ఎర్నెస్టో ‘చె‘గువేరా 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధి చెందిన విప్లవ కారుల్లో ఒకరు. ఆయన జీవితం కేవలం క్యూబా విప్లవానికి మాత్రమే పరిమితం కాలేదు.
అర్జెంటీనాలో జన్మించి, ఒక వైద్య విద్యార్థిగా లాటిన్ అమెరికా అంతటా మోటార్ సైకిల్ యాత్ర చేసి పేదరికాన్ని ప్రత్యక్షంగా చూసిన యువకుడు.
మార్క్సిజం వైపు మళ్లిన రాజకీయ కార్యకర్త. ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబా విప్లవంలో పోరాడి విజయం సాధించిన గెరిల్లా కమాండర్. విప్లవ అనంతర క్యూబాలో ఆర్థిక విధాన రూపకర్త, అంతర్జాతీయ విప్లవానికి మద్దతు దారుడు.
చివరకు బొలీవియాలో పోలీసులకు పట్టుబడి 39 ఏళ్ల వయసులో అత్యంత కిరాతకంగా హత్యగావించబడిన యోధుడు. అక్టోబర్ 9 ఆయన వర్ధంతి.
1967 అక్టోబర్ 8న బొలీవియా సైన్యానికి చిక్కిన గువేరాను, మరుసటి రోజు అక్టోబర్ 9న లా హిగ్వెరాలో కాల్చిచంపారు. ఆయన మరణం భౌతికంగా ఆయన రాజకీయ ప్రస్థానానికి ముగింపు అయినప్పటికీ, ఆయన పేరు, ఆయన నమ్మిన, సాధించి చూపిన మార్గం అంతర్జాతీయ విప్లవ చరిత్రలో ప్రసిద్ధి చెందింది.
బాల్యం..
చె గువేరా 1928 జూన్ 14న అర్జెంటీనాలోని రొసారియోలో జన్మించారు. ఆయనది మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఎర్నెస్టో గువేరా లించ్ ఇంజనీర్. తల్లి సెలియా దే లా సెర్నా సామాజిక, రాజకీయ అంశాలపై ఆసక్తి కలిగిన వ్యక్తి.
చిన్నతనం నుంచే గువేరాకు తీవ్రమైన ఆస్తమా ఉండేది. ఈ వ్యాధి జీవితాంతం ఆయనను వెంటాడింది. అయినప్పటికీ దాన్ని అధిగమించడానికి ఈత, సైక్లింగ్, రగ్బీ వంటి కఠినమైన శారీరక వ్యాయామాలు చేశారు.
చిన్నప్పటి నుంచే ఆయనలో పట్టుదల, సాహస స్వభావం అలవడ్డాయి. తల్లి ద్వారా పుస్తకాల పరిచయం పెరిగింది. మార్క్స్, లెనిన్ తదితర రచనలను అధ్యయనం చేశారు.
వైద్య విద్య-పేదల జీవితాలను చూసిన యువకుడు
గువేరా బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించి 1953లో వైద్య పట్టా పొందారు. మొదట ఆయన వృత్తి పరంగా వైద్యుడిగా జీవించాలని అనుకున్నారు. కానీ లాటిన్ అమెరికా పర్యటన ఆయన జీవిత దిశను పూర్తిగా మార్చివేసింది.
1952లో స్నేహితుడు అల్బెర్టో గ్రనడోతో కలిసి మోటార్‌సైకిల్‌పై దక్షిణ అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. ఆ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలు తరువాత ‘ది మోటార్ సైకిల్ డైరీస్’గా ప్రసిద్ధి చెందాయి.
ఈ ప్రయాణంలో గువేరా గని కార్మికులు, రైతులు, ఆదివాసీలు, కుష్ఠు రోగులు, పేద కుటుంబాలు ఎదుర్కొంటున్న దుస్థితిని దగ్గరగా పరిశీలించారు.
వైద్యుడిగా రోగులకు చికిత్స చేయడం కన్నా, పేదరికానికి, సామాజిక అసమానతలకు కారణమయ్యే వ్యవస్థలను మార్చడం అవసరమనే ఆలోచన ఆయనలో బలపడింది. ఇదే ఆయన జీవితంలో కీలకమైన మలుపు.
