వార్తాపత్రికలలో సంపాదక వ్యాఖ్యలకున్న గుర్తింపు గౌరవాలను మసకబార్చే చర్యలను సంపాదకవర్గం ఎందుకు అనుమతిస్తోంది అన్న ప్రశ్నలకు సరైన సమాధానం ఏమీ లేదు.
జంతర్ మంతర్‌లో జులై 20న బొద్దింకలు సాధించిన విజయం తర్వాత ప్రజాస్వామ్య మూల స్తంభాలన్నీ నోరు తెరవడం మొదలైంది.
ఊపిరి తీసుకుంటున్నాయి అనుకుంటున్నాము. అటువంటి సమయంలో సెప్టెంబర్ 28 ఉదయాన్నే గడపలో పడిన పత్రిక భారీ షాక్ కలిగించింది.
విశ్వ హిందూ పరిషత్ అధినేత దివంగత అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ఘనమైన నీరాజనాలు అర్పిస్తూ మోడీ రాసిన వ్యాఖ్యానాన్ని అన్ని పత్రికలు(ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, టెలిగ్రాఫ్, ట్రిబ్యూన్, టైమ్స్ ఆఫ్ ఇండియా) తమ సంపాదక వ్యాఖ్య స్థానంలో ప్రముఖంగా ప్రచురించాయి.
అశోక్ సింఘాల్‌ను కీర్తిస్తూ మోడీ రాసిన వ్యాఖ్య ప్రచురించటానికి తిరస్కరించిన ఏకైక పత్రిక ది హిందూ మాత్రమే.
సైద్ధాంతిక పక్షపాతమా?
భవిష్యత్తులో భారతీయ పత్రికారంగంపై పరిశోధనలు జరిపే చరిత్రకారుడు ఎవరైనా ఏ ఆత్మగౌరవం కలిగిన ప్రముఖ సంపాదకుడు అయినా తమ సంపాదకీయ స్థలాన్ని ఇలా ఎందుకు అరువు ఇస్తారు అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంటుంది.
అశోక్ సింఘాల్‌కు మోడీ ఆర్పించిన నీరాజనంలో ప్రధానమంత్రి హోదా ఏమీ కనిపించడం లేదు. ఏదో ఒక ప్రభుత్వ విధానాన్ని ఆయన వివరించేందుకు పూనుకోవటం లేదు.
ఇది పూర్తిగా సైద్ధాంతిక పక్షపాతంతో, ఏకపక్ష ఒంటెత్తు పోకడతో నిండిన నీరాజనం. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకై హిందుత్వసేనలను ప్రత్యక్షంగా నడిపించిన వ్యక్తికి అర్పించిన నీరాజనం.
అశోక్ సింఘాల్ మత గురువా?
ఇక్కడ ఎవరికీ ఏ రకమైన గందరగోళము ఉండాల్సిన అవసరం లేదు. అశోక్ సింఘాల్ ఏమి మత గురువు కాదు. జాతి నిర్మాత అంతకంటే కాదు. అయోధ్య విషయంలో ఆయన అలుపెరుగని ఆందోళన జీవి.
1998 నుంచి 2004 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దానికి నాయకత్వం వహించిన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, హోంమంత్రి అద్వానీలు ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన నియంత్రణ ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధపడటంతో అశోక్ సింఘాల్, వీహెచ్ పీ వాళ్లకు నిద్రలేకుండా చేశాయి.
శాంతిభద్రతల విషయంలో ప్రస్తుత ప్రభుత్వాలు పాటిస్తున్న ప్రమాణాలను ఆధారం చేసుకుని పరిశీలిస్తే అశోక్ సింఘాల్ చేసిన పని రాజా ద్రోహమే.
భారత ప్రభుత్వానికి, రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన యుద్ధమే. ఇటువంటి ఆరోపణలను సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అద్భుతమైన వాదనలు వినిపించగలరు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంతకంటే అద్భుతంగా అశోక్ సింఘాల్ దోషి అని నిర్ధారించగలరు.
