సెప్టెంబరు 26న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన ది వైర్ తెలుగు సదస్సులో ది వైర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ మాట్లాడుతూ- వికసిత్ భారత్ అనే బూటకపు నినాదంతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, చివరికి ప్రజలకు ఆయుధం లాంటి ఓటు హక్కు కూడా లేకుండా చేయడానికి కుట్ర పన్నుతున్న కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పాలని పిలుపునిచ్చారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన మాయ మాటలతో సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సాగిస్తున్న మోసాలను గమనించాలని ఆయన అన్నారు.
‘నవ భారత్‌కు నవ ఎజెండా’ కాంక్లేవ్
ది వైర్ తెలుగు “నవ భారత్‌కు నవ ఎజెండా” అనే అంశంపై శనివారం నగరంలోని ప్రెస్ క్లబ్లో కాంక్లేవ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు, ప్రముఖ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషే ఘోష్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొడాలి శ్రీనివాస్, జెన్ జీలు పవనం, విజయ్‌లు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ కాంక్లేవ్‌కి ది వైర్ తెలుగు సంపాదకులు కొండూరి వీరయ్య మోడరేటర్‌గా వ్యవహరించారు.

వికసిత్ భారత్ బూటకం: సిద్ధార్థ్ వరదరాజన్
ఈ సందర్భంగా తొలుత సిద్ధార్థ్ వరదరాజన్ మాట్లాడుతూ, ఈరోజు దేశ పరిస్థితి ఎలా ఉందో, వికసిత్ భారత్, నయా భారత్ అనేది అంతా బూటకమని, ఈ కొత్త పేరుతో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో హిందుత్వ ఎజెండాని అమలు చేయడానికి కొత్త కొత్త పద్ధతులు, విధానాలను, చట్టాలను తీసుకు వస్తున్నారని అన్నారు.
వికసిత్ భారత్, నయా భారత్ గురించి 70 సంవత్సరాల క్రితమే చర్చ జరిగిందని, అలాగే సమాచార హక్కు, ఉపాధి హామీ కావాలని 20 ఏండ్ల కిందటనే చర్చ జరిగిందని వరదరాజన్ గుర్తు చేశారు.
నయా భారత్ ఆలోచనలో ఎస్ఐఆర్ ఒకటని, ఒక పద్ధతి ప్రకారం మోదీ, అమిత్ షా నియమించిన వారే దాన్ని ప్రయోగిస్తున్నారని, గతంలో ఎస్ఐఆర్ను సమర్థించిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికనే ఈ రోజు ఎన్నికల సంఘం అంతర్గత బాగోతాన్ని బయటపెట్టిందని అన్నారు.
అధికార పార్టీకి అనుకూలంగా లేకపోతే మొదట్లో పేదలు, ముస్లిం ప్రజల ఓటును తొలగించారని, కానీ ఈ తొలగింపు అన్ని వర్గాల ఓటర్లకు వర్తింప చేస్తున్నారని, బీహార్ నుంచి మొదలు పెట్టి ఎస్ఐఆర్ను ప్రారంభించిన అన్ని రాష్ట్రాల్లో ఇలానే చేస్తున్నారని చెప్పారు.
దేశంలో స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నికలు యువకులు, కార్మికులతో సహా అన్ని రంగాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలతో ముడిపడి ఉన్నాయని, అందుకోసం విషయాలను చర్చించాలి, పోరాడాలని సిద్ధార్థ్ వరదరాజన్ కోరారు.
విద్యా సంస్థలపై గురి: ఐషే ఘోష్
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషే ఘోష్ మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ తన ఎజెండాను సంస్థల ద్వారా అమలు పరచడానికి కుట్ర పన్నుతూ నూతన విద్యా విధానం పేరుతో మొదట విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటుందని తెలిపారు.
మంచి విషయాలు తెలియజేసే పుస్తకాలు చదవడాన్ని కూడా నేరంగా భావిస్తున్నారని అన్నారు.
నిఘా దేశంగా భారత్: కొడాలి శ్రీనివాస్..
సైబర్ సెక్యూరిటీ నిపుణులు కొడాలి శ్రీనివాస్ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా ప్రస్థానం హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమైందని, దాని ఫలితమే ఈరోజు కేవలం హైదరాబాదే కాకుండా మొత్తం దేశమే నిఘా దేశంగా మారిపోయిందని చెప్పారు.
జన్‌ధన్, ఆధార్, మొబైల్‌తో సహా అన్నింటినీ సాంకేతిక పరంగా ఒకదానితో మరొక దానికి అనుసంధానం చేయడం వల్లనే ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే విధానం వంటి నినాదాలు పెద్ద నోట్ల రద్దు వంటి ఆలోచనలకు తెరతీసిందని కొడాలి శ్రీనివాస్ వివరించారు.
టవర్ డేటా రికార్డు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డు ద్వారా రోజూ ప్రతి పౌరుడు మాట్లాడుతున్న మాటలు, అతని కదలికలపై ప్రభుత్వం నిఘా పెట్టిందని తెలిపారు.
పోరాడే హక్కు కల్పించాలి: జెన్ జీ ప్రతినిధులు
జెన్ జీ పవనం మాట్లాడుతూ- దేశంలో ఉచిత విద్య, ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి ప్రజలు ఎప్పటికీ ప్రతిపక్షం మాదిరిగా ఉండాలని, ఆ దిశగా వారిని చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. నిరసన తెలిపే హక్కు కల్పించాలని, దాని చట్టాల్లో సంస్కరణలు తీసుకురావాలని పవనం అభిప్రాయపడ్డారు.
కాక్రోచ్ జనతా పార్టీ రాష్ట్ర కన్వీనర్ విజయ్ మాట్లాడుతూ, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2వ తేదీన ముంబైలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు, ఆ తర్వాత పది రోజుల లోపే హైదరాబాద్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.
దేశ యువత పట్ల పాలకులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబించారని, దశాబ్దాలుగా పాఠ్యపుస్తకాల్లో చెబుతున్నది ఒకటైతే చేస్తున్నది మరొకటని, నరేంద్ర మోదీ కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు.
బీజేపీ దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రూ.1,100 కోట్లు ఖర్చు చేస్తుందని, ఈ నిధితో జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించవచ్చని సీజేపీ కన్వీనర్ పేర్కొన్నారు.
కొత్త ప్రయోగం: మోడరేటర్ వీరయ్య
మోడరేటర్ వీరయ్య మాట్లాడుతూ, ఇది హైదరాబాద్ యువతకు ఒక కొత్త ప్రయోగం లాంటిదని అన్నారు. దేశంలో కనీస మౌలిక అవసరాలు, లక్ష్యాల కోసం మళ్లీ ఎజెండాలను పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు.
ఈ కాంక్లేవ్‌లో వివిధ రంగాలకు చెందిన పలువురు నిపుణులు, పత్రికా సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ది వైర్ సంపాదక వర్గ సభ్యులు ఐవీ రమణ రావు, కోయ చంద్రమోహన్, కాపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
