ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన సుదీర్ఘ స్వాతంత్ర్య పోరాటం ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఆ పోరాటం కేవలం విదేశీ పాలకుల నుంచి విముక్తి కోసం మాత్రమే కాదు.
స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక, ఆర్థిక న్యాయం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం వంటి విలువలతో కూడిన భారతదేశ నిర్మాణం కోసం కూడా జరిగింది.
భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పించింది.
అయితే గత కొంతకాలంగా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, పౌర స్వేచ్ఛలు, మానవ హక్కుల పరిస్థితిపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో లండన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) 2026 నవంబర్ 23న విడుదల చేసిన 95 పేజీల నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నివేదిక పేరు “సో వాట్స్ దిస్ డెమోక్రసీ వి ఆర్ టాకింగ్ అబౌట్? – మోదీస్ అథారిటేరియన్ ప్లేబుక్ ఇన్ ఇండియా” (So What’s This Democracy We’re Talking About? – Modi’s Authoritarian Playbook in India). అంటే “మనం దేని గురించి ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాం? భారతదేశంలో మోదీ అనుసరిస్తున్న నిరంకుశ పాలనా విధానం.”
ఈ నివేదికలో ప్రధానంగా 2014 నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలను, మానవ హక్కులను పరిరక్షించాల్సిన సంస్థలను ఎలా బలహీనపరిచారనే అంశాలను పరిశీలించారు.
నివేదిక రూపొందించడానికి జనవరి 2025 నుంచి సెప్టెంబర్ 2026 వరకు పరిశోధన నిర్వహించారు. మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు తదితర 40 మందికి పైగా వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు.
ప్రభుత్వ పత్రాలు, కోర్టు తీర్పులు, ఇతర పరిశోధనా నివేదికలను కూడా పరిశీలించారు. ఈ నివేదికలోని ప్రధాన అంశాలను పరిశీలిస్తే భారత ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ల తీవ్రత అర్థమవుతుంది.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు
ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం, ప్రజలు ఓటు వేయడం, మెజారిటీ సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు.
ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉండాలి. ప్రజలు తమ సమస్యలపై ఉద్యమించగలగాలి. మీడియా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపగలగాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి. ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు సహా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండాలి.
ప్రభుత్వ అధికారాన్ని నియంత్రించే సంస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయడం ప్రజాస్వామ్యానికి అత్యవసరం. కానీ మోదీ ప్రభుత్వ పాలనలో ఈ సంస్థల స్వతంత్రత క్రమంగా బలహీనపడుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక తెలియజేస్తోంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం – ప్రతిపక్షాల గొంతు నొక్కివేత
భారతదేశంలో పార్లమెంటు ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన వ్యవస్థ. ప్రజల తరఫున ఎన్నికైన ప్రతినిధులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, చట్టాలను పరిశీలించడం, ప్రజల సమస్యలపై చర్చించడం పార్లమెంటు ప్రధాన బాధ్యత. కానీ పార్లమెంటరీ చర్చలకు, ప్రతిపక్షాల పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని నివేదిక విమర్శించింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను నిపుణులు, ప్రజాసంఘాలు, వివిధ రంగాల ప్రతినిధులతో చర్చించేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు పంపడం ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య సంప్రదాయం.
అయితే పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ (PRS Legislative Research) గణాంకాల ప్రకారం 2004–2009లో 60 శాతం, 2009–14లో 71 శాతం, 2014–19లో 28 శాతం, 2019–24లో 16 శాతం బిల్లులు కమిటీలకు పంపారు.
ఈ గణాంకాలు చట్టాల రూపకల్పనలో నిపుణుల అభిప్రాయాలు, ప్రజల భాగస్వామ్యం తగ్గుతున్న విషయాన్ని సూచిస్తున్నాయి.
146 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్: 2023 డిసెంబర్లో పార్లమెంటు సమావేశాల సందర్భంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం మరో ముఖ్యమైన ఉదాహరణ.
