ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో మొదటి సోమవారం ప్రపంచ నివాస దినోత్సవంగా(వరల్డ్ హాబిటాట్ డే) పరిగణించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.
1986లో మొదటిసారిగా ఇది ప్రారంభమైంది. మనిషికి ఆహారం, నీరు, ఆరోగ్యం, విద్య ఎంత అవసరమో సురక్షితమైన, అందుబాటులో ఉండే, గౌరవప్రదమైన నివాసం కూడా అంతే అవసరం.
అయితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ఇప్పటికీ భద్రమైన ఇల్లు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రవాణా, ఉపాధి అవకాశాలకు దగ్గరగా ఉన్న నివాసం అందుబాటులో లేదు.
అందుకే ఐక్యరాజ్యసమితిలో ‘యునైటెడ్ నేషన్స్ హాబిటాట్’ మానవ నివాసాలు, పట్టణీకరణ, గృహ విధానం, మురికివాడల అభివృద్ధి, భూమి హక్కులు, పట్టణ పేదరికం వంటి అంశాలను ప్రపంచ అభివృద్ధి చర్చలో ప్రధాన స్థానానికి తీసుకువచ్చింది.
2026 అక్టోబర్ 5న జరిగే ప్రపంచ నివాస దినోత్సవానికి “అందరికీ తగిన నివాసం” అనే అంశాన్ని ఈ సంస్థ ప్రకటించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా ప్రజలకు తగిన నివాసం అందుబాటులో లేదని, 1.1 బిలియన్లకు పైగా ప్రజలు అనధికారిక నివాసాలు, మురికివాడల్లో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ప్రపంచ నివాస దినోత్సవం నేపథ్యం
1985లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రపంచ నివాస దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1986లో కెన్యాలోని నైరోబీలో మొదటి సదస్సు జరిగింది. దాని ప్రారంభ సమావేశంలో “నివాసం నా హక్కు” అని ప్రకటించింది. అంటే కేవలం పేదలకు ఇళ్లు నిర్మించడం కాదు.
ప్రతి మనిషికి సురక్షితమైన ఇల్లు, భద్రతతో కూడిన నివాస హక్కు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, రహదారి, ప్రజా రవాణా, పాఠశాలలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలకు దగ్గరలో నివాసం, పర్యావరణ భద్రత, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉండేలా చూడటం దీని లక్ష్యం. అందువల్ల “గృహం” అంటే కేవలం నాలుగు గోడలు, ఒక పైకప్పు కాదు.
యునైటెడ్ హాబిటాట్ నిర్ణయం ప్రకారం నివాసానికి అర్హమైన ఇళ్ళు అంటే భద్రత, అందుబాటు ధర, పౌర సేవల లభ్యత, భూమిపై భద్రమైన హక్కు, సాంస్కృతిక అనుకూలత, వాతావరణ స్థిరత్వం వంటి అనేక అంశాలు కలిసి ఉన్నదే నివాస యోగ్యమైన ఇల్లు అని అర్థం.
నివాస హక్కు – మానవ హక్కు – ఐక్యరాజ్యసమితి దృక్పథం
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల వ్యవస్థలో తగిన నివాసానికి(అడిక్వేట్ హౌసింగ్) ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంటే ప్రభుత్వం ఒక ఇల్లు ఉచితంగా నిర్మించి ఇవ్వడం మాత్రమే “నివాస హక్కు” అమలు చేసినట్లు కాదు.
ఒక కుటుంబం నివసించే ఇల్లు సురక్షితంగా ఉండాలి. ఆ కుటుంబం భరించగలిగే ధరలో ఉండాలి. ప్రాథమిక సేవలు అందుబాటులో ఉండాలి.
బలవంతపు తొలగింపుల భయం లేకుండా ఉండాలి. పాఠశాల, ఆసుపత్రి, రవాణా, ఉపాధి ప్రాంతాలకు దగ్గరగా ఉండాలి. ఈ విస్తృత నిర్వచనమే యునైటెడ్ హాబిటాట్ “హౌసింగ్ ఎట్ ది సెంటర్” భావనకు ఆధారం.
హాబిటాట్ 1 (1976): మొదటి పెద్ద అంతర్జాతీయ చర్చ
1976లో కెనడాలోని వాంకోవర్‌లో మొదటి హాబిటాట్ సదస్సు జరిగింది. ఆ సమయంలో ప్రపంచంలో వేగంగా పట్టణీకరణ జరుగుతుండటంతో పట్టణ పేదరికం, మురికివాడలు, గృహ కొరత, నీటి కొరత, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక వంటి సమస్యలు అంతర్జాతీయ చర్చలోకి వచ్చాయి.
