ఢిల్లీ నగర సరిహద్దులలో వెలుగు జిలుగులతో ప్రకాశించే ఒకానొక ఉపగ్రహ నగరం అయిన నోయిడా గురించి మనలో చాలా మందిమి వినే ఉంటాము.
ఆధునిక భారత దేశానికి అదొక ప్రచార సారథి. ధనిక దేశాల సరసన ఇండియాను నిలబెట్టే ఒక అర్హత. విశాలమైన రహదారులకు ఇరువైపులా బారులు తీరిన వృక్ష శ్రేణి.
అంబర చుంబిత భవన శ్రేణి, వాటిలో కొలువు తీరిన ప్రపంచంలో పెద్దవైన టెక్నాలజీ కార్పోరేట్ కంపెనీలు, రకరకాల ఇతర పరిశ్రమల తయారీ యూనిట్లు, ముఖ్య నిర్వహణా సిబ్బంది, పాలకవర్గం కొలువు తీరిన ప్రదేశం.
భారత దేశ ప్రగతిని ప్రతిబింబించే ఆ మెరిసే అద్దాల వెనుక ఒక చేదు పారిశ్రామిక వైరుధ్యం కూడా చోటు చేసుకుంటూనే ఉంది.
వేలాది మందిగా పారిశ్రామిక కార్మికులు తమ ఉనికిని నిలుపుకోవడం కోసం చేస్తున్న జీవన్మరణ పోరాటం, వారిపై రాజ్యం మోపిన ఊపిరి పీల్చుకోనివ్వని ఉక్కుపాదం మనకు కనిపించే బొమ్మ వెనుక ఉన్న బొరుసు.
ఏప్రిల్ 2026లో రాజుకున్న వివాదం
ఈ సంక్షోభం నిజానికి ఏప్రిల్ నెల 2026 ప్రారంభంలో వెలుగు చూసింది. ఒక పెద్ద ఎలక్ట్రానిక్ పరిశ్రమకు సంబంధించిన యూనిట్లో పనిచేస్తున్న కార్మికుల స్థితిగతుల మీద ప్రారంభమైన ఈ వివాదం రాజుకుని చివరకు ఒక స్వతంత్ర జర్నలిస్టు సత్యం వర్మ, మరో పరిశోధనా విద్యార్థి ఆకృతి చౌదరిలపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదై, అత్యంత ప్రమాదకారులుగా గుర్తించబడి, సంవత్సరం పాటుగా విచారణకు కూడా నోచుకోని సెక్షన్ల వలయంలో బంధించబడి, జైలు జీవితం గడిపే దాకా వచ్చింది.
నోయిడా పారిశ్రామిక కేంద్రాలలో సాగుతున్న ఈ సంక్షోభం మూలాల్లోకి వెళితే, మరీ ముఖ్యంగా ఫేజ్-2, సెక్టార్-63 లలో గత కొన్నేళ్లుగా పన్ను రాయితీలు పొందే బహుళ జాతి సంస్థల తయారీ పరిశ్రమలే ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో పాతుకుపోవడం మనకు కనిపించే సత్యం.
ఏప్రిల్ ప్రారంభంలో హర్యానా ప్రభుత్వం కనీస వేతనాలను పెంచుతూ ఒక ప్రకటన చేసింది. నోయిడాలోని వస్త్ర పరిశ్రమలో, ఆటో విడి భాగాల పరిశ్రమలో, ఎలక్ట్రానిక్ పరిశ్రమలలో పనిచేస్తున్న వేలాది కార్మికులు తమ జీతాలు కూడా పెంచమని కనీసం నెలకు ఇరవై వేల రూపాయలు చేయమని డిమాండ్ చేశారు.
పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని దినాల పైన, ఓవర్ టైం పని జీతాల పైనా పరిశ్రమలో పనిచేసే చోట దక్కాల్సిన కనీస భద్రతా, మర్యాదల పైనా వారు దృష్టి సారించారు.
పెరుగుతున్న ఇంధన ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం తమ నిజ వేతనాలను ఇంకా బాగా తగ్గించి వేసిందనీ, కార్మికులు రోడ్డున పడే స్థితికి చేరుకుంటున్నారని వారు తమ యజమానులకు మొరపెట్టుకున్నారు.
