విజయవాడ పట్టణం నున్న పరిధిలోని వాంబే కాలనీలో కామాంధుల (గంజాయి బ్యాచ్) చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పసుపులేటి గణేశ్వరిని(మాదిగ)పరామర్శించిన కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ, కృష్ణా జిల్లా అధ్యక్షులు తుమాటి శ్రీరాములు.
వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామ దళిత(మాదిగ) వాడకు చెందిన కొప్పాక వెంకయ్య, భార్య వెంకాయమ్మ దంపతులకు మూడవ సంతానంగా జన్మించిన గణేశ్వరి తల్లిదండ్రులు మందలించగా చిన్న వయసులోనే ఇంటిలో నుంచి పారిపోయి విజయవాడ పట్టణంలోని వాంబే కాలనీకి చేరింది.
అదే కాలనీలో గణేష్ అలియాస్ సంధ్యారాణి(హిజ్రా) గణేశ్వరిని చేరదీసింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత పసుపులేటి మావూళ్లు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి మగబిడ్డ(రాము) పుట్టిన కొంత కాలానికి ఆమె భర్త మరణించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హిజ్రాలతోనే స్నేహం చేస్తూ వారంలో నాలుగు రోజులు కలిగినోళ్లకు మసాజ్ చేయడం, మరో రెండు రోజులు హిజ్రాలతో కలిసి షాపుల వెంట తిరుగుతూ వాళ్లు ఇచ్చే చిల్లర డబ్బులతోనే బిడ్డను చదివించింది. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న రాము పని నిమిత్తం చెన్నై వెళ్లాడు.
తమ్ముడిని కాదని హిజ్రా పుట్టినరోజుకు వెళ్లి..
భర్తను కోల్పోయిన గణేశ్వరి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా ఆమె తమ్ముడు తనకు రాఖీ కట్టి వెళ్లమని ఫోన్ చేశాడు. ఆమె వెళ్లలేదు. ఎందుకంటే చిన్న వయసులోనే ఆమెకు ఆశ్రయమిచ్చి ఆదరించిన సంధ్యారాణి(హిజ్రా) పుట్టిన రోజు కనుక. తమ్ముడు కన్నా ఆమెకే ఎక్కువ విలువ ఇచ్చింది.
సంధ్యారాణి పుట్టిన రోజు రాత్రి వేడుక జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన గణేశ్వరి విందు ముగిసిన తరువాత ఇంటికి వెళ్లింది. అదే వేడుకలకు హాజరైన రహంతుల్లా(ముస్లిం), లింగాల సాయి(ఎరుకల), సాయి అనే యువకుడితో పాటు పిలకా వెంకన్న(రాజు), గణేశ్వరి స్నేహితురాలు నాగమణి(ముస్లిం) భర్త వెంకటరమణ(మాల) కొడుకు ప్రభాస్ గంజాయి తాగి రాత్రి సుమారు ఒంటి గంట సమయంలో గణేశ్వరి ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు.
గడి తీసీతీయక ముందే తోసుకుంటూ ఇంట్లో జొరబడి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగక ఆమె మల, మూత్ర ద్వారాలను వేట కుక్కల్లా చీల్చివేశారు.
అమానుషం.. అపస్మారక స్థితిలో బాధితురాలు..
మీ తల్లి, అక్క, చెల్లి లాంటి దాన్ని అని ఆమె ఎంత ప్రాధేయపడినా వదలని మానవ మృగాలు, మృగాలు కూడా అసహ్యించుకునే విధంగా ఆమె జననాంగాలను ఛిధ్రం చేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న గణేశ్వరిని స్థానిక మహిళలు ఆర్ఎంపీ వద్దకు తీసుకొని వెళ్లగా ప్రాథమిక చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన ఆర్ఎంపీ సూచన మేరకు గణేశ్వరిని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
అసలే ఒంటరి మహిళ. ఆమె వైద్యం కోసం డబ్బులు ఇచ్చి సహాయం చేసే వారు లేకపోవడంతో మూడు రోజులు పాటు డాక్టర్లు వైద్యం అందించలేదు. అంతమాత్రమే కాదు ఆమెను బలవంతంగా సెప్టెంబర్ 4న డిశ్చార్జి చేశారు.