ఈ సమావేశం నుండే మానవ నివాసాలను ప్రపంచ అభివృద్ధి విధానంలో ప్రత్యేక అంశంగా చూడటం ప్రారంభమైంది.
హాబిటాట్ 2(ఇస్తాంబుల్ – 1996)
1996లో టర్కీలోని ఇస్తాంబుల్‌లో హాబిటాట్ 2 సదస్సు జరిగింది. ఇక్కడ “అందరికీ తగిన నివాసం”, “స్థిరమైన మానవ నివాసాలు” ప్రధాన అంశాలుగా ముందుకు వచ్చాయి. అంటే అందరికీ తగిన నివాసం, స్థిరమైన పట్టణాలు అనే రెండు లక్ష్యాలను కలిపి చూడాలని ప్రపంచ దేశాలు అంగీకరించాయి.
ఈ సమయంలో పట్టణ పేదల సమస్యను కేవలం ప్రభుత్వ గృహ నిర్మాణ సమస్యగా కాకుండా భూమి, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాలు, ఉపాధి, సామాజిక న్యాయం అనే సమగ్ర విధానాన్ని ఇస్తాంబుల్ సమావేశానికి హాజరైన దేశాలు ఆమోదించాయి.
హాబిటాట్ 3 (క్విటో – 2016): నూతన పట్టణ ఎజెండా
2016లో ఈక్వెడార్ రాజధాని క్విటోలో హాబిటాట్ 3 సమావేశం జరిగింది. ఇక్కడ నూతన పట్టణ ఎజెండా(న్యూ అర్బన్ ఎజెండా) ఆమోదించబడింది. తరువాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని ఆమోదించింది.
ఈ ఎజెండా ముఖ్య ఉద్దేశ్యం పట్టణీకరణను సమస్యగా కాకుండా, సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే శక్తిగా మార్చడం. దీనిలో మూడు ప్రధాన మార్పులు ఉన్నాయి.
1. సామాజిక సమగ్రత, పేదరిక నిర్మూలన. అంటే పట్టణాల్లో ఎవరూ వెనుకబడకుండా చూడటం.
2. అందరికీ సమాన ఆర్థిక అవకాశాలు కల్పించడం అంటే పట్టణాభివృద్ధి ఫలితాలు కొద్దిమందికి మాత్రమే కాకుండా ప్రజలందరికీ అందాలి.
3. పర్యావరణ పరంగా స్థిరమైన, వాతావరణాన్ని తట్టుకునే నగరాలు. వరదలు, వేడి తరంగాలు, తుపాన్లు, సముద్ర మట్టం పెరుగుదల వంటి సమస్యలను పట్టణ ప్రణాళికలోనే పరిగణనలోకి తీసుకోవాలి.
2026లో నూతన పట్టణ ఎజెండా అమలుపై మధ్యంతర సమీక్ష జరిగింది. యునైటెడ్ హాబిటాట్ ప్రకారం 2026 సమీక్షలో 2036 నాటికి లక్ష్యాలను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యం 11
2015లో ఐక్యరాజ్యసమితి ఆమోదించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో(సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్) 11వ లక్ష్యం నగరాలు, మానవ నివాసాలను సమగ్రంగా, సురక్షితంగా, విపత్తులను తట్టుకునేలా, స్థిరమైనవిగా మార్చడం.
11వ లక్ష్యంలో అందరికీ తగిన, సురక్షితమైన, అందుబాటు ధరలో గృహాలు, మురికివాడల అభివృద్ధి, ప్రజా రవాణా, పట్టణ ప్రణాళిక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విపత్తుల నుంచి రక్షణ, గాలి కాలుష్యం తగ్గింపు, వ్యర్థాల నిర్వహణ, పచ్చని ప్రాంతాలు, పట్టణ-గ్రామీణ ప్రాంతాల అనుసంధానం వంటి అంశాలు ఉన్నాయి.
ఈ లక్ష్యాలు 2030 నాటికి చేరుకోవాలని నిర్ణయించారు. కానీ 2026 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచం ఈ లక్ష్యాల సాధనలో ఇప్పటికీ వెనుకబడి ఉంది. గృహ సంక్షోభం దానికి ప్రధాన అవరోధాలలో ఒకటిగా సంస్థ పేర్కొంది.
