ఎస్సీఆర్బీ(రాష్ట్ర నేర నమోదు సంస్థ) డేటా ప్రకారం, మే నెలలో 349, జూన్‌లో 389, జులైలో 786, ఆగస్టులో 459, సెప్టెంబర్‌లో 471 అత్యాచార కేసులు నమోదు కాగా, హత్య కేసులు మే నెలలో 125, జూన్‌లో 134, జులైలో 133, ఆగస్టులో 111, సెప్టెంబర్‌లో 97 గా నమోదయ్యాయి.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వ హయాంలో మొదటి ఐదు నెలల్లోనే నేరాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ కాలంలో 2,454 అత్యాచార కేసులు, 600 హత్య కేసులు నమోదయ్యాయి.
మమతా బెనర్జీ నేతృత్వంలోని అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా మే నుంచి సెప్టెంబర్ 24 వరకు ఎస్సీఆర్బీ సేకరించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ వ్యవధిలో రాష్ట్రంలో 13,114 హత్యాయత్నం కేసులు, దాడుల కారణంగా తీవ్ర గాయాలైన కేసులు 32,341 నమోదయ్యాయి.
సోషల్ మీడియాలో టీఎంసీ పోరాటం
ఈ వివరాలను బుధవారం పంచుకుంటూ, తృణమూల్ కాంగ్రెస్ తమ ‘ఎక్స్’ ఖాతాలో ఇలా పోస్ట్ చేసింది- “బీజేపీ పాలనలో కేవలం ఐదు నెలల్లోనే బెంగాల్లో 2,400కు పైగా అత్యాచార కేసులు నమోదయ్యాయి.
బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌ను మహిళలు, సామాన్య పౌరులు భయంభయంగా బతకాల్సిన పరిస్థితికి నెట్టేస్తోంది.
రాష్ట్ర నేర నమోదు సంస్థ ప్రకారం కేవలం ఐదు నెలల్లో దాదాపు 2,454 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
ఈ సంఖ్య అక్కడితో ఆగలేదు. 600 హత్య కేసులు, 13,114 హత్యాయత్నం కేసులు, 32,341 తీవ్ర దాడుల కేసులు నమోదయ్యాయి” అని పేర్కొంది.
భద్రత లేని బెంగాల్
“ఒక్కసారి ఆలోచించండి, బీజేపీ వాగ్దానం చేసిన భద్రమైన బెంగాల్ ఇదేనా, ‘భరోసా ఇన్, భయ్ అవుట్’ అంటే ఇదేనా” అని ఆ పోస్టులో ప్రశ్నించారు.
“క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నేరాలు పెరుగుతూ, నేరస్థులు రెచ్చిపోతూ, మహిళలు తమ భద్రత పట్ల భయపడే బెంగాల్‌ను ఎవరూ అంగీకరించలేరు. బెంగాల్ ప్రజలకు భద్రత, జవాబుదారీతనం, న్యాయం కావాలి, బూటకపు మాటలు కాదు. సువేందు అధికారి, మీరు నినాదాలు, డొల్ల వాగ్దానాల వెనుక దాగలేరు. బెంగాల్ ప్రజలను మీరు విఫలం చేశారు. మొదటి రోజు నుంచి మేము ఇదే చెబుతున్నాం, గడిచే ప్రతి రోజూ మీ వైఫల్యాలను దాచడం కష్టమవుతోంది” అని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.
రోజుకు 16 అత్యాచారాలు
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు నెలల్లో 2400కు పైగా అత్యాచార కేసులు జరిగాయని సాకేత్ గోఖలే ఎత్తిచూపారు.
ఇవి ప్రభుత్వమే అందించిన గణాంకాలు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెంగాల్లో ప్రతిరోజూ దాదాపు 16 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఇది అత్యంత దిగ్భ్రాంతికరం అని ఆయన అన్నారు.
ఈ వార్తను డెక్కన్ క్రానికల్ సౌజన్యంతో అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
