అక్టోబర్ మూడో తేదీ ఉదయం తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఒక మందుల కంపెనీలో బాయిలర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదం అత్యంత దిగ్భ్రాంతికరం.
తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీ, తదితర అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాయిలర్ తనిఖీ అధికారిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని, కుటుంబంలో ఒకరికి అదే పరిశ్రమలో కానీ వేరొక పరిశ్రమలో కానీ ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
గాయపడిన కార్మికులకు వైద్య సదుపాయం, నష్టపరిహారం ప్రకటించారు. అధికారులు తక్షణం కదిలి కొన్ని తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకోవడం మంచిదే.
కేవలం కిందిస్థాయి ఉద్యోగులు లేదా అధికారులలో ఒకరిద్దరిపై చర్య తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు. కానీ యాజమాన్యాలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగిన తర్వాత నాలుగైదు రోజులు పెద్ద హడావుడి చేయడం సర్వసాధారణం అయింది.
కానీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కారణాలేంటి? నివారణకు ఏం చేయాలి? అనే కీలకమైన అంశాలు పక్కకి నెట్టబడుతున్నాయి.
ప్రాధాన్యతలు
పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక పురోగతికి అవసరం. అయితే పరిశ్రమల విస్తరణకు సమాంతరంగా కార్మికుల ప్రాణాలకు భద్రత, ఆరోగ్యం, రక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వకపోతే అభివృద్ధి తీవ్ర విషాదాలకు దారితీస్తుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత దశాబ్దంలో రసాయన, ఫార్మా, పెట్రోకెమికల్, ఎరువులు, జీవ ఇంధనాలు, సిమెంట్, స్టీల్, ఇతర తయారీ పరిశ్రమల్లో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
కొన్ని ప్రమాదాలు ఒకరు లేదా ఇద్దరు కార్మికుల ప్రాణాలను తీసుకోగా, ఎల్జీ పాలిమర్స్, ఎసెన్షియా, ఎస్బీ ఆర్గానిక్స్, సిగాచీ వంటి ఘటనలలో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ప్రజలు కూడా తీవ్ర అస్వస్థతకు, భయాందోళనలకు గురయ్యారు.
ప్రభుత్వ, యాజమాన్య బాధ్యత
తెలుగు రాష్ట్రాలలో తరచూ ఎక్కడో ఒకచోట పరిశ్రమల ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికులు బలి అవుతున్నారు. ఆ కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి. వారి బాధలు వర్ణనాతీతం. పరిశ్రమలు రావడం, నిరుద్యోగులకు ఉపాధి దొరకడం ఆహ్వానించతగినదే.
“ఉత్పత్తి ఎంత ముఖ్యమో, ఉత్పత్తి చేసే కార్మికుడి ప్రాణం అంతకంటే ముఖ్యమైనది.” “కార్మికుడి భద్రత ఖర్చు కాదు, అది పరిశ్రమ అభివృద్ధికి పునాది.” అయితే పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో పారిశ్రామిక భద్రత కూడా అంతే ముఖ్యమైనది.
ఒక కర్మాగారంలో పేలుడు లేదా విష వాయువు లీక్ అయితే కేవలం అక్కడ పనిచేసే కార్మికులనే కాదు, చుట్టుపక్కల గ్రామాలు, పర్యావరణం, ప్రజారోగ్యం, కుటుంబాల జీవనాధారాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
అధికారిక గణాంకాలు
2016-2024 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పారిశ్రామిక ప్రమాదాలలో 66 మంది చనిపోగా, 1066 మంది గాయాల పాలు అయ్యారని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.
