పలు అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను, విభేదాలను ఈ మధ్యకాలంలో పరిశోధనాత్మక జర్నలిస్టులు బట్టబయలు చేశారు. ఈ పరిశోధనాత్మక జర్నలిస్టులు వెల్లడించిన విషయాలు పరిశీలిస్తే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత నాలుగు నెలల్లో ఎన్నికల సంఘం పూర్తిస్థాయి సమావేశం కనీసం ఒక్కసారి కూడా జరగలేదని వెల్లడవుతోంది. అందువల్లనే కేంద్ర ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వివిధ అంశాలపై 14 సార్లు తమ భిన్నాభిప్రాయాలను, అసమ్మతిని నమోదు చేశారు.
ఈ భిన్నాభిప్రాయాలను, బేదాభిప్రాయాలను, అసమ్మతులను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ఎన్నికల సంఘం తాము ఎంచుకున్న పనిలో ముందుకు వెళ్లడంతో యావత్ ఎన్నికల సంఘం, ప్రధానంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పనితీరుపై ప్రశ్నల మబ్బులు కమ్ముకున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రజలలో ఉన్న సందేహాలను తొలగించి, ప్రజల విశ్వాసం తిరిగి పొందే ప్రయత్నం చేయటానికి బదులు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన రెండు పత్రికా ప్రకటనలు ఈ సందేహాలను మరింత పెంచాయి.
పరిశోధనాత్మక జర్నలిస్టులు వెలుగులోకి తెచ్చిన ఏ ఒక్క అంశాన్ని నిరాకరించే విధంగా పత్రికా ప్రకటనలో తగిన ఆధారాలు గాని, వివరణ గాని పొందుపరచలేదు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అమలులో జరుగుతున్న అక్రమాలు, అవకతవకల గురించి ప్రతిపక్షాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను అభిశంసించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరుగున పడుతున్న మౌలిక ప్రశ్నలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు, ప్రధాన ఎన్నికల కమిషనర్ అనుసరిస్తున్న పద్ధతుల గురించి తాజాగా పెద్ద ఎత్తున వివిధ కోణాలలో విశ్లేషణలు జరుగుతున్నాయి. కుండపోతగా జరుగుతున్న చర్చలలో కొన్ని ప్రధాన విషయాలు మరుగున పడే ప్రమాదం ఉన్నది.
అంతిమంగా ఈ కీలకమైన ప్రశ్నలు ఈ దేశ ప్రజాతంత్ర జనజీవనం నుండి మాయమయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అందుకే ఈ చర్చలన్నింటిలో మరుగున పడుతున్న కొన్ని ప్రధానమైన విషయాలను పాఠకుల దృష్టికి తేవడం కోసమే ఈ వ్యాసం ఉద్దేశం.
అసమ్మతి లేకపోతే ఏమయ్యేది?
ముందుగా అయితే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుని సమాధానం కోసం ప్రయత్నం చేద్దాం. ఆ ఇద్దరు ఎన్నికల సంఘం కమిషనర్లు తమ భిన్న అభిప్రాయాలను, అసంతృప్తులను, అసమ్మతులను నమోదు చేయకపోతే ఏమి జరిగి ఉండేది?
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్న తీరు విషయంలో ఈ ఇద్దరు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌తో పాటు, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ఐటీ విభాగం వ్యవహార శైలితో ఏకీభవించి ఉంటే ఏమి జరిగేది?
కొంతమంది ప్రముఖులకు తమ ఓటు హక్కు నిరూపించుకోండి అని నోటీసులు రాకపోతే ఏమి జరిగి ఉండేది? ఓటు హక్కు ధ్రువీకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ కేవలం నోరులేని మైనారిటీలు, ఆదివాసీలు, దినసరి కూలీలు, మహిళలపైనే దృష్టి పరిమితం చేయకుండా ఉండి ఉంటే ఏమి జరిగేది?
బెంగాల్లో ఫారం ఏడు ద్వారా 16 లక్షల మంది ఓటర్లను తొలగించే ప్రక్రియలో ఎన్నికల సంఘంలోని మిగిలిన ఇద్దరు కమిషనర్లను కూడా భాగస్వాములను చేసి వారి అనుమతి తీసుకుని ఉండి ఉంటే ఏమి జరిగి ఉండేది? ఇవన్నీ సజావుగా జరిగి ఉంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమంజసమైనదిగా మనం ఒప్పుకోవాల్సి ఉండేదా?
ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే యత్నం
ఇప్పుడు “ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎంత మంచిదో అంత చెడ్డది” అన్న వాదన కూడా వింటున్నాము. ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారిక స్పందన కూడా ఇదే వాదనపై ఆధారపడి ఉంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విషయంలో ఎన్నికల సంఘం కమిషనర్లు అందరూ ఏకాభిప్రాయంతో వ్యవహరించి ఉండాల్సింది అని అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతుంది.
పౌర సమాజం జరుపుతున్న చర్చలలో ఒక మౌలికమైన ప్రశ్నకు ఎన్నికల సంఘం ఇంతవరకు సమాధానం చెప్పలేదు. సమాచార హక్కు కార్యకర్త వేసిన ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఎన్నికల సంఘం ఇచ్చిన సమాధానం ప్రకారం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరపాలన్న నిర్ణయం ఎన్నికల సంఘం తీసుకోలేదు.
రాతపూర్వకంగా ఇచ్చిన ఈ సమాధానం అవునని గాని కాదని గాని చెప్పడానికి ఎన్నికల సంఘం ఇంతవరకు ప్రయత్నం చేయలేదు.