నోయిడాలోని అనేక సెక్టార్ల నుండి అన్ని రకాల పరిశ్రమల నుండి 40,000 నుండి 45,000 మంది కార్మికులు సమైక్యంగా ప్రదర్శన చేయడానికి ఏప్రిల్ 13న వీధుల్లోకి వచ్చారు.
పెద్ద ఎత్తున మోహరించిన పోలీసు దళాలు విచక్షణా రహితంగా తమ బ్యాటన్లను ఉపయోగించి, నిరాయుధులైన కార్మికులపై దాడి చేశారు.
పోలీసులపై, కార్మికుల గుంపులో నుంచి రాళ్ళు వచ్చి పడ్డాయనీ, పరిశ్రమల ఆస్తులు కొంత మేరకు ధ్వంసం చేశారనీ, కొన్ని వాహనాలను తగులబెట్టారనీ, ఆందోళనకారులపై పోలీసులు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా కార్మికుల ప్రదర్శనలోకి కావాలని మేనేజ్మెంట్ చే చొప్పించబడిన సంఘ వ్యతిరేక శక్తుల ముఠా, కార్మికులపై వ్యతిరేకత పెంచేందుకు, పోలీసుల దాడులకు ఆస్కారం ఇచ్చేలా ఈ పని చేసింది అనేది కార్మిక సంఘాల వాదన.
శాంతి భద్రతల సమస్యగా మారిన పారిశ్రామిక వివాదం
పారిశ్రామిక వివాదం కాస్తా ఒక భారీ శాంతి భద్రతల సమస్యగా మార్చివేయబడింది. కార్మికులు వందల సంఖ్యలో అరెస్టు చేయబడ్డారు.
అర్ధరాత్రులు కార్మికులను ఇళ్ల నుండి ఎత్తుకు వెళ్లారు. వారికి మద్దతుగా నిలిచిన వారిపై పదుల సంఖ్యలో కేసులు మోపారు. ఆ ప్రాంతమంతా సీలు చేయబడింది. ఆఖరికి అక్కడ లేని ఇద్దరు వ్యక్తులపై జాతీయ భద్రతా చట్టం కింద నేరారోపణ చేయబడింది.
నిజానికి సమ్మెలో పాల్గొన్న కార్మికులు తాము చట్టబద్ధమైన సమ్మెలో ఉన్నామని భావించారు. నెల జీతం మొదటి వారం గడవక ముందే ఆవిరైపోతుందనే దుఃఖంలో, కాంట్రాక్టు కూలీ వ్యవస్థ రద్దు కావాలని, తమ కనీస వేతనాలు మరికాస్త పెరగాలని మాత్రమే కోరుకున్నారు.
ఈ దేశ చట్టాలలో రాసి ఉన్న దాన్నే వారు అడిగారు. వేతన నిర్ణాయక కమిటీ తమతో చర్చలు జరుపుతుందని వారు ఆశించారు.
జీతాలు పెంచమని నినదించిన కార్మికుల డిమాండ్ జాతీయ భద్రతకు ప్రమాదంగా ఎలా పరిణమించిందో మనం కాస్త జాగ్రత్తగా అధ్యయనం చేస్తే కానీ అర్ధం కాదు.
ఒక ఫ్యాక్టరీలోకి ఒక కార్మికుడు అడుగుపెట్టినప్పుడు మన న్యాయవ్యవస్థ చేసే ఏర్పాటు ప్రకారం, యజమాని, కార్మికుడు అనబడే ఇద్దరు స్వేచ్ఛాయుత వ్యక్తుల మధ్య ఏర్పడిన స్వచ్ఛంద సమ భాగస్వామ్య ఒప్పందంగా నిర్ణయమవుతుంది.
యజమాని శ్రమను కొంటాడు, కార్మికుడు తన శ్రమను అమ్ముకుంటాడు. ఈ శ్రమ మారకం ప్రశాంతంగా విడివిడిగా సాగినంత కాలం ఎవరికీ ఏ పేచీ లేదు.
