ఇందులో ముందస్తు వ్యూహం ఏమీ లేదు. ఉదయం నుంచి అక్కడ రెండు గంటలు పాటు చేసిన ధర్నా తర్వాత దాన్ని పార్లమెంట్ భవన్ వైపుకు నడిపించడానికి ఉన్న రోడ్లు అప్పటికే మూసేశారు. దాంతో అక్కడ నుంచి బస్సులు కదిలి వారి నిష్క్రమణ మొదలైంది. వారున్నది ఢిల్లీ ‘ఆకాశవాణి’ భవన్ వద్ద, ఆ ఆవరణ గోడ పొడవునా ఆ ధర్నా కవర్ చేస్తున్న జర్నలిస్టులు.
అది నిషేధిత ప్రాంగణం. అటు వైపు చూస్తే, రేడియో సిబ్బంది రాకపోకలకు వాడే చిన్న గేటు తెరచి ఉంది. అంతే, ఆ ఆవరణలోకి ప్రవేశించాడు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.
కొన్ని సంఘటనలు కొన్నిసార్లు ఇలా అకస్మాత్తుగా జరుగుతాయి. అయితే వాటి పర్యవసానాలు తర్వాత ఎప్పుడో చూస్తాము.
ఆ తర్వాత జరిగింది ఏమిటి. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, మరి కొందరు కాంగ్రెస్ ఎంపీలు లోపలికి చేరి ఆ ఢిల్లీ 35 డిగ్రీల వేడిలో ఆకాశవాణి ఆవరణలోని మర్రి చెట్టు క్రింద మధ్యాహ్నం నుంచి రాత్రి ఎనిమిది వరకు వారు తమ దీక్ష కొనసాగించారు.
దేశ రాజకీయాల్లోకి నెహ్రూ కుటుంబం నుంచి ‘గాంధీ’ పేరుతో 1964 జులై 2న ఇందిరాగాంధీ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశించారు.
అరవై ఏళ్ల తర్వాత ఇందిర మనవడు మనవరాలు ఆ ఆవరణలోకి తిరిగి ఇలా ప్రవేశించడం, అక్కడ చెమటలు తుడుచుకుంటూ దాహం తీర్చుకుంటూ రోజంతా చేసిన నిరసన వెనుక, ఒక నేపథ్య సంగీతంలా ‘సమాచారం’ ఉండడం అంటే, ఆశ్చర్యం కలుగుతుంది.
సమాచార యుద్ధం: రహస్య సమావేశం వెనుక
ఇది, ఏదో ఒక ‘రొమాంటిసిజం’లో నుంచి అంటున్నది కాదు. ఈ మాట అర్థం కావడానికి ఏడాది క్రితం ఢిల్లీలోనే జరిగింది ఏమిటో మనకు తెలియాలి. దీని గురించి మన ప్రైవేట్-పబ్లిక్ ‘మీడియా’లో ప్రముఖంగా కనిపించలేదు. వచ్చిన ఒకే ఒక్క వార్త గురించి కూడా పైకి మాట్లాడిన వారు లేరు.
తలుపులు మూసి జరిపిన ఆ సమావేశానికి హాజరైన అధికారి ఒకరు దీని గురించి ఇది- “క్రూషియల్ అండ్ అన్ యూజువల్లీ క్యాండిడ్” అన్నట్టుగా ఢిల్లీ నుంచి కీలక అంశాలు రిపోర్ట్ చేసే ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్’ సీనియర్ జర్నలిస్ట్ సుమీత్ కుమార్ సింగ్ 2025 అక్టోబర్ 29న ‘బై లైన్’ స్టోరీ రాశారు.
ప్రధాని కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇద్దరు, కేబినెట్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ మినిస్ట్రీ సెక్రటరీ ఇలా నలుగురి అధ్యక్షతన రెండు ‘సెషన్స్’గా ఆ మీటింగ్ జరిగింది. అన్ని మంత్రిత్వ శాఖల అధిపతులు దానికి హాజరయ్యారు.
