రాష్ట్రాల ఆదాయ లోటు క్రమంగా పెరుగుతుండటం, కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకం ‘వీబీ–జీ రామ్ జీ’ కింద భారీగా వ్యయం చేయాల్సి రావడం, నగదు బదిలీ పథకాలపై ప్రభుత్వ ఖర్చులు పెరుగుతుండటం వంటి అంశాలపై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక భారతదేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్లో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను విశ్లేషించింది.
న్యూఢిల్లీ: మన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే అంశంపై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ రూపొందించిన కొత్త నివేదిక రాష్ట్రాల ఆర్థిక ధోరణులను సమీక్షించింది.
శాసనసభలు కలిగిన మూడు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక పరిస్థితులను కూడా ఇందులో పరిశీలించింది. ఈ నివేదికలో అనేక ముఖ్యమైన అంశాలను గుర్తించింది.
వాటిలో రాష్ట్రాల ఆదాయ లోటు నిరంతరం పెరుగుతుండటం, కేంద్ర పన్నుల ఆదాయ పంపిణీ విధానంలో మార్పుల కారణంగా దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలకు ప్రయోజనం కలగడం, కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలపై భారీగా అదనపు వ్యయభారం పడటం, నగదు బదిలీ పథకాలపై ప్రభుత్వ ఖర్చులు పెరుగుతుండటం ప్రధానమైనవి.
పీఆర్ఎస్ రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ 2026-27’ నివేదిక ఆధారంగా ముఖ్యమైన అంశాల సంక్షిప్త వివరణను ఇక్కడ అందిస్తున్నాం.
ఆయుష్ స్టీఫెన్ టొప్పో, వేదికా భానోటే ఈ నివేదికను రూపొందించారు. ది వైర్ ఇంగ్లిష్ ఈ నివేదికలోని కొన్ని భాగాలను స్వల్పంగా సంపాదకీయ మార్పులతో ప్రచురించింది.
రాష్ట్రాల సమిష్టి ద్రవ్య లోటు జీడీపీలో 2.9 శాతం నుంచి 3 శాతం లోపు
2026-27 ఆర్థిక సంవత్సరానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వ్యయం సుమారు రూ.69 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యయం కంటే 62 శాతం అధికం. రాష్ట్రాల ద్రవ్య లోటు జీడీపీలో 3.2 శాతంగా, ఆదాయ లోటు 0.2 శాతంగా అంచనా వేశారు.
అయితే, రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయ పథకం (SASCI) కింద ఇచ్చే 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలను మినహాయిస్తే, రాష్ట్రాల ద్రవ్య లోటు జీడీపీలో 2.9 శాతంగా ఉంటుంది. అయినప్పటికీ, 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన 3 శాతం పరిమితిని తొమ్మిది రాష్ట్రాలు అధిగమించాయి. వాటిలో జమ్మూ కశ్మీర్ (3.7 శాతం), హిమాచల్ ప్రదేశ్ (3.5 శాతం), మేఘాలయ (3.5 శాతం), పంజాబ్ (3.4 శాతం) ఉన్నాయి.
2022-23 నుంచి పెరుగుతున్న ఆదాయ లోటు
2022-23 నుంచి రాష్ట్రాల ఆదాయ వ్యయం, వాటి ఆదాయ రాబడుల కంటే వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణాలు పెరుగుతున్న సబ్సిడీలు, నగదు బదిలీలు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో అంటే 2020-21లో రాష్ట్రాల సమిష్టి ఆదాయ లోటు గణనీయంగా పెరిగింది. అనంతరం 2022-23 నాటికి అది జీడీపీలో 0.23 శాతానికి తగ్గింది.
అయితే, ఆ తర్వాత మళ్లీ ఆదాయ లోటు పెరుగుతూ వచ్చింది. 2024-25లో ఇది జీడీపీలో 0.61 శాతానికి, 2025-26లో 0.71 శాతానికి చేరుకుంది.