కార్మికులు తమను తాము సమీకరించుకుని సామూహికంగా చైతన్యవంతులై తమ శ్రమకు ఎక్కువ విలువ పొందేందుకు ప్రయత్నాలు చేస్తారో, ఎప్పుడైతే సాఫీగా సాగిపోతున్న ఉత్పత్తి ప్రవాహం నిలిచిపోతుందో అప్పుడు ఇక ఎంత మాత్రమూ అది ఇద్దరు స్వేచ్ఛాయుత వ్యక్తుల మధ్య అంగీకరించబడిన ఒప్పంద సమస్యగా చూడబడదు. అది నేరపూరితమైన కుట్రగా, పబ్లిక్ ఆర్డర్‌ను విచ్ఛిన్నం చేసే చర్యగా భావించబడుతుంది.
దేశపు ఆర్థిక స్వావలంబన పై జరిగిన దాడిగా చూడబడుతుంది.
పెట్టుబడి వైపు మొగ్గుచూపుతున్న న్యాయవ్యవస్థ
ఈ రకపు భావజాల యంత్రాంగం కోర్టు హాళ్ళ నిండా మనకు దర్శనమిస్తుంది. నోయిడా కార్మికుల కేసుల విచారణ సందర్భంగా ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు కానీ, న్యాయమూర్తులు కానీ పదే పదే స్పృశించిన ప్రాథమిక అంశం కార్మికుల వేతనం కాదు.
చట్ట విరుద్ధంగా పారిశ్రామిక యజమానులు, కాంట్రాక్టర్లు కార్మికుల జీతాలపై సాగించిన దోపిడీ అంతకన్నా కాదు. వారు పదే పదే ప్రస్తావించిన అంశం పెట్టుబడులు ఏమైపోతాయోనన్న విషయం.
ఆఖరుకు జాతీయ భద్రతా చట్టం ఎందుకు వాడవలసి వస్తుందో చెప్పే నివేదికలో జిల్లా మెజిస్ట్రేట్ కూడా ఈ లక్ష కోట్ల రూపాయల పెట్టుబడికి కలిగే నష్టాన్ని, అది కొత్త పెట్టుబడిదారులలో కలిగించే భయం గురించి ప్రస్తావించారు.
కార్మిక నాయకులపై, విద్యార్థి నాయకులపై, మేధావులపై పెట్టిన అనేక కేసులలో బెయిల్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వాద సంవాదాల దిశ అంతా భారీగా పోగుపడిన పెట్టుబడి ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొంటుందో అన్నదే.
ఒక లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి ఇబ్బంది పడితే అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు ఏమి ఆలోచిస్తాయి? దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఎంత భయపడతాయి ? న్యాయస్థానంలో చర్చ దాదాపుగా ఇదే ధోరణిలో కొనసాగింది.
సమ్మె కార్మికుడికి ప్రసాదించబడిన మౌలిక రాజ్యాంగ హక్కు అనే విషయం ఈ న్యాయ తర్కానికి అసలు పట్టలేదు. సమ్మె ఆర్థిక అవరోధంగా అంచనా కట్టబడింది.
పెట్టుబడిదారుడి నమ్మకాన్ని వమ్ము చేసిన ఒక పైత్య ప్రకోపంగా, గ్లోబల్ సప్లై చైన్‌లో ఎదురైన ఒక అనుకోని అతిథిగా చూడటం జరిగింది.
ఒక పారిశ్రామిక వివాదాన్ని అక్కడ శ్రమను దుర్భర పరిస్థితుల మధ్య చౌకగా అమ్ముకుంటున్న ఆరు లక్షల మంది కార్మికుల వైపు నుండి కాకుండా, లక్షల కోట్ల పెట్టుబడి వైపు నుండి ఈ తటస్థ న్యాయవ్యవస్థ చూస్తోందని మనకు వారు నిరాకరించిన బెయిల్ తీర్పులలో, జాతీయ భద్రతా చట్టం ఎందుకు వాడవలసి వచ్చిందో వారు ఇచ్చిన వివరణలలో స్పష్టంగా కనిపిస్తుంది.
కరిగిపోతున్న కార్మికుల కండరాలు, కూలిపోతున్న జీవితాలు, చిందించిన స్వేదం, వచ్చిన జబ్బులు చాలా చిన్న విషయాలుగా కనపడతాయి.
