తిరుపతి జిల్లా నుంచి వెలువడిన ఒక వార్త అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు సమర్పించారని, 46 రకాల ప్రత్యేక ఆభరణాలను తయారు చేయించి స్వామివారికి కానుకగా అందించారని వార్తా కథనం వెల్లడించింది.
ఈ దాతృత్వాన్ని చూసి కొందరు భక్తులు ఆనందించవచ్చు. మరికొందరు దాతల భక్తి శ్రద్ధలను ప్రశంసించవచ్చు.
అయితే ఒక సామాన్య పౌరుడిగా, హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తులుగా— “అసలు దేవుడికి బంగారం అవసరమా? లేక దేవుడి సృష్టిలో భాగమైన మనిషికి ఆ బంగారం అవసరమా?” లాంటి ఆత్మావలోకనం చేసుకోవాల్సిన కొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ప్రశ్నలు భక్తికి వ్యతిరేకంగా వేసేవి కాదు. భక్తి అసలైన అంతరార్థాన్ని తెలుసుకోవడానికి వేసే ప్రశ్నలు.
దేవుడు సర్వసంపన్నుడా? లేక మానవుల కానుకల కోసం ఎదురుచూస్తున్నాడా? మన పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు దేవుడిని సర్వశక్తిమంతుడిగా, సర్వవ్యాపిగా, సర్వసంపన్నుడిగా అభివర్ణిస్తాయి. అలాంటి దేవుడికి 121 కిలోల బంగారం అవసరమా?
వందల కోట్ల విలువైన ఆభరణాలు లేకపోతే ఆయన మహిమ తగ్గిపోతుందా? దేవుడికి మనం సమర్పించే బంగారం కంటే, మన హృదయంలో ఉండే మంచితనం విలువైనది కాదా?
ఒకవైపు ఆభరణాల పెరుగుదల.. మరోవైపు ప్రజా సమస్యలు
ఒకవైపు దేవాలయాల్లో కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు పెరుగుతుంటే, మరోవైపు అదే సమాజంలో ఎంతోమంది పేదలు కనీస వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
నిరుపేద పిల్లలు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరమవుతున్నారు. వృద్ధులు ఆదరణ లేక జీవిస్తున్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు.
ఒక పేదవాడు దేవుడి హుండీలో పది రూపాయలు వేస్తాడు. ఒక సంపన్నుడు వందల కోట్ల విలువైన బంగారాన్ని సమర్పిస్తాడు.
దేవుడి దృష్టిలో ఎవరి భక్తి గొప్పది? సంపదను బట్టి భక్తిని కొలవగలమా? భక్తి అనేది ఆర్థిక స్థాయితో సంబంధం లేని అంతరంగ భావన.
ఒక పేదవాడు తన కష్టార్జితంలో నుంచి ఒక రూపాయి సమర్పించినా, అది అతని త్యాగానికి ప్రతీక కావచ్చు. ఒక కోటీశ్వరుడు కోట్ల రూపాయలు సమర్పించినా, దాని విలువను కేవలం బంగారం బరువుతో నిర్ణయించలేం. కాబట్టి దానాన్ని గౌరవించాలి. కానీ దానానికి సామాజిక ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నను కూడా అంతే గౌరవంగా పరిశీలించాలి.
“అదే రూ.207.6 కోట్లతో ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపవచ్చు?” ఒక్కసారి ఆలోచించండి.
అదే రూ.207.6 కోట్లను సమాజహిత కార్యక్రమాలకు వినియోగిస్తే ఎన్నో కుటుంబాలకు ప్రయోజనం చేకూరవచ్చు.
♦ పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు అందించవచ్చు.
♦ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించవచ్చు.
♦ నిరుపేదలకు ఉచిత వైద్య చికిత్స అందించవచ్చు.
♦ అనాథ పిల్లలకు విద్య, వసతి, భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చు.
♦ ఉపాధి లేని యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.
♦ రైతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవవచ్చు.
♦ నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించవచ్చు.
ఇక్కడ మన ఉద్దేశం దేవాలయాలకు కానుకలు ఇవ్వకూడదని చెప్పడం కాదు. దాతలు తమ సంపదను ఎక్కడ వినియోగించుకోవాలన్నది వారి వ్యక్తిగత నిర్ణయం.
అయితే సమాజంలో ఇంతటి అవసరాలు ఉన్నప్పుడు, దాతృత్వం మానవ సంక్షేమం వైపు కూడా మళ్లితే దాని ప్రయోజనం మరింత విస్తృతమవుతుందని సూచించడం మాత్రమే.
దేవాలయాల వైభవం పెరగాలా? ధర్మ వైభవం పెరగాలా?
మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో అన్నదానం, విద్యాదానం, ప్రాణదానం, సేవాధర్మాలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, అనారోగ్యంతో ఉన్నవాడికి వైద్యం చేయించడం, అజ్ఞానంలో ఉన్నవాడికి విద్య అందించడం కూడా అత్యున్నతమైన ధార్మిక కార్యాలే.
శ్రీవేంకటేశ్వరస్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే కోట్లాది భక్తుల్లో ఒక చిన్న ప్రశ్నను రేకెత్తించాలనుకుంటున్నాను.
శ్రీవారి పాదాల చెంత బంగారం పోగవ్వడం ఎంత గొప్ప విషయమో, శ్రీవారి సృష్టిలోని పేదవాడి కళ్లలో ఆనందబాష్పాలు రావడం కూడా అంతే గొప్ప విషయం కాదా?
దేవాలయాల్లో ఆభరణాలు ఉండకూడదని కాదు. సంప్రదాయాలు, ఆచారాలు, ఆలయాల పరిరక్షణకు వాటి ప్రాధాన్యతను కాదనలేం.
అయితే సంపదలో కొంత భాగమైనా విద్య, వైద్యం, ఆకలి నివారణ, సామాజిక అభివృద్ధికి వినియోగించాలనే ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదా?
పాలకులు, దేవస్థానాలు, సంపన్నులు ఆలోచించాల్సిన అంశం
ఇలాంటి భారీ కానుకలు సమర్పించిన సందర్భాలు కేవలం ప్రశంసలతోనే ముగియకుండా, సమాజానికి ఉపయోగపడే చర్చలకు కూడా దారితీయాలి.
దేవస్థానాల ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని మరింత విస్తృతం చేయడానికి, పారదర్శకంగా నిర్వహించడానికి, విద్యా–వైద్య రంగాల్లో మరింత పెట్టుబడి పెట్టడానికి అవకాశాలను పరిశీలించాలి.
అదేవిధంగా సంపన్నులు తమ సంపదలో కొంత భాగాన్ని శాశ్వత సామాజిక సేవా నిధులుగా ఏర్పాటు చేస్తే, వారి దాతృత్వం ఒక్కరోజు వార్తగా మిగిలిపోకుండా తరతరాలకు ఉపయోగపడుతుంది.
దేవుడు ఎక్కడున్నాడనే ప్రశ్న
మన దేవుడు బంగారు కిరీటంలో ఉన్నాడా? లేక ఆకలితో అలమటించే పేదవాడి కళ్లలో ఉన్నాడా? మన దేవుడు వజ్రాలహారంలో ఉన్నాడా? లేక వైద్యం కోసం ఎదురుచూస్తున్న రోగి నిస్సహాయతలో ఉన్నాడా?
మన దేవుడు బంగారు ఆభరణాలతో అలంకరించిన విగ్రహంలో మాత్రమే ఉన్నాడా? లేక విద్య కోసం ఎదురుచూస్తున్న పేద విద్యార్థి ఆశల్లో కూడా ఉన్నాడా?
భక్తి మనిషిని మరింత మానవీయంగా మార్చాలి. దైవచింతన మనలో దయ, కరుణ, సేవాభావం పెంచాలి. మన సంపదతో దేవుడి విగ్రహాన్ని అలంకరించడం ఒక సంప్రదాయం కావచ్చు. అదే సంపదతో దేవుడి సృష్టిలోని మనిషి జీవితాన్ని అలంకరించడం కూడా ఒక గొప్ప ధర్మం.
దేవుడికి బంగారం సమర్పించే చేతులు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి కూడా ముందుకు రావాలి. దేవుడికి ఆభరణాలు ఇచ్చే మనసు, నిరుపేద పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విశాల హృదయాన్ని కూడా కలిగి ఉండాలి.
ఎందుకంటే దేవుడిని ప్రేమించడం అంటే ఆయన సృష్టిని కూడా ప్రేమించడం. దేవుడి ముందు దీపాలు వెలిగించడం ఎంత పవిత్రమో, ఒక నిరుపేద కుటుంబం జీవితంలో విద్య అనే దీపాన్ని వెలిగించడం కూడా అంతే పవిత్రం.
మనకు కావాల్సింది కేవలం బంగారు దేవాలయాలు కాదు.. ఆకలి లేని సమాజం, అజ్ఞానం లేని సమాజం, అనారోగ్యంతో ఆర్థికంగా కుంగిపోని సమాజం, ప్రతి మనిషికి గౌరవంగా బతికే అవకాశం ఉన్న సమాజం. అదే నిజమైన ధర్మం. అదే మానవత్వం. అదే భక్తి పరమార్థం.
ఆలోచండి.. ఆత్మపరిశీలన చేసుకోండి.. భక్తిని మానవసేవతో అనుసంధానించండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