ప్రపంచ పరిస్థితి
2026లో యునైటెడ్ హాబిటాట్ వెల్లడించిన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 3 బిలియన్లకు పైగా ప్రజలకు తగిన నివాసం లేదు. 1.1 బిలియన్లకు పైగా ప్రజలు మురికివాడలు లేదా అనధికారిక నివాసాల్లో నివసిస్తున్నారు.
అదే సమయంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గృహ అద్దెలు, ఇళ్ల ధరలు ఆదాయంతో పోలిస్తే శరవేగంగా పెరుగుతున్నాయి.
నివేదిక ప్రకారం ప్రపంచంలోని సగం కుటుంబాలు తమ ఆదాయంలో 30 శాతానికి పైగా అద్దెకు ఖర్చు చేస్తున్నాయి. పట్టణ నివాసితుల్లో 10 మందిలో సుమారు 4 మందికి సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులో లేదని కూడా నివేదిక పేర్కొంది. అందువల్ల ఇల్లు లేకపోవడమనే సంక్షోభం అంటే కేవలం నీడ ఏర్పాటుచేయడం మాత్రమే కాదు. ఇది ఆదాయం, భూమి, రవాణా, నీరు, పారిశుద్ధ్యం, వాతావరణం కలిసిన సంక్షోభం అని అర్థం.
ఐక్యరాజ్యసమితి విధానాల అమలులో వివిధ దేశాల అనుభవాలు
యునైటెడ్ హాబిటాట్ నమూనా వివిధ దేశాల పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు విధానాలు ఉన్నాయి.
2024లో ఓఈసీడీ కలిసి చేసిన 78 దేశాల అధ్యయనం ప్రకారం 80 శాతానికి పైగా దేశాల్లో జాతీయ పట్టణ విధానం(నేషనల్ అర్బన్ పాలసీ) ఏదో ఒక రూపంలో ఉంది. ముఖ్యమైన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి.
సింగపూర్
సింగపూర్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రజా గృహ విధానాలలో ఒకటి. హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ గృహాలను నిర్మించారు.
యునైటెడ్ హాబిటాట్ ప్రకారం సుమారు 80 శాతం మంది ప్రజలు పబ్లిక్ హౌసింగ్‌లో నివసిస్తున్నారు. సుమారు 90 శాతం మంది సొంత ఇల్లు కలిగి ఉన్నారు.
1960ల నుంచి ఈ బోర్డు ఒక మిలియన్‌కు పైగా గృహాలను నిర్మించింది. గృహ నిర్మాణాన్ని రవాణా, పాఠశాలలు, ఉద్యోగాలు, సేవలు, సామాజిక మౌలిక వసతులతో కలిపిన ఒక సమగ్ర ప్రణాళికగా అమలు చేశారు.
“ఇల్లు నిర్మించడం” మాత్రమే కాదు, “పూర్తి నివాస సమాజాన్ని నిర్మించడం” అని సింగపూర్ ప్రభుత్వం నిరూపించింది.
బ్రెజిల్
బ్రెజిల్ 2009 నుంచి మై హౌస్, మై లైఫ్ అనే భారీ సామాజిక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. తక్కువ, తక్కువ-మధ్య ఆదాయ కుటుంబాలకు గృహాల నిర్మాణం, కొనుగోలు కోసం ప్రభుత్వ సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
యునైటెడ్ హాబిటాట్ ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయి అఫర్డబుల్ హౌసింగ్ కార్యక్రమంగా విశ్లేషించింది. ఇటీవల బ్రెజిల్ విధాన చర్చల్లో కొత్త ఇళ్లు నిర్మించడం మాత్రమే కాకుండా సామాజిక అద్దె, పాత భవనాల పునరుద్ధరణ, నగర కేంద్రాల్లో హౌసింగ్, ఇప్పటికే ఉన్న ఇళ్ల మెరుగుదల వంటి పద్ధతులను కూడా గృహ నిర్మాణ ప్రణాళికలో కలుపుతున్నారు.
యూరప్‌లో సోషల్ హౌసింగ్
ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ దేశాల్లో లాభాపేక్ష లేని సామాజిక గృహ విధానానికి(నాన్ ప్రాఫిట్ సోషల్ హౌసింగ్) ప్రాధాన్యత ఇచ్చారు.
యునైటెడ్ హాబిటాట్ అధ్యయనాలు ఈ దేశాల విధానాలను పరిశీలించాయి. దీని ప్రధాన ఉద్దేశం హౌసింగ్‌ను కేవలం రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు వదిలిపెట్టకుండా, సామాజిక అవసరంగా చూడాలి.