చివరిలో ఆ సాయంత్రం- “దీనిపై సమాచార ప్రసార మంత్రిత్వశాఖ తగిన చర్యకు సిద్ధం కావాలని” వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు, సుమీత్ కుమార్ సింగ్ తన వార్తా కథనంలో రాశారు.
ప్రభుత్వ సమాచార వ్యూహంలో మార్పులు
అసలు ఆ సమావేశం ఎందుకు జరిగింది, ఎందుకని అది అంత కీలకమో అర్థమైతే, విస్తుపోతాము. ఇండియాపై ‘సమాచార దాడి’కి సిద్ధమవుతున్న విదేశీ శక్తుల్ని ఎదుర్కోవడం, అంటే ఇప్పుడు అదొక సరికొత్త యుద్ధభూమిలా మారిందని, దాన్ని తిప్పి కొట్టడానికి సమన్వయ వ్యూహం అవసరమైందని ఏడాది క్రితం ‘బ్యూరోక్రసీ’ గ్రహించింది.
కేంద్రంలో ‘పొలిటికల్ గవర్నెన్స్’ అంటే నరేంద్ర మోడీ కనుక, ఆయన చెబుతున్న సూత్రమైన- ‘రిఫార్మ్’-‘పెర్ ఫార్మ్’- ‘ట్రాన్స్ ఫార్మ్’-‘ఇన్ ఫార్మ్’ ఈ నాలుగు ‘వికసిత్ భారత్’ సాధనకు మార్గదర్శకాలు అని ఆ రోజు కేబినెట్ సెక్రటరీ అన్నారట.
ఈ అంత్య ప్రాసలను దాటి, అసలు లోపలి కథ ఏమిటి అని ఆరా తీస్తే, కొన్ని విదేశీ శక్తులు తప్పుడు సమాచారం ‘మిస్ ఇన్ఫర్మేషన్’ వ్యాప్తిని ఒక పద్ధతి ప్రకారం చేస్తూ, ప్రపంచ దేశాల్లో మన పరపతిని దెబ్బతీస్తున్నది అనేది ఫిర్యాదు అట, అది ఈ ‘మీటింగ్’ కారణం.
సరే దీన్ని ఎదుర్కోవడం ఎలా… విషయాన్ని వక్రీకరించేట్టుగా ఒక ‘నేరేటివ్’ ఉందని అనిపించినప్పుడు, సంబంధిత మంత్రిత్వశాఖ శరవేగంగా స్పందించాలి. అందుకోసం అన్ని శాఖల మధ్య పరస్పర సహకారం ఉండాలి అనుకున్నారు, ఇది మొదటిది.
రెండవది- కొత్త ‘డిజిటల్ టూల్స్’ను ప్రతి శాఖ వాడుతూ, ఆయా శాఖల సమాచారాన్ని ప్రజలకు నేరుగా చేరేట్టుగా చూడాలి అన్నారు. వారు అదనంగా అనుకొన్నది ఏమంటే, ఆ చెప్పే సమాచారం ఏదో అది- ‘సింప్లిసిటీ’తోనూ ‘ఆథెంటిసిటీ’ తోనూ ఉండాలి అనుకున్నారు.
విశ్వసనీయత దిశగా అడుగులు
దీనర్థం మన ప్రచారంలో అది లోపించింది అనేది తెలుస్తూనే ఉంది. అతి అక్కర లేదు, ‘పాలసీలు’ చెప్పడానికి మనం ఉపయోగించే భాష సాధారణ పౌరులకు అర్థమయ్యేట్టుగా ఉండాలి, అని వారు అనుకున్నారు.
ఈ దశలో ఒకరు కల్పించుకుని- “ఇకముందు ఇది ఏ మాత్రం దృశ్యమానంగా(‘విజిబిలిటీ’) ఉండకూడదు, అది నమ్మకం(‘ట్రస్ట్’) కలిగించేదిగా ఉంటే చాలు” అన్నారట.
