, ఒక మొత్తం మతానికి తామే ప్రతినిధులమని చెప్పుకునే ‘మతపరమైన మెజారిటీ’కి మధ్య ఉన్న తేడాను ఆయన స్పష్టంగా విడమరిచి చెప్పారు.
రాజ్యాంగంలోని మూడో భాగం (పార్ట్ 3) కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకే విధంగా కట్టుబడి ఉండేలా చేస్తుంది కాబట్టి, సమాఖ్య నిర్మాణం ఈ అంశానికి మరింత పదును పెడుతుంది.
కోల్‌కతాలోని ప్రభుత్వ రాజకీయ రంగు ఏదైనా, స్థానిక మెజారిటీ స్వభావం ఎలా ఉన్నా—కేరళ లేదా గోవాలోని క్రైస్తవుడికి ఉన్న హక్కులన్నీ బెంగాల్‌లోని క్రైస్తవుడికీ ఉంటాయి. శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం కావడం వల్ల, అంత్యక్రియలకు లేదా ప్రార్థనా సమావేశానికి రక్షణ కల్పించే మొదటి బాధ్యత రాష్ట్ర యంత్రాంగం, దాని పోలీసులపైనే ఉంటుంది.
ఈ విషయంలో వైఫల్యం మరొకరిదని రాష్ట్రం గానీ, కేంద్రం గానీ తప్పించుకోలేవు. స్థానిక మెజారిటీని బట్టి ప్రాథమిక హక్కులు మారిపోయే రాష్ట్రాల సమాఖ్య, త్వరలోనే ఒకే జెండా కింద ఉన్న సామంత రాజ్యాల సముదాయంగా మారిపోతుంది.
క్షేత్రస్థాయిలో పెరుగుతున్న దాడులు.. అంత్యక్రియల నిరాకరణ
ఈ తరహా ఆలోచనా విధానం ఆచరణలో ఎక్కడికి దారితీస్తుందో బెంగాల్ నుంచి వస్తున్న వార్తలు చూపిస్తున్నాయి. భారతదేశ జనాభాలో క్రైస్తవులు సుమారు 2.3 శాతం, బెంగాల్ జనాభాలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నారు. దీనివల్ల వారు ఎవరికీ జనాభాపరమైన ముప్పు కాకపోగా, సులభమైన లక్ష్యంగా మారుతున్నారు. అంత్యక్రియల హక్కులను నిరాకరించడం, నీటి వసతిని అడ్డుకోవడం, కుటుంబాలను వెలివేయడం, స్వయం ప్రకటిత రక్షక దళాలు (విజిలెంట్ గ్రూపులు) ప్రార్థనా సమూహాలను బెదిరించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
ఒక ఘటనలోనైతే, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బలవంతంగా దహనం చేస్తూ, ‘ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చింది’ అని ఆ కుటుంబానికి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎవాంజెలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియాకు చెందిన రిలీజియస్ లిబర్టీ కమిషన్, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం గణాంకాల ప్రకారం 2014లో క్రైస్తవులపై 127 హింసాత్మక ఘటనలు నమోదు కాగా, 2024 నాటికి ఆ సంఖ్య 834కు చేరింది. కేవలం స్థానిక తగాదాలతో వివరించలేనంత భారీ పెరుగుదల ఇది.
అంత్యక్రియల అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా తమ పూర్వీకులను ఖననం చేసిన నేలను ఒక కుటుంబానికి నిరాకరించడం అంటే—ఆ కుటుంబం జీవితంలో అత్యంత విషాదకరమైన సమయంలో, ఊరందరి ముందూ ‘మీరు ఈ ఊరి వారు కాదు’ అని చెప్పడమే.
ఆర్టికల్ 21 కింద మానవ గౌరవం మరణానంతరం కూడా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక సమాజం తమ మృతులను స్మరించుకుంటూ నిర్వహించే సంప్రదాయ వేడుకలకు చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయి.