ప్రధాన పాఠాలు
ప్రపంచ దేశాల అనుభవాలను పరిశీలిస్తే ఐదు ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. మొదటిది గృహ సమస్యను పూర్తిగా మార్కెట్‌కు వదిలిపెట్టడం కాకుండా ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి. రెండు భూమి విధానం. చౌకైన భూమి లేకుండా చౌకైన ఇల్లు నిర్మించడం అసాధ్యం. మూడు అద్దె గృహాలు. ప్రతి పేద కుటుంబం వెంటనే ఇల్లు కొనుక్కోలేరు. కాబట్టి అందుబాటులో ఉండే అద్దె గృహాలు(అఫర్డబుల్ రెంటల్ హౌసింగ్) కూడా అవసరం. నాలుగు రవాణా. పేదలను నగరానికి దూరంగా ఇళ్లు కట్టి పంపడం పరిష్కారం కాదు. ఇల్లు, ఉద్యోగం, రవాణా కలిసి ఉండాలి. ఐదు మురికివాడల అభివృద్ధి. నివసిస్తున్న వారిని తరిమి వేయడం కాకుండా వారు నివసిస్తున్న ప్రాంతంలోనే గృహాలు, నీరు, పారిశుధ్యం, రహదారులు, విద్యుత్, సామాజిక సదుపాయాలను మెరుగుపరచడం(ఇన్-సిటు అప్‌గ్రేడింగ్) అనేది మెరుగైన పరిష్కార మార్గం.
2026 నివేదికలోని ఒక కీలక అంశం హౌసింగ్ ఈజ్ నాట్ మేర్లీ యాన్ అవుట్ కమ్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఫర్ ఇట్. అంటే నివాసం స్థిరమైన అభివృద్ధి ఫలితం మాత్రమే కాదు, స్థిరమైన అభివృద్ధికి పునాది.
ప్రపంచానికి 2026లో హెచ్చరిక
సరైన నివాసం ఉంటే ఆరోగ్యం, పిల్లల విద్య మెరుగు పడుతుంది. మహిళల భద్రత పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. పేదరికం తగ్గుతుంది. విపత్తుల ప్రభావం తగ్గుతుంది. పట్టణ అసమానతలు తగ్గుతాయి. అందుకే సంస్థ 2026లో గృహ నిర్మాణాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్రంగా పేర్కొన్నది.
“ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు” అనే నినాదం వినడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఒక కుటుంబానికి నాలుగు గోడలు, పైకప్పు కల్పించడం మాత్రమే గృహ సమస్యకు పరిష్కారం కాదు.
ఒక నివాసయోగ్యమైన గృహం అంటే సురక్షితమైన నిర్మాణం, తగినంత నివాస స్థలం, తాగునీరు, మరుగుదొడ్డి, పారిశుధ్యం, విద్యుత్, వంట సౌకర్యం, రహదారి, ప్రజా రవాణా, పాఠశాల, ఆరోగ్య సేవలకు అందుబాటు, ఉపాధి ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గర వరదలు, అగ్ని, తుపాను, భూకంపం వంటి ప్రమాదాల నుంచి రక్షణ, భూమి లేదా ఇంటి హక్కుకు భద్రత, కుటుంబ ఆదాయానికి తగిన ధర లేదా అద్దె ఉండాలి.
యునైటెడ్ హాబిటాట్ కూడా హౌసింగ్ అనేది కేవలం పైకప్పు కంటే ఎక్కువ అని స్పష్టం చేస్తోంది. తగిన నివాసం సురక్షితంగా, అందుబాటు ధరలో, నివాసయోగ్యంగా, సమగ్రంగా ఉండాలని అది పేర్కొంది.
భారతదేశం
భారతదేశంలో గృహ సమస్య తీవ్రంగా ఉంది. పట్టణీకరణ వేగం పెరుగుతున్నది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు, భూమి ధరలు అనూహ్యంగా పెరగడం, అద్దెల పెరుగుదల, అనధికారిక నివాసాలు, మురికివాడలు, వలస కార్మికుల నివాస సమస్య, నిర్మాణ కార్మికుల గృహ సమస్య, పారిశుధ్యం, నీటి సరఫరా, పట్టణ రవాణా వంటి సమస్యలు పెరిగాయి.
