దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ సామాజిక వర్గాల్లో, విభిన్న పద్ధతుల్లో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వేలాది మంది ఉద్యమకారుల సమిష్టి కృషి ఫలితమే భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర.
ఆ విస్తృత చరిత్రలో కేరళకు చెందిన కే కేళప్పన్, గుజరాత్‌కు చెందిన నరహరి ద్వారకాదాస్ పారిఖ్, ఉత్తర భారతదేశానికి చెందిన దుర్గావతి దేవి(దుర్గా భాభీ) ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు.
వీరిలో కేళప్పన్ గాంధేయ సత్యాగ్రహం, సామాజిక సంస్కరణకు ప్రతీకగా నిలిస్తే, నరహరి పారిఖ్ గాంధేయ నిర్మాణ కార్యక్రమం, గ్రామీణ పునర్నిర్మాణం, విద్య, ప్రజా చైతన్యానికి ప్రతినిధిగా నిలిచారు.
దుర్గా భాభీ మాత్రం సాయుధ విప్లవోద్యమంలో మహిళల పాత్రకు ధైర్యవంతమైన ఉదాహరణగా నిలిచారు.
కేళప్పన్ – కేరళ గాంధీ
కోయపల్లి కేళప్పన్ కేరళ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ప్రముఖ నాయకుడు. ఆయనను ప్రజలు ప్రేమగా “కేరళ గాంధీ” అని పిలిచేవారు.
కేళప్పన్ 1889లో జన్మించారు. ఆయన రాజకీయ నాయకుడిగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, సామాజిక సంస్కర్త, జర్నలిస్టుగా కూడా పనిచేశారు.
భారత స్వాతంత్య్రోద్యమంతో పాటు కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాడారు.
ఉప్పు సత్యాగ్రహంలో కేళప్పన్
1930లో మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైనప్పుడు కేరళలో ఉద్యమం ఉధృతమైంది.
కేళప్పన్ పయ్యన్నూర్ ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని పెంచేందుకు ఆయన కృషి చేశారు.
కేరళలో స్వాతంత్య్రోద్యమం రాజకీయ స్వాతంత్య్రానికే పరిమితం కాకుండా సామాజిక సమానత్వం కోసం జరిగిన పోరాటంలో కేళప్పన్ పాత్ర ముఖ్యమైనది.
గురువాయూర్ సత్యాగ్రహాలు
పోరాటంలో అత్యంత ముఖ్యమైన అంశం అంటరానితనం. కుల వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కేళప్పన్కు ముఖ్యమైన పాత్ర ఉంది.
కేరళలో దేవాలయ ప్రవేశం అప్పట్లో తీవ్రమైన సామాజిక సమస్య. అణగారిన వర్గాలకు దేవాలయ ప్రవేశం నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన వైకోమ్ సత్యాగ్రహం, ఆ తర్వాత గురువాయూర్ సత్యాగ్రహం సామాజిక సంస్కరణ చరిత్రలో ముఖ్య ఘట్టాలు. గురువాయూర్ సత్యాగ్రహానికి కేళప్పన్ నాయకత్వం వహించారు.
1932 సెప్టెంబర్ 18న దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలనే డిమాండ్‌తో ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు.
ఈ దీక్ష 12 రోజులు కొనసాగింది. మహాత్మా గాంధీ విజ్ఞప్తితో 1932 అక్టోబర్ 2న ఆయన దీక్ష విరమించారు. తరువాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 77 శాతానికి పైగా ప్రజలు దేవాలయ ప్రవేశానికి అనుకూలంగా స్పందించారు.
చివరకు 1936లో కేరళలో దేవాలయ ప్రవేశ ప్రకటనకు మార్గం ఏర్పడింది.
స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలకుడిని వెళ్లగొట్టడంతో పాటు సమాజంలోని అసమానతలను కూడా తొలగించడం అనే భావనను కేళప్పన్ తన ఆచరణ ద్వారా ముందుకు తెచ్చారు.
మహాత్మా గాంధీ ప్రారంభించిన వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో కేరళ నుంచి మొదటి సత్యాగ్రహిగా కేళప్పన్ ఎంపికయ్యారు.
ఇది ఆయనపై గాంధీజీకి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. కేళప్పన్ 1971 అక్టోబర్ 7న మరణించారు. ఆయన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వ తపాలా శాఖ 1990లో స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.
నరహరి ద్వారకాదాస్ పారిఖ్
నరహరి ద్వారకాదాస్ పారిఖ్ 1891 అక్టోబర్ 7న అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆయన గుజరాత్‌లోని ఖేడా ప్రాంతానికి చెందినవారు.
గుజరాత్ కాలేజీలో బీఏ పూర్తి చేసిన తర్వాత ముంబైలో న్యాయ విద్యను అభ్యసించి ఎల్ఎల్బీ పొందారు. అనంతరం అహ్మదాబాద్‌లో న్యాయవాదిగా పనిచేశారు. కానీ ఆయన న్యాయవాదిగా కొనసాగలేదు.