శ్మశాన వాటికల వివరాలు మున్సిపల్, రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదై ఉంటాయి. కాబట్టి స్థలాన్ని నిరాకరించడం అనేది అరుదుగా మాత్రమే అక్కడికక్కడే గుమిగూడిన జనం చేసే చర్యగా ఉంటుంది; చాలావరకు చట్టం ఇప్పటికే నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించడంలో రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారి లేదా పంచాయతీ విఫలమవడం వల్లే ఇలా జరుగుతోంది.
క్రైస్తవ శ్మశాన వాటిక లేని చోట లేదా వివాదంలో ఉన్న చోట, ఆ సమాజానికి భూమిని కేటాయించడంతో పాటు అంత్యక్రియలు సురక్షితంగా జరిగేలా హామీ ఇవ్వాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. బాధిత కుటుంబం వచ్చి వేడుకునే వరకు వేచి చూడకుండానే రాజ్యం ఈ రెండింటినీ నెరవేర్చాలి.
రాజ్యం నుంచి ఆశిస్తున్నది ఏమంత క్లిష్టమైన విషయం కాదు, అందులో ఎలాంటి దాతృత్వమూ అడగడం లేదు—ఒక సమాధిని తవ్వి బయటకు తీస్తుంటే చోద్యం చూస్తూ నిలబడితే, తాము చేసిన ప్రమాణాన్ని విస్మరించినట్లేనని గ్రహించే పోలీసు వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం ఉంటే చాలు.
ఓంగే తెగ ఉదాహరణ.. మానవ గౌరవమే ప్రామాణికం
దశాబ్దాల క్రితం పార్లమెంటరీ విలేకరిగా పనిచేస్తున్నప్పుడు, రాజ్యసభలో జరిగిన ఒక అత్యంత ఆత్మీయమైన చర్చను నేను ప్రత్యక్షంగా చూశాను. లిటిల్ అండమాన్‌కు చెందిన అతి తక్కువ జనాభా కలిగిన ‘ఓంగే’ తెగ ప్రజల హక్కులను అన్ని పార్టీల సభ్యులు బలంగా సమర్థించారు.
అభివృద్ధి గణాంకాల్లో కనీసం నమోదు కూడా కాని సంప్రదాయ ఆర్థిక వ్యవస్థ కలిగిన, అత్యంత బలహీన గిరిజన సమూహం అది. ఇతర పౌరులందరితో సమానంగా జీవించే హక్కు, స్వేచ్ఛ, అంతరాత్మ స్వేచ్ఛ, సమాన రక్షణ పొందే హక్కు ఓంగే ప్రజలకూ ఉన్నాయని సభ్యులంతా ఏకగ్రీవంగా నొక్కిచెప్పారు. వారి ఆర్థిక తోడ్పాటు తక్కువగా ఉన్నందున వారి ఉనికి అంతరించిపోవచ్చని గానీ, వారి హక్కులను నిలిపివేయవచ్చని గానీ ఏ ఒక్కరూ సూచించలేదు.
క్రైస్తవ పాఠశాలలు, ఆసుపత్రులపై కురిపించే ప్రశంసలను మర్యాదపూర్వకంగా స్వీకరించవచ్చు; కానీ ఓంగే ప్రజల హక్కులు వారి అడవి ఇచ్చే దిగుబడిపై ఆధారపడనట్లే, క్రైస్తవుల హక్కులు కూడా ఆ సంస్థలపై ఆధారపడి లేవు.
ఈ రెండు సమాజాల హక్కులూ రాజ్యాంగంపై, ప్రతి వ్యక్తి సమాన గౌరవంపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని అత్యంత సూటిగా తెలియజేసే హెచ్చరికగా డాక్టర్ అంబేద్కర్ మాటలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఆయన హెచ్చరికను పాటించడం అంటే, ఈ లావాదేవీల ఆధారిత తర్కాన్ని పూర్తిగా కూల్చివేయడమే. తద్వారా భారతదేశంలో క్రైస్తవులైనా, మరే ఇతర సమాజమైనా—తమ ఉపయోగం ఏమిటో నిరూపించుకుని తమ ఉనికిని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ తలెత్తదు.
(వ్యాసరచయిత జాన్ దయాళ్ మాజీ సంపాదకులు, జాతీయ సమైక్యతా మండలి సభ్యులు, ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ పూర్వ అధ్యక్షులు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