లోక్‌సభ నుంచి 100 మంది, రాజ్యసభ నుంచి 46 మంది సస్పెన్షన్‌కు గురయ్యారు. వారు సభలో లేని సమయంలో మూడు ప్రధాన క్రిమినల్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను, టెలికమ్యూనికేషన్స్ చట్టాన్ని ఆమోదించారు.
2019 నుంచి 2024 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటం, ప్రతిపక్ష నాయకత్వానికి తగిన గుర్తింపు లేకపోవడం కనిపిస్తోంది.
పార్లమెంటులో ప్రభుత్వానికి మెజారిటీ ఉండవచ్చు. కానీ ఆ మెజారిటీ ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఉల్లంఘించడానికి అనుమతి కాదు.
కేంద్ర దర్యాప్తు సంస్థల రాజకీయ వినియోగం
ఈ నివేదికలో అత్యంత కీలకమైన అంశం కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై చేసిన విమర్శలు. ప్రధానంగా మూడు సంస్థలు— సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ. ఈ సంస్థలు అవినీతి, ఆర్థిక నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర తీవ్రమైన నేరాలను దర్యాప్తు చేయడానికి ఏర్పాటయ్యాయి.
కానీ ప్రభుత్వ రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ సంస్థలను ఉపయోగిస్తున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నివేదిక ప్రస్తావించింది.
ఈడీ గణాంకాల ఆధారంగా 2015 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు 193 మంది రాజకీయ నాయకులపై ఈడీ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు దశాబ్దంలో ఇలాంటి కేసులు 26 మాత్రమే నమోదయ్యాయి.
అంతేకాకుండా 2014 తర్వాత కనీసం 23 మంది ప్రముఖ ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరిన అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ దాదాపు ఆగిపోయింది. దీనిని రాజకీయంగా విమర్శకులు బీజేపీ ‘వాషింగ్ మెషీన్’ విధానంగా అభివర్ణిస్తున్నారు.
ఒకే రకమైన ఆరోపణలు పదే పదే రావడం దర్యాప్తు సంస్థల నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.
UAPA చట్టం – పౌర హక్కులకు ముప్పు
అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (Unlawful Activities (Prevention) Act – UAPA) అనేది ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు ఉద్దేశించిన చట్టం.
దేశ భద్రతను కాపాడటానికి ఇలాంటి చట్టాలు అవసరమే. అయితే వాటిని ఉపయోగించి ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు, విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులను దీర్ఘకాలం జైలులో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
ఈ చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణ ఆలస్యం కావడం, బెయిల్ పొందడం కష్టమవడం, నిందితులు సంవత్సరాల తరబడి జైలులో ఉండాల్సి వచ్చింది.
కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు: ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా—ఆదివాసీ, దళిత హక్కుల కోసం పనిచేసిన ఆయనను మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టు చేశారు.
2024లో బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అదే ఏడాది ఆయన మరణించారు. స్టాన్ స్వామి—ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన 84 ఏళ్ల సామాజిక కార్యకర్త. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయి 2021లో జైలులోనే మరణించారు.
భీమా కోరేగావ్ కేసు—మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలపై నమోదైన కేసులు, దీర్ఘకాలిక నిర్బంధం గురించి నివేదిక చర్చించింది.
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్—పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు సంబంధించి నమోదైన కేసుల్లో దీర్ఘకాలంగా విచారణను ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వాన్ని విమర్శించడం ఉగ్రవాదం కాదు. శాంతియుతంగా నిరసన తెలపడం దేశద్రోహం కాదు. నేరం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి వ్యక్తికి న్యాయమైన విచారణ పొందే హక్కు ఉంటుంది.
