జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఖట్గావ్ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోవిందరావు, తల్లి చిమణాబాయి. వీరి కుటుంబం మాలి అనే పూల వ్యాపారం, తోటల పెంపకంతో జీవించే సామాజిక వర్గానికి చెందినది. అందుకే వారి కుటుంబానికి పూలే అనే పేరు వచ్చింది.
చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన జ్యోతిరావు కొంతకాలం విద్యకు దూరమయ్యారు. అయితే ఆయనలో చదువుకోవాలనే ఆసక్తి బలంగా ఉండేది. తర్వాత స్కాటిష్ మిషన్ పాఠశాలలో ఆంగ్ల విద్యను అభ్యసించారు.
ఆయన జీవించిన కాలంలో భారతీయ సమాజం కులవ్యవస్థ, అంటరానితనం, మతపరమైన మూఢనమ్మకాలు, స్త్రీలపై తీవ్రమైన వివక్షతో ఉండేది. అగ్రవర్ణాలకే విద్య, సామాజిక గౌరవం, అధికారాలు పరిమితమైన పరిస్థితి ఉండేది.
శూద్రులు, అతి శూద్రులు, దళితులను విద్యకు దూరంగా ఉంచేవారు. మహిళలకు చదువుకునే హక్కు లేదనే భావన కూడా బలంగా ఉండేది.
ఒకసారి తన బ్రాహ్మణ మిత్రుడి వివాహ ఊరేగింపులో పాల్గొన్నప్పుడు కులం పేరుతో అవమానాన్ని ఎదుర్కోవడం ఆయన జీవితంలో కీలకమైన మలుపుగా మారింది.
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పం మరింత బలపడింది. ఆయనకు థామస్ పెయిన్ రచించిన ‘రైట్స్ ఆఫ్ మ్యాన్’ వంటి గ్రంథాలు కూడా ప్రభావం చూపాయి. మానవులందరూ సమానులనే భావన ఆయన ఆలోచనలకు పునాది వేసింది.
మహిళా విద్య కోసం చారిత్రాత్మక పోరాటం
జ్యోతిరావు పూలే జీవితంలో అత్యంత గొప్ప కృషి మహిళలకు, అణగారిన వర్గాలకు విద్యను అందించడం. ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడం పాపమనే భావన సమాజంలో ఉండేది.
బాల్యవివాహాలు, వితంతువులపై అమానుష ఆచారాలు, మహిళలకు ఆస్తి, సామాజిక హక్కులు నిరాకరించడం సాధారణంగా ఉండేవి. ఈ పరిస్థితులను మార్చాలంటే ముందుగా మహిళలకు విద్య అందించాలని పూలే భావించారు.
1848లో పూణేలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. ఈ విద్యా ఉద్యమంలో ఆయన భార్య సావిత్రిబాయి పూలే కీలక పాత్ర పోషించారు.
సావిత్రిబాయి పూలే భారతదేశంలో తొలి ఆధునిక మహిళా ఉపాధ్యాయినుల్లో ఒకరు. ఆమె పాఠశాలకు వెళ్లే సమయంలో సంప్రదాయవాదులు ఎదురుగా వచ్చి బురద, రాళ్లు, పేడ విసిరేవారు. అయినప్పటికీ ఆమె వెనుకడుగు వేయలేదు. జ్యోతిరావు, సావిత్రిబాయి ఇద్దరూ కలిసి మహిళా విద్యను ఒక సామాజిక ఉద్యమంగా మార్చారు.
వారు బాలికలతో పాటు శూద్రులు, అతి శూద్రులు, దళిత పిల్లలకు కూడా విద్య అందించడానికి పాఠశాలలు ప్రారంభించారు.
1851లో పూణేలో బాలికల కోసం మరిన్ని పాఠశాలలను ప్రారంభించారు. రాత్రి పాఠశాలలను కూడా నిర్వహించారు. ఈ కృషి భారతదేశంలో ఆధునిక ప్రజాస్వామిక విద్యా ఉద్యమానికి పునాది వేసింది.
వితంతువుల సమస్యలు – మహిళల హక్కుల కోసం పోరాటం
ఆ కాలంలో వితంతువుల జీవితాలు అత్యంత దుర్భరంగా ఉండేవి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన మహిళలు జీవితాంతం ఎన్నో ఆంక్షలకు లోనయ్యేవారు. వారి తలలు గొరిగించడం, శుభకార్యాలకు దూరంగా ఉంచడం, పునర్వివాహాన్ని నిషేధించడం వంటి అమానుష ఆచారాలు ఉండేవి.
పూలే దంపతులు వితంతువులకు అండగా నిలవడంతో పాటు వారి పునర్వివాహాలను ప్రోత్సహించారు.