ఇదే ధోరణి కొనసాగితే రాష్ట్రాల ఆదాయ లోటు మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది.
2025-26లో పలు రాష్ట్రాల్లో జీడీపీలో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం వాటా తగ్గింది
2025 సెప్టెంబరులో జీఎస్టీ మండలి జీఎస్టీ పన్ను రేట్లను సవరించింది. 2025-26లో నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్ర వస్తు సేవల పన్ను ఆదాయం పెరుగుదల రేటు, జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే మందగించింది.
జీఎస్టీ పరిహార సెస్సును మినహాయించి చూస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి మధ్య జీఎస్టీ వసూళ్లు కేవలం 5 శాతం మాత్రమే పెరిగాయి. అదే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఈ పెరుగుదల 9 శాతంగా ఉంది.
2024-25తో పోలిస్తే 2025-26లో 31 రాష్ట్రాల్లో 23 రాష్ట్రాలకు సంబంధించి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP)లో రాష్ట్ర జీఎస్టీ ఆదాయం శాతం తగ్గింది.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఆదాయం పెంచుకుంటున్న పలు రాష్ట్రాలు
2017లో జీఎస్టీ అమల్లోకి రావడంతో రాష్ట్రాల పన్నులు విధించే అధికారాల్లో మార్పులు వచ్చాయి. రాష్ట్రాలు విధించే అనేక పన్నులు జీఎస్టీలో విలీనమయ్యాయి.
అయితే, జీఎస్టీలో విలీనం కాని రాష్ట్ర స్థాయి పన్నుల్లో కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం వంటి వాటిపై అమ్మకపు పన్ను, మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్ సుంకం, ఆస్తులు లేదా న్యాయపరమైన పత్రాలపై విధించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయి.
రాష్ట్రాలు జీఎస్టీయేతర వనరుల నుంచి ఆదాయాన్ని సమీకరించాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ముఖ్యంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇంకా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
2018-19 నుంచి 2025-26 మధ్య రాష్ట్రాల ప్రధాన స్వంత పన్నుల ఆదాయ వనరుల్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు అత్యధిక వార్షిక వృద్ధి రేటును నమోదు చేశాయి.
31 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాలు తమ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP)లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల ఆదాయ వాటాను పెంచుకున్నాయి.
అయితే బిహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ ఆదాయ వాటా తగ్గింది. రాష్ట్రాల మధ్య ఈ వ్యత్యాసాలకు ఆయా రాష్ట్రాల ఆర్థిక వృద్ధి, పన్ను రేట్లు, పన్ను విధించే ఆస్తుల విలువ నిర్ణయం, ఆస్తుల లావాదేవీల పరిమాణం, పన్నుల వసూళ్ల సామర్థ్యం వంటి అంశాలు కారణమై ఉండవచ్చు.
ఎంఎండీఆర్ చట్ట సవరణతో ఖనిజాల ద్వారా ఆదాయం సమీకరించడంలో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి కోత
2026 ఆగస్టులో పార్లమెంటు గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం (MMDR Act)కు సవరణలు చేసింది.
ఈ సవరణల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినవి మినహా ఇతర గనుల సంబంధిత పన్నులు లేదా సుంకాలను రాష్ట్ర ప్రభుత్వాలు విధించకుండా నిషేధించారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇలాంటి గనుల సంబంధిత పన్నులు, సుంకాల ద్వారా రాష్ట్రాలు రూ.26,683 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాయి.
ఈ చట్ట సవరణతో ఖనిజాల ద్వారా ఆదాయాన్ని సమీకరించుకునే విషయంలో రాష్ట్రాల అధికారాలు, స్వయంప్రతిపత్తి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది.
16వ ఆర్థిక సంఘం పన్నుల పంపిణీ ప్రమాణాల్లో మార్పుతో దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలకు ప్రయోజనం
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేయదగిన వాటాలో 41 శాతాన్ని రాష్ట్రాలకు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇది 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫారసుతో సమానంగా ఉంది.