1917లో భార్య మణిబెన్ తో కలిసి సబర్మతి ఆశ్రమంలో చేరడం ఆయన జీవితంలో కీలక మలుపు. గాంధీజీతో సన్నిహితంగా పనిచేసిన ప్రముఖ సహచరుల జాబితాలో నరహరి పారిఖ్ పేరు గాంధీ హెరిటేజ్ పోర్టల్‌లో కూడా ఉంది.
ఖేడా సత్యాగ్రహంలో పాత్ర
1918లో ఖేడా ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం భూమి పన్నును పూర్తిగా చెల్లించాలని రైతులను ఒత్తిడి చేసింది.
పంట దిగుబడి సాధారణ స్థాయిలో నాలుగో వంతు కంటే తక్కువగా ఉంటే పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ డిమాండ్‌ను తిరస్కరించింది.
ఈ పరిస్థితుల్లో రైతులు పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో వల్లభభాయ్ పటేల్‌తో పాటు నరహరి పారిఖ్ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకుల్లో ఒకరు.
రైతుల్లో చైతన్యం కల్పించడం, ఉద్యమాన్ని విస్తరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో సభలు, ప్రసంగాలతో పాటు గ్రామాలకు వెళ్లి ప్రజలను సంఘటితం చేయడం, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, వారికి రాజకీయ చైతన్యం కల్పించడం కూడా ఒక ప్రధాన అంశంగా ఉండేది.
బర్డోలీ సత్యాగ్రహం
1923–25 మధ్య నరహరి పారిఖ్ బర్డోలీ ప్రాంతంలోని సర్బోన్ గ్రామంలో నివసించారు.
1928లో జరిగిన బర్డోలీ సత్యాగ్రహంలో వాస్తవ పరిస్థితులపై సమాచారం సేకరించడం, ప్రజల సమస్యలను గుర్తించడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
బర్డోలీ ఉద్యమం భారత రైతాంగ చరిత్రలో కీలకమైన ఘట్టం. రైతుల ఆర్థిక సమస్యను జాతీయోద్యమంలో భాగం చేయడం ఈ ఉద్యమం ప్రాధాన్యత.
నరహరి పారిఖ్ వంటి కార్యకర్తలు ఆ ఉద్యమానికి సంస్థాగత, సమాచార, ప్రజా సంబంధాల కృషి కీలకం.
విద్య, గ్రామీణ పునర్నిర్మాణం
నరహరి పారిఖ్ కేవలం బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి మాత్రమే కాదు.
గాంధీజీ ఆలోచనల్లోని నిర్మాణాత్మక కార్యక్రమాలను ఆచరణలో పెట్టడానికి కృషి చేశారు.
1930 వరకు ఆయన గుజరాత్ విద్యాపీఠ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 1933లో ఖేడా జిల్లాలోని థామ్నా గ్రామంలో గాంధీజీ ప్రతిపాదించిన వర్ధా జాతీయ విద్యా పథకాన్ని అమలు చేసిన తొలి వ్యక్తిగా ఆయనను భారత ప్రభుత్వ చరిత్ర పేర్కొంది.
1935లో హరిజన్ ఆశ్రమానికి మేనేజర్‌గా పనిచేశారు. 1937లో బొంబాయి బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షుడయ్యారు.
1940–41లో సేవా గ్రామ్‌లోని సమగ్ర గ్రామ సేవక విద్యాలయానికి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు.
స్వాతంత్ర్యం అంటే రాజకీయ అధికార మార్పు మాత్రమే కాదు; విద్య, గ్రామీణ అభివృద్ధి, సామాజిక సమానత్వం ద్వారా కొత్త సమాజ నిర్మాణం అని ఆయన భావించారు.
క్విట్ ఇండియా ఉద్యమం
1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం నరహరి పారిఖ్‌ను సబర్మతి ఆశ్రమం నుంచి అరెస్టు చేసి జైలుకు పంపింది.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఆయన ప్రజా జీవితాన్ని విడిచిపెట్టలేదు.
భూదాన్ ఉద్యమం గురించి 1956 వరకు రచనలు చేస్తూ ప్రజా చైతన్యానికి తన వంతు కృషి చేశారు.
1957 జూలై 15న బర్డోలీలో ఆయన మరణించారు.
విప్లవోద్యమంలో ధైర్యానికి ప్రతీక దుర్గావతి దేవి
కేళప్పన్, నరహరి పారిఖ్ గాంధేయ మార్గంలో పనిచేసిన నాయకులైతే, దుర్గావతి దేవి భారత విప్లవోద్యమంలో అత్యంత ధైర్యవంతమైన మహిళా కార్యకర్తల్లో ఒకరు.