వితంతువులు సమాజంలో ఎదుర్కొనే మరో తీవ్రమైన సమస్య అవాంఛిత గర్భధారణ, శిశుహత్యలు.
ఈ సమస్యకు పరిష్కారంగా 1863లో పూలే దంపతులు గర్భిణీ వితంతువులకు ఆశ్రయం కల్పించే శిశుహత్య నిరోధక గృహాన్ని ప్రారంభించారు.
సమాజం నిరాకరించిన ఒక వితంతువు బిడ్డను దత్తత తీసుకుని పెంచారు. ఆ బిడ్డే యశ్వంతరావు. తర్వాత ఆయన వైద్యుడిగా సేవలందించారు. ఇది పూలే దంపతుల మానవతా దృక్పథానికి గొప్ప ఉదాహరణ.
కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమం
జ్యోతిరావు పూలే దృష్టిలో కులవ్యవస్థ కేవలం సామాజిక విభజన కాదు. అది ఒక వర్గం మరో వర్గాన్ని అణచివేయడానికి, వారి శ్రమను దోచుకోవడానికి ఉపయోగపడుతున్న వ్యవస్థ.
కులం పేరుతో మనుషుల మధ్య ఉన్నత, నీచ భావనలు సృష్టించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
1868లో తన ఇంటి ప్రాంగణంలోని బావి నీటిని అంటరానివారికి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. ఆ కాలంలో ఇది చాలా సాహసోపేతమైన చర్య.
దేవాలయ ప్రవేశం, నీటి వనరుల వినియోగం, విద్య, ఉపాధి వంటి ప్రాథమిక హక్కులు అందరికీ సమానంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
కులం ఆధారంగా మనిషి గొప్పతనం నిర్ణయించబడదని, మనిషి విలువ అతని వ్యక్తిత్వం, శ్రమ, మానవత్వం ఆధారంగా నిర్ణయించబడాలని ఆయన బోధించారు.
సత్యశోధక సమాజం స్థాపన – సామాజిక విప్లవానికి పునాది
1873 సెప్టెంబర్ 24న జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. సత్యశోధక సమాజం అంటే సత్యాన్ని అన్వేషించే సమాజం.
కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించడం, శూద్రులు, అతి శూద్రులు, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడం, మహిళలకు సమాన హక్కులు, విద్య అవకాశాలు కల్పించడం, మతం పేరుతో, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రశ్నించడం, పూజారుల మధ్యవర్తిత్వం లేకుండా వివాహాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, సమాజంలో హేతుబద్ధమైన ఆలోచనలను ప్రోత్సహించడం ఈ సంస్థ స్థాపన ప్రధాన ఉద్దేశాలు.
ఈ సంస్థలో కుల, మత భేదాలకు అతీతంగా సభ్యత్వం కల్పించారు. సత్యశోధక సమాజం అణగారిన ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించింది.
కేవలం సంస్కరణల గురించి మాట్లాడటమే కాకుండా, ఆచరణలో ప్రత్యామ్నాయ సామాజిక విధానాలను అమలు చేసింది.
రైతాంగ సమస్యలపై పూలే పోరాటం
జ్యోతిరావు పూలే కేవలం కుల వివక్ష, మహిళా సమస్యలపైనే కాకుండా రైతాంగ సమస్యలపైనా లోతైన అవగాహన కలిగిన నాయకుడు. ఆయన కాలంలో రైతులు భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, ప్రభుత్వ పన్నుల భారంతో తీవ్రంగా నష్టపోతూ ఉండేవారు.
వ్యవసాయ ఉత్పత్తి చేసే రైతులకు తగిన ప్రతిఫలం లభించేది కాదు. రైతుల దుస్థితికి కారణాలను పరిశీలించి, పాలకవర్గాల విధానాలను ప్రశ్నించారు.
1883లో ఆయన రచించిన ‘షేత్కార్యాచా ఆసూడ్’ (రైతు కొరడా) అనే గ్రంథంలో రైతుల దోపిడీని, వ్యవసాయ రంగంలోని అసమానతలను తీవ్రంగా విమర్శించారు.
రైతుల అభివృద్ధికి విద్య, నీటిపారుదల, వ్యవసాయాభివృద్ధి, ప్రభుత్వ బాధ్యతాయుత విధానాలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు. పూలే దృష్టిలో రైతు కేవలం ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యక్తి కాదు; సమాజ ఆర్థిక వ్యవస్థకు పునాది వేసే శ్రమజీవి.
