మనిషిని దేవుడు సృష్టించాడా? లేక మనిషే తనను తాను సృష్టించుకున్నాడా? ఈ ప్రశ్నకు ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ ఇచ్చిన సమాధానం చాలా విభిన్నంగా, లోతుగా ఉంటుంది.
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ మానవ చరిత్రను అర్థం చేసుకోవడంలో అత్యంత విప్లవాత్మకమైన ఆలోచనను ప్రతిపాదించాడు. మనిషిని మనిషిగా మార్చింది కేవలం మెదడు కాదు, ప్రకృతి కాదు, భాష కాదు. శ్రమే మానవ పరిణామానికి ప్రధాన చోదకశక్తి అని ఆయన స్పష్టం చేశాడు. డార్విన్ జీవ పరిణామాన్ని వివరిస్తే, ఎంగెల్స్ సామాజిక పరిణామంలో శ్రమ పాత్రను వివరించాడు.
మనిషిని మనిషిగా మార్చింది శ్రమ మాత్రమే. శ్రమ సంపదకు మూలం మాత్రమే కాదు, నిజం చెప్పాలంటే శ్రమే మనిషిని సృష్టించింది అంటాడు ఎంగెల్స్. ఈ ఒక్క వాక్యంలోనే మార్క్సిజం సిద్ధాంతం దాగి ఉంది.
ఎంగెల్స్ రాసిన “ది పార్ట్ ప్లేడ్ బై లేబర్ ఇన్ ది ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏప్ టు మ్యాన్” అనే వ్యాసం మానవ పరిణామంలో శ్రమ పాత్రను చారిత్రక భౌతికవాద దృక్పథంలో వివరిస్తుంది.
రెండు కాళ్లపై నడక – మానవ చరిత్రలో మొదటి విప్లవం
మన పూర్వీకులు నాలుగు కాళ్లపై నడిచే కోతుల్లాంటి జీవులు. కాలక్రమంలో పరిస్థితుల ప్రభావంతో రెండు కాళ్లపై నిలబడి నడవడం ప్రారంభించారు. దాంతో చేతులు స్వేచ్ఛను పొందాయి. వస్తువులను పట్టుకునే అవకాశం వచ్చింది. పనిముట్లు తయారు చేయగలిగారు. ప్రకృతిని మార్చే శక్తి ఏర్పడింది.
ఎంగెల్స్ ప్రకారం చెయ్యి అనేది కేవలం శరీర భాగం కాదు. కేవలం ప్రకృతి ఇచ్చిన అవయవం కాదు. పని చేస్తూ చేస్తూ అది అభివృద్ధి చెందింది. మొదట రాళ్లు పట్టింది. తర్వాత కర్రలు ఉపయోగించింది. ఆ తర్వాత ఆయుధాలు తయారు చేసింది. మంట వెలిగించింది. వ్యవసాయం చేసింది. ఇళ్లు నిర్మించింది. ఒకే అవయవం లక్షల సంవత్సరాల సాధనలో ప్రపంచాన్ని మార్చే సాధనంగా మారింది.
ఒక చిన్న పిల్లవాడికి మొదటిసారి పెన్సిల్ ఇస్తే సరిగా పట్టుకోలేడు. రోజూ రాస్తూ ఉంటే చేతి కండరాలు అలవాటు పడి, కొన్ని సంవత్సరాల తర్వాత అదే పిల్లవాడు అద్భుతమైన చిత్రాలు గీయగలుగుతాడు. అంటే సాధన చేతిని అభివృద్ధి చేస్తుంది. ఎంగెల్స్ చెప్పింది కూడా ఇదే.
లక్షల సంవత్సరాల శ్రమ మనిషి చేతిని ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం కలిగిన అవయవంగా మార్చింది.
మెదడు ఎలా పెరిగింది?
చేతులు పని చేయడం మొదలైన తర్వాత సమస్యలు కూడా పెరిగాయి. ఏ రాయి బలంగా ఉంటుంది? ఏ చెట్టు కర్ర బాగుంటుంది? మంట ఎలా వెలిగించాలి? జంతువును ఎలా వేటాడాలి?
ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ఆలోచన పెరిగింది. ఆలోచనతో పాటు మెదడు అభివృద్ధి చెందింది. అంటే, మెదడు ముందుగా పెరిగి శ్రమను సృష్టించలేదు. శ్రమే మెదడును అభివృద్ధి చేసింది. ఇదే ఎంగెల్స్ వాదనలో ప్రధానమైంది.
భాష ఎందుకు పుట్టింది?
ఒక్క మనిషి ఏనుగును వేటాడలేడు. పది మంది కలిసి వెళితేనే అది సాధ్యమవుతుంది. దానికోసం పరస్పరం సంకేతాలు అవసరమవుతాయి. తర్వాత మాటలు అవసరమవుతాయి. ఇలా శ్రమ చేస్తూ, శ్రమ కోసమే మనుషులు మాట్లాడటం నేర్చుకున్నారు. దాంతో భాష పుట్టింది.
ఎంగెల్స్ ప్రకారం శ్రమ, భాష – ఈ రెండూ కలిసి మానవ మెదడును మరింత అభివృద్ధి చేశాయి. దాంతో మనిషి ప్రకృతిని మార్చగలిగాడు. జంతువులు ప్రకృతికి అలవాటు పడతాయి. కానీ మనిషి మాత్రం ప్రకృతినే మార్చాడు. అడవిని పొలంగా మార్చాడు. రాయిని ఆయుధంగా మార్చాడు. మట్టిని కుండగా మార్చాడు. ఇనుమును యంత్రంగా మార్చాడు. ఇవన్నీ కేవలం శ్రమ వల్లే సాధ్యమయ్యాయి.
జంతువులు కూడా శ్రమ చేస్తాయి, అయితే ఆ పనులు ప్రకృతికి లోబడే ఉంటాయి. ఉదాహరణకు తేనెటీగ అద్భుతమైన తేనెగూడు నిర్మిస్తుంది. కానీ, వేల సంవత్సరాల క్రితం ఎలా నిర్మించిందో ఇప్పటికీ అలాగే నిర్మిస్తుంది. ఏ మార్పూ లేదు. కానీ మనిషి గుహ నుంచి ప్రారంభించి, గుడిసె, ఇల్లు, అంతస్తుల భవనం, ఆకాశహర్మ్యం వరకు వచ్చాడు. ఎందుకు? ఎందుకంటే ప్రతి తరం తన శ్రమతో కొత్త జ్ఞానాన్ని సృష్టించి, తర్వాతి తరానికి అందించింది.
శ్రమ వ్యక్తిగతం కాదు, అది సామూహికం. మనిషి ఒంటరిగా అభివృద్ధి చెందలేదు. సమూహంగా పనిచేశాడు. ఒకరు వేటాడారు. మరొకరు మంట వెలిగించారు. ఇంకొకరు పనిముట్లు తయారు చేశారు. ఈ సహకారం సమాజానికి పునాది వేసింది. అంటే, సమాజం నుంచే మనిషి పుట్టాడు, సమాజాన్ని కూడా మనిషే శ్రమతో నిర్మించాడు. ఆధునిక ప్రపంచంలో కూడా శ్రమే ఆధారం. ఈరోజు మనం ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక వేలాది మంది శ్రమ ఉంది.
ఇప్పుడు మన చేతిలో ఉండే మొబైల్ ఫోన్నే తీసుకుంటే, దాని కోసం ఖనిజాలు తవ్విన కార్మికుడు, చిప్ తయారు చేసిన ఇంజినీర్, సాఫ్ట్వేర్ రాసిన ప్రోగ్రామర్, కర్మాగారంలో అమర్చిన కార్మికుడు, రవాణా చేసిన డ్రైవర్— ఇలా లక్షల మంది శ్రమ కలిస్తేనే ఒక ఫోన్ మన చేతికి వస్తుంది. అందుకే నాగరికత అనేది కొందరి ప్రతిభ ఫలితం కాదు, కోట్లాది మంది సమిష్టి శ్రమ ఫలితం.