అయితే, కేంద్ర ప్రభుత్వం విధించే సెస్సులు, సర్ఛార్జీలలో రాష్ట్రాలకు వాటా లేకపోవడం వల్ల, 2015-16 నుంచి రాష్ట్రాలకు వాస్తవంగా పంపిణీ అవుతున్న పన్నుల వాటా, కేంద్ర ప్రభుత్వ స్థూల పన్ను ఆదాయంలో కేవలం 31 నుంచి 37 శాతం మధ్యనే ఉంటోంది.
రాష్ట్రాల మధ్య కేంద్ర పన్నుల వాటాను నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణాల్లో స్థూల దేశీయోత్పత్తికి 10 శాతం వెయిటేజీ కేటాయించారు.
ఈ మార్పు వల్ల ఆర్థికంగా అధిక ఉత్పత్తి, ఆదాయ సామర్థ్యం కలిగిన దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది.
అర్హత ప్రమాణాలను స్థానిక సంస్థలు నెరవేర్చకపోతే నిధుల విడుదల పరిమితం కావచ్చు
2026-31 కాలానికి గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల కోసం 16వ ఆర్థిక సంఘం రూ.7.91 లక్షల కోట్ల గ్రాంట్లను సిఫారసు చేసింది.
ఇది 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్ల కంటే 121 శాతం అధికం. అయితే, గతంలో ఏ ఆర్థిక సంఘం పదవీకాలంలోనూ సిఫారసు చేసిన గ్రాంట్లన్నీ పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు విడుదల కాలేదు.
దీనికి ప్రధాన కారణం గ్రాంట్ల విడుదలకు కొన్ని షరతులు, అర్హత ప్రమాణాలు విధించడం కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు ఈ షరతులను నెరవేర్చలేకపోవడం వల్ల నిధుల విడుదలలో పరిమితులు ఏర్పడుతున్నాయి.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలపై మరింత ఆర్థిక భారం
వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ – ఆజీవికా మిషన్ (గ్రామీణ) (VB-G RAM G) పథకం 2026 జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.
2025-26లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ పథకం అమల్లో ఉండి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద చేసిన ఖర్చు కంటే సుమారు ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చేది.
బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాలకు ఈ కొత్త పథకం వల్ల అదనంగా రూ.2,000 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు వ్యయభారం ఏర్పడేది. దీంతో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఎక్కువ నిధులను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
నగదు బదిలీ పథకాలపై రాష్ట్రాల ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి
అస్సాం మినహా ఈశాన్య రాష్ట్రాలను పక్కనపెట్టి మిగిలిన రాష్ట్రాల ఖర్చులను పరిశీలిస్తే, సబ్సిడీలు, నగదు బదిలీలపై రాష్ట్రాలు చేస్తున్న వ్యయం వాటి మొత్తం ఆదాయ రాబడుల్లో 2018-19లో 16 శాతంగా ఉండగా, 2023-24 నాటికి 21 శాతానికి పెరిగింది.
ఈ కాలంలో సబ్సిడీలు వార్షిక సగటు వృద్ధి రేటు 12 శాతం పెరగగా, నగదు బదిలీలు 24 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగాయి.
అనేక రాష్ట్రాల్లో సబ్సిడీలు, నగదు బదిలీలపై చేస్తున్న మొత్తం వ్యయంలో విద్యుత్ సబ్సిడీలు, ఎలాంటి నిర్దిష్ట షరతులు లేకుండా అందించే నగదు బదిలీలు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో సబ్సిడీలు, నగదు బదిలీలకు కేటాయిస్తున్న నిధుల వాటా నిరంతరం పెరుగుతోంది.
ది వైర్ ఇంగ్లిష్లో ప్రచురితమైన ఈ వ్యాసానికి తెలుగు అనువాదం: కె. గంగాధర్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