గ్వాటెమాలా-రాజకీయ మార్పుకు మలుపు
1953లో వైద్య పట్టా పొందిన తరువాత గువేరా లాటిన్ అమెరికాలోని అనేక దేశాల్లో పర్యటించి చివరకు గ్వాటెమాలాకు చేరుకున్నారు.
అక్కడ అధ్యక్షుడు జాకోబో ఆర్బెన్స్ ప్రభుత్వం భూ సంస్కరణలను చేపట్టింది. పెద్ద భూస్వామ్య వ్యవస్థను మార్చే ప్రయత్నాలు జరిగాయి.
అమెరికాకు చెందిన ‘యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ’ ప్రయోజనాలకు ఈ విధానాలు విరుద్ధంగా ఉన్నాయి.
1954లో ఆర్బెన్స్ ప్రభుత్వం కూల్చివేయబడింది. గువేరా ఈ పరిణామాన్ని ప్రత్యక్షంగా చూశారు.
అమెరికా మద్దతుతో జరిగిన ఈ రాజకీయ కుట్ర ఆయనలో అమెరికన్ సామ్రాజ్యవాదంపై తీవ్ర వ్యతిరేకతను పెంచింది. అనంతరం ఆయన మెక్సికోకు వెళ్లారు. ఇక్కడే ఆయన జీవితం క్యూబా విప్లవంతో ముడిపడింది.
“చె” అనే పేరు ఎలా వచ్చింది?
‘చె’ అనేది ఆయన అసలు పేరు కాదు. అర్జెంటీనా స్పానిష్‌లో ‘చె’ అనే పదాన్ని స్నేహపూర్వకంగా “అయ్యా”, “మిత్రమా” లాంటి పదాలు వాడతారు.
గువేరా తరచూ ఈ పదాన్ని ఉపయోగించేవారు. ఆయన సహచరులు కూడా ఆయనను ‘చె’ అని పిలవడం ప్రారంభించారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ‘చె గువేరా’గా ప్రసిద్ధి చెందింది.
ఫిడెల్ కాస్ట్రోతో పరిచయం
1955లో మెక్సికోలో గువేరాకు ఫిడెల్ కాస్ట్రో, రౌల్ కాస్ట్రోలతో పరిచయం ఏర్పడింది. అప్పటికి కాస్ట్రో క్యూబా నియంత ఫుల్జెన్సియో బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చడానికి సాయుధ పోరాటానికి సిద్ధమవుతున్నారు.
గువేరా తొలుత వైద్యుడిగా ఆ బృందంలో చేరాలని అనుకున్నప్పటికీ, త్వరలోనే ఆయుధ పోరాటంలో క్రియాశీల సభ్యుడయ్యారు.
1956 డిసెంబర్ 2న కాస్ట్రో నాయకత్వంలోని 82 మంది విప్లవకారులు “గ్రాన్మా” పడవలో క్యూబా తీరానికి చేరుకున్నారు.
ప్రారంభ దశలో ప్రభుత్వ సైన్యంతో జరిగిన పోరాటాల్లో విప్లవకారులకు తీవ్ర నష్టాలు కలిగాయి. అయినప్పటికీ మిగిలిన వారు సియెర్రా మాస్ట్రా పర్వతాల్లో గెరిల్లా పోరాటాన్ని కొనసాగించారు.
గువేరా అక్కడ వైద్యుడిగానే కాకుండా క్రమంగా సైనిక నాయకుడిగా ఎదిగారు. 1957లో ఆయనకు కమాండర్ హోదా లభించింది.
క్యూబా విప్లవం
బటిస్టా ప్రభుత్వంపై గ్రామీణ గెరిల్లా పోరాటం, పట్టణాల్లో ఉద్యమాలు, సమ్మెలు, రాజకీయ పోరాటాలు పెరిగాయి. నియంత బటిస్టా పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
అదే సందర్భంలో కాస్ట్రో నేతృత్వంలో చే, రౌల్ కాస్ట్రోలు జరిపిన గెరిల్లా పోరాటంతో 1959 జనవరిలో బటిస్టా దేశం విడిచి పారిపోయారు.
విప్లవకారులు హవానాలోకి ప్రవేశించారు. గువేరా ఆ విప్లవ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడినుంచి గువేరా క్యూబా దేశ నవ నిర్మాణంలో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ నాయకుడు అయ్యారు.