ఎన్నికల సంఘం స్వతంత్రత, ఓటు హక్కుపై ప్రశ్నలు
ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక వంటిది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు సమాన అవకాశాలు కల్పించడం, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం దాని ప్రధాన బాధ్యత. కానీ ఎన్నికల సంఘం నియామక విధానంలో కేంద్ర ప్రభుత్వ ప్రభావం పెరిగింది. అధికార పార్టీ నాయకుల విద్వేషపూరిత ఎన్నికల ప్రచారాలపై తగిన చర్యలు తీసుకోలేదు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ – SIR: 2025 జూన్‌లో ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించింది. మరణించినవారు, నకిలీ ఓట్లు, అర్హత లేని వారి పేర్లను తొలగించడం ఈ ప్రక్రియ లక్ష్యం. అయితే 2026 అక్టోబర్ నాటికి 13 కోట్లకు పైగా పేర్లు ఓటర్ల జాబితాల నుంచి తొలగించారు.
ఈ తొలగింపుల ప్రభావం పేదలు, మహిళలు, మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, ఇతర అణగారిన వర్గాలపై అధికంగా ఉంది.
పశ్చిమ బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 90 లక్షలకు పైగా పేర్లు తొలగించారు, ఇది అక్కడి మొత్తం ఓటర్లలో సుమారు 12 శాతం.
ఓటర్ల జాబితాలను శుద్ధి చేయడం అవసరమే. కానీ నిజమైన, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చూడాలి. తొలగించిన వ్యక్తులకు తమ పేర్లను తిరిగి చేర్చుకునేందుకు సరైన అవకాశం కల్పించాలి. ఒక పౌరుడికి ఓటు హక్కు లేకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనే ప్రాథమిక అవకాశమే దెబ్బతింటుంది.
రాజ్యాంగబద్ధ సంస్థల బలహీనత
ప్రభుత్వ అధికారాలను నియంత్రించడానికి, ప్రజల హక్కులను పరిరక్షించడానికి భారత రాజ్యాంగం, పార్లమెంటు చట్టాల ద్వారా అనేక స్వతంత్ర సంస్థలు ఏర్పాటయ్యాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, కేంద్ర సమాచార కమిషన్, లోక్‌పాల్ ముఖ్యమైనవి.
ఈ సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడినవి కావు. ప్రభుత్వ అధికారుల వల్ల హక్కుల ఉల్లంఘన జరిగినా ప్రశ్నించే స్వతంత్ర వ్యవస్థలుగా పనిచేయాలి. కానీ నియామకాలు, నిధులు, అధికారాలు, స్వతంత్ర నిర్ణయాధికారంపై రాజకీయ ప్రభావం పెరిగింది.
జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తింపు తగ్గింపు: 2025 మార్చిలో ఐక్యరాజ్యసమితి వ్యవస్థతో సంబంధమున్న గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ (Global Alliance of National Human Rights Institutions) సంస్థ భారత జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఉన్న ‘ఎ’ (A) కేటగిరీ గుర్తింపును ‘బి’ (B) కేటగిరీకి తగ్గించాలని సిఫార్సు చేసింది.
సంస్థ స్వతంత్రత, నియామకాల విధానం, పనితీరుపై ఆందోళనలు ఈ సిఫార్సుకు కారణం. ఇది భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగించే పరిణామం.
సమాచార హక్కు చట్టం బలహీనపడటం: 2005లో అమలులోకి వచ్చిన సమాచార హక్కు చట్టం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక గొప్ప ముందడుగు.
ప్రభుత్వ ఖర్చులు, నియామకాలు, విధాన నిర్ణయాలు, పరిపాలనలోని అవకతవకలు తెలుసుకోవడానికి సామాన్య పౌరులకు ఇది ఒక శక్తివంతమైన సాధనంగా నిలిచింది.
దేశవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 40 నుంచి 60 లక్షల వరకు సమాచార హక్కు దరఖాస్తులు వస్తున్నాయని పౌర సంఘాల పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ 2019లో చేసిన సవరణల ద్వారా కేంద్ర సమాచార కమిషనర్ల పదవీకాలం, జీతభత్యాలు, సేవా నిబంధనలపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పెరిగింది. దీంతో సమాచార కమిషన్ స్వతంత్రతకు ముప్పు ఏర్పడింది. సమాచారం అడిగే హక్కు బలహీనపడితే అవినీతిని బయటపెట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆందోళనలు
భారత రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి స్వతంత్రంగా పనిచేయాలి. ప్రభుత్వం తప్పు చేసినా, ప్రజల హక్కులను ఉల్లంఘించినా న్యాయస్థానాలు రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని తీర్పులు ఇవ్వాలి.
