కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యలు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) విధిస్తున్న కఠిన నిబంధనలపై దేశవ్యాప్తంగా సహకార బ్యాంకులు, సొసైటీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
రాజ్యాంగబద్ధమైన హక్కులను, స్వేచ్ఛను కాలరాస్తున్న ఈ విధానాలను కోర్టులు సైతం తప్పుబడుతున్నాయి. అయినప్పటికీ కేంద్రం, ఆర్బీఐలు సహకార రంగాన్ని తమ రాజకీయ, బ్యూరోక్రాటిక్ ఆధిపత్యం కిందకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయనే ఆందోళన బలంగా వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే బెంగళూరు, విజయవాడల్లో జరిగిన అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్ సమావేశాలు ఆర్బీఐ ఆంక్షలను ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ విస్పష్ట తీర్మానాలు చేశాయి.
‘సహకార వ్యవస్థ అనేది ప్రజలు తమ అవసరాలు, ఆకాంక్షల కోసం నిర్మించుకున్న ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య సౌధం. దీనికి సభ్యుల భాగస్వామ్యం, ప్రజాస్వామ్య నియంత్రణ, స్వయంప్రతిపత్తి అనేవి ప్రాణవాయువులు. ఆర్బీఐ లేదా బయటి సంస్థలు అనాలోచిత నిర్ణయాలు రుద్దడం వల్ల వ్యవస్థ ఆత్మ దెబ్బతింటుంది’ అని విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ పూర్వ అధ్యక్షులు, ఎమిరిటస్ మానం ఆంజనేయులు స్పష్టం చేశారు.
సహకార సంస్థలు నడిచే పోస్టుకార్డులు కావు..
విజయవాడలో ఘనంగా జరిగిన ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ 11వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య ప్రసంగిస్తూ, సహకార సంస్థలు లేఖలు రాస్తే నడిచే పోస్టుకార్డులు కావు అని హెచ్చరించారు.
బోర్డులో ఎవరిని డైరెక్టర్‌గా ఎన్నుకోవాలి? ఎంతకాలం కొనసాగించాలి? అనే అత్యున్నత నిర్ణయాధికారం రాజ్యాంగబద్ధంగా కేవలం సభ్యులకే ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ, బయటి వ్యవస్థల ఆధిపత్యం సహకార స్ఫూర్తికే విరుద్ధమని నిప్పులు చెరిగారు.
కేంద్రం, ఆర్బీఐ వైఖరిపై శంఖారావం..
ఇదే వేదికపై సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు చిట్టూరి రవీంద్ర, కార్యదర్శి చలసాని రాఘవేంద్రరావు సమర్పించిన 2025-26 వార్షిక నివేదిక ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సమర శంఖారావం పూరించింది.
‘సహకార్ సే సమృద్ధి’ అని చెప్తూనే, గత 23 ఏళ్లుగా కొత్త బ్యాంకులకు లైసెన్సులు ఇవ్వకపోగా, ఆచరణ సాధ్యం కాని ఆంక్షలతో చిన్న బ్యాంకులను బలవంతపు విలీనాల వైపు నెడుతున్న ఆర్బీఐ తీరును నివేదిక తీవ్రంగా ఖండించింది.
ఐక్య ఉద్యమానికి నాంది..
కేంద్రం, ఆర్బీఐ విధిస్తున్న అక్రమ నిబంధనలపై ఏపీ ఫెడరేషన్ ముందుగా స్పందించి హైకోర్టులో పదునైన న్యాయపోరాటం ప్రారంభించిందని, ఇది మహారాష్ట్ర, కర్ణాటక ఫెడరేషన్లకు దిక్సూచిగా మారి జాతీయ స్థాయి ఐక్య ఉద్యమానికి పునాది వేసిందని నేతలు పేర్కొన్నారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని తగ్గించుకోవడంలో కీలక పాత్ర పోషించామని, రాబోయే రోజుల్లో రూ 5 లక్షలు దాటిన డిపాజిట్లకు పూర్తి బీమా సాధించే వరకు, సహకార స్వయంప్రతిపత్తిని కాపాడుకునే వరకు న్యాయస్థానాలు, ప్రజా వేదికలపై ఐక్య పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
చలసాని రాఘవేంద్రరావు గొంతుక..
ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ అర్బన్ బ్యాంకుల ఫెడరేషన్ నూతన అధ్యక్షులు, నాఫ్కబ్(నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ లిమిటెడ్) డైరెక్టర్, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు సహకార రంగానికి బలమైన గొంతుకగా నిలిచారు.
ప్రజాస్వామ్య సూత్రాల పరిరక్షణే ధ్యేయంగా ఆయన వినిపిస్తున్న పదునైన వాదనలు దేశవ్యాప్తంగా చైతన్యాన్ని రగిలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సహకార వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్బీఐ నిబంధనలలోని అంతరార్థాలపై విజయవాడలో ఆయన సీనియర్ జర్నలిస్టు కృష్ణ కానూరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ పాఠం ఇది.
ప్రశ్న: ‘మోడల్ బైలాస్’ ద్వారా ఆర్బీఐ అంతర్గత పరిపాలనలో నేరుగా జోక్యం చేసుకోవడం సహకార వ్యవస్థకు ఎంతవరకు ప్రమాదకరం?
రాఘవేంద్రరావు: 97వ రాజ్యాంగ సవరణ సహకార సంస్థలకు స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్య యాజమాన్య హక్కును కల్పించింది.
అయితే ఆర్బీఐ తెస్తున్న ‘మోడల్ బైలాస్’లోని 90 శాతానికి పైగా అంశాలు కేవలం నియంత్రణ ధోరణితో రూపొందించినవే. సహకార బ్యాంకులు కేవలం ఆర్థిక సంస్థలు మాత్రమే కావు.. అవి సభ్యుల ప్రజాస్వామ్య భాగస్వామ్యంతో నడిచే సామాజిక-ఆర్థిక ఉద్యమాలు.
పాలకవర్గాల అధికారాలకు కోత విధించడం, నియామకాలపై అదనపు ఆంక్షలు పెట్టడం ద్వారా బ్యాంకుల ప్రాథమిక స్వేచ్ఛను దెబ్బతీసి, వాటిని బలవంతంగా వాణిజ్య బ్యాంకుల మాదిరిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
ప్రశ్న: రాష్ట్ర సహకార రిజిస్ట్రార్(ఆర్సీఎస్), ఆర్బీఐల ‘ద్వంద్వ నియంత్రణ’ అర్బన్ బ్యాంకుల నిర్వహణను ఏ విధంగా స్తంభింపజేస్తోంది?
రాఘవేంద్రరావు: ఈ ‘ద్వంద్వ నియంత్రణ’ ప్రస్తుతం సహకార రంగాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద పరిపాలనా సంక్షోభం. బ్యాంకింగ్ నిబంధనల పేరుతో ఆర్బీఐ ఒకవైపు, సొసైటీ నమోదు, ఆడిట్, ఎన్నికల పేరుతో రాష్ట్ర రిజిస్ట్రార్ మరోవైపు పరస్పర విరుద్ధమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు.
బైలాస్ మార్చాలన్నా, పాలనాపరమైన నిర్ణయాలు అమలు చేయాలన్నా రెండు వ్యవస్థల అనుమతులు తప్పనిసరి కావడంతో తీవ్ర ఆలస్యం జరుగుతోంది.
ఫలితంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక బ్యాంకుల పాలకమండళ్లు నిరంతరం నలిగిపోతూ రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి.
ప్రశ్న: బ్యాంకింగ్ రెగ్యులేషన్ (బీఆర్) చట్టాన్ని బోర్డుల రద్దు, పరిపాలనాధికారాల కోత వరకు విస్తరించడం సహకార స్ఫూర్తికి విరుద్ధం కాదా?
రాఘవేంద్రరావు: ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన అధికార విభజనకు విరుద్ధం. డిపాజిటర్ల నిధుల భద్రత, బ్యాంకింగ్ క్రమబద్ధీకరణకే బీఆర్ చట్టం పరిమితం కావాలి.
కేవలం బ్యాంకింగ్ లైసెన్స్ ఉందనే సాకుతో మొత్తం యాజమాన్య వ్యవస్థను కేంద్ర పర్యవేక్షణలోకి తెచ్చుకోవడం సమర్థనీయం కాదు.
