అక్టోబర్ 7న జరిగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం సందర్భంగా ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు, మ్యూజియం నిర్వాహకుడు, వ్యవస్థాపకుడు మాభూమి ఫేం బీ నర్సింగరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సినీ ప్రముఖులలో నర్సింగరావు మూడో వ్యక్తి. ఇంతకు ముందు ఆచార్య ఆత్రేయ, ప్రముఖ నటి జయసుధలకు గౌరవ డాక్టరేట్ వరించిందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ మాజీ డైరెక్టర్ వీ శివలింగప్రసాద్ ఈ సందర్భంగా స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారని ఘంటా చక్రపాణి తెలిపారు.
విలేకరుల సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ దయాకర్ కూడా ఉన్నారు.
36 వేల మందికి పైగా విద్యార్థులకు పట్టాలు
ఈ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 విద్యార్థులు పట్టాలు పొందనున్నట్టు వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఇందులో 17,960 మంది డిగ్రీ పట్టా తీసుకోనుండగా, 19,800 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకోనున్నారు.
పట్టాలు పొందనున్న వారిలో 16,334 మంది విద్యార్థినులు ఉన్నారు. 43 మంది సైనికోద్యోగులు, 11 మంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా పట్టాలు పొందనున్నారు.
మొత్తం పట్టాలు పొందే వారిలో 23 మంది డాక్టరేట్ పట్టాలు పొందనుండగా, 38 మంది గోల్డ్ మెడల్ కూడా పొందనున్నారు. గోల్డ్ మెడల్ పొందే వారిలో అత్యధికులు(29 మంది) మహిళలే.
జైలు నుంచే డిగ్రీ పూర్తి చేసిన ఖైదీలు
చర్లపల్లి, రాజమండ్రి, కడప సెంట్రల్ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న 27 మంది ఖైదీలు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసి ఈ స్నాతకోత్సవంలో పట్టాలు పొందేందుకు హాజరు కానుండటం ఈ సారి ప్రత్యేకత.
గత 45 ఏళ్లలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా 6.27 లక్షల మంది డిగ్రీ పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యారని ప్రొఫెసర్ చక్రపాణి తెలియచేశారు.
వర్సిటీలో ఎనిమిది కొత్త కోర్సుల ప్రారంభం
39 విభాగాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అందిస్తోందని ఆయన తెలిపారు.
ప్రధానంగా ఆంగ్ల, తెలుగు మాధ్యమాలతో పాటు కొన్ని కోర్సులను ఉర్దూ మాధ్యమం ద్వారా కూడా బోధించనున్నట్టు ప్రొఫెసర్ చక్రపాణి తెలియచేశారు.
అత్యధిక విద్యార్థులు బీఏ, బీఎస్సీ, బీకాం, ఎంఏ (ఇంగ్లీషు), ఎంఏ (తెలుగు), ఎంఏ (సోషియాలజీ), లైబ్రరీ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చక్రపాణి వివరించారు. ఈ సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతితో ఎనిమిది కొత్త కోర్సులు ప్రారంభించామని చక్రపాణి తెలియజేశారు.
మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్సెస్), ఎంఎస్సీ (డేటా సైన్సెస్), ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్), ఎంఎస్సీ (జియోగ్రఫీ), మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, ఎంఏ (ఎడ్యుకేషన్), ఎంఏ (ఎడ్యుకేషన్ – స్కూల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులు ఇకపై ఈ యూనివర్సిటీ ద్వారా చదువుకోవచ్చని ఆయన వివరించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