విధ్వంసాన్ని చట్టబద్ధం చేయడమేనా?
జరిగిన దాంట్లో సింఘల్ పాత్ర ఎంత అన్న విషయం గురించి కాదు ఈ చర్చ. ప్రముఖ పత్రికలలో సంపాదక వ్యాఖ్య ప్రచురించడం ద్వారా ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి ఏమి సాధించాలనుకుంటున్నారు అన్నదే ప్రశ్న.
అయోధ్య ఉద్యమం పేరుతో సాగించిన బాబ్రీ విధ్వంసాన్ని చట్టబద్ధం చేయటమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశం. తద్వారా అయోధ్య ఉద్యమం భారతీయ సమాజంలో తీసుకువచ్చిన అన్ని చీలికలకు శాశ్వత స్వభావాన్ని ఆపాదించడమే.
హిందుత్వ చర్చలను మరింత విస్తృతపరచడంలో భాగంగా సైద్ధాంతిక తీవ్రవాదానికి నగిషీలు చెక్కటానికి ప్రధానమంత్రి పూనుకున్నారు అని ఆయన వ్యతిరేకులతో పాటు సన్నిహితులు కూడా గొణుగుతున్నారు.
అయోధ్య ఉద్యమం భారతీయ సమాజంలో తీసుకువచ్చిన చీలికలు మతోన్మాద విభజనలు లేకపోతే నేడు మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండేదే కాదు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు.
“1990 దశకం తర్వాత ఈ దేశంలో హిందువులు మరోసారి తిరగబడతారు. దాన్ని వ్యతిరేకించేవారు కాలగర్భంలో కలవక తప్పదు” అని అశోక్ సింఘాల్ 2013లోనే ప్రకటించాడు.
ఆర్ఎస్ఎస్ అండ అవసరమా?
బహుశా నాగపూర్ తోటి, సంఘపరివార్ సిద్ధాంతాల తోటి చెదిరిపోతున్న సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన దుస్థితికి మోడీ నెట్టబడినట్టు ఉన్నారు.
ప్రస్తుతం ఇంట బయట మోడీ వ్యతిరేక పవనాలు శృతి మించుతూ ఉండడంతో మోహన్ భగవత్ జోక్యాన్ని మోడీ ఆశిస్తున్నట్లున్నారు.
మోడీ ప్రయోజనాలు కాపాడాలనుకునేవారు ఎన్నికల కమిషన్ మోసాలు బట్టబయలు కావడంతో ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు నానాటికి విశ్వసనీయత కోల్పోతున్నారన్న వాస్తవాన్ని గ్రహించే ఉంటారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలోని ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన దాడిని నిలువరించేందుకు సిద్ధంగా లేదన్న వాస్తవాన్ని బీజేపీ వ్యూహాత్మక నిపుణుల బృందంలోని రాజకీయ యోధులు గుర్తించారు. దీనికి తోడు ఎప్పుడు ఎలా ఏ విషయానికి ఉవ్వెత్తున లేగుస్తారో అర్థం కాని జెన్ తరం, దానికి నాయకత్వం ఇస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఉండనే ఉన్నాయి.
భజనలు కీర్తనలు చేసుకుంటూ ఈ జెన్ జెడ్ తరాన్ని లోబర్చుకోవడం మోడీ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అటువంటి చర్యలు మరింత గేలి పాలు కావడానికి కారణమవుతాయి. ఆయన కుయుక్తులు అన్నింటిని ఈ తరం గమనించింది.
వాతావరణం బాగా లేదు కాబట్టి పాలకవర్గానికి నాగపూర్ సహకారం ఎంతైనా అవసరం. అందుకే సంఘ పరివారంలోని ప్రధానమైన వ్యక్తిని ఆరాధిస్తూ హిందూత్వ పక్షపాత రాజకీయాలకు సంబంధించిన జ్ఞాపకాలను తిరగతోడే ప్రయత్నంలో భాగంగానే మోడీ అర్పించిన ఈ నీరాజనం.
హిందుత్వ యోధుడిగానే మిగిలిపోవాలని..