జాతీయ పట్టణ గృహ, నివాస విధానం – 2007
భారతదేశం 2007లో జాతీయ పట్టణ గృహ, నివాస విధానాన్ని రూపొందించింది (వామ పక్షాల మద్దతుపై ఆధార పడిన యూపీఏ 1 ప్రభుత్వ కాలం). దాని ప్రధాన లక్ష్యం అందరికీ అందుబాటు ధరలో గృహాలు(అఫర్డబుల్ హౌసింగ్ ఫర్ ఆల్). ఈ విధానంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయ వర్గాలు(ఎల్ఐజీ), పట్టణ పేదలు, భూమి సరఫరా, మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం, మహిళల సాధికారత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మురికివాడల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
2007 విధానం కొత్త హౌసింగ్ ప్రాజెక్టులలో ఈ వర్గాల గృహాలకు భూమి, ఫ్లోర్ ఏరియా రేషియో(ఎఫ్ఏఆర్) వంటి ప్రోత్సాహకాలను ఉపయోగించాలని కూడా ప్రతిపాదించింది.
2026 పరిస్థితి
1 కోటి 27 లక్షల 68 వేల ఇళ్లు మంజూరు కాగా 1 కోటి 21 లక్షల 2 వేల ఇళ్ళు ప్రారంభమయ్యాయి. అందులో 99 లక్షల 7 వేల ఇళ్లు పూర్తి అయినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఇల్లు నిర్మించామా? అనే దానితో పాటు ఆ ఇల్లు ఎక్కడ ఉంది? అక్కడ నీరు, పారిశుధ్యం ఉందా? పాఠశాల, ఆసుపత్రి ఎంత దూరం? పని చేసే చోటుకు రవాణా ఉందా? పిల్లలు సురక్షితంగా పాఠశాలకు వెళ్లగలరా? మహిళలకు భద్రత ఉందా? ఇంటి యాజమాన్య హక్కు భద్రమా? అనేది యునైటెడ్ హాబిటాట్ చెప్పే “తగిన నివాసం”(అడిక్వేట్ హౌసింగ్) భావనకు కేంద్ర బిందువు. దేశంలో వీటికి సమాధానం లేదు. అసలు ఆ ఆలోచనే లేదని అనుభవం తెలియజేస్తున్నది.
భారతదేశం నేర్చుకోవలసినవి
ప్రపంచ దేశాల అనుభవాలను, సూచనలను పరిశీలిస్తే భారతదేశం కొన్ని ముఖ్యమైన విధాన నిర్ణయాలు తీసుకోవాలి.
1. గృహ నిర్మాణాన్ని సంక్షేమంగా కాకుండా హక్కుగా చూడాలి. ఇల్లు పేదరిక నిర్మూలనకు పునాది.
2. ప్రభుత్వ భూమిని సామాజిక గృహాలకు వినియోగించాలి. భూమి ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూమి కీలకం.
3. ప్రతి నగరానికి అందుబాటు ధరలో ఉండే గృహ ప్రణాళిక ఉండాలి. పట్టణ మాస్టర్ ప్లాన్‌లోనే పేద, అల్పాదాయ వర్గాల ఇళ్లకు స్థలం కేటాయించాలి.
4. రెంటల్ హౌసింగ్‌ను విస్తరించాలి. వలస కార్మికులు, యువ ఉద్యోగులు, ఒంటరి మహిళలు, నిర్మాణ కార్మికులు వంటి వారికి సామాజిక అద్దె గృహాలు అవసరం.
5. మురికివాడల పునర్నిర్మాణం కంటే వాటి మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజలను వారి ఉపాధి ప్రాంతాల నుంచి దూరంగా తరలించడం కాకుండా వారు నివాసం ఉంటున్న చోట అభివృద్ధి చేయాలి.
6. ఇల్లు-రవాణా. పేదల ఇళ్లకు సమీపంలో చౌకైన ప్రజా రవాణా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
7. ఇల్లు-ఉపాధి. పట్టణ పేదల నివాసాలను ఉపాధి ప్రాంతాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలి.
8. ఇల్లు-నీరు-పారిశుద్ధ్య సదుపాయం. నీరు, డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ లేకుండా “అందరికీ ఇల్లు” అనేదానికి అర్థం లేదు.
9. మహిళలకు యాజమాన్య హక్కు. గృహ యాజమాన్యం మహిళల పేరుతో ఉండటం కుటుంబ భద్రతకు ఉపయోగపడుతుంది.
