కార్మిక రంగంలో ఉద్యోగాల తొలగింపు సర్వసాధారణంగా మారాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడం, ఏఐ మౌలిక సదుపాయాలపై కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టడం ఉద్యోగ భద్రత, ఉపాధి భవిష్యత్తుపై ఆందోళనలను మరింత పెంచాయి.
ఈ నేపథ్యంలో, నవంబర్ 21న భారతదేశం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసి మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు చెల్లించే నష్టపరిహారం, విస్తృత సామాజిక భద్రతా చట్రం అనే అంశాన్ని పరిశీలిద్దాం.
‘ది హిందూ’ ప్రముఖ జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్ నివేదిత వరదరాజన్— భారతదేశంలో ఉద్యోగుల తొలగింపు (లేఆఫ్స్) జరిగినప్పుడు వారికి ఎలాంటి రక్షణలు ఉంటాయనే అంశంపై ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ మాజీ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్, కార్మిక నిపుణుడు కెఆర్ శ్యామ్ సుందర్, ఎకనామిక్ లాస్ ప్రాక్టీస్ భాగస్వామి, న్యాయవాది రాహుల్ చర్ఖాలతో జరిపిన చర్చలోని కొన్ని ముఖ్యాంశాలు ఇవి.
ఉద్యోగ కోతల విషయంలో భారతదేశంలోని కార్మికులకు ఎలాంటి రక్షణలు ఉన్నాయి? ఒక వ్యక్తి ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైనప్పుడు (లేఆఫ్) ఏమి జరుగుతుంది? వివిధ రంగాల్లో ఇది భిన్నంగా ఉంటుందా?
శ్యామ్ సుందర్: ‘లేఆఫ్’ అనేది అమెరికన్ పద్ధతిలో వచ్చిన పదం. భారతదేశంలో మనం దీనిని ‘రిట్రెంచ్‌మెంట్’ అని పిలుస్తాం. బొగ్గు గనులు, సాంకేతిక సంస్థలు లేదా ప్రభుత్వ రంగాలు—ఇలా ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైనప్పుడు తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతారు. పాశ్చాత్య దేశాల్లో, ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా తేలిక. వారికి ముందుగా తొలగింపు నోటీసు, బకాయిలు చెల్లిస్తారు, వారు సంస్థ నుంచి నిష్క్రమిస్తారు. కానీ భారతదేశంలో, ఒక ఉద్యోగిని తొలగించినప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అతను తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అని మదనపడతాడు. రహస్యంగా కొత్త ఉద్యోగం కోసం వెతుకులాటలో ఉంటాడు.
అంతేకాకుండా తాను ఎన్నో ఏళ్లుగా పనిచేసిన కార్యాలయ ప్రాంగణంలోకి కూడా అతడిని అనుమతించరు. ఉద్యోగం నుంచి తొలగించడం కార్మికుడి ఉనికికే (జీవనాధారానికి, ఆత్మగౌరవానికి) పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది.
బ్లూ-కాలర్, వైట్-కాలర్ కార్మికుల మధ్య ఉద్యోగ తొలగింపులో తేడా ఏమిటి?
శ్యామ్ సుందర్: వైట్-కాలర్ కార్మికులు సాధారణంగా తమ మేధస్సుతో తమను తాము పోషించుకోగలరని నమ్ముతారు. వైట్-కాలర్ కార్మికుడి నైపుణ్యాలు కంపెనీలో అతని పాత్రకు ప్రత్యేకంగా ఉండవచ్చు. తక్కువ నైపుణ్యం లేదా పాక్షిక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలు చేసేవారు తాను పొందుతున్న జీతం కంటే తక్కువకు ఏ కార్మికుడూ తన శ్రమశక్తిని అమ్ముకోవడానికి ఇష్టపడని వేతనం సాధించే వరకు వేర్వేరు కంపెనీలకు మారవచ్చు.
“నియమించుకోవడానికి, తొలగించడానికి యజమానికి పూర్తి స్వేచ్ఛ ఉన్న నేటి పరిస్థితుల్లో” (హైర్ అండ్ ఫైర్), భద్రతకు హామీ ఉండదు. ఇది యూఎస్, కెనడా వంటి ఉత్తర అమెరికా దేశాల్లో ప్రబలంగా ఉంది.