విప్లవ అనంతర క్యూబాలో చె గువేరా
కాస్ట్రో ప్రభుత్వం ఏర్పడిన తరువాత గువేరా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రేరియన్ రిఫార్మ్స్’లో పారిశ్రామిక విభాగానికి నాయకత్వం వహించారు.
1959లో క్యూబా నేషనల్ బ్యాంక్ అధ్యక్షుడైనారు. 1961లో పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విదేశీ పర్యటనలు చేసి క్యూబాకు అంతర్జాతీయ సంబంధాలను పెంచడానికి కృషి చేశారు.
ఆర్థిక వ్యవస్థపై ఆయనకు ఒక ప్రత్యేక దృక్పథం ఉంది. క్యూబా కేవలం చక్కెర ఎగుమతులపై మాత్రమే ఆధారపడకుండా పారిశ్రామిక దేశంగా మారాలని ఆయన భావించారు.
ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ నియంత్రణ, కేంద్రీకృత ప్రణాళిక, సామాజిక అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తి వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.
“కొత్త సామ్యవాద మనిషి”
చె గువేరా ఆర్థిక వ్యవస్థను కేవలం జీతం, లాభం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని భావించారు. సమాజ ప్రయోజనం కోసం పనిచేయడం, వ్యక్తిగత లాభం కంటే సామూహిక ప్రయోజనం, విప్లవ విలువలకు కట్టుబడి ఉండటం ఆయన లక్ష్యంగా ఎంచుకున్నాడు.
ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే ప్రజలను ఉత్పత్తికి ప్రేరేపించవని ఆయన భావించారు. నైతిక ప్రోత్సాహకాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే ఈ ఆర్థిక విధానాలకు పరిమితులు కూడా ఎదురయ్యాయి. ఉత్పత్తి, నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్లు, వ్యవసాయ ఉత్పత్తి వంటి రంగాల్లో క్యూబా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంది.
1960ల ప్రారంభంలో క్యూబా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి తగ్గుదల, వస్తువుల కొరతలాంటి సమస్యలు ఎదురయ్యాయి.
అమెరికా–క్యూబా ఘర్షణ
క్యూబా విప్లవం తరువాత అమెరికా క్యూబా సంబంధాలు బాగా దిగజారాయి. 1961లో ‘బే ఆఫ్ పిగ్స్’ దాడి ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం విఫలమైంది. ఆ తరువాత అమెరికా క్యూబాపై ఆంక్షలు పెంచింది. క్యూబా సోవియట్ యూనియన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకుంది.
క్యూబాను లొంగదీసుకోవడానికి, ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడానికి, లాటిన్ అమెరికాలో తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి అమెరికా అనేక కుట్రలకు పాల్పడింది. కాస్ట్రో హత్యకు పలు సార్లు ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో క్యూబా స్వతంత్ర దేశంగా నిలబడటానికి సోవియట్ సహాయపడింది. క్యూబా రక్షణలో భాగంగా సోవియట్ యూనియన్ క్యూబాలో అణు క్షిపణులను ఏర్పాటు చేయడం, అమెరికా వాటిని తొలగించాలని డిమాండ్ చేయడం వల్ల అమెరికా సోవియట్ ఘర్షణ తీవ్రస్థాయికి చేరింది.
ఈ కాలంలో చె గువేరా క్యూబా తరఫున అంతర్జాతీయ వేదికల్లో అమెరికా విధానాలను తీవ్రంగా విమర్శించారు.
ఐక్యరాజ్యసమితిలో చె గువేరా
1964 డిసెంబర్ 11న చె గువేరా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో క్యూబా తరఫున ప్రసంగించారు. ఆ ప్రసంగాల్లో ఆయన ప్రధానంగా వలసవాద వ్యతిరేకత, సామ్రాజ్యవాద వ్యతిరేకత, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అసమానతలు, జాతీయ విముక్తి ఉద్యమాలు, క్యూబాపై అమెరికా ఒత్తిడి వంటి అంశాలను ప్రస్తావించారు. ఆయన రాజకీయ ఆలోచన క్యూబా సరిహద్దులను దాటి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా ప్రజల విముక్తి ఉద్యమాలతో పెనవేసుకుంది.
అంతర్జాతీయ కార్మికోద్యమ వారసత్వం అయిన సంఘీభావ ఆవశ్యకత, దానికి అంతర్జాతీయంగా ప్రాణం పోయటానికి ఆయన కృషి చేశారు.
