పుట్టుక ఆధారంగా నెలకొన్న నిచ్చెనమెట్ల కులాధిపత్య వ్యత్యాసాల నుంచి వ్యక్తులను విముక్తి చేయాల్సిన సంస్థలే, తిరిగి ఆ తరతమ భేదాలను ప్రతిబింబిస్తూ ఉండడం ఎంతో ఆందోళన కలిగించే విషయం.
విశ్వవిద్యాలయాలు ప్రతిభను పెంపొందించేవిగా, మూఢనమ్మకాలను, వివక్షలను హేతుబద్ధతతో ప్రశ్నించేవిగా, ఒక యువకుడి భవిష్యత్తును అతని పుట్టుక ఆధారంగా కాకుండా అవకాశాల ఆధారంగా నిర్దేశించేవిగా ఉండాలని ఆశిస్తాం.
అయినప్పటికీ, కులం ఉన్నత విద్యాలయం తలుపుల వద్ద అంతం కాలేదు. అది తరగతి గదిలోకి, హాస్టల్లోకి, ప్రయోగశాలలోకి, అధ్యాపకుల గదిలోకి, చివరికి ‘ప్రతిభ’ అనే పదజాలంలోకి కూడా ప్రవేశిస్తోంది.
ఈ రోజు మన విశ్వవిద్యాలయాలలో కులం ఉందా లేదా అనేది అసలు ప్రశ్నే కాదు. రాజ్యాంగపరమైన హామీలు, రిజర్వేషన్లు, విద్యావకాశాల విస్తరణ ఉన్నాయి. అయినప్పటికీ, కులం అనేది ఇంకా అభ్యసనం, ఆత్మీయత, గౌరవాల అనుభవాన్ని ప్రభావితం చేస్తూనే ఉంది.
‘జూఠన్’ చెప్పిన చేదు నిజం
బహుశా సాహిత్యం దీనిని మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు. ఓం ప్రకాష్ వాల్మీకి రాసిన ‘జూఠన్’లో, విద్య అనేది కేవలం సామాజిక పురోగతికి ఒక సాధారణ నిచ్చెన మాత్రమే కాదు.
తరగతి గది అనేది కులం తన ఉనికిని చాటుకునే ప్రదేశంగా మారుతుంది. ఇతరులు చదువుకుంటున్నప్పుడు, తాను మాత్రం తక్కువ పనులు చేయవలసి రావడం వల్ల కలిగే అవమానాన్ని ఎదుర్కోవడం ఒక ప్రాథమిక వైరుధ్యాన్ని తెలియజేస్తుంది.
సామాజిక వివక్ష నుంచి విముక్తి కలిగిస్తుందని భావించే ఒక విద్యా సంస్థ, విద్యార్థి ఏ బంధనాల నుంచి అయితే విముక్తి కోరుకుంటున్నాడో అదే ఆధిపత్య వ్యవస్థను తిరిగి సృష్టిస్తుంది.
‘ప్రతిభ’ వెనుక ఉన్న అసమానతలు
ఇవి కేవలం వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత పక్షపాతాలు మాత్రమే కావు, ఇవి సంస్థాగత సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు. ఇక్కడ ‘ప్రతిభ’ అనే పదజాలం చాలా కీలకంగా మారుతుంది.
ప్రతిభ అనేది సామాజిక నేపథ్యంతో సంబంధం లేకుండా శూన్యం నుండి ఉత్పన్నమవుతుందన్నట్లుగా చిత్రీకరిస్తారు. కానీ మంచి పాఠశాలలు, కోచింగ్, పుస్తకాలు, కంప్యూటర్లు, అపరిచితమైన విద్యాసంస్థలలో సులభంగా మసలుకునే సంబంధాలు ఎవరికి అందుబాటులో ఉన్నాయి?
ఈ అసమానతలను అంగీకరించడం అంటే విద్యా ప్రమాణాల ప్రాముఖ్యతను నిరాకరించడం కాదు. కానీ ప్రతిభను అది ఉత్పత్తి అయ్యే, పోషించబడే, ప్రదర్శించబడే అసమాన పరిస్థితులను పరిశీలించకుండా అర్థం చేసుకోగలమా అనే కఠినమైన ప్రశ్నను మనల్ని వేసుకోమని కోరుతుంది.
ఈ ప్రశ్నను అడగడానికి నిరాకరించే విశ్వవిద్యాలయం, వంశపారంపర్యంగా వచ్చిన అనుకూలతలను, ప్రయోజనాలను వ్యక్తిగత సాధనగా పొరబడే ప్రమాదం ఉంది.
భారతీయ సాహిత్యం దశాబ్దాలుగా ఈ ప్రశ్నలను అడుగుతోంది. పవార్ లేదా వేర్వేరు చారిత్రక ఘట్టాలలో రాసిన ప్రేమ్చంద్ ‘సద్గతి’ వంటి రచనలు, ఆధునిక భారతదేశం తేలిగ్గా పరిష్కరించబడ్డాయని అనుకోవడానికి ఇష్టపడే ప్రశ్నలను మన ముందు ఉంచుతూనే ఉన్నాయి.
పెరుగుతున్న ఫిర్యాదులు.. కాగితాలకే పరిమితం
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పార్లమెంటరీ కమిటీకి అందించిన డేటా ప్రకారం, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో కుల వివక్షపై వచ్చిన ఫిర్యాదులు 2019-20లో 173 కాగా, 2023-24 నాటికి 378కి పెరిగాయి (ఇందులో 704 విశ్వవిద్యాలయాలు, 1,553 కళాశాలల నివేదికలు ఉన్నాయి).
ఈ గణాంకాలకు జాగ్రత్తగా విశ్లేషణ అవసరం. అసలు ప్రశ్న ఏమిటంటే— ఒక విద్యార్థి ఫిర్యాదు చేసిన తర్వాత ఏమి జరుగుతుంది?
కేవలం కాగితాలపై మాత్రమే ఉండే ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఎవరినీ కాపాడలేదు.
సంస్థాగత వివక్షకు బలైపోతున్న విద్యార్థులు
2016లో హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య, ఇటీవల ఐఐటీ బాంబేలో సాహిల్ వాకోడే ఆత్మహత్య వంటి సంఘటనలు కులం, సంస్థాగత వివక్ష, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల బలహీనతల మధ్య ఉన్న సంబంధంపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించాయి.
సాహిల్ వాకోడే విషయంలో కుల వివక్ష ఆరోపణలపై విచారణ జరుగుతోంది, అయితే అలాంటి వివక్ష జరగలేదని ఆ సంస్థ ఖండించింది.
ఈ విభేదాలు, వివరాలు ముఖ్యమే, కానీ ఇవి ఒక పెద్ద ప్రశ్న నుండి దృష్టి మళ్లించడానికి కారణం కాకూడదు.
విద్యార్థులు ఎదుర్కొనే అవమానం, ఒంటరితనం, మినహాయింపుల రూపాలను గుర్తించడానికి, పరిష్కరించడానికి మన విద్యాసంస్థలు తగినంతగా సిద్ధపడి ఉన్నాయా?
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