శ్రమ మనిషిని మాత్రమే కాదు, సమాజాన్నీ మార్చింది. శ్రమతో పాటు వ్యవసాయం వచ్చింది. వ్యవసాయంతో మిగులు ఉత్పత్తి వచ్చింది. మిగులు ఉత్పత్తితో వ్యక్తిగత ఆస్తి ఏర్పడింది. ఆస్తితో వర్గాలు ఏర్పడ్డాయి. వర్గాలతో రాజ్యం ఏర్పడింది అంటాడు ఎంగెల్స్.
అంటే మానవ పరిణామాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా శ్రమను అర్థం చేసుకోవాలని ఎంగెల్స్ సూచిస్తాడు.
ఎంగెల్స్ దృష్టిలో మనిషి పరిణామం అనేది కేవలం శరీర రూపం మారడం కాదు. అది శ్రమ, సహకారం, భాష, ఆలోచన, ప్రకృతిని మార్చే సామర్థ్యం కలిసి సృష్టించిన సుదీర్ఘ చారిత్రక ప్రక్రియ.
కోతి నుంచి మనిషిగా మారడంలో కేవలం జీవశాస్త్ర పరిణామమే పనిచేయలేదు. ప్రకృతితో పోరాడుతూ, చేతులతో పనిచేస్తూ, కలిసి జీవిస్తూ, అనుభవాన్ని తరతరాలకు అందిస్తూ సాగిన శ్రమే మనిషిని మానవుడిగా మలిచింది అని ఎంగెల్స్ వాదించాడు.
నేటి మానవశాస్త్రం, జీవపరిణామ శాస్త్రం మానవ పరిణామాన్ని ప్రధానంగా సహజ ఎంపిక, జన్యు మార్పులు, పర్యావరణ అనుకూలన వంటి అంశాలతో వివరిస్తున్నప్పటికీ, సహకార శ్రమ, పనిముట్ల వినియోగం, భాష, సామాజిక జీవనం మానవ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయనే అంశం ఇప్పటికీ విస్తృతంగా పరిశోధనకు, చర్చకు కేంద్రంగా ఉంది.
ఎంగెల్స్ వ్యాసం ఈ సంబంధాన్ని సామాజిక–చారిత్రక కోణంలో ఆలోచించడానికి ఒక ప్రభావవంతమైన రచనగా నిలిచింది.
సమిష్టి శ్రమ నుంచి దోపిడీ వ్యవస్థ వరకు
ఈ సమిష్టి శ్రమ తర్వాతి కాలంలో దోపిడీగా పరిణామం చెందిన విధానం కూడా చూద్దాం.
ఫ్రెడ్రిక్ ఎంగెల్స్ 1884లో రాసిన “ది ఆరిజిన్ ఆఫ్ ది ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ది స్టేట్” (The Origin of the Family, Private Property and the State) అనే ఈ చిన్న పుస్తకం మార్క్సిస్ట్ సిద్ధాంతంలో అత్యంత ప్రాముఖ్యమైన గ్రంథంగా మారింది.
మానవ సమాజాల పరిణామ క్రమాన్ని, కుటుంబ వ్యవస్థ పుట్టుకను, ఆస్తి హక్కుల ఏర్పాటును, తద్వారా రాజ్యం (State) ఎలా ఏర్పడిందో ఈ పుస్తకంలో చారిత్రక భౌతికవాద (Historical Materialism) కోణంలో ఎంగెల్స్ అద్భుతంగా వివరించాడు. ఈ పుస్తకంలో ఎంగెల్స్ చేసిన విశ్లేషణకు అమెరికన్ మానవశాస్త్రవేత్త లూయిస్ హెచ్. మోర్గాన్ పరిశోధనలు ఆధారం.
