ఎన్నికల కమిషన్ కేంద్రంగా పుట్టిన తాజా సంచలనం కేవలం ఎన్నికల వ్యవస్థ పనితీరు గురించి మాత్రమే చెబుతోందా? కానేకాదు; అది ఈ దేశం ఈ క్షణాన ఉన్న పరిస్థితిని చెబుతోంది; గత పది, పన్నెండేళ్లలో అది తిరిగిన మలుపుల గురించి చెబుతోంది, రేపు మరింత స్పష్టంగా స్థిరపడబోయే మలుపు గురించి చెబుతోంది.
పదిహేను నుంచి ఇరవయ్యేళ్ళ వెనక్కి వెళ్ళి చూస్తే, అప్పుడు కేంద్రంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న పార్టీలు వేరు కావచ్చు; కానీ అప్పుడూ అవినీతే కాకుండా ఎన్నికల కమిషనర్ల నియామకంలో; ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకలు, తెరవెనుక లాలూచీలూ ఉన్నాయి.
అయితే, అప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. వ్యక్తిగతంగా తమ భావజాలం ఎలాంటిదైనా, పార్టీ పక్షపాతం ఎలాంటిదైనా తప్పును తప్పుగా ఎత్తిచూపే ఒక వర్గం బలంగా ఉండేది.
కొంచెం హెచ్చుతగ్గుల తేడాతో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆ పాత్ర నిర్వహించేవి.
ప్రభుత్వాలు, అధికారపక్షాలు వ్యవహరించే తీరుపై ఫోకస్ పెడుతూనే ఆయా వ్యవస్థల పనితీరును కూడా పట్టించుకోవడం ఉండేది.
పార్టీలు, ఎన్నికల మీదే కాకుండా ఆయా రాజ్యాంగవ్యవస్థల బాగోగులపై కూడా ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుందన్న సంగతి తెలిసినదే.
సామాజిక మాధ్యమాల ప్రభావం – సమాచార లోపం
కానీ ఆ తదుపరి కాలంలో ఏం జరుగుతూవచ్చిందంటే, ఒకవైపు ఇంటర్నెట్ ఆధారిత సోషల్ మీడియా వ్యాప్తితో సమాచారం అందుబాటు వేగం పెరిగింది, సమాచార పరిమాణం పెరిగింది; ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో తమ భావప్రకటనకు అవకాశం లేని అసంఖ్యాకులకు తమ ఆలోచనలను, భావాలను, స్పందనలను వ్యక్తీకరించుకునే వెసులుబాటు కలిగింది.
ఇటువంటివి శుభపరిణామమనుకుంటే; దాంతోపాటే, సమాచార రూపంలో అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణల వ్యాప్తి కూడా పెరిగిపోయి ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితిని తెచ్చి ఆచరణలో సమాచారం బదులు సమాచారరాహిత్యం వైపు నడిపించింది.
దానికితోడు, అంతవరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తమ వాళ్ళను ప్రతిష్ఠించుకుని, తమకు అనుకూలంగా వాటిని మలచుకోగల అవకాశం లేని అధికారపక్షాలకు, ప్రతిపక్షాలకు ఆ లోటును తీర్చుకునే కొత్త అవకాశాన్ని సోషల్ మీడియా ఇచ్చింది. దానికి సమాంతరంగా ప్రజాక్షేత్రంలో మరో కీలకమైన మార్పూ వచ్చింది. తగుమేరకు చదువూ, అవగాహనతోపాటు భావప్రకటన సామర్థ్యం ఉండి, పార్టీ పక్షపాతాలకు, భావజాలాలకూ అతీతంగా తప్పును తప్పుగా ఎంచి చూపే వర్గానికి పోటీగా; ఇతరత్రా అటువంటి లక్షణాలే ఉండి, పార్టీపక్షపాతానికీ, భావజాలానికీ లోబడి తప్పొప్పుల విచికిత్స లేకుండా తాము అభిమానించే పార్టీ, లేదా భావజాలానికి చెందిన ప్రభుత్వం ఏం చేసినా సమర్థించి నెత్తిన పెట్టుకునే వర్గం బలం పుంజుకుంది.
