నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులకే అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆర్థికవేత్త జయతి ఘోష్ అన్నారు.
భారతదేశం తన జాతి సంపదను తిరిగి సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని కొద్దిమంది పెట్టుబడిదారులు గుప్పిట్లో పెట్టుకున్నారని ఆమె విమర్శించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త జయతి ఘోష్, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) నాయకులతో కలిసి నవంబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం తీవ్రమైన ‘అసమానతల అత్యవసర పరిస్థితి’ని ఎదుర్కొంటోందని, ఇది వలస పాలన కాలం నాటి పరిస్థితుల కంటే మరింత దారుణంగా ఉందని అన్నారు.
జయతి ఘోష్ ఈ వ్యాఖ్యలు న్యూఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో చేశారు. ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) డిసెంబర్ 1న పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఈ మార్చ్‌లో లక్ష మందికి పైగా కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. వీరిలో 50 వేల మందికి పైగా మహిళా కార్మికులు ఉంటారు. అందరికీ వర్తించే విధంగా నెలకు రూ.21,000 కనీస పెన్షన్, రూ.42,000 కనీస వేతనం అమలు చేయాలని, అత్యంత సంపన్న కుటుంబాలపై పన్ను విధించాలని, తదితర డిమాండ్లతో ఈ పార్లమెంట్ మార్చ్ నిర్వహించనున్నారు.
ఈ విలేకరుల సమావేశాన్ని సీఐటీయూ జాతీయ అధ్యక్షుడు సుదీప్ దత్తా సమన్వయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, యువత నిర్వహిస్తున్న నిరసన పోరాటాల నేపథ్యాన్ని ఆయన గుర్తుచేశారు.
సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎళమరం కరీం, జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు ఈ పార్లమెంట్ మార్చ్‌కు సంబంధించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వివరించారు. అలాగే మార్చ్‌లో ముందుకు తీసుకెళ్తున్న ఏడు డిమాండ్లను వెల్లడించారు.
సంపద పన్ను, వారసత్వ పన్నుల ప్రస్తావన
జేఎన్‌యూలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్ (సీఈఎస్పీ) మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్ కార్మికులకు తన సంఘీభావం ప్రకటిస్తూ, ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది సంపన్నుల గుత్తాధిపత్యానికి, వారి ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగుతున్నాయని పేర్కొన్నారు.
నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అన్ని దేశాల్లోనూ సంపన్నులకు అనుకూలంగా పనిచేశాయని ఆమె అన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సంపద పన్ను, వారసత్వ పన్ను వంటి విధానాలు ప్రస్తుతం బ్రిటన్, బ్రెజిల్ వంటి దేశాల్లో అమల్లో ఉన్నాయని వివరించారు.
“కార్మికుల వాస్తవ వేతనాల్లో గణనీయమైన క్షీణత కనిపిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు. భారతదేశం తన ప్రజా సంపదను తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
“భారతదేశంలో కూడా ఇలాంటి ఉద్యమం రావాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని కొద్దిమంది పెట్టుబడిదారులే తమ గుప్పిట్లో పెట్టుకున్నారు” అని ఆమె అన్నారు.
కార్మిక పోరాటాల చరిత్ర.. కార్పొరేట్ రాయితీలు..
ఢిల్లీ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం మాజీ ప్రొఫెసర్ ప్రభు మహాపాత్ర, భారత స్వాతంత్ర్య పోరాటంలో కార్మికవర్గం చేసిన త్యాగాలను గుర్తుచేశారు.
మీరట్ కుట్ర కేసు నుంచి బొంబాయి నౌకాదళ డాక్ కార్మికుల సమ్మె వరకు స్వాతంత్ర్య పోరాటంలో కార్మికవర్గం నిర్వహించిన కీలక పాత్రను ఆయన ప్రస్తావించారు.
కార్మికవర్గం ఎప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమించినా వలస పాలక ప్రభుత్వం అణచివేతకు పాల్పడేదని ప్రభు మహాపాత్ర గుర్తుచేశారు.
అయితే, కార్మికుల పోరాటాల ఒత్తిడితో కొన్ని కార్మిక చట్టాలను మాత్రం తీసుకురావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఫిక్కీ (FICCI) సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విలేకరుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక రాయితీలు కల్పించినప్పటికీ, భారత పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు ఉపాధి అవకాశాలను పెంచలేదని, వేతనాలను కూడా పెంచలేదని మోదీ తన ప్రసంగంలో అంగీకరించినట్లు ఈ సమావేశంలో ప్రస్తావించారు.
ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కల్పించిన రాయితీల్లో కొన్ని:
♦ 2019లో ప్రాథమిక కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం.
♦ భారీ స్థాయిలో రుణమాఫీలు కల్పించడం.
♦ కార్పొరేట్ సంస్థలకు వివిధ రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు అందించడం.
డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్‌తో కూడా ఈ పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ కోడ్ల అమలుకు సంబంధించిన కేంద్ర నిబంధనలను 2026 మే 8న ప్రభుత్వం నోటిఫై చేసింది.
కార్మికులకు చట్టబద్ధంగా కల్పించిన హక్కులు, ప్రయోజనాలను అమలు చేయాల్సిన యజమానుల బాధ్యతలను సడలించడమే ఈ లేబర్ కోడ్ల లక్ష్యమని విమర్శించారు.