ఓటర్ల జాబితా సవరణలో అనుసరించే విధివిధానాలు, అనుసరించాల్సిన విధివిధానాల గురించిన చర్చను పక్కన పెడితే మొత్తంగా ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ద్వారా భారత రాజకీయ సమాజంలో ప్రభుత్వం తేవాలనుకున్న మార్పులు ఏమిటి?
ఈ ప్రక్రియ ద్వారా భారతీయులందరినీ రెండు తరగతులకు చెందిన వారిగా శాశ్వతంగా విభజించనున్నారు అన్న మౌలిక సత్యాన్ని మనం విస్మరించకూడదు.
దాదాపు 14 కోట్ల మంది పౌరులకు ఓటు హక్కు రద్దుచేసి, వారిని రోజువారీ రాజకీయ భారతంలో భాగస్వాములను కానీయకుండా చేయడం, అదే సమయంలో వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా భారతదేశంలో కొనసాగేందుకు అనుమతించడం అన్నది అత్యంత ప్రధానంగా ముందుకొస్తున్న మౌలిక సమస్య. అంటే స్థూలంగా చెప్పాలంటే మీరందరూ ఇకపై భారతదేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా మిగిలిపోతారు.
గత ఎన్నికల అవకతవకలు
గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో జరిగిన ఎన్నికలలో చోటు చేసుకున్న అవకతవకలను విస్మరించకూడదు. కొన్ని మౌలికమైన అవకతవకలు ఇవి: రాష్ట్రాలలో ఎన్ని దఫాలలో ఎన్నికలు జరగాలి అనే విషయంలో అర్థరహితంగా వ్యవహరించడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపట్ల వివక్షత ప్రదర్శించడం, పాలక పార్టీ ప్రధాన ప్రచారకులు యథేచ్ఛగా మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినా కళ్ళప్పగించి చూడటం,
తుది ఓటింగ్ శాతం వివరాలు వెల్లడించడంలో అనూహ్యమైన ఆలస్యం, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుమానాస్పద పద్ధతుల్లో భారీ మోతాదులో ఓటర్ల సంఖ్య పెంచడం, ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్యకు లెక్కింపు సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో తేలిన సంఖ్యకు మధ్య అగాధమంత తేడాలు ఉండటం, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా కొన్ని నియోజకవర్గాలలో అనూహ్యంగా ఓటర్ల సంఖ్య పెరిగిపోవడం వంటివి ఉన్నాయి.
ఇన్ని అవకతవకలు జరుగుతున్నా వీటన్నిటి విషయంలో ఎన్నికల కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న సంగతి బయటకు పొక్కలేదు. అసలు భిన్నాభిప్రాయాలు లేవని మనమేమీ అనుకోవటం లేదు. కాకపోతే ఆ భిన్నాభిప్రాయాలు వెలుగు చూడలేదు.
ముందు ముందు ఏవైనా వాస్తవాలు వెలుగు చూసేంతవరకు పై విషయాలపై ఎన్నికల కమిషన్‌లో ఉన్న ముగ్గురు కమిషనర్లు ఏకాభిప్రాయంతో ఉన్నారు అని భావించాల్సి ఉంటుంది.
ఓటు హక్కు తొలగింపు వెనుక ఉన్న లక్ష్యం
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కేవలం ఏదో ఒక పార్టీని గెలిపించడానికి, మరొక పార్టీని ఓడించటానికి పరిమితమైనది కాదు. మరింత లోతైన స్వభావం కలిగిన పరిణామం.
దేశంలో ఒక ప్రత్యేకమైన తరగతికి చెందిన ఓటర్లను తయారు చేయడమే ఆ లోతైన ప్రక్రియ. ఈ పరిణామం పూర్తయ్యేసరికి భారత గణతంత్ర రాజ్యంలో ఒక తరగతికి చెందిన ఓటర్లు మాత్రమే రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉంటారు. అటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగిన తరగతి సహజంగానే మైనారిటీయేతరులు, ఆదివాసీయేతరులు, విస్మరణకు గురికాని తరగతులకు చెందిన వారు, దళితేతరులు అయి ఉంటారు. మరి ఈ మైనారిటీలు, ఆదివాసీలు, దళితులు, ఇతర విస్మృత సామాజిక తరగతులకు చెందిన వారు ఓటు హక్కు కోల్పోతే రాజకీయంగా కూడా తమ ప్రాధాన్యతను కోల్పోతారు.
కొద్దో గొప్పో ఓటు హక్కు కలిగిన మైనారిటీలు ఉన్నప్పటికీ వారు పెద్దగా రాజకీయ ప్రభావం చూపగలిగిన వారు కాబోరు.
మరో రకంగా చూసినప్పుడు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఒక లోతైన లక్ష్యం కలిగిన ప్రాజెక్టు. ఈ భారతదేశాన్ని సనాతన హిందూ రాష్ట్రగా మార్చడమే ఆ లోతైన లక్ష్యం.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను వ్యతిరేకించడానికి కానీ లేదా ఈ మొత్తం క్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయటానికి కానీ ఈ అవగాహన ప్రాతిపదికగా ఉండాలి. నిర్వహణపరమైన లోపాలకు మాత్రమే పరిమితం కాకూడదు.
(అనువాదం: కొండూరి వీరయ్య)
(రచయిత రాజకీయ ఆర్థిక విశ్లేషకులు. అష్టవంకరల నవభారతం గ్రంథ రచయిత. ది టెలిగ్రాఫ్ సౌజన్యంతో)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