1. మానవ సమాజపు మూడు ప్రధాన దశలు: మానవ సమాజం నేరుగా ఆధునిక రూపంలోకి రాలేదని, అది దశలవారీగా పరిణామం చెందుతూ మూడు ప్రధాన ఉత్పత్తి/సాంస్కృతిక దశల గుండా ప్రయాణించిందని ఎంగెల్స్ పేర్కొన్నాడు.
ఆటవిక దశ (Savagery): ఇది మానవుడు ప్రకృతిపై పూర్తిగా ఆధారపడిన కాలం. వేటాడటం, పండ్లు సేకరించడం ఈ దశ ప్రధాన లక్షణాలు. ఎలాంటి ప్రైవేట్ ఆస్తి లేదా శాశ్వత కుటుంబాలు లేవు.
అనాగరిక దశ (Barbarism): పశుపోషణ, వ్యవసాయం, మట్టిపాత్రల తయారీ, లోహాల వాడకం ప్రారంభమైన దశ. ఉత్పత్తి పెరగడం మొదలైన కాలం ఇది.
నాగరిక దశ (Civilization): పరిశ్రమలు, వాణిజ్యం, పట్టణాల ఏర్పాటు జరిగిన దశ. ఈ దశలోనే శ్రమ విభజన పెరిగి, సమాజం వర్గాలుగా విడిపోయింది.
2. కుటుంబ వ్యవస్థ పరిణామం: కుటుంబం అనేది మొదటి నుంచీ ఒకేలా లేదు, సమాజంలోని ఆర్థిక మార్పులకు అనుగుణంగా అది మారుతూ వచ్చిందని ఎంగెల్స్ నిరూపించాడు.
ఆదిమ కమ్యూనిజం – మాతృస్వామ్యం: సమాజం తొలినాళ్లలో (ఆటవిక దశలో) సమూహ వివాహాలు ఉండేవి. పిల్లలకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితి వల్ల, వంశం తల్లి పేరు మీదనే నడిచేది. ఆస్తిపై అందరికీ సమాన హక్కు ఉండేది. దీనినే మాతృస్వామ్య వ్యవస్థ అంటారు.
పితృస్వామ్య వ్యవస్థకు మార్పు: వ్యవసాయం, జంతువులను మచ్చిక చేసుకోవడం పెరిగినప్పుడు పురుషుడి పాత్ర పెరిగింది.
సంపద పురుషుడి చేతిలోకి రావడం ప్రారంభమైంది. తన ఆస్తి తన సొంత పిల్లలకే చెందాలనే కోరికతో పురుషుడు మాతృస్వామ్యాన్ని కూలదోసి, పితృస్వామ్య వ్యవస్థను తెచ్చాడు. ఎంగెల్స్ దీనిని “స్త్రీ జాతి చారిత్రక ఓటమి”గా అభివర్ణించాడు.
ఏకపత్నీ వ్రతం: ఇది ప్రేమానురాగాల వల్ల వచ్చింది కాదు, కేవలం పురుషుడి ఆస్తిని తన వారసులకు భద్రంగా అందించడం కోసం స్త్రీ ప్రవర్తనను, లైంగికతను నియంత్రించేందుకు ఏర్పడిన ఆర్థిక ఒప్పందం అని ఎంగెల్స్ తీర్మానించాడు.
3. వ్యక్తిగత ఆస్తి పుట్టుక: ఆదిమ సమాజంలో సంపద ఉమ్మడిగా ఉండేది. కానీ ఉత్పత్తి సాధనాలు (ఆయుధాలు, పశువులు, భూమి) మెరుగయ్యాక, అవసరానికి మించి అదనపు ఉత్పత్తి సాధ్యమైంది.
ఈ అదనపు ఉత్పత్తిని సమాజంలోని కొద్దిమంది (ముఖ్యంగా తెగల నాయకులు, బలవంతులు) తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆస్తి కాస్తా వ్యక్తిగత ఆస్తిగా మారింది.