వాస్తవంగా జరుగుతున్న ప్రమాదాలతో పోల్చినప్పుడు ఈ లెక్కలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కారణం పరిశ్రమలన్నీ నమోదు చేయబడుతున్నాయా లేదా? నమోదు అయిన పరిశ్రమలలో ప్రమాదం జరిగితే దాన్ని ప్రభుత్వ పరిశ్రమల శాఖకు తెలియజేస్తున్నారా? వాస్తవంగా ఎంత మంది చనిపోయారు? ఎంతమంది గాయపడ్డారు? సంవత్సరంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనే అంశాలు రికార్డు చేయడంలో చాలా లోపాలు ఉన్నాయని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 458 మంది కార్మికులు మరణించారని, 67 మంది గాయపడ్డారని లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇందులో 2025 జూన్ 30వ తేదీన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతిని కలిగించే అతి పెద్దది. 54 మంది కార్మికులు మరణించారు, 28 మంది గాయపడ్డారు.
2020 మే 7వ తేదీన విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 12 మంది కార్మికులు మరణించారు, 585 మంది గాయపడ్డారు.
సుమారు పదివేల మందికి పైగా ప్రజలు ఈ గ్యాస్ లీక్ వల్ల అనారోగ్యానికి గురయ్యారని లెక్కలు తెలియజేస్తున్నాయి.
సరళీకరణ విధానాలు ప్రమాదాలకు హేతువు
దేశంలో 1990లో సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ప్రైవేటు పరిశ్రమాధిపతులకు ఎర్ర తివాచీ పరచడం ఈ విధానం ప్రధాన లక్ష్యం.
ప్రైవేట్ పరిశ్రమల అధిపతులు కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి తమ లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకోవటమే వారి లక్ష్యం. ప్రమాద నివారణకు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఖర్చుతో కూడిన పని.
అలాగే నిరంతరం అన్ని విభాగాలు సరియైన పద్ధతుల్లో తనిఖీలు నిర్వహించడం, అవసరమైన మార్పులు చేయడం కూడా ఖర్చుతో కూడుకున్నది. అందుచేత లాభార్జనే పరమావధిగా భావించే ప్రైవేటు యాజమాన్యాలు వీటన్నిటికీ తిలోదకాలు ఇస్తున్నాయి.
తాత్కాలిక ఉద్యోగాలు-శిక్షణ శూన్యం
సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న భారీ మార్పులకు అనుగుణంగా కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలి. కొన్ని కీలకమైన పోస్టులలో విధిగా అందుకు తగిన అర్హత ఉన్న వారిని శాశ్వత ప్రాతిపదిక పైన నియమించాలి. కానీ ఆచరణలో అత్యధిక శాతం పరిశ్రమలలో ఇవన్నీ ఉల్లంఘనకు గురవుతున్నాయి.
మెజారిటీ పరిశ్రమలలో దాదాపు 90 శాతం మంది కార్మికులను కార్మిక చట్టాలు వర్తించని తాత్కాలిక, ఒప్పంద, ఇంకా రకరకాల పేర్లతో నియమిస్తున్నారు.
ఏ రోజు కార్మికులు అవసరమైతే ఆ రోజు అడ్డ మీద కూలీలు లాగా దొరికిన వాళ్లతో తీసుకొచ్చి పనులు చేయించడం కూడా ప్రమాదాలకు దారి తీస్తున్నదని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.
తనిఖీలకు స్వస్తి
ప్రభుత్వ పారిశ్రామిక విభాగ అధికారులు పరిశ్రమల తనిఖీలకు వెళ్లకుండా ప్రభుత్వమే ఆ శాఖ కోరలు పీకేసింది. పరిశ్రమాధిపతులు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు, హక్కులు అమలు చేస్తున్నామని స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోతుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత ముందుకెళ్లి ఏక గవాక్షం పేరు మీద యుద్ధ ప్రాతిపదికన పరిశ్రమలకు అనుమతులు ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులను ఆదేశిస్తున్నారు.
ఇవన్నీ కలిసి యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి రాజమార్గం అవుతున్నది. కార్మికులు మాత్రం బలి పశువులు అవుతున్నారు.
ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయ లోపం
అధికారిక లెక్కలలో అనేక తేడాలు ఉంటున్నాయి. డైరెక్టర్ జనరల్ ఫ్యాక్టరీ అడ్వైజ్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్స్టిట్యూట్స్ వారి లెక్కలకు, కార్మిక శాఖ, పరిశ్రమల శాఖ నివేదికలకు పొంతన ఉండటం లేదు. దీంతో నిర్దిష్టంగా ఏ సంవత్సరంలో, ఏ ఫ్యాక్టరీలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనే వివరాలు తెలుసుకోవడం కష్టమవుతున్నది.
ప్రభుత్వ లెక్కల్లో చనిపోయిన వారి సంఖ్య, గాయపడిన వారి సంఖ్య మాత్రమే ఇస్తున్నారు(ప్రాణాంతక, సాధారణ గాయాలు) తప్ప అసలు ఏ ఫ్యాక్టరీలో, మొత్తం ఒక సంవత్సర కాలంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనే గణాంకాలు ఇవ్వడం లేదు.
ఇది ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమల యజమానులను కాపాడటానికే ప్రభుత్వం ఇలాంటి నివేదికలను తయారు చేయిస్తున్నదా అనే అనుమానం కూడా కలుగుతున్నది.
ఈ పారిశ్రామిక ప్రమాదాలు కేవలం ఉభయ రాష్ట్రాలలోనే కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల కాలంలో ప్రమాదాలు క్రమంగా పెరిగాయి.
2025 డిసెంబరు 30 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరిగిన సీఐటీయూ అఖిలభారత మహాసభలో పారిశ్రామిక ప్రమాదాల అంశంపై ప్రధానంగా చర్చించి ఒక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో జరిగిన కొన్ని ముఖ్యమైన ప్రధాన పారిశ్రామిక ప్రమాదాలు ఎలా జరిగినది, ప్రాణ నష్టం తదితర వివరాలు పరిశీలిద్దాం.
ఎల్జీ పాలిమర్స్
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ పరిశ్రమలో 2020 మే 7న ప్లాంట్‌లో స్టైరీన్ నిల్వ ట్యాంకు నుంచి విషపూరిత స్టైరీన్ ఆవిరి బయటకు వచ్చింది. దీనిపై విచారణ చేసిన ఉన్నత స్థాయి కమిటీ, సంబంధిత ఇతర అధికారిక నివేదికల్లో నిల్వ ట్యాంకులో స్టైరీన్ నియంత్రణ కోల్పోవడం, ఉష్ణోగ్రత, పాలిమరైజేషన్ నియంత్రణలో సమస్యలు వంటి అంశాలు గుర్తించారు.
ఇది సాధారణ చిన్న ఫ్యాక్టరీ ప్రమాదం కాకుండా భారీ రసాయన ప్రమాదంగా పరిగణించారు.
సైనోర్ లైఫ్ సైన్సెస్-విశాఖపట్నం
సైనోర్ లైఫ్ సైన్సెస్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువుల విడుదలతో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు మరణించినట్లు రికార్డులలో నమోదు అయింది.
ప్రమాదానికి సంబంధించి పరిశ్రమ, ఉద్యోగుల స్థాయిలో భద్రతా వైఫల్యాలు ఉన్నట్లు జాతీయ హరిత ట్రైబ్యునల్ పేర్కొంది.
ఈ ఘటన మరో విషయాన్ని గుర్తు చేస్తుంది, రసాయన కర్మాగారాల్లో ప్రమాదం అనేది పేలుడు జరిగినప్పుడు మాత్రమే కాదు, విష వాయువుల నియంత్రణలో వైఫల్యం కూడా ప్రాణాంతకమే అని ఈ ఘటన తెలియజేస్తున్నది.
ఎసెన్షియా ప్రమాదం-2024
అనకాపల్లి అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్లో భారీ పేలుడు, అగ్ని ప్రమాదం జరిగింది.
17 మంది కార్మికులు మరణించగా 50 మంది వరకు గాయపడ్డారు. ప్రాథమిక పరిశీలనలో సాల్వెంట్(ద్రావకం) లీకేజీ ఒక కారణంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ భావించింది.