తరచి చూసేవారికి ఇటువంటి సంపాదక వ్యాఖ్యల ద్వారా తాను హిందుత్వ యోధుడుగానే మిగిలిపోవడానికి సిద్ధంగా ఉన్నానని తన శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం అని అర్థం అవుతుంది.
సనాతన వాదులు అందరూ ఇండియా ఇప్పుడు భారత్ అయిందని నమ్ముతున్నారు. ఇదే హిందూ రాష్ట్రమని కూడా నమ్ముతున్నారు.
ఈ హిందూ రాష్ట్ర ఏర్పాటును కొనసాగించడానికి మోడీ అధికారంలో ఉండటం అవసరంగా భావిస్తున్నారు. ఇటువంటి వారంతా పాలకవర్గం నవతరం విసిరిన సవాలును అధిగమిస్తూ నిర్నిరోధంగా సంపూర్ణ అధికారాలు చెలాయించాలని ఆశిస్తున్నారు.
అశోక్ సింఘాల్‌కు శత జయంతి నీరాజనం అర్పించడం ద్వారా ప్రధాని తన అధికారిక హోదాను మసకబార్చుకోవడానికి సిద్ధం కావడం వెనక ఉన్న కారణాలు అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. అటు ఇటు నిర్ణయించుకోకుండా మధ్యస్తంగా ఉండే అశేష ప్రజానీకం మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి తగినన్ని కారణాలు ఉన్నాయి.
అయోధ్యలో చందా చోరీ, రాజకీయ ప్రత్యర్థుల పట్ల ప్రభుత్వ దురహంకారపు నగ్నత్వం, తాజాగా వెలుగు చూస్తున్న ఎన్నికల సంఘం అడ్డగోలు నిర్వాకాలు వంటివన్నీ గమనించిన ప్రజలు విసుగు చెందారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి మౌలిక పునాదిగా ఉన్న సనాతని గుంపులు కూడా అధికారంలో కొనసాగటం పట్ల ఏమాత్రం సందేహం వ్యక్తం అయ్యేలా వ్యవహరించుకోవడం పెను తుఫానును ఆహ్వానించడమే అవుతుందని నయా చాణక్యులకు బాగా తెలుసు.
పత్రికల తీరు ఆక్షేపణీయం
ఇవన్నీ అటుంచితే విలువైన తమ సంపాదకీయ స్థలాన్ని మోడీ నిరాజనాలకు అరువు ఇవ్వటం ద్వారా తమ ప్రతిష్టలు దిగదార్చుకునేందుకు సంపాదకులు ఎందుకు సిద్ధపడ్డారు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
బహుశా ఈ సంపాదకులు పత్రికా నిర్వాహకులు దేశంలో మారుతున్న ప్రజల ఆలోచనలను పసిగట్టడంలో విఫలమై ఉండవచ్చు.
లోక్ కళ్యాణ్ మార్గ్(గతంలో రేస్ కోర్స్ రోడ్) పేరు మార్చుకున్న ప్రధాన మంత్రి నివాసంలో ఉండటానికి అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి మోడీ మాత్రమే అని విశ్వసిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ ఇన్ని సంశయాలు, శంకల మధ్య కొనసాగుతున్న ఈ దేశానికి నాయకత్వం వహించిన నైతిక అర్హతను మోడీ కోల్పోయారు.
ఇటువంటి పరిస్థితుల్లో మరిచిపోయిన, సరిగా మరచిపోవాల్సిన అశోక్ సింఘాల్ లాంటి వారికి నీరాజనాలు అర్పించడం ద్వారా తన నైతికతను తిరిగి తెచ్చుకోవడం సాధ్యమయ్యే పని కానే కాదు.
(అనువాదం : కొండూరి వీరయ్య)
(వ్యాస రచయిత ది ట్రిబ్యూన్ పూర్వ ప్రధాన సంపాదకులు. ఈ వ్యాఖ్యానం ముందుగా ది ఇండియా కేబుల్‌లో విడుదలైంది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