ఆస్తి ఉన్నవారు–లేనివారు అనే తేడా వచ్చి, సమాజం యజమానులు–దాసులుగా, దోపిడీదారులు–దోపిడీకి గురయ్యేవారుగా విడిపోయింది. శ్రమ విభజన తీవ్రతరమై వర్గ వైరుధ్యాలు మొదలయ్యాయి.
4. రాజ్యం ఆవిర్భావం: సమాజం పరస్పర విరుద్ధమైన వర్గాలుగా (ఆస్తి ఉన్నవారు, లేనివారు) విడిపోయినప్పుడు, వారి మధ్య ఘర్షణలు సహజం. ఆ ఘర్షణల వల్ల సమాజం అంతరించిపోకుండా చూడటానికీ, ఆస్తిపరుల ప్రయోజనాలను కాపాడటానికి ఒక పైచేయి కలిగిన శక్తి అవసరమైంది. అదే రాజ్యం.
రాజ్యం అనేది సమాజంపై పైనుంచి రుద్దిన శక్తి కాదు. సమాజంలో వర్గ వైరుధ్యాలను పరిష్కరించుకోలేనప్పుడు, బలమైన ఆర్థిక వర్గం (శాసించే వర్గం) బలహీన వర్గాన్ని అణచివేయడానికి సృష్టించుకున్న ఒక సాధనమే రాజ్యం అంటాడు ఎంగెల్స్.
పోలీసులు, సైన్యం, చట్టాలు, జైళ్లు అన్నీ ఆస్తిపరుల సంపదను కాపాడటానికి, పేదలను అణచడానికే పని చేస్తాయని ఎంగెల్స్ వివరించాడు.
ఎంగెల్స్ ఈ గ్రంథం ద్వారా కుటుంబం, ఆస్తి, రాజ్యం అనేవి శాశ్వతమైనవి కావని, అవి మానవ పరిణామంలో ఒకానొక దశలో ఏర్పడినవని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ప్రైవేట్ ఆస్తి అంతరించి, వర్గరహిత సమాజం (కమ్యూనిజం) ఏర్పడినప్పుడు, దోపిడీకి సాధనమైన రాజ్య వ్యవస్థ కూడా క్రమంగా అంతరించిపోతుందని, స్త్రీ–పురుషుల మధ్య సమానత్వంతో కూడిన నిజమైన సంబంధాలు ఏర్పడతాయని ఎంగెల్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నాగరికతకు అసలు సృష్టికర్త శ్రమ
ఈ ప్రపంచాన్ని, నాగరికతను, సమాజాన్ని అన్నింటినీ దేవుడే సృష్టించాడని మతాలు చెబుతాయి. ఇల్లు దేవుడు కట్టాడా? లేక మేస్త్రీ, కూలీలు కట్టారా? పొలం దేవుడు దున్నాడా? లేక రైతు దున్నాడా? రోడ్లు దేవుడు వేశాడా? లేక కార్మికులు వేశారా? బట్ట దేవుడు నేశాడా? లేక చేనేత కార్మికుడు నేశాడా? ఇలాంటి ప్రశ్నలకు మన కళ్ల ముందే సమాధానం ఉంది. నాగరికతకు అసలు సృష్టికర్త శ్రమ.
ఈ రోజు మనం నివసిస్తున్న ప్రపంచాన్ని ఒకసారి చూస్తే—ఆకాశాన్ని తాకే భవనాలు, వేల కిలోమీటర్ల రహదారులు, ఆనకట్టలు, రైల్వేలు, విమానాలు, విద్యుత్ కేంద్రాలు, ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు ఇవన్నీ ప్రార్థనల వల్ల రాలేదు.
లక్షలాది కార్మికుల చెమటతో, రైతుల శ్రమతో, శాస్త్రవేత్తల పరిశోధనతో, ఇంజినీర్ల సృజనతో నిర్మితమయ్యాయి. మనం తినే ప్రతీ గింజ వెనుక శ్రమే ఉంది.