పోరస్ లాబొరేటరీస్-అక్కిరెడ్డి గూడెం-2022
ఎన్టీఆర్ జిల్లాలోని పోరస్ లాబొరేటరీస్‌లో బాయిలర్, రసాయన సంబంధిత పేలుడు 2022లో జరిగింది. ఆరుగురు కార్మికులు మరణించగా 12 మంది గాయపడ్డారు.
ఎస్బీ ఆర్గానిక్స్-సంగారెడ్డి-2024
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చంద్రాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ బల్క్ డ్రగ్ యూనిట్లో 2024 ఏప్రిల్ 3న రియాక్టర్ పేలింది. ఆరుగురు కార్మికులు మరణించగా, సుమారు 30 మంది వరకు గాయపడినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఈ ఘటనలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సదరు యూనిట్‌పై మూసివేతకు ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ ఉల్లంఘనలకు గాను 31 లక్షల పర్యావరణ పరిహారం విధించింది.
రసాయనాలతో కలుషితమైన మట్టి, వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించే చర్యలు చేపట్టింది. ఎన్జీటీ కూడా ఈ ఘటనపై సుమోటోగా విచారణ చేపట్టింది.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు
పై ఘటనలన్నీ కలిపి పరిశీలిస్తే కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1) రసాయనాల నిర్వహణలో లోపాలు: ఫార్మా, బల్క్ డ్రగ్, కెమికల్ పరిశ్రమల్లో సాల్వెంట్ లీకేజీ, విష వాయువుల విడుదల, నియంత్రణ లేని రసాయన చర్యలు, రియాక్టర్ వైఫల్యం, తగినంత కూలింగ్ లేకపోవడం, ప్రమాదకర పదార్థాల నిల్వ వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.
2) బాయిలర్లు, రియాక్టర్లు, ప్రెజర్ పరికరాల భద్రత: బాయిలర్, రియాక్టర్ వంటి పరికరాల్లో అధిక ఉష్ణోగ్రత, అధిక ఒత్తిడి, కూలింగ్ సిస్టమ్ చెడిపోవడం, నిర్వహణ లోపాలు, భద్రతా ఇంటర్‌లాక్ వైఫల్యాలు ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చు.
3) భద్రతా ఆడిట్ ఉన్నా అమలులో వైఫల్యం: కాగితాలపై భద్రతా వ్యవస్థలు ఉండటం మాత్రమే సరిపోదు. ప్రమాదకర పరిశ్రమల్లో రిస్క్ అసెస్మెంట్, భద్రతా శిక్షణ, మాక్ డ్రిల్, పరికరాల తనిఖీ, అత్యవసర ప్రతిస్పందన నిరంతర ప్రక్రియగా ఉండాలి.
4) కార్మికుల శిక్షణ: ప్రమాదం జరిగిన తరువాత స్పందించడం కంటే ప్రమాదం జరగకుండా కార్మికులకు శిక్షణ ఇవ్వడం అత్యంత ముఖ్యమైనది.
5) కాంట్రాక్ట్ కార్మికుల సమస్య: ప్రమాదకర పరిశ్రమల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు అత్యధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. వారికి తగిన శిక్షణ, వ్యక్తిగత భద్రతా పరికరాలు, అత్యవసర పరిస్థితికి తగిన శిక్షణ, రసాయన ప్రమాదంపై విషయ పరిజ్ఞానం విధిగా కల్పించాలి.
నష్టపరిహారం పరిష్కారమా?
ఒక కార్మికుడి మరణానికి 50 లక్షలు లేదా 1 కోటి రూపాయలు ఇవ్వడం కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయానికి ఉపయోగపడుతుంది. కానీ మరణించిన కార్మికుడి జీవితాన్ని డబ్బుతో కొలవడం సాధ్యం కాదు.