రాజకీయాల్లో మతం – క్షీణిస్తున్న వ్యవస్థలు
ఇంకొంచెం లోతుకు వెళ్ళి చెప్పాలంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతా, బహుశా అంతకు ముందు నుంచీ రాజకీయాలతో సహా ప్రజాక్షేత్రంలో అంత చురుగ్గా లేకుండా దాదాపు సుప్తావస్థలో ఉండి, గత పదిహేను, ఇరవయ్యేళ్ళలో మేలుకొని జూలు విదిల్చిన వర్గం అది.
స్వాతంత్ర్యానికి చాలా ముందు నుంచీ, ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, నూరేళ్ళకు పైబడిన కాలం నుంచీ మతపరమైన భావోద్వేగాలను ఇంధనం చేసుకుని కేంద్రంలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ అధికార శిఖరానికి చేరుకోవడంలో ఒక పక్షం విజయం సాధించడం, సాంకేతిక అభివృద్ధి కారణంగా సోషల్ మీడియా వంటి అదనపు సౌలభ్యాలు అందుబాటులోకి రావడం ఏకకాలంలో జరిగి సాపేక్షంగా ఎక్కువ భావప్రకటనాసామర్థ్యం కలిగిన ఈ వర్గానికి అంతకుముందులేని కొత్త జవసత్త్వాలనూ, గొంతునూ ఇచ్చాయి.
భావోద్వేగాలతో ముడిపడిన మతం ఎప్పుడైతే అధికార రాజకీయాల అజెండాలో ప్రథమస్థానానికి చేరుకుందో అప్పుడిక దాని అస్తిత్వ రక్షణా లేదా ఆధిపత్య స్థాపనా ఏకైక దిక్సూచులుగా, లక్ష్యాలుగా మారడం సహజమే.
ఆ క్రమంలో ప్రజాస్వామ్యమూ, దానికి సంబంధించిన పారదర్శకతా మొదలైన విలువలూ; వాటిని పరిరక్షించవలసిన చట్టసభలు, రాజ్యాంగవ్యవస్థల అస్తిత్వమూ ఆరోవేలుగా మారి; వాటి పనితీరూ, అందులో దొర్లే తప్పులు, పొరపాట్లూ వగైరా పక్కకు తప్పుకోవడమూ అలాంటిదే.
ఇలాగే మరింత లోతుగా దృష్టి సారించి చెప్పుకోవలసిన మరో విషయమేమిటంటే, అంతకుముందు స్వతంత్రభారతంలో యాభై, అరవయ్యేళ్ళుగా అధికారచక్రం తిప్పిన పార్టీలు కానీ, ప్రజాక్షేత్రంలో ఎంతోకొంత ప్రభావోపేతంగా పనిచేస్తూవచ్చిన పార్టీలు కానీ, మీడియా సహా ఆయా రంగాలకు చెందిన ఆలోచనాపరులు కానీ అతి సమీపకాలంలోనే దేశంలో సంభవించబోయే ఆ మార్పునూ, దేశం తిరగబోయే ఈ మలుపునూ గుర్తించడంలో విఫలమయ్యాయి.
మతాన్ని వ్యక్తిగతానికి పరిమితం చేసి సామాజికక్షేత్రంలో మతాతీతంగా అందరినీ కలిపి ఉంచడం ద్వారా దేశాన్ని బలోపేతం చేయగల భావజాలాన్ని పాఠశాలస్థాయితో మొదలుపెట్టి అన్ని అంచెల్లోనూ రంగరించవలసిన బాధ్యతను అవి దారుణంగా విస్మరించాయి.
తమకు పోటీలేదనీ, తమ అధికారం శాశ్వతమనీ అవి భ్రమించినా భ్రమించి ఉండచ్చు. దాని పర్యవసానంగా పది, పన్నెండేళ్ళకు ముందు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న మతాధారిత రాజకీయపక్షం వైపూ, దాని పరివార సంస్థలవైపూ ఎన్నడూ చూసి ఉండని – మీడియా, సినీరంగాలతో సహా- ఆయా రంగాలకు చెందిన ప్రముఖులతో సహా అసంఖ్యాక జనాలు పొలోమని అటువైపు మళ్ళిపోయి, ఆ జెండాపుచ్చుకోవడం, వారి భాష మాట్లాడడం చూస్తున్నాం.