ఎంగెల్స్ దృష్టిలో శ్రమ కేవలం ఉపాధి కాదు. అది మనిషిని సృష్టించిన శక్తి. సమాజాన్ని నిర్మించిన శక్తి. విజ్ఞానాన్ని పుట్టించిన శక్తి. నాగరికతను ముందుకు నడిపించిన శక్తి. అందుకే ఆయన “మనిషి చేతి శ్రమ ప్రకృతిని మార్చింది; ప్రకృతిని మార్చే క్రమంలో మనిషినే మార్చింది” అంటాడు.
ఈ ప్రపంచాన్ని దేవుడు నిర్మించాడని నమ్మేవాళ్లు కూడా ఈ రోజు మనం చూస్తున్న ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, పరిశ్రమలు, పుస్తకాలు, విజ్ఞానం, సాంకేతికత అన్నీ మనుషుల శ్రమ ఫలితాలే అని ఒప్పుకుని తీరాల్సిందే. ఎంగెల్స్ చెప్పిన ప్రధాన అంశం ఇదే.
“ప్రపంచ నాగరికతకు నిజమైన శిల్పి శ్రమ. సమాజాన్ని నిర్మించినది శ్రమజీవి. మనిషిని మనిషిగా మలిచినది కూడా శ్రమే.” ఈ భావన మార్క్సిస్టు చారిత్రక భౌతికవాదంలోని ప్రధానమైన ఆలోచనల్లో ఒకటి. ఇది మానవ సమాజం, నాగరికత, చరిత్ర, అభివృద్ధిని శ్రమ, భౌతిక ఉత్పత్తి ప్రక్రియల ఆధారంగా విశ్లేషించే ఒక తాత్విక–చారిత్రక దృక్కోణం.
ప్రకృతిపై విజయం.. ఎంగెల్స్ హెచ్చరిక
ప్రకృతిపై మానవుడు సాధించిన విజయాలు, దాని వెనుక దాగున్న చేదు నిజాల గురించి కూడా ఎంగెల్స్ హెచ్చరించాడు.
చాలా కాలం క్రితం మెసొపొటేమియా, గ్రీస్, ఇటలీ వంటి ప్రాంతాల్లో దట్టమైన అడవులు ఉండేవి. అక్కడ జీవించే మనుషులు తమ తెలివితేటలు ఉపయోగించి శ్రమ చేయడం మొదలుపెట్టారు. వారికి వ్యవసాయం చేయడానికి భూమి కావాల్సి వచ్చింది. గొర్రెలు, మేకలు మేపడానికి పచ్చికబయళ్లు అవసరమయ్యాయి. చలి కాచుకోవడానికి, ఇళ్లు కట్టుకోవడానికి కలప కావాల్సి వచ్చింది. దాంతో మనుషులంతా కలిసి, “ఈ అడవుల వల్ల మనకు ఉపయోగం ఏంటి? వీటిని నరికేసి, వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేద్దాం. ప్రకృతిని మన గుప్పిట్లోకి తెచ్చుకుందాం” అని సంబరపడ్డారు.
గొడ్డళ్లు చేతబట్టి అడవులను నరికేశారు. చెట్లన్నీ పోయాయి, అక్కడ పంటలు పండాయి. మనుషులు నవ్వుకుంటూ, “చూశారా, ప్రకృతిని మన శ్రమతో ఎలా జయించామో” అని గర్వంగా కాలర్ ఎగరేశారు.
అయితే, ప్రకృతి తీర్చుకున్న పగ (ఎంగెల్స్ చెప్పిన అసలు ట్విస్ట్) కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్ని దశాబ్దాలు గడిచాయి. అడవులు నరికేసిన ఆ ప్రాంతాల్లో భారీ మార్పులు జరిగాయి. నీటి వనరులు మాయమయ్యాయి. కొండలపై ఉన్న చెట్లను నరికేయడం వల్ల, వర్షం పడినప్పుడు నీటిని పట్టి ఉంచే వేళ్లు లేకుండా పోయాయి. దీనివల్ల కొండల నుంచి ప్రవహించే సెలయేళ్లు, ఊట బావులు ఎండిపోయాయి. ఏ నీటి కోసమైతే అడవులు నరికారో, ఆ నీరే కరువైంది. వరదలు, భూసారం నాశనమయ్యాయి. వర్షం పడినప్పుడు చెట్లు లేకపోవడంతో, వరద నీరు నేరుగా కొండల పైనుంచి కిందికి దూసుకొచ్చేది. దాంతో నేలపై ఉన్న సారవంతమైన మట్టి కొట్టుకుపోయింది. పంటలు పండటం ఆగిపోయాయి.