పెట్టుబడుల అనుకూల వాతావరణం కాపాడటమే పరమావధిగా మారిపోయింది. ఇందులో భాగంగానే వందల సంఖ్యలో కార్మికులు నేరస్తులు అవుతారు. కార్మిక నాయకులు జాతి భద్రతకు ప్రమాదకారులుగా కనిపిస్తారు.
కార్మికుల స్వీయ చైతన్యాన్ని నిరాకరించే కుట్ర
ఇందుకోసం మొదట జరిగే పని ఏమిటంటే, కార్మికుల స్వీయ చైతన్యాన్ని నిరాకరించడం. ఖాళీ కడుపులు చేత పట్టుకుని వీధుల నిండా నిండిన కార్మికులు స్వచ్ఛందంగా స్వీయ చైతన్యంతో ఆ పని చేశారని భావించడానికి నిరాకరించడం.
వారంతా ఎవరో బయట నుంచి వచ్చిన శక్తుల ప్రేరణతో తాత్కాలిక ఉద్రేకంతో, హింసాత్మక చర్యలలోకి దింపబడ్డారని మాట్లాడటం. దీంతో కఠినంగా శిక్షించడానికి కొందరు బయట వ్యక్తులు అవసరం అవుతారు. ఆ తర్వాత కార్మికులను భయపెట్టడం, శ్రమ సరుకును అమ్ముకునే మరమనిషిగా మార్చడం సహజంగా జరిగే అనంతర పరిణామాలు అవుతాయి.
ఈ సందర్భంగా సమ్మె జరిగిన రెండు వారాల్లోనే అధికారులు అక్కడ లేని ఇద్దరి మీద జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు. వారిలో ఒకరు శ్రామికుల స్థితిగతులను దశాబ్దాలుగా రికార్డు చేస్తున్న ప్రచురణకర్త, స్వతంత్ర జర్నలిస్టు, రచయిత అయిన అరవై రెండేళ్ల సత్యం వర్మ, మరొకరు సాంస్కృతిక రంగంలో కృషి చేస్తున్న పరిశోధక విద్యార్థి ఆకృతి చౌదరి.
ఈ ఇద్దరు పారిశ్రామిక వాడలోకి ప్రవేశించి వేలాదిమంది కార్మికుల మెదళ్లను కలుషితం చేసిన ప్రధాన కుట్రదారులుగా ప్రభుత్వం తేల్చింది.
న్యాయస్థానం వారి వాదనతో ఏకీభవించి విచారణ చేయ సంకల్పించింది. పెట్టుబడిచే నిరంతరం విడగొట్టబడే కార్మికులను ఎక్కడైనా కలిపే శక్తులు ఉంటాయని చరిత్ర గమనాన్ని చూసిన వారెవరికైనా అర్ధమవుతుంది.
ప్రాంతాల వారీగా, షిఫ్టుల వారీగా, పరిశ్రమల వారీగా స్థాయి భేదాలతో విడగొట్టబడుతున్న కార్మికులను ఓ రచయిత, ఓ మేధావి, ఓ విద్యార్థి వారిని కలిపే ఉత్ప్రేరకాలుగా ఉంటూనే ఉంటారు.
కార్మికుల హక్కుల గురించి మాట్లాడుతారు. బయట ప్రపంచానికి వారిని గురించి తెలియజెప్పుతారు.
సామూహిక చైతన్యంతో తమ సమస్యలపై తామే గళం విప్పేందుకు సహకరిస్తారు.
అయితే వీరిలో ఆకృతి చౌదరిపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించటం ఎంత మాత్రం తగదని హైకోర్టు కొట్టివేసింది. అయినా ఆమె విడుదలకు నోచుకోలేదు.
ఇదే సంఘటనకు సంబంధించిన మరో పది కేసులలో కొన్నింటికి బెయిల్ రాలేదు. కనుక ఇంకా తనతో పాటు అరెస్టు అయిన మరో ఎనిమిది మందితో జైలులోనే ఉన్నారు. తప్పుడు ఆరోపణలపై జాతీయ భద్రతా చట్టం ప్రయోగించినందుకు జిల్లా మెజిస్ట్రేట్ కు ఐదు లక్షల జరిమానా విధిస్తే వారం తిరిగే లోగా సుప్రీంకోర్టు జరిమానాపై స్టే విధించింది.
భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కుమార్తె అయిన ఈ జిల్లా మెజిస్ట్రేట్ కేసు విచారణ సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం ఆపివేసి మరీ తీర్పు ఇచ్చింది.
జాతీయ భద్రతా చట్టమే అన్యాయంగా మోపారు అన్న తరువాత కూడా ఐదు నెలలుగా ఆకృతి చౌదరి, సత్యం వర్మ వారి సహచరులు సాధారణ నిరసన ప్రదర్శన సందర్భంగా నమోదైన కేసులలో బెయిల్ రాకుండా ఉన్నారు. వడ్డించే వాడు మనవాడైతే అన్న సామెత గుర్తుకు వస్తుంది.
జంతర్ మంతర్‌లో ఓ విద్యార్థి తండ్రి తల పగలగొట్టానని సగర్వంగా టీవీ ఛానళ్ల ముందు కూర్చుని ప్రకటించిన స్వతంత్ర ఇన్ఫ్లుయెన్సర్ భరద్వాజకు నెల తిరిగేలోగా రెండు సార్లు బెయిల్ వస్తుంది, కానీ వీళ్ళకు మాత్రం బెయిల్ రాదు.
మద్దతివ్వడమే నేరంగా పరిగణించే ధోరణి
అసలు విషయం ఏమిటంటే, చట్టం దృష్టిలో ఇది ఎప్పుడు నేరంగా మారింది? నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం నేరం కాదు.
పెట్టుబడితో మరింతగా లాభాలను ఆర్జించే పనికి ఇది నేరంగా కనపడుతుంది. ప్రభుత్వాలు సాగించే వర్గ పాలనా రూపంగా, పనిముట్లుగా న్యాయస్థానాలు వ్యవహరిస్తే ఇటువంటి ప్రమాదకర ధోరణులు ప్రబలుతాయి.
విద్యావంతుడైన పౌరుడు సమ్మె చేస్తున్న కార్మిక సోదరులకు మద్దతు ప్రకటిస్తే నేరంగా పరిగణించి అతని స్వేచ్ఛను హరించివేసే చట్టాలను వాడితే ఏం జరుగుతుందో ఈ ఇద్దరి వ్యవహారంలో చూస్తున్నాం. వీరిని, ఇతర కార్మిక నాయకులను జైలు నుండి విడిపించేందుకు ఏర్పడిన సంస్థ ‘కార్వాన్’ ప్రకారం సత్యం వర్మ ఏప్రిల్ 17 నాడు లక్నోలో ‘జనచేతన’ పుస్తకాల షాపులో ఉన్నాడు. అతను నోయిడా వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతోంది.
ఆకృతి చౌదరి రంగస్థల కళాకారిణి, పరిశోధక విద్యార్థి. చురుకుగా ‘దిశ’ విద్యార్థి సంఘంలో పనిచేస్తుంది. ఆమెను ఏప్రిల్ 11 నాడు, అంటే ఈ సంఘటన జరగటానికి రెండు రోజుల ముందే ఢిల్లీలో అరెస్టు చేశారు.
సత్యం వర్మ బ్యాంకు ఖాతాలో ఒక కోటి రూపాయలు డాలర్ల రూపంలో వచ్చి చేరాయనే ప్రాసిక్యూషన్ వాదనలో ఎటువంటి నిజం లేదని కార్వాన్ ప్రకటించింది. మరి ఈ ఇద్దరే ఎందుకు చట్టం దృష్టిలో పడ్డారు?
నిరసనను కుట్రగా మార్చే క్రమంలో మేధావులకు, విద్యార్థి నాయకులకు, రచయితలకు ఒళ్ళు జలదరించే పాఠాన్ని నేర్పించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది.
పారిశ్రామిక వాడలు సమ్మెలు లేని పవిత్ర వాతావరణంలో నడవాలని, పెట్టుబడి అనే దేవుడిని పూజించే స్థలాల్లో ఏ కార్మిక సంఘాలు ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా ఉండాలంటే, శ్రమ నిరంతరాయంగా పెట్టుబడి సేవలో ఉండాలంటే, కార్మికుల హక్కులకంటూ మద్దతుగా ముందుకు ఎవరు వచ్చినా ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వం ఒక నమూనా చూపెట్టదలుచుకుంది.