భారతదేశంలో, ఒక సంస్థ కార్మికుడిని ఏ రకమైన ఒప్పందం కింద నియమించుకుంది అనేది ముఖ్యం—అది ట్రైనీ అయినా, కాంట్రాక్ట్ కార్మికుడు అయినా లేదా శాశ్వత ఉద్యోగి అయినా.
కొత్త లేబర్ కోడ్లలో (కార్మిక చట్టాల్లో) ఏమి మారాయి?
శ్యామ్ సుందర్: కార్మిక చట్ట సంస్కరణల పేరుతో జరిగినదంతా బూటకం. దానికి మూడు లక్ష్యాలు ఉన్నాయి— వ్యాపారం సులభతరం చేయడం, దేశంలోకి విదేశీ పెట్టుబడులను, సాంకేతికతను ఆకర్షించడం, కార్మికుల సమస్యలను పరిష్కరించడం.
గతంలో అనేక నిర్ణయాధికార సంస్థలు ఉండేవి. కొత్త కార్మిక కోడ్లు వాటన్నింటినీ ఒకేచోట చేర్చాయి. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను హేతుబద్ధీకరించే పేరుతో, పారిశ్రామిక సంబంధాల కోడ్ దానిని పూర్తిగా నాశనం చేసింది.
ఈ కోడ్ కార్మిక న్యాయస్థానాలను తొలగించి, వాటి స్థానంలో పారిశ్రామిక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల సామర్థ్యం పెరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఖాళీలను సకాలంలో భర్తీ చేస్తున్నారా? మనకు సమర్థవంతమైన నిర్వాహకులు ఉన్నారా? అనేది సరిగ్గా అధ్యయనం చేయాలి. అయినప్పటికీ, యూరప్‌లో లాగా కాకుండా, ఇక్కడ ఒక కార్మికుడిని తొలగించినా, మొత్తం యంత్రాంగం తిరిగి పనిలోకి రాగలదు.
ఉద్యోగ విరమణ పరిహారంపై ఎందుకు పన్ను విధిస్తారు?
రాహుల్ చర్ఖా: భారతదేశంలో చట్ట ప్రకారం, కొన్ని రంగాల్లో ఉద్యోగం నుంచి తొలగిస్తే పరిహారం తప్పనిసరి. కానీ యజమానికి ఇది ఒక ఆనవాయితీగా మారింది. కార్మికులకు, ఉద్యోగం కోల్పోవడం అనేది ఒక పెద్ద షాక్. ఎందుకంటే వారు తమ సాధారణ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా, వారి కుటుంబాల ఆరోగ్య బీమా వంటి ఉద్యోగ ప్రయోజనాలను కూడా కోల్పోతారు. ఈ జీవనోపాధి సమస్యలన్నింటికీ పరిహారంగా యజమాని కార్మికులకు చెల్లించే పరిహారంలో మూడింట ఒక వంతు ప్రభుత్వం నిజంగా తీసుకోవాలా అన్నదే అసలైన ప్రాథమిక ప్రశ్న.
పన్ను విధించదగినదిగా ప్రభుత్వం భావించే దానిపై పన్ను విధించవచ్చు. ప్రభుత్వం దీన్ని ముందుగా అందుకునే జీతంగా భావిస్తుంది తప్ప మరేమీ కాదు. కాబట్టి, దీనిపై పన్ను విధించవచ్చు.
ప్రభుత్వం ఉద్యోగ విరమణ పరిహారాన్ని ‘జీతానికి బదులుగా లాభం’గా పరిగణిస్తుంది. ఇది జీతమే. రెండింటిపై ఒకే విధంగా పన్ను విధిస్తారు. ఉద్యోగ తొలగింపు లేఖలో అనేక అంశాలు ఉంటాయి. చాలా కాలం పాటు, జీతం భాగంపై పన్నులు చెల్లించారు, ఇది ఒక చిన్న భాగం.
ఉద్యోగ విరమణ ఒప్పందంలోని పన్ను విధించని ఈ భాగం కూడా ‘ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం’ అనే ప్రత్యేక శీర్షిక కింద పన్ను వర్తిస్తుందని చెప్పడానికి ప్రభుత్వం ఒక నిర్దిష్ట నిబంధనను తీసుకువచ్చింది.