అయితే రాజకీయంగా సున్నితమైన కేసుల్లో న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్ మంజూరులో ఆలస్యం, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు వంటి అంశాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ కేసులు, భీమా కోరేగావ్ కేసులోని నిందితుల దీర్ఘకాల నిర్బంధం ఇందుకు ఉదాహరణలు.
2026 ఫిబ్రవరిలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ప్రస్తావించిన పాఠ్యపుస్తకాన్ని సుప్రీంకోర్టు నిషేధించడం, ఆ పాఠ్యాంశాన్ని రూపొందించిన ముగ్గురు విద్యావేత్తలపై తీసుకున్న చర్యలు, అనంతరం మేలో ఆంక్షలను వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు కూడా న్యాయవ్యవస్థ పనితీరులో లోపాలను తెలియజేస్తున్నాయి.
న్యాయవ్యవస్థపై విమర్శలకు కూడా ప్రజాస్వామ్యంలో స్థానం ఉండాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రతతో పాటు దాని జవాబుదారీతనం కూడా అవసరం.
మతపరమైన మైనారిటీలపై వివక్ష, దాడులు
భారత రాజ్యాంగంలోని 14వ అధికరణ చట్టం ముందు సమానత్వాన్ని, 15వ అధికరణ మతం, కులం, జాతి, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధించడాన్ని, 25వ అధికరణ మత స్వేచ్ఛను నిర్ధారిస్తున్నాయి.
అయితే ముస్లింలు, క్రైస్తవులు తదితర మైనారిటీలపై విద్వేష ప్రచారం, దాడులు, వివక్ష గణనీయంగా పెరిగాయి.
గోరక్షణ పేరుతో దాడులు: గోమాంసం తింటున్నారనే అనుమానంతో ముస్లిం పశువుల వ్యాపారులు, పశువులను రవాణా చేసేవారిపై దాడులు, హత్యలు జరిగాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోకపోవడం, కొన్ని సందర్భాల్లో బాధితులపైనే కేసులు పెట్టడం చూశాం.
లవ్ జిహాద్, మత మార్పిడి చట్టాలు: మతాంతర వివాహాలను అనుమానాస్పదంగా చిత్రీకరించడం, వివాహం పేరుతో మత మార్పిడి జరుగుతోందని ప్రచారం చేయడం వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పుగా మారుతోంది.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో అమలులో ఉన్న మత మార్పిడి నిరోధక చట్టాలు ఇందుకు ఉదాహరణలు. ఈ చట్టాల పేరుతో క్రైస్తవులు, ఆదివాసీలు, దళితుల స్వచ్ఛంద మత మార్పిడికి కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
బుల్డోజర్ న్యాయం: నేరానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వ్యక్తుల ఇళ్లను, ఆస్తులను కూల్చివేయడం నిత్యకృత్యమైంది. ఒక వ్యక్తిపై ఆరోపణ వచ్చినంత మాత్రాన అతడిని నేరస్థుడిగా ప్రకటించడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. న్యాయస్థానంలో విచారణ జరగాలి. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఆస్తులను కూల్చివేయడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధం. సుప్రీంకోర్టు 2024 నవంబర్‌లో శిక్షాత్మక కూల్చివేతలపై మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ఆ చర్యలు కొనసాగుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం – NRC – అసోం సమస్య: పౌరసత్వ సవరణ చట్టం 2019లో పార్లమెంటు ఆమోదం పొందింది. 2024 మార్చిలో దాని అమలుకు సంబంధించిన నిబంధనలు ప్రకటించారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి 2014 డిసెంబర్ 31లోపు వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్శీ, క్రైస్తవ మతాలకు చెందిన వలసదారులకు నిర్దిష్ట నిబంధనల ప్రకారం పౌరసత్వం పొందేందుకు మార్గం కల్పించారు.