సంస్థలో లోపాలుంటే ఆడిట్ లేదా చట్టపరమైన చర్యల ద్వారా సరిదిద్దవచ్చు. కానీ ఏకపక్షంగా బోర్డులను రద్దు చేయడం లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రతినిధుల అధికారాలను తీసివేయడం అనేది సహకార రంగాన్ని బ్యూరోక్రాటిక్ కంట్రోల్లోకి తెచ్చే కుట్రే.
ప్రశ్న: ఆర్బీఐ విధించే కఠిన ఆంక్షల వల్ల గ్రామీణ, పట్టణ దిగువ మధ్యతరగతి వర్గాలకు జరిగే నష్టమేమిటి?
రాఘవేంద్రరావు: వాణిజ్య బ్యాంకులు పట్టించుకోని సామాన్యుడికి, చిన్న వ్యాపారికి అండగా నిలవడమే సహకార బ్యాంకుల అసలు లక్ష్యం.
అయితే బడా కార్పొరేట్ బ్యాంకులకు వర్తించే కఠిన నిబంధనలనే ఈ చిన్న బ్యాంకులపై కూడా రుద్దడం వల్ల సామాన్యులు తీవ్రంగా దెబ్బతింటున్నారు.
చివరికి అత్యవసర సమయాల్లో ఇచ్చే గోల్డ్ లోన్లు, సూక్ష్మ రుణాలపై కూడా ఆంక్షలు విధించడం వల్ల పేదలు మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఇది స్థానిక ఆర్థిక ప్రగతికి తీవ్రమైన ప్రతిబంధకం.
ప్రశ్న: రాజ్యాంగంలో ‘సహకారం’ అనేది స్పష్టంగా రాష్ట్ర జాబితాలోని అంశమైనప్పుడు కేంద్రం ఆర్బీఐ ద్వారా జోక్యం చేసుకోవడాన్ని ఎలా చూడాలి?
రాఘవేంద్రరావు: రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(సి) పౌరులకు సంఘాలు ఏర్పరుచుకునే ప్రాథమిక హక్కును ఇచ్చింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం ‘సహకారం’ అనేది స్పష్టంగా రాష్ట్రాల పరిధిలోని విషయం (స్టేట్ లిస్ట్ – 32వ అంశం).
ఒకే రాష్ట్రంలో పనిచేసే బ్యాంకులపై ఆర్బీఐ ద్వారా కేంద్రీకృత నియంత్రణ సాధించాలని చూడటం సమాఖ్య స్ఫూర్తిని, రాష్ట్రాల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాయడమే.
వివిధ రాష్ట్రాల ప్రత్యేక చట్టాలను, స్థానిక అవసరాలను విస్మరించి నిర్ణయాలు రుద్దడం వ్యవస్థ ఉనికికే ప్రమాదం.
ప్రశ్న: ఆర్బీఐ ప్రతిపాదిస్తున్న ‘మోడల్ బైలాస్’ను నిర్బంధం చేయకుండా మార్గదర్శకాలుగా మాత్రమే ఎందుకు ఉంచాలి?
రాఘవేంద్రరావు: బైలాస్ అనేది సంస్థకు సంబంధించిన రాజ్యాంగం లాంటిది. దానిని సవరించే లేదా ఆమోదించే అత్యున్నత ప్రాథమిక అధికారం ఆ సంస్థలో వాటాదారులుగా ఉన్న సభ్యులందరితో కూడిన ‘జనరల్ బాడీ’ (సాధారణ సభ)కి మాత్రమే ఉంటుంది.
ఆర్బీఐ ప్రతిపాదించే మోడల్ బైలాస్‌ను బలవంతంగా మ్యాండేటరీ చేస్తే జనరల్ బాడీ ఉత్సవ విగ్రహంగా మారిపోతుంది. అందుకే మోడల్ బైలాస్ అనేది కేవలం ఒక మార్గదర్శిగా మాత్రమే ఉండాలి తప్ప, తుది నిర్ణయాధికారం జనరల్ బాడీదే కావాలి.
ప్రశ్న: ఒకవైపు స్థానిక రాజకీయ జోక్యం, మరోవైపు ఆర్బీఐ కేంద్రీకృత ఆంక్షలు… ఈ రెండింటి నడుమ అర్బన్ బ్యాంకుల పరిస్థితి ఏమిటి?