ఎడారీకరణ: గ్రీస్, ఇటలీ దేశాల్లో పర్వతాలపై అడవులను నరికేయడం వల్ల, ఆ పర్వతాల చుట్టుపక్కల వాతావరణం పొడిబారిపోయి, పశువుల మేత కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఎంగెల్స్ దీని గురించే ఇలా రాశారు:
“ప్రకృతిపై మనం సాధించిన మానవ విజయాల పట్ల మనం అతిగా సంతోషించవద్దు. ఎందుకంటే, అలాంటి ప్రతి విజయానికి ప్రకృతి మనపై ప్రతీకారం తీర్చుకుంటుంది. మొదటి అడుగులో మనం అనుకున్న ఫలితాలు రావచ్చు, కానీ రెండు, మూడు అడుగుల్లో మనం ఊహించని భయంకరమైన పరిణామాలు ఎదురవుతాయి.”
ఆధునిక ప్రపంచానికి కూడా వర్తించే పాఠం
ప్రస్తుత ఆధునిక ప్రపంచానికి కూడా ఈ కథ వర్తిస్తుంది (మన కళ్ల ముందున్న ఉదాహరణలు). ఎంగెల్స్ 150 ఏళ్ల క్రితం చెప్పిన ఈ విషయం, నేటి 2026 ప్రపంచానికి అక్షరాలా సరిపోతుంది.
పారిశ్రామిక విప్లవం – గ్లోబల్ వార్మింగ్: మనిషి తన శ్రమతో ఫ్యాక్టరీలు పెట్టాడు, వాహనాలు తయారు చేశాడు, బొగ్గు, పెట్రోల్ వాడాడు. “మేం ప్రపంచాన్ని మార్చేశాం” అని మురిసిపోయాడు. కానీ ప్రకృతి ఏం చేసింది? ‘గ్లోబల్ వార్మింగ్’ (భూతాపం) రూపంలో వేడిని పెంచింది. ఇప్పుడు అకాల వర్షాలు, తీవ్రమైన ఎండలతో మానవాళి తలపట్టుకుంటోంది.
ప్లాస్టిక్ ఆవిష్కరణ: ప్యాకింగ్ సులభం కావాలని మనిషి ప్లాస్టిక్ కనుగొన్నాడు. అదొక గొప్ప విజయంగా భావించాడు. కానీ ఈరోజు అదే ప్లాస్టిక్ సముద్రాలను, భూమిని విషపూరితం చేస్తూ, మైక్రోప్లాస్టిక్ రూపంలో మనం తినే ఆహారంలోకి, రక్తంలోకి సైతం చేరి మన ప్రాణాలకే ముప్పుగా మారింది.
ఇక మన దేశంలో మోదీ ప్రభుత్వం అడవులను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది.
జంతువులు ప్రకృతిని కేవలం వాడుకుంటాయి. కానీ మనిషి ప్రకృతిని మార్చగలడు. అలాగని మనం ప్రకృతికి యజమానులం కాదు. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే. ప్రకృతిని ఒక శత్రువులా భావించి “జయిస్తాం” అనుకుంటే వినాశనం తప్పదు.
ప్రకృతితో కలిసి జీవిస్తూ (Sustainable Development), భవిష్యత్తు పరిణామాలను ఆలోచించి శ్రమ చేసినప్పుడే మానవజాతి మనుగడ సాధ్యమవుతుంది. ఇదే ఎంగెల్స్ మనకు అందించిన అమూల్యమైన హెచ్చరిక.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