10. వాతావరణాన్ని తట్టుకునే గృహాలు (క్లైమేట్-రెసిలియంట్ హౌసింగ్). వరదలు, వేడి, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణ ప్రమాణాలు మార్చాలి.
నివాసం సంక్షేమం కాదు – మానవ గౌరవం – హక్కు
భారత రాజ్యాంగంలో దీన్ని హక్కుగా పేర్కొనలేదు. కానీ రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 మనిషి జీవించే హక్కును గారంటీ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఆర్టికల్ 21లోని జీవించే హక్కు పరిధిలో గౌరవప్రదమైన నివాస హక్కుకు ప్రాధాన్యం లభించింది.
చమేలీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు నివాసాన్ని కేవలం తలపై పైకప్పుగా కాకుండా, తగిన నివాస స్థలం, సురక్షితమైన నిర్మాణం, పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన గాలి, నీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాలతో కూడిన నివాసం అని పేర్కొంది.
అందువల్ల ప్రజలు గౌరవప్రదంగా నివసించ గలిగే సామాజిక, ఆర్థిక, భౌతిక వాతావరణాన్ని సృష్టించడం భారత ప్రభుత్వ బాధ్యతగా చూడాలి.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్ళు వగైరా పేర్లతో అధికారంలో ఉన్న వారి ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కానీ ఆ డబ్బు దేశ ప్రజలందరూ చెల్లించే పన్నుల నుండి వచ్చేదే తప్ప ఎవరు ఉదారంతో చేసే దానం కాదు.
ప్రజల ఓట్లతో అధికారానికి వచ్చిన వారిని నిలదీసి అందరికీ నివాస యోగ్యమైన గృహ వసతిని హక్కుగా సాధించుకోవాలి.
సమగ్ర సమాచార లేమి
నిర్దిష్టంగా గృహ సమస్యపై ప్రభుత్వం దగ్గర సమగ్ర సమాచారం లేదు. ఇది అత్యంత శోచనీయం. 2021 జనాభా లెక్కల సేకరణ జరగలేదు. ఇప్పుడు ప్రారంభమైంది.
ఇప్పటికైనా కనీసం ఇంటి స్థలం కూడా లేని వారు, స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోలేని వారు, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల పక్కన, మురికివాడలలో దుర్భర జీవితం గడుపుతున్న కోట్లాది మంది వివరాలు సేకరించాలి.
కనీసం 10 సంవత్సరాల ప్రణాళిక రూపొందించి, వార్షిక బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలి. వాటి అమలు పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఇది ప్రజల ఒత్తిడితోనే సాధ్యం.
ఎవరు బాధ్యులు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల ఉమ్మడి బాధ్యత. భారత రాజ్యాంగ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ గృహ విధానం, ఆర్థిక సహాయం, కేంద్ర పథకాలు, సాంకేతిక ప్రమాణాలు, ఆర్థిక సంస్థల ద్వారా గృహ రుణ సౌకర్యాలు, పట్టణ మౌలిక సదుపాయాలకు సహాయం, డేటా, పర్యవేక్షణ, దేశవ్యాప్త లక్ష్యాలను నిర్దేశించాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు: భూమి, లేఅవుట్లు, భవన అనుమతులు, పట్టణ ప్రణాళిక, రాష్ట్ర గృహ బోర్డులు, నీరు, డ్రైనేజీ, రాష్ట్ర వాటా, లబ్ధిదారుల గుర్తింపు, భూమి లేని కుటుంబాలకు స్థలం వంటి అంశాల్లో బాధ్యత వహించాలి.
భారత ప్రభుత్వం ల్యాండ్ అండ్ కలోనిజేషన్ రాష్ట్ర జాబితాలోని అంశాలని స్పష్టంగా పేర్కొంది. అందువల్ల పట్టణ గృహ కార్యక్రమాల భూమి, లేఅవుట్, నిర్మాణ అనుమతులలో రాష్ట్రాల పాత్ర తప్పనిసరి.
స్థానిక సంస్థలు – మున్సిపాలిటీలు/పంచాయతీలు..
స్థానికంగా భూమి గుర్తింపు, నీటి సరఫరా, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ, స్థానిక సేవలు, ఆస్తి రికార్డులు లాంటి సేవలు అందించాలి.
అయితే మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు, అధికారాలు, ఆర్థిక వనరులను క్రమంగా తన హస్తగతం చేసుకుంటున్నది.
ఫలితంగా స్థానిక సంస్థలు కూడా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఐక్యంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