అయితే ఈ ప్రక్రియలో ముస్లింలను మినహాయించడం మతపరమైన వివక్షకు దారితీస్తుంది. అసోంలో 2019లో నిర్వహించిన జాతీయ పౌరసత్వ నమోదు ప్రక్రియలో 19 లక్షల మందికి పైగా ప్రజలు తుది జాబితాలో చోటు పొందలేకపోయారు. వారిలో బెంగాలీ భాష మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పేదలు, నిరక్షరాస్యులు, మహిళలు తమ పౌరసత్వానికి సంబంధించిన పత్రాలు సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
పౌరసత్వం అనేది ఒక వ్యక్తి ప్రాథమిక గుర్తింపు. తగిన న్యాయపరమైన ప్రక్రియ లేకుండా ఎవరి పౌరసత్వాన్నీ ప్రశ్నించకూడదు.
మీడియా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలు
ప్రజాస్వామ్యంలో మీడియాను నాలుగో స్తంభంగా పరిగణిస్తారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడం, అవినీతిని బయటపెట్టడం, ప్రజలకు వాస్తవాలను తెలియజేయడం మీడియా బాధ్యత. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై కేసులు, మీడియా సంస్థల కార్యాలయాలపై దాడులు, డిజిటల్ మీడియాపై నియంత్రణ, ఇంటర్నెట్ నిలిపివేత వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు, డిజిటల్ మీడియా సంస్థలపై దర్యాప్తులు, ఆన్లైన్లో ప్రభుత్వ విధానాలను విమర్శించే సమాచారంపై ఆంక్షలు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, సోషల్ మీడియా పోస్టుల తొలగింపునకు ఆదేశాలు వంటివి జరుగుతున్నాయి.
ఇవి కేవలం మీడియా సమస్యలు కావు. ప్రజలకు సమాచారాన్ని తెలుసుకునే హక్కుకు సంబంధించిన అంశాలు.
విద్యాసంస్థల్లో భావప్రకటనా స్వేచ్ఛకు ముప్పు: విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు కావు.
స్వేచ్ఛగా ఆలోచించే, ప్రశ్నించే, చర్చించే వేదికలు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించే విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులపై కేసులు, అరెస్టులు, బెదిరింపులు, సెమినార్ల రద్దు వంటి చర్యలు పెరిగాయి.
స్వీడన్‌కు చెందిన వీ-డెమ్ (V-Dem) సంస్థ పరిశోధన ప్రకారం 2025లో భారతదేశంలో విద్యా స్వేచ్ఛ ప్రపంచ దేశాల్లో దిగువ 15 శాతం పరిధిలో ఉందని నివేదిక పేర్కొంది.
విద్యాసంస్థల్లో శాస్త్రీయ దృక్పథం, చారిత్రక పరిశోధన, సామాజిక సమస్యలపై భిన్నాభిప్రాయాలకు అవకాశం ఉండాలి. ఒకే రాజకీయ లేదా మతపరమైన భావజాలాన్ని విద్యా వ్యవస్థపై రుద్దడం సమాజ మేధో వికాసానికి ప్రమాదకరం.
శాంతియుత ప్రజా ఉద్యమాలపై పోలీసు నిర్బంధం: భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రజా ఉద్యమాల ద్వారా బలపడింది. రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, సామాజిక కార్యకర్తల పోరాటాల ఫలితంగా అనేక హక్కులు సాధించుకున్నాం. అందుకే ప్రజలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు.
రైతుల ఉద్యమం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, విద్యార్థుల ఉద్యమాలు ఇందుకు ఉదాహరణలు.
ప్రత్యేకంగా 2026 జూలైలో వైద్య విద్య ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలు రద్దు కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఈ ఆందోళనల్లో 100 మందికి పైగా గాయపడినట్లు నివేదిక పేర్కొంది. మహిళలు పోలీసుల చేతిలో దాడులు, లైంగిక వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలి. ప్రజల నిరసనలను అణచివేయడం ప్రజాస్వామ్య పరిష్కారం కాదు.
హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) నివేదికలోని ప్రధాన సిఫార్సులు
హ్యూమన్ రైట్స్ వాచ్ భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు, అంతర్జాతీయ సంస్థలకు అనేక సూచనలు చేసింది.
పార్లమెంటుకు చేసిన సూచనలు:
1. ప్రతిపక్షాలకు తగిన ప్రాధాన్యం కల్పించాలి.
2. కీలకమైన బిల్లులను పార్లమెంటరీ కమిటీలకు పంపాలి.
3. ప్రజాసంఘాలు, నిపుణులు, కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలి.
4. దర్యాప్తు, నిఘా సంస్థలపై పార్లమెంటరీ పర్యవేక్షణ ఉండాలి.
5. ఆమోదించిన చట్టాల అమలును పరిశీలించాలి.
కేంద్ర ప్రభుత్వానికి చేసిన సూచనలు:
1. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం నిలిపివేయాలి.
2. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి.
3. మానవ హక్కుల కమిషన్లకు స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించాలి.
4. UAPA, PMLA, FCRA తదితర చట్టాలను అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా సవరించాలి.
5. శాంతియుతంగా నిరసన తెలిపినవారిపై రాజకీయ కక్షతో కేసులు పెట్టకూడదు.
6. మైనారిటీలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, పిల్లల హక్కులను పరిరక్షించాలి.
7. చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియ లేకుండా ఆస్తులను కూల్చివేయడం నిలిపివేయాలి.
8. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలి.
9. మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన అధికారులపై నిష్పాక్షిక విచారణ జరపాలి.
10. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థల సిఫార్సులను అమలు చేయాలి.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించడం దేశాన్ని విమర్శించడం కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుకోవడం దేశభక్తిలో భాగమే.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే
భారత స్వాతంత్ర్య పోరాటం మనకు అనేక విలువలను అందించింది. భగత్‌సింగ్ కలలుగన్న దోపిడీ లేని సమాజం, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రతిపాదించిన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, మహాత్మా గాంధీ ప్రబోధించిన మతసామరస్యం, నెహ్రూ ప్రతిపాదించిన ప్రజాస్వామ్య లౌకికవాదం ఇవన్నీ ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులుగా నిలిచాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాలి. మెజారిటీ ప్రజల మద్దతు పొందినంత మాత్రాన మైనారిటీల హక్కులను హరించే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు.
దేశంలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడగలగాలి. రైతులు తమ సమస్యలపై ఉద్యమించగలగాలి. విద్యార్థులు విద్యారంగంలోని లోపాలను ప్రశ్నించగలగాలి.
మహిళలు సమానత్వం కోసం పోరాడగలగాలి. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు భయం లేకుండా జీవించగలగాలి. జర్నలిస్టులు నిజాలను నిర్భయంగా రాయగలగాలి.
ప్రజాస్వామ్యం అంటే కేవలం అధికారంలో ఉన్నవారికి ప్రజలు విధేయులుగా ఉండటం కాదు. ప్రజల పట్ల ప్రభుత్వం జవాబుదారీగా ఉండటం.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటివి.
ప్రజాస్వామ్య సంస్థలు బలహీనపడినప్పుడు, పౌర హక్కులు క్షీణించినప్పుడు, అధికారాన్ని ప్రశ్నించే గొంతులు మూగబోయినప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడమే కాదు, ప్రపంచానికి ప్రజాస్వామ్య విలువలకు ఆదర్శంగా నిలవాలి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అంటే కేవలం ఎన్నికలను నిర్వహించడం కాదు. రాజ్యాంగాన్ని, పౌర స్వేచ్ఛలను, మానవ హక్కులను, సామాజిక న్యాయాన్ని, లౌకికవాదాన్ని, సమానత్వాన్ని కాపాడుకోవడం. అదే భారత స్వాతంత్ర్య పోరాట వారసత్వానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