చట్టపరంగా, ప్రభుత్వం పన్ను విధించదగినదిగా భావించే దానిపై పన్ను విధించవచ్చు. అయితే ప్రభుత్వం దానిపై పన్ను విధించడం న్యాయమేనా?
ఒకేసారి ఇచ్చే పరిహారం సరిపోతుందా?
శ్యామ్ సుందర్: భారతదేశంలో ఉద్యోగ విరమణ పరిహారం చాలా ఎక్కువగా ఉందని విమర్శకులు వాదిస్తారు. నేను దానితో ఏకీభవించను.
శ్రీలంక, ఐరోపాలోని అనేక దేశాలతో సహా పలు దేశాల్లో కఠినమైన నియమాలు ఉన్నాయి. ఒక ప్రగతిశీల యజమాని ఉద్యోగ తొలగింపునకు ముందు కౌన్సెలింగ్, న్యాయ సలహా, పునఃశిక్షణ, ప్రశంసా పత్రాలు, ఉపాధి మార్పిడి కేంద్రాల్లో నమోదు చేసుకోవడానికి సహాయం అందిస్తారు. ఇవి చిన్న ఖర్చులుగా కనిపించవచ్చు, కానీ యజమాని వాటిని భరించడం చాలా ముఖ్యం.
చాలా మంది యజమానులు భారతీయ నమూనానే ఇష్టపడతారు— పరిహారాన్ని ఒకేసారి చెల్లించి, ఫైల్‌ను మూసివేయడం.
అయితే ఈ నిబంధనలు బొగ్గు గనుల తవ్వకం, తోటల పెంపకం, తయారీ రంగం అనే మూడు పరిశ్రమలకు మాత్రమే వర్తిస్తాయి. సేవా రంగ కార్మికులు, ఐటీ కార్మికులు దీని పరిధిలోకి రారు.
గత ఐదేళ్లలో ఈ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. కానీ సరైన, చట్టపరమైన ప్రక్రియను అనుసరించడం లేదు. దీనివల్ల అసంఘటిత రంగ కార్మికులు కూడా దీని పరిధిలోకి రారు.
అనేక దేశాలు తమ కార్మికులకు భద్రత కల్పించడానికి పలు మార్గాలను అనుసరిస్తున్నాయి. వాటిలో భారతదేశం ఏ మార్గాలను పరిశీలించాలి? భారతదేశానికి ఏది అత్యంత ఆచరణీయమైనది?
రాహుల్ చర్ఖా: వివిధ దేశాలు విభిన్న పద్ధతులు అనుసరిస్తున్నాయి. వారు తమ సంస్కృతికి అనుగుణంగా సామాజిక భద్రతను రూపొందించుకున్నారు. ఉదాహరణకు, జర్మనీలో ఆదాయంతో ముడిపడిన నిరుద్యోగ భృతి ఉంది. అక్కడ నిరుద్యోగ భృతి చెల్లింపులను ఒకే స్థిర రేటుగా కాకుండా, కార్మికుడి మునుపటి ఆదాయంలో శాతంగా లెక్కిస్తారు.
అమెరికా తన నిరుద్యోగ భృతి చెల్లింపులకు పేరోల్ పన్ను ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఇది అనుభవ రేటింగ్ ద్వారా నిర్ణయమవుతుంది. ఇది నిరుద్యోగ క్లెయిమ్‌ల చరిత్ర, యజమాని పేరోల్ మార్పులపై ఆధారపడి ఉంటుంది. దీనికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు సమకూరుస్తాయి. దీనికి దాని స్వంత పరిపాలనా విభాగాలు ఉన్నాయి.
యూకే, సింగపూర్‌లో కూడా విభిన్న పథకాలు ఉన్నాయి. మనం ఈ పథకాలను పరిశీలించి, భారతీయ పరిస్థితులు, పద్ధతులకు అనుగుణంగా ఒక పథకాన్ని రూపొందించుకోవచ్చని నేను భావిస్తున్నాను.
ఇందుకోసం నష్టపరిహార పద్ధతులు, వేతనాలు, ఆర్థిక ఆసరా గురించి కూడా పరిశీలించాలి. గ్రామీణ నిరుద్యోగ విషయంలో మన వద్ద కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. కానీ పట్టణ ఉపాధి పథకాలకు సంబంధించిన ప్రమాణాలు భిన్నంగా ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి.