అదే సమయంలో కార్మికుల సమ్మె హక్కును, సంఘటితమయ్యే ప్రాథమిక హక్కును దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
తద్వారా కార్పొరేట్ సంస్థల అంతులేని లాభాపేక్షకు వ్యతిరేకంగా కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడానికి ఉన్న ప్రాథమిక హక్కులనే ఈ కోడ్లు బలహీనపరుస్తున్నాయని విమర్శించారు.
సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ ఎళమరం కరీం మాట్లాడుతూ, కార్మికులు కింది డిమాండ్ల సాధన కోసం పోరాడతారని తెలిపారు:
♦ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి.
♦ ఈ పథకం కింద పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి, వారికి కార్మికులకు దక్కాల్సిన అన్ని చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలు కల్పించాలి.
♦ కనీస వేతనాన్ని నెలకు రూ.42,000గా నిర్ణయించాలి.
♦ స్వయం ఉపాధి పొందుతున్న కుటుంబాలకు నెలకు కనీస ఆదాయం రూ.42,000గా నిర్ణయించాలి.
♦ అందరికీ వర్తించే విధంగా నెలకు రూ.21,000 కనీస పెన్షన్ అందించాలి.
కరీం మాట్లాడుతూ, ప్రభుత్వం కింది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు:
♦ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి.
♦ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి, పర్మినెంట్ చేయాలి.
♦ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
♦ యజమానులు భద్రతా నిబంధనలను ఉల్లంఘించకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
♦ యూనియన్ కార్యకలాపాలను, సమ్మెలను నేరాలుగా పరిగణించే విధానానికి స్వస్తి పలకాలి.
♦ నీరు, భూమి, అడవులు, జాతీయ సంపదను రక్షించాలి.
♦ భూముల ఆక్రమణలను అరికట్టాలి.
♦ నిర్వాసితులకు పునరావాసం, పునఃస్థాపన కల్పించడంతో పాటు వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలి.
ఇతర డిమాండ్లలో భాగంగా జల్–జమీన్–జంగల్ (నీరు–భూమి–అడవులు), జాతీయ సంపదను పరిరక్షించాలని కోరారు.
భూఆక్రమణలను అరికట్టాలని, నిర్వాసితులకు పునరావాసం, పునఃస్థాపన కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
మేధావులు, కళాకారుల సంఘీభావం
సీఐటీయూ నిర్వహిస్తున్న కార్మికుల పార్లమెంట్ మార్చ్‌కు వంద మందికి పైగా మేధావులు తమ సంఘీభావం ప్రకటించారు.
సంఘీభావం తెలిపిన వారిలో ప్రముఖ విద్యావేత్తలు, మాజీ వైస్ ఛాన్సలర్లు, శాస్త్రవేత్తలు, సినీ దర్శకులు, రచయితలు, ప్రముఖ హక్కుల కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
సీఐటీయూ కార్మికుల పార్లమెంట్ మార్చ్‌కు సంఘీభావం ప్రకటించిన వారిలో కొందరి పేర్లు:
ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, ప్రొఫెసర్ జయతి ఘోష్, డాక్టర్ బద్రీ రైనా, ప్రొఫెసర్ ప్రభు మహాపాత్ర, అరుణా రాయ్, ప్రొఫెసర్ పవిత్ర సర్కార్, ప్రొఫెసర్ ఉత్సా పట్నాయక్, ప్రొఫెసర్ సిపి చంద్రశేఖర్, ప్రొఫెసర్ హర్బన్స్ ముఖియా, ప్రొఫెసర్ మనోరంజన్ మొహంతి, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, ప్రొఫెసర్ మాలిని భట్టాచార్య, ప్రొఫెసర్ తనికా సర్కార్, పమేలా ఫిలిపోస్, ప్రొఫెసర్ పార్థ సేన్, ప్రొఫెసర్ వికె రామచంద్రన్, ప్రొఫెసర్ అచిన్ వనాయక్, ప్రొఫెసర్ నివేదితా మీనన్, అమ్ము అబ్రహం, ప్రొఫెసర్ రవీంద్రన్ గోపీనాథ్, ప్రొఫెసర్ అమర్ ఫారూఖీ, ప్రొఫెసర్ అరుణ్ కుమార్, ప్రొఫెసర్ ఎన్వి వర్గీస్, త్రిషిత్ రాయ్, ప్రొఫెసర్ అమర్త్య ముఖర్జీ, అభిజిత్ చౌదరి, కమలేశ్వర్ ముఖర్జీ, అశోకన్ చారువిల్, నెమోం పుష్పరాజ్, ప్రొఫెసర్ ఆర్. రామ్‌కుమార్, అడ్వకేట్ గాయత్రీ సింగ్, అనికేత్ ఆలం, స్వపన్ చక్రవర్తి, ప్రొఫెసర్ శ్యామల్ చక్రవర్తి, మందాక్రాంత సేన్, అరుణ్ సింగ్, అనిందిత సర్బాధికారి, బాద్షా మోయిత్రా, బికాష్ భట్టాచార్య తదితరులు ఉన్నారు.
అనువాదం: కె మనోహర రాజు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