అలీన దేశాల మహాసభలో మాట్లాడుతూ అపుడే విముక్తి పొందిన దేశాలు ఆర్థిక రంగాల్లో పెట్టుబడిదారి విధానాన్ని మక్కీకి మక్కీ అనుసరించాల్సిన అవసరం లేదని, సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు పరిస్థితులు సిద్ధమయ్యే వరకు అనేక ప్రత్యామ్నాయ వ్యవస్థాగత ప్రయోగాలతో దేశ హితం లక్ష్యంగా పెట్టుకోవాలని చే ప్రతిపాదించారు.
తద్వారా నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమ ప్రస్థానంలో కీలకమైన ఆర్థిక కోణాన్ని ఆవిష్కరించారు.
ఎందుకు క్యూబాను విడిచారు?
ఆయన లక్ష్యం క్యూబాలో విజయంతో ఆగిపోవడం కాదు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలలో విప్లవ ఉద్యమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
“ఒక దేశంలో విజయవంతమైన ప్రజా విప్లవం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలి” అనేది ఆయన లక్ష్యం. అందుకే 1965లో చె గువేరా క్యూబా ప్రభుత్వంలోని తన అధికారిక బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
కాంగో ప్రయోగం
1965లో గువేరా ఆఫ్రికాలోని కాంగో వెళ్లారు. అక్కడ తిరుగుబాటు శక్తులకు సహాయం చేసి విప్లవాన్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ ఈ ప్రయత్నం విజయవంతం కాలేదు.
1960 జూన్ 30న కాంగో బెల్జియం వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది. ప్యాట్రీస్ లుముంబా ప్రధానిగా, జోసెఫ్ కసావుబు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. స్వాతంత్ర్యం అనంతరం రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
1961లో కాంగో ప్రధాని ప్యాట్రీస్ లుముంబా హత్యకు గురయ్యారు. ఆ తరువాతి రాజకీయ పరిణామాలు, విదేశీ జోక్యం, వివిధ తిరుగుబాటు వర్గాల మధ్య పోరాటాలు కొనసాగుతున్నాయి.
గువేరా అక్కడి స్థానిక తిరుగుబాటు దళాలకు శిక్షణ, సైనిక సహాయం అందించాలనుకున్నారు. అక్కడ తిరుగుబాటు శక్తులకు సహాయం చేసి విప్లవాన్ని నిర్మించాలని అనుకున్నారు.
అయితే స్థానిక నాయకత్వ సమస్యలు, దళాల సమన్వయ లోపం, ప్రజల మద్దతు కొరవడటం వంటి కారణాలతో ఆయన ప్రయత్నం విఫలమైంది.
చివరకు ఆయన కాంగో విడిచిపెట్టి క్యూబాకు తిరిగి వచ్చారు. దీంతో క్యూబా అనుభవాన్ని మరొక దేశంలో యథాతథంగా అమలు చేయడం కాకుండా వేరు వేరు రూపాలలో ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.
బొలీవియా పోరాటం
1966లో చె గువేరా బొలీవియా వెళ్లారు. అక్కడి నుంచి దక్షిణ అమెరికాలో విప్లవ ఉద్యమాన్ని నిర్మించాలని అనుకున్నారు. ఆయనకు ఉన్న సిద్ధాంతాన్ని సాధారణంగా ‘ఫోకో థియరీ’ లేదా ‘ఫోకిస్మో’ అని పిలుస్తారు.
దాని ప్రకారం పెద్ద రాజకీయ విప్లవానికి ముందుగా పరిస్థితులలో భారీ మార్పు కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, క్రమశిక్షణ గల ఒక చిన్న గెరిల్లా కేంద్రం గ్రామీణ ప్రాంతంలో పోరాటాన్ని ప్రారంభించి, దాని ద్వారా విప్లవాత్మక పరిస్థితులను సృష్టించగలదని గువేరా భావించారు. కానీ బొలీవియాలో ఈ సిద్ధాంతం తీవ్ర పరీక్షకు గురైంది.
స్థానిక రైతాంగం నుంచి తగిన మద్దతు లభించలేదు. బొలీవియా కమ్యూనిస్టు పార్టీతో కూడా సంబంధాలు సజావుగా సాగలేదు.