ఇందుకోసం కాస్త మిలిటెంట్‌గా పనిచేస్తున్న ‘రివల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా’కు చెందిన ప్రజా సంఘాల నాయకులపై దృష్టి సారించారు.
సృష్టి వర్మ, ఆదిత్య ఆనంద్, మనీషా, రూపేష్, యోగేష్ మీనా, హిమాంశు ఠాకూర్ వంటి మజ్దూర్ బిగుల్ కార్యకర్తలను పలు చోట్ల అరెస్టు చేసి పదుల సంఖ్యలో కేసులు మోపారు.
ఇప్పుడు వీరి వంతు. మరోసారి మరొకరి వంతు. అందుకే చట్టానికి కావలసిన సాక్ష్యాలు లేకున్నా, ఆ ఇద్దరికీ ఆ ఘటనతో ప్రత్యక్ష సంబంధం, ప్రమేయం లేకున్నా, కుట్ర కథనాన్ని వండి వార్చింది, వారిని దేశద్రోహులుగా ముద్ర వేసింది.
కార్మిక ఉద్యమం కాస్తా జాతీయ భద్రతా సమస్యగా మారింది. న్యాయం పెట్టుబడి సృష్టిస్తున్న సరుకుల రక్షణలోకి దిగిపోయింది.
ఆర్థిక ఉపద్రవం కింద నలిగిపోతున్న జీవితాలు
అదే పనిగా తిరస్కరించబడే బెయిల్ అప్లికేషన్లు కేవలం న్యాయ వ్యవస్థ నిర్ణయాలుగా మాత్రమే చూడలేము. అది ఒక నైతిక ప్రకటన. అది మానవ జీవితపు విలువ కంటే పెట్టుబడి విలువ చాలా ఎక్కువ అని తేల్చి చెప్పదలుచుకున్న నైతిక ప్రకటన.
ప్రతిఘటనకు ప్రతినిధులుగా నిలిచిన ఈ ఇద్దరి ఖైదు భారత ప్రజాస్వామ్య పరిమితులను పరిహసించే వ్యాసంగం. వీరితో పాటు వివిధ కేసుల్లో అరెస్టు చేయబడిన విద్యార్థి నాయకులు, కార్మికులు ఈ న్యాయ ప్రక్రియను ఒక శిక్షగా భావించాల్సి వచ్చే పరిస్థితి కల్పించబడుతుంది.
అట్టడుగున ఉన్న ఒక కుటుంబానికి, అరెస్టు వారిపై పడిన ఆర్థిక ఉపద్రవం. న్యాయ వ్యవస్థ ఒక పద్మవ్యూహం. అందులోకి చొరబడి పని చేయాలంటే ఉన్న ఆర్థిక వనరులన్నీ ఒక్క చోటుకు తెచ్చినా సరిపోవు.
కోర్టు అఫిడవిట్లకు, ధృవీకరణ పత్రాలకు, నోటరీ స్టాంపులకు, రవాణా చార్జీలకు వడ్డీలకు తెచ్చి డబ్బు కట్టాలి. పైగా ఒక్కొక్కరిపైనా డజను పైగా కేసులు.
ఒక్క కేసులో బెయిల్ విచారణకే వేలకు వేలు ధారపోయాల్సి వస్తుంది. నెలలు తరబడి జైళ్ళలో మగ్గుతున్న వీరంతా మనలాంటి మనుషులకే తండ్రులు, భర్తలు, అక్కాచెల్లెళ్ళే.
పారిశ్రామిక అభివృద్ధి, అద్దాల భవంతులు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రవాహాలు అన్నీ ఈ మట్టి మనుషుల శరీరాల నుండి, వారి స్వేదం నుండే జన్మిస్తాయి.
నోయిడా కార్మికుల నిరసన భారత రాజ్యం, పెట్టుబడి మధ్య ఉన్న ఎడతెగని పేగు బంధానికి అద్దం పడుతుంది.
ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని రక్షించే పనిలో భాగంగా ఈ నిరసనను క్రూరంగా అణచివేసింది.
నిందితులు జైలు గోడల మధ్యనే ఉంటారు. వారి స్వేచ్ఛ మనందరి చైతన్యంతో ముడిపడి ఉందని గ్రహిస్తే చాలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