ఆమెను ప్రేమగా “దుర్గా భాభీ” అని పిలిచేవారు. ఆమె 1907 అక్టోబర్ 7న జన్మించారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసిన విప్లవకారుడు భగవతీ చరణ్ వోహ్రాను ఆమె వివాహం చేసుకున్నారు.
వోహ్రా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్(హెచ్ఎస్ఆర్ఏ)లో ప్రముఖ విప్లవకారుడు.
దుర్గా భాభీ స్వయంగా నౌజవాన్ భారత్ సభలో పనిచేసి, విప్లవకారులకు సహకరించారు.
భగత్‌సింగ్‌ను లాహోర్ నుంచి తప్పించడంలో కీలక పాత్ర
1928లో బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్య అనంతరం భగత్‌సింగ్ కోసం బ్రిటిష్ పోలీసులు వెతకడం తీవ్రం చేశారు. అటువంటి ప్రమాదకర పరిస్థితిలో భగత్‌సింగ్‌ను లాహోర్ నుంచి బయటకు తీసుకెళ్లడంలో దుర్గా భాభీ కీలక పాత్ర పోషించారు.
ఆమె భగత్‌సింగ్ భార్యాభర్తల వేషంలో ప్రయాణించగా, రాజ్ గురును వారి సేవకుడిగా చూపించారు.
ఈ విధంగా వారు లాహోర్ నుంచి కలకత్తాకు చేరుకున్నారు. ఇది సాధారణ సహాయం కాదు.
బ్రిటిష్ పోలీసులు ప్రతి మార్గంలో విప్లవకారులను వెతుకుతున్న సమయంలో, ఒక మహిళ తన కుటుంబ భద్రతను పక్కనపెట్టి ఒక విప్లవకారుడి ప్రాణాన్ని రక్షించడానికి ముందుకు రావడం అప్పటి పరిస్థితుల్లో అత్యంత ప్రమాదకరమైన చర్య.
విప్లవోద్యమంలో మహిళ పాత్ర
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో దుర్గా భాభీ వంటి మహిళలు అనేకమంది ధైర్య సాహసాలను ప్రదర్శించారు. విప్లవకారులకు ఆశ్రయం కల్పించారు.
రహస్య సమాచారాన్ని చేరవేశారు. ప్రయాణాల్లో సహకరించారు. ఆర్థికంగా సహాయం చేశారు.
బ్రిటిష్ నిఘా వ్యవస్థను తప్పించుకునేందుకు రిస్క్ తీసుకున్నారు. ప్రత్యక్ష విప్లవ చర్యల్లో పాల్గొన్నారు.
దుర్గా భాభీ తన ఆభరణాలను అమ్మి సుమారు మూడు వేల రూపాయలు భగత్‌సింగ్ తదితర విప్లవకారుల కు సహాయం చేశారు.
భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు మరణశిక్ష విధించడాన్ని దుర్గా భాభీ తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఉరితీతకు ప్రతీకారంగా అప్పటి పంజాబ్ గవర్నర్ లార్డ్ హేలీపై దాడి చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
దాడిలో గవర్నర్ తప్పించుకున్నప్పటికీ ఆయన సహాయకులు గాయపడ్డారు. అనంతరం దుర్గా భాభీని అరెస్టు చేసి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఆ విధంగా దుర్గా భాభీ విప్లవకారులకు సహాయం చేయడంతో పాటు తాను స్వయంగా విప్లవోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు.
నేటి తరానికి వారి జీవితాలు ఒక పాఠం
స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడిచినప్పటికీ ఈ ముగ్గురి జీవితాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.
మనకు రాజకీయ స్వాతంత్ర్యంతో పాటు సామాజిక సమానత్వం అవసరమని కేళప్పన్ పోరాడారు.
దేశ నిర్మాణం అంటే కేవలం ప్రభుత్వాలు మారడం కాదని, విద్య, గ్రామీణాభివృద్ధి, ప్రజా చైతన్యం వంటి అంశాలు కూడా స్వాతంత్య్రానికి అంతర్భాగాలని నరహరి పారిఖ్ రుజువు చేశారు.
స్వాతంత్య్రోద్యమంలో మహిళలు ప్రేక్షకులు కాదు, వారు కూడా ప్రమాదానికి వెరవక నాయకత్వం వహించిన క్రియాశీల యోధులని దుర్గా భాభీ చరిత్ర తెలియజేస్తోంది.
ఈ ముగ్గురి జీవితాలు కలిపి చూసినప్పుడు స్వాతంత్ర్యం ఒక తేదీ కాదు, అది నిరంతర సామాజిక బాధ్యత. రాజకీయ స్వేచ్ఛను సాధించిన తరువాత దానిని ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, మానవ గౌరవం ద్వారా బలోపేతం చేయడం ప్రతి తరం బాధ్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