దేన్ని అయినా వాళ్ళు ‘పవర్ కారిడార్స్’ నుంచి చూస్తారు కనుక మనకు ఏది ఎక్కువ అయిందో, ఏది తక్కువ అయిందో… ఏడాది క్రితమే వాళ్ళు ఒక స్పష్టతకు వచ్చేశారని ఇప్పుడు అనుకోవలసి వస్తున్నది.
చివరికి వాళ్ళు ప్రభుత్వ సమాచారం ‘చివరి మైలు’కు చేరడానికి ఏమి చేయాలి అనే ప్రశ్నవద్ద ఆగారట.
పలు తర్జనభర్జనల తర్వాత అనుకున్నది ఏమంటే, ‘ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రచారానికి ప్రైవేట్ ఏజెన్సీలను అనుమతించడం తక్షణమే ఆపాలి’, అని తేల్చారు. ఇది కీలకమైనది.
ఇందుకు సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వెంటనే చొరవ తీసుకుని, అవసరమైన ‘శైలి-శిల్పం’(‘క్రాఫ్టింగ్’) సిద్ధం చేసి, దాన్ని అన్ని ‘ప్లాట్ ఫారమ్స్’ ద్వారా ప్రజలలోకి తీసుకుని వెళ్లాలి అని తేల్చారు.
ఆ మీటింగ్ ‘మినిట్స్’ ఒక సీనియర్ అధికారి ‘రీ క్యాప్’ చేస్తూ- “ఇకముందు ‘వన్-వే’ ‘కమ్యూనికేషన్’ అంటే కుదరదు, ఆ రోజులు వెళ్లిపోయాయి” అన్నారు.
ప్రజలకు ప్రభుత్వం చెప్పే సమాచారం అంటే అది- సాధికారికం(‘క్రెడిబుల్’) నిరంతరత(‘కన్సిస్టెంట్’) ప్రజలకు చేరువగా(‘కనక్టెడ్’)గా ఉండాలి. జరుగుతున్న సమాచార యుద్ధంలో మనం గెలవడానికి అదొక్కటే మార్గం అని ముగించారు.
ప్రతీకలు ఇస్తున్న ప్రమాద సంకేతాలు
ఒకరి తర్వాత ఒకరుగా రాజ్యాంగ వ్యవస్థల కాపలాదారులుగా ఉండాల్సిన శ్రేణుల నర్మగర్భ స్పందన, వాటి అంచులు దాటి ఏదో ఒక వైపు నుంచి ఇలా బయటకు కనిపించడం ఉన్న పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నది.
రాహుల్, ప్రియాంక ఢిల్లీ ‘ఆకాశవాణి’ ప్రాంగణంలో ఊడలు దిగిన మర్రి చెట్టు క్రింద తెల్లటి దుప్పటి వేసుకుని తమ సహచరులతో వారు కలిసి కూర్చుంటే, వారితో జీన్స్ తెల్ల చొక్కాల యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. ఫొటోల్లో వెనుక జాతీయ జెండా, ఖాకీ యూనిఫారం పోలీస్, ఇవన్నీ వేటికి ప్రతీకలు?
ఏడాది క్రితం ఢిల్లీలో ‘సుష్మా స్వరాజ్ భవన్’లో జరిగిన తలుపులు మూసిన సమావేశంలో- “ఇకముందు ఇది ఏ మాత్రం దృశ్యమానంగా(‘విజిబిలిటీ’) ఉండకూడదు, అది నమ్మకం(‘ట్రస్ట్’) కలిగించేదిగా ఉంటే చాలు” అన్నది వాస్తవంలో జరుగుతున్నట్టుగా ఉంది.
ప్రతీకల ద్వారా చేరే ప్రమాద సంకేతాలు, నిజమని వాస్తవంలో తెలియడానికి కొంచెం సమయం పడుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