రాఘవేంద్రరావు: సహకార రంగం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించకపోవడం, నామినేటెడ్ కమిటీలు వేయడం వంటి స్థానిక రాజకీయ జోక్యంతో దెబ్బతింటోంది. దీనికితోడు ఆర్బీఐ కేంద్రీకృత విధానాలు, ఊపిరాడనివ్వని జరిమానాలు విధిస్తుండటంతో చిన్న అర్బన్ బ్యాంకులు నిర్వహణ భారమై మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
విలీనాలు లేదా లైసెన్సుల రద్దు సులభమైన మార్గంగా భావిస్తే గ్రామీణ, పట్టణ స్వయంప్రతిపత్తి దెబ్బతింటుంది. బ్యాంకులను కాపాడాలంటే అనాలోచిత ఆంక్షలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
ప్రశ్న: ఏక-రాష్ట్ర, బహుళ-రాష్ట్ర బ్యాంకులకు ఒకే విధమైన ‘మోడల్ బైలాస్’ రుద్దడం సమంజసమేనా?
రాఘవేంద్రరావు: ఇది ఎంతమాత్రం ఆచరణ సాధ్యం కాని చర్య. ఒకే రాష్ట్ర పరిధిలో పనిచేసే ఏక-రాష్ట్ర బ్యాంకుల పరిధి, నిధుల పరిమాణం వేరు.
అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉండే బహుళ-రాష్ట్ర బ్యాంకుల చట్టపరమైన పరిధి, ఆర్థిక మూలధన సామర్థ్యాలు వేరు. ఈ రెండింటినీ ఒకే గాటన కట్టి ‘అందరికీ ఒకే కొలత’ చందాన ఒకే రకమైన బైలాస్ నిబంధనలు తెస్తామనడం వాస్తవ దూరమైన చర్య. చిన్న ఏక-రాష్ట్ర బ్యాంకులపై ఈ నిబంధనలు రుద్దితే అవి కుప్పకూలిపోతాయి.
ప్రశ్న: ఆర్బీఐ, కేంద్రం, ఆర్సీఎస్, నాఫ్కబ్లతో ‘శాశ్వత సమన్వయ కమిటీ’ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉద్దేశం ఏమిటి?
రాఘవేంద్రరావు: నిరంతరం తలెత్తుతున్న వివాదాలకు ప్రధాన కారణం అధికారులు, నియంత్రణ సంస్థల మధ్య ఉన్న సమన్వయ లోపమే. అందుకే ఆర్బీఐ, కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ఆర్‌సీఎస్‌లు, నాఫ్కబ్ ప్రతినిధులతో ఒక ‘శాశ్వత సమన్వయ కమిటీ’ ఏర్పాటు చేయాలని బెంగళూరు భేటీలో ప్రతిపాదించాను.
ఏవైనా కొత్త నిబంధనలు తెచ్చే ముందు క్షేత్రస్థాయి యథార్థాలను ఈ కమిటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే వివాదాలు కోర్టుల వరకు వెళ్లకుండానే సామరస్యంగా పరిష్కారమవుతాయి.
ప్రశ్న: ఈ తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో స్వయంప్రతిపత్తిని, డిపాజిటర్ల నమ్మకాన్ని కాపాడుకోవడానికి సహకార బ్యాంకులు తీసుకోవాల్సిన దిశానిర్దేశం ఏమిటి?
రాఘవేంద్రరావు: ‘అందరి కోసం ఒకరు – ఒకరి కోసం అందరూ’ అనే సూత్రమే సహకార రంగానికి జీవగర్ర. ప్రభుత్వాలు, ఆర్బీఐ ఎంతటి ఆంక్షలు విధించినా బ్యాంకులు తమ పారదర్శకతను, ప్రజాస్వామ్య యాజమాన్య సూత్రాలను వీడకూడదు.
అంతర్గత ఆడిట్, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనలిజం పెంచుకోవాలి. అదే సమయంలో రాజ్యాంగబద్ధమైన హక్కులు, స్వయంప్రతిపత్తి పరిరక్షణ కోసం నాఫ్కబ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకులన్నీ ఐక్యంగా న్యాయపోరాటం సాగించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