శ్యామ్ సుందర్: భారతదేశంలో నిరుద్యోగ ఉపశమన వ్యవస్థ ఎందుకు లేదు అనేది చర్చించాల్సిన ప్రశ్న. సాంప్రదాయకంగా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఒక ఆసరాగా ఉండేది. దానిపై ఎప్పుడైనా ఆధారపడవచ్చు.
ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చే డబ్బును ఉపయోగించి, బలహీన వర్గాల కార్మికులకు నిరుద్యోగ సహాయం అందించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) పథకం కార్మికులకు, వారి కుటుంబాలకు బీమాను అందిస్తుంది. కానీ లబ్ధిదారుల సంఖ్యతో పోలిస్తే ఈఎస్ఐ ఆసుపత్రుల విస్తరణ చాలా తక్కువగా ఉంది. ఇది అధికార యంత్రాంగం, పరిపాలన, దూరదృష్టి లేకపోవడంలో ఒక తీవ్రమైన లోపం.
గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతను ఎలా కల్పించాలి?
రాహుల్ చర్ఖా: మనం చాలా సహజమైన యజమాని–ఉద్యోగి సంబంధం నుంచి దూరమవుతున్నాం. ప్రభుత్వం దీనిని గుర్తించింది.
కొత్త కార్మిక చట్టాల్లో గిగ్/ప్లాట్‌ఫామ్, అసంఘటిత కార్మికుల గురించి ప్రస్తావించారు. వారిని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చట్టాలను రూపొందిస్తున్నాయి. ఒక డేటాబేస్ ఉండటం చాలా ముఖ్యం. ఈ-శ్రమ్ పోర్టల్ ఆ డేటాను సేకరిస్తోంది.
గిగ్ వర్కర్లకు వారి సంపాదన సామర్థ్యంలో నష్టం వాటిల్లినా లేదా స్థిరమైన సంపాదన సామర్థ్యం కోల్పోయినా ఎలా పరిహారం అందిస్తారు? దీనికి సులభమైన సమాధానం లేదు. వారికి ఇప్పటికే ఉన్న బీమాను విస్తరించడమే అత్యంత సులభమైన మార్గమని నేను భావిస్తున్నాను. కానీ మనకు ఒక వినూత్నమైన పరిష్కారం అవసరం.
బహుశా, ఆదాయంలో కోల్పోయే నష్టానికి బదులుగా ఒక చిన్న ప్రీమియం చెల్లించడానికి గిగ్ వర్కర్లు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చు. బహుశా, ఈ ప్రీమియం కోసం అవసరమైన నిధికి అగ్రిగేటర్, కస్టమర్ తమ వంతుగా నిధులను సమకూర్చవచ్చు.
శ్యామ్ సుందర్: రెండు విధాలుగా అమలు చేసే వ్యూహం అవసరం. ప్రభుత్వం కార్మికులను సాంప్రదాయ సామాజిక భద్రతా వలయంలోకి తీసుకురావాలి.
ఇంకా పౌరులు, ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయం ఉండాలి. కార్మిక మార్కెట్ పాలన భవిష్యత్తు ప్రధానంగా కార్మిక మంత్రిత్వ శాఖ లేదా వాణిజ్య మంత్రిత్వ శాఖలో కాకుండా నైపుణ్యాల మంత్రిత్వ శాఖలో ఉంటుంది.
మనకు చాలా ప్రశంసనీయమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేసే విషయంలో మనం ఘోరంగా విఫలమయ్యాం. (భారతదేశంలో నిరుద్యోగ సహాయక వ్యవస్థ ఎందుకు లేదనేది సమగ్రంగా చర్చించాల్సిన ఒక ప్రశ్న.)
‘గిగ్ వర్కర్’ అంటే సంప్రదాయబద్ధమైన పూర్తికాల ఉద్యోగిగా కాకుండా, స్వల్పకాలిక, ఫ్రీలాన్స్, ప్రాజెక్ట్ ఆధారిత లేదా అవసరానికి తగినట్లుగా పనిని చేపట్టే వ్యక్తి అని అర్థం.
ది హిందూ పత్రిక సౌజన్యంతో: తెలుగు అనువాదం – సుబ్రమణ్యం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