కాబట్టి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. పిల్లల చదువులకు బాధ్యత తీసుకోవాలి. కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించాలి. తీవ్రంగా గాయపడిన వారికి జీవితకాలం వైద్య సహాయం చేయాలి. శాశ్వతంగా వికలాంగులు అయిన వారికి నెలవారీ పింఛన్ ఇవ్వాలి. కార్మికుడు కోల్పోయిన ఆదాయానికి నష్టపరిహారం చెల్లించాలి. కుటుంబానికి సామాజిక భద్రత కల్పించాలి.
ముందస్తు నివారణ కీలకం
ఎల్జీ పాలిమర్స్, ఎసెన్షియా, ఎస్బీ ఆర్గానిక్స్, సిగాచీ వంటి ప్రమాదాల తర్వాత “ప్రమాదం జరిగిన తర్వాత ఎన్ని కోట్లు పరిహారం ఇచ్చాం” అనే దానికంటే “ప్రమాదం జరగకుండా ముందే ఏమి చేశాం?” అనేది ముఖ్యమైన ప్రశ్న. అందుకోసం ప్రతి ప్రమాదకర కర్మాగారానికి సంవత్సరానికి కనీసం ఒకసారి సమగ్ర భద్రతా తనిఖీ జరగాలి.
యాజమాన్యం, ప్రభుత్వం కాకుండా ఒక స్వతంత్ర తనిఖీ చేయించాలి. ప్రమాదకర రసాయనాల మ్యాపింగ్ జరగాలి. అత్యవసర సమయంలో చేపట్టాల్సిన చర్యలపై ఒక ప్రణాళిక ఉండాలి. తరచుగా మాక్ డ్రిల్ నిర్వహించాలి.
బాయిలర్, రియాక్టర్ ప్రెషర్ తనిఖీ తరచూ చేయాలి. ప్రమాదం జరిగితే దానంతటదే మూసుకుపోయే సిస్టమ్ ఏర్పాటు చేయాలి. గ్యాస్ లీకేజీని పసిగట్టే పరికరాలు ఏర్పాటు చేయాలి.
సీసీటీవీ భద్రతా పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కార్మిక భద్రతా కమిటీ యూనియన్ నాయకులతో వేయాలి. తాత్కాలిక, శాశ్వత కార్మికులు అందరికి కాలానుగుణ శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలి. “లక్ష్యం పూర్తి చేయాలి”, “ప్లాంట్ మూసివేత సమయం తగ్గాలి” అని ఒత్తిడి చేసి భద్రతా నిబంధనలను వదిలివేయకూడదు. భద్రత లేని పనిపై ప్రశ్నించే హక్కు కార్మికునికి ఉండాలి. భద్రతా పరికరాలు లేకున్నా పని చేయాలి అనే సంస్కృతికి స్వస్తి పలకాలి.
స్థానిక ప్రజలకు అత్యవసర పరిస్థితులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. జిల్లా లేదా పారిశ్రామిక ప్రాంత విపత్తు ప్రతిస్పందన ప్రణాళిక అమలు చేయాలి.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
అన్ని పరిశ్రమలను ఒకే విధంగా చూడకుండా అధిక ప్రమాద పరిశ్రమలకు తరచూ తనిఖీలు చేయాలి. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ప్రమాదంపై విచారణ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ప్రమాదానికి కారణం ఏమిటో, ఎవరి నిర్లక్ష్యం ఉందో, ఏ చర్యలు తీసుకున్నది ప్రజలకు తెలియాలి. ప్రమాదాలను చనిపోయిన, గాయపడిన వారి సంఖ్య కంటే ప్రతి మరణం లేదా వైకల్యం వెనుక ఒక కుటుంబం, పిల్లల భవిష్యత్తు, భార్య, భర్త, తల్లిదండ్రులు, అప్పులు, ఆదాయం కోల్పోవడం సామాజిక భద్రత కోల్పోవడం ఉంటాయి. అందువల్ల పారిశ్రామిక ప్రమాదం అనేది కేవలం పరిశ్రమకు సంబంధించినది మాత్రమే కాదు. అది ఒక కుటుంబాన్ని ప్రభావితం చేసే సామాజిక విపత్తుగా పరిగణించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