జ్యోతిరావు పూలే రచనలు
పూలే ఒక గొప్ప సంఘ సంస్కర్త మాత్రమే కాదు. సమాజంలోని అసమానతలను విశ్లేషించిన రచయిత, ఆలోచనాపరుడు కూడా. ఆయన రచనల్లో ముఖ్యమైనవి 1855లో రచించిన సామాజిక మూఢనమ్మకాలపై విమర్శ ‘తృతీయ రత్న’, 1869లో మతపరమైన దోపిడీపై విమర్శ ‘బ్రాహ్మణాంచే కసబ్’, 1873లో కుల అణచివేత, బానిసత్వంపై ‘గులాంగిరి’, 1883లో రైతాంగ దోపిడీపై ‘షేత్కార్యాచా ఆసూడ్’, 1885లో సామాజిక సంస్కరణలపై ‘సత్సార్’, సామాజిక చైతన్యంపై ‘ఇషారా’, 1891లో సమానత్వం, మానవతా ధర్మంపై ‘సార్వజనిక్ సత్యధర్మ పుస్తక్’. ‘గులాంగిరి’ (బానిసత్వం) ఆయన అత్యంత ప్రాముఖ్యమైన రచనల్లో ఒకటి.
అమెరికాలో బానిసత్వ నిర్మూలన కోసం జరిగిన పోరాటాన్ని గుర్తుచేస్తూ ఈ గ్రంథాన్ని అమెరికాలోని బానిసత్వ వ్యతిరేక ఉద్యమకారులకు అంకితం చేశారు.
ఈ రచనలో భారతదేశంలోని కుల వ్యవస్థను బానిసత్వంతో పోల్చుతూ, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కల్పించారు.
మహాత్మా బిరుదు
1888 మే 11న ప్రజలు జ్యోతిరావు పూలేకు ‘మహాత్మా’ బిరుదును ప్రదానం చేశారు. జీవితాంతం సామాజిక న్యాయం కోసం కృషి చేసిన ఆయనకు ఇది ప్రజలు అందించిన గౌరవం. 1888లో పక్షవాతానికి గురైనప్పటికీ, తన రచనలు, ఆలోచనల ద్వారా సమాజానికి మార్గదర్శకత్వం వహించారు.
1890 నవంబర్ 28న పూణేలో ఆయన కన్నుమూశారు. ఆయన మరణం భారతదేశ సామాజిక సంస్కరణ ఉద్యమానికి తీరని లోటు.
భారత సామాజిక ఉద్యమాలపై పూలే ప్రభావం
జ్యోతిరావు పూలే ప్రారంభించిన సామాజిక ఉద్యమం ఆయనతోనే ముగిసిపోలేదు. తర్వాతి తరాల సామాజిక న్యాయ ఉద్యమాలకు అది మార్గదర్శకంగా నిలిచింది.
ప్రత్యేకంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆలోచనల్లో పూలే ప్రభావం కనిపిస్తుంది. అంబేడ్కర్ పూలేను తనకు మార్గదర్శకులైన మహనీయుల్లో ఒకరిగా గౌరవించారు.
పూలే, సావిత్రిబాయి ప్రారంభించిన విద్యా ఉద్యమం మహిళా హక్కుల పోరాటానికి, దళిత బహుజన ఉద్యమాలకు, సామాజిక సమానత్వ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.
రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే సరిపోదు; సమాజంలో కుల, మత, లింగ, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నంత కాలం నిజమైన స్వేచ్ఛ, సమానత్వం సాధ్యం కావు అని వీరి ఉద్యమం మనకు తెలియజేస్తుంది.
నేటి భారతదేశంలో పూలే ఆశయాల ప్రాసంగికత
జ్యోతిరావు పూలే మరణించి 136 సంవత్సరాలు గడిచినా ఆయన ఆశయాలు నేటికీ ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయి.
భారత రాజ్యాంగం సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సోదరభావం అనే విలువలను మనకు అందించింది. అంటరానితనాన్ని నిషేధించింది. ప్రతి ఒక్కరికీ విద్య, ఉపాధి, గౌరవంగా జీవించే హక్కులను కల్పించింది.
అయితే నేటికీ దేశంలో కుల వివక్ష, దళితులపై దాడులు, మహిళలపై హింస, విద్యలో అసమానతలు, రైతుల ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
మరోవైపు విద్యను అందరికీ సమానంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, విద్యా రంగం ప్రైవేట్ వ్యాపారమయం అయింది. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూలే ఆలోచనలను గుర్తుచేసుకోవడం అంటే కేవలం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడం కాదు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందేలా పోరాడాలి. కుల వివక్ష, మతతత్వం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడాలి.
మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలి. రైతులు, కార్మికులు, శ్రమజీవుల హక్కులను కాపాడాలి. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయ విలువలను పరిరక్షించాలి. అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమాన అవకాశాలు కల్పించాలి. ఇవే మహాత్మా జ్యోతిరావు పూలేకు మనం అందించగల నిజమైన నివాళి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