పోలీసుల రంగప్రవేశం, నిందితుల అరెస్ట్..
సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో రంగప్రవేశం చేసిన నున్న సీఐ తన సిబ్బందితో వెళ్లి బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
డాక్టర్లతో సంప్రదించి ఆమెకు సర్జరీ చేయించారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
తమతో సన్నిహితంగా మెలిగే గంజాయి బ్యాచ్ గణేశ్వరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలుసుకున్న సంధ్యారాణి(హిజ్రా) రేపిస్టులపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించిందే కానీ తన పుట్టిన రోజు వేడుకల కోసం సొంత తమ్ముడితో రాఖీ కట్టించుకునేందుకు కూడా వెళ్లకుండా తనకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని వదిలి మానవ మృగాలకు అండగా నిలిచింది.
నిజం టీవీ చొరవ.. బయటపడ్డ దారుణం..
గణేశ్వరిపై జరిగిన అత్యాచార ఘోర సంఘటన తెలుసుకున్న ఆమె అక్కలు, చెల్లి, తమ్ముడు ఆసుపత్రికి చేరుకున్నారు.
సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినా అది పత్రికలకు, మీడియాకు తెలుపలేదు. విషయం తెలుసుకున్న నిజం టీవీ ఛానెల్ బాధ్యులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి వేదనను, పాలకుల నిర్లక్ష్యం పట్ల తన ఆవేదనను ఛానల్ ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు.
విషయం ఆలస్యంగా తెలుసుకున్న కుల నిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ, కృష్ణా జిల్లా అధ్యక్షులు తుమాటి శ్రీరాములు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు గణేశ్వరి, ఆమె కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించడం జరిగింది.
పాలకుల నిర్లక్ష్యంపై విమర్శలు..
జగన్ పరిపాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, గంజాయి అమ్మకాలకు, కొనుగోళ్లకు నిలయంగా మారిందని, ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి అదే చివరి రోజు అవుతుందని ప్రజలకు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు నేడు పోలీసులతోనే, వారి వాహనాల్లోనే గంజాయి, మద్యం సరఫరా చేస్తుండగా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
అగ్రకులాల మహిళలపై జరుగుతున్న అత్యాచార హత్యలపై వెంటనే స్పందిస్తూ నేరగాళ్లను కడతేరుస్తున్న సంఘటనలు మన కళ్లముందున్న సత్యం.
సుమారు 15 రోజుల క్రితం రాజధాని శివారు వాంబే కాలనీలో మాదిగ మహిళ గణేశ్వరిపై జరిగిన సామూహిక అత్యాచారం, నిజం మీడియా ద్వారా ప్రచారం జరిగింది.
బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు కనీసం ఒక్క సారి పరామర్శించి వెళ్లమని, తనకు జరిగిన అన్యాయం మరొక స్త్రీకి జరగకుండా చూడాలని కూటమి ప్రభుత్వం అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తో పాటు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని వేడుకున్నారు. వాళ్లతో అంటకాగుతూ, వాళ్ల అడుగులకు మడుగులొత్తే దళిత నాయకులకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికీ కూడా బాధితుల ఆవేదనను అర్థం చేసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారమై, బాధితులను పరామర్శించి వారిని ఆదుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేయాల్సిన సంఘటన ఆసుపత్రికి నాలుగు గోడల మధ్య బందీ అయి పోయింది.
బాధితురాలు, వారి కుటుంబ సభ్యులకు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో తిండి తిప్పలు సరిగా లేక, ఆసుపత్రిలో దోమల బారిన పడి బాధలు పడుతున్నారు.
ఇప్పటికైనా మానవత్వం ఉన్న మనుషులు, దళిత, మహిళా, ప్రజాసంఘాల నాయకులు బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి ఆదుకోవాలని కుల నిర్మూలనా పోరాట సమితి విజ్ఞప్తి చేస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