భౌగోళిక పరిస్థితులు, సరఫరా సమస్యలు, దళాల విభజన, ఆరోగ్య సమస్యలు వంటి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
పట్టుబడటం
1967 అక్టోబర్ 8న బొలీవియా సైన్యంతో జరిగిన పోరాటంలో చె గువేరా తీవ్రంగా గాయపడి పట్టుబడ్డారు. ఆయనను లా హిగ్వెరా అనే గ్రామానికి తీసుకెళ్లారు. 1967 అక్టోబర్ 9న ఆయనను అక్కడే కాల్చిచంపారు. అప్పటికి ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు. ఆయన కాల్చివేత అంతర్జాతీయ రాజకీయ సంఘటనగా మారింది. తరువాత ఆయన అవశేషాలు గుర్తించి 1997లో క్యూబాకు తరలించారు.
శాంటా క్లారాలోని ఆయన సమాధి స్మారక సముదాయం నేడు ఆయన జ్ఞాపకానికి ప్రధాన చిహ్నంగా ఉంది.
ఆయన ముఖచిత్రంతో కూడిన ప్రసిద్ధ చిత్రం, ఎర్ర జెండాలు, పోస్టర్లు, టీ-షర్టులు, పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తాయి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడిగా ఆయన గుర్తింపు పొందారు.
వ్యక్తిగత సౌకర్యాన్ని వదులుకొని క్యూబా విప్లవంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ దృక్పథం, లాటిన్ అమెరికా, ఆఫ్రికా విముక్తి ఉద్యమాలకు మద్దతునిచ్చారు. శాశ్వతంగా అధికారాన్ని అనుభవించడం కాకుండా తిరిగి గెరిల్లా పోరాటానికి వెళ్లడం, ముఖ్యంగా యువతపై ఆయన ప్రభావం వంటి అనేక అంశాలు ఆయనకు ప్రపంచవ్యాపిత గుర్తింపుకు కారణాలు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
పేదరికం ఎందుకు కొనసాగుతుంది? ఆర్థిక అసమానతలకు కారణాలేమిటి? వలస పాలన తర్వాత కూడా ఆర్థిక ఆధిపత్యం ఎలా కొనసాగుతుంది? జాతీయ సార్వభౌమత్వం అంటే ఏమిటి? అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు ఎలా చేరాలి? అని ఆయన లేవనెత్తిన ప్రశ్నల వల్ల చె గువేరా రాజకీయ ఆలోచనలు అంతర్జాతీయంగా కూడా ఆకర్షణకు కారణమైనాయి.
కార్మికులు, యువతపై ఆయన ప్రభావం
చె గువేరా రాజకీయ ఆలోచనలో కార్మిక వర్గం, రైతాంగం, యువత కీలక పాత్ర పోషించాయి. ప్రత్యేకించి యువత సమాజ మార్పులో చురుకైన పాత్ర పోషించాలనే ఆయన దృక్పథం ప్రపంచంలోని అనేక విద్యార్థి, యువజన ఉద్యమాలను ప్రభావితం చేసింది.
ఎర్నెస్టో ‘చె’గువేరా జీవించింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆ స్వల్ప జీవితంలో ఆయన వైద్య విద్యార్థి నుంచి అంతర్జాతీయ విప్లవ నాయకుడిగా మారారు.
అర్జెంటీనా నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం గ్వాటెమాలా, మెక్సికో, క్యూబా, కాంగో, బొలీవియా వరకు సాగింది.
క్యూబా విప్లవంలో ఆయన సైనిక పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. విప్లవ అనంతర ప్రభుత్వంలో ఆయన రూపొందించిన ఆర్థిక విధానాలు ఆ దేశ అభివృద్ధికి బాటలు వేశాయి.
అంతర్జాతీయ వేదికలపై వలసవాదం, సామ్రాజ్యవాదం, ప్రపంచ ఆర్థిక అసమానతలను ఎండగట్టిన తీరు నేటికీ ఆదర్శం.
చె గువేరాను అర్థం చేసుకోవడం అంటే ఆయన ఫోటోను చూసి ఒక నినాదాన్ని గుర్తుచేసుకోవడం కాదు.
పేదరికం, అసమానత, సామ్రాజ్యవాదం, జాతీయ స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం, విప్లవం, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక అభివృద్ధి వంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలను అర్థం చేసుకోవడం, వాటి సాధనకు సంసిద్ధం కావడం ఆయన స్ఫూర్తికి నిజమైన కొనసాగింపు అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
