ఓటర్ల జాబితాలో నమోదు, తొలగింపులలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన “ఛలో లోక్‌భవన్” పిలుపు మేరకు కూటమి భాగస్వామ్య పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు లోక్‌భవన్ వరకు ప్రదర్శన చేశారు.
తమ డిమాండ్‌పై బారికేడ్లను దాటి లోక్‌భవన్‌లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన నాయకులు, కార్యకర్తలను ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కారణంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య కొంత సేపు తోపులాట జరిగింది.
నిరసనలో పాల్గొన్న అఖిలపక్ష నేతలు
ఈ నిరసన కార్యక్రమంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బి మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏ లక్ష్మణ్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహ్మద్ అజారుద్దీన్, సీపీఎం జాన్‌వెస్లీ, జూలకంటి రంగారెడ్డి, టి జ్యోతి, చెరుకుపల్లి సీతారాములు, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి, ఈటి నర్సింహ, టీజేఎస్ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ(ఎంఎల్ – న్యూ డెమోక్రసీ), సీపీఐ(ఎంఎల్ – మాస్‌లైన్), సీపీఐ (ఎంఎల్ – ప్రజాపంథా), ఎస్‌యూసీఐ, సమాజ్‌వాదీ పార్టీతో పాటు పలు విద్యార్థి, యువజన, మహిళా సంఘాలతో సహా పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పాల్గొన్నారు. స్థానిక మాజీ శాసనసభ్యులు దానం నాగేందర్ కూడా ఉన్నారు.
ట్యాంక్‌బండ్ నుంచి సాగిన భారీ ప్రదర్శన
అంతకు ముందు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్ చౌరస్తా మీదుగా లోక్‌భవన్ వరకు ప్రదర్శన కొనసాగింది.
ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా ప్రదర్శనలో పాల్గొన్న వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యంగ్యంగా ఈ ముగ్గురి ఫోటోలతో రూపొందించిన పోస్టర్లను పట్టుకొని డోలు, డప్పులు వాయిస్తూ ఆడుతూ పాడుతూ ముందుకు సాగారు.
“ఓటు మా రాజ్యాధికారం, సేవ్ ఎలక్షన్ కమిషన్ సేవ్ ఇండియా, జ్ఞానేశ్కో హటావో దేశ్‌కో బచావో” అంటూ నినాదాలు చేశారు.
ఛలో లోక్‌భవన్ కార్యక్రమం వల్ల ఖైరతాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ కొంత వరకు స్తంభించి పోయింది.
ఓటు చోరీపై మండిపడ్డ విపక్ష నేతలు
ఈ సందర్భంగా అంతకు ముందు లోక్‌భవన్ వద్ద ప్రదర్శకులను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షులు బి మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కుమ్మక్కై ఓటు చోరీకి పాల్పడుతున్నాయని గడచిన ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వాదిస్తున్నారని, అది నిజం కాదని బుకాయిస్తూ వచ్చిన వారు ఈ రోజు సాక్ష్యాధారాలతో నిరూపించగా దానిపై నోరు విప్పకుండా ముఖం చాటేస్తున్నారని అన్నారు. ఇలాంటి దేశద్రోహులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని కోరారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రధాన మంత్రి, హోం మంత్రి, ఎన్నికల సంఘం కలిసి ఓటు చోరీకి పాల్పడుతూ దేశానికే ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో 13 కోట్ల మంది ఓటు హక్కును కాలరాసిన సీఈసీకి ఎన్ని సార్లు ఉరి శిక్ష విధించినా తప్పులేదని అన్నారు. సీఈసీ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