చరిత్రలోకి వెడితే మౌర్యసామ్రాజ్యపతనంతో ఇక్కడ అతికినట్టు పోలిక కుదురుతుంది. అశోకుడి తర్వాతి రాజులు బలహీనులు కావడంతో యాభయ్యేళ్ళకే ఆ సామ్రాజ్యాన్ని పుష్యమిత్రశుంగుడు కుప్పకూల్చి, అప్పటి వైదికమతానుకూల రాజ్యాన్ని స్థాపించగలిగాడు. అది అనంతర భారతదేశ చరిత్ర మొత్తాన్నే కొత్త మలుపు తిప్పింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ – ఎన్నికల సంఘంపై ఆరోపణలు
ఇప్పుడు ఎన్నికల కమిషన్, అది చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కేంద్రంగా జరుగుతున్న రగడ మొత్తం, పై పరిణామాలన్నిటికీ- ఏ ఒక్క దాన్నీ విడిచిపెట్టకుండా- ఎంతో సమగ్రంగా, స్పష్టంగా అద్దం పడుతున్న సందర్భం.
ముందుగా చెప్పుకోవలసింది, గత ఏడాదిగా ఆ వివాదం చుట్టూ దట్టంగా ఆవరించి ఉన్న సమాచార అంధత్వం. అంటే, వాస్తవంగా అసలేం జరుగుతోందో తెలియని- పారదర్శకతాలోపం.
ప్రజాస్వామ్యమూ, రాజ్యాంగమూ, వాటికి సంబంధించిన విలువల పరిరక్షణా కాకుండా, ఎట్టి పరిస్థితులలోనూ తమ మతాధారిత లక్ష్యాన్ని సాకారం చేసుకోవడమే పాలకుల పరమాశయం అయినప్పుడు; భావప్రకటనాసామర్థ్యం ఉండి కొత్తగా మేలుకొని గొంతుపెంచుకున్న ఒక వర్గం మద్దతు కూడా దానికి ఉన్నప్పుడు మొట్టమొదట వేటుపడేది పారదర్శకతపైనే.
ఉదాహరణకే చూడండి- గత సంవత్సరం(2025) జూన్ చివరి వారంలో ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినప్పటి నుంచే దాని మీద అనుమానాలు, ఆక్షేపణలు, ప్రశ్నలు మొదలయ్యాయి.
సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలవడం, కోర్టు వాటిని విచారించి కొన్ని విషయాల్లో ఎన్నికల కమిషన్ వ్యవహరణను తప్పుపట్టి సవరణలను సూచించడం, ప్రత్యేకంగా ఒక మతం వారిని అక్రమంగా దేశంలోకి అడుగుపెట్టి ఓటర్లుగా నమోదైనట్టు చూపుతూ, వారి వాస్తవిక సంఖ్యకు భిన్నంగా హెచ్చు సంఖ్యలో ఉన్నట్టు చిత్రించే కథనాలు బయటికి రావడం, అలాంటి ఏ కొందరినో గుర్తించి వారిని దేశం దాటించే ప్రయత్నాలు కొన్ని హాస్యాస్పద సన్నివేశాలను ఆవిష్కరించడం, కొత్త ఓటర్ల దరఖాస్తుకు ఉద్దేశించిన ఫారం-6ను కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించడం, ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు ఎస్ఐఆర్ కసరత్తు ఒకవేళ అవసరమే అనుకున్నప్పటికీ, సుప్రీంకోర్టు అక్షింతల దృష్ట్యా ఎన్నికల కమిషన్ అందుకు తగిన కార్యచరణకు ముందే నిర్దుష్టమైన రూపురేఖలు ఇచ్చుకోకుండా తొందరపడుతున్నట్టు కనిపించడం, వస్తున్న విమర్శలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ స్పందనలో రాజ్యాంగ వ్యవస్థా ధ్వని కన్నా రాజకీయ ధ్వని వినిపించడం మొదలైనవి ఏడాది క్రితమే చర్చలోకి వచ్చాయి.
అయినాసరే, ఈ ఏడాది కాలంలోనూ, అనేక ఆరోపణలతో సహా వేటిపైనా సంతృప్తికరమైన వివరణ రాకపోవడం ‘సమాచారయుగం’గా చెప్పుకునే ఈరోజున కూడా నిక్కమైన సమాచారం పొందడం ఎంత గగనంగా మారిందో చెబుతుంది. కిందటి ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో ఎస్ఐఆర్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ వ్యవహారసరళిపై ఫేస్ బుక్‌లో పదకొండు పోస్టులు రాశాను. అవి బీహార్ ఎన్నికలవరకూ కవర్ చేశాయి. వాటిలో పై విషయాలతో సహా అనేక అంశాలను స్పృశించాను.
కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు
ఇక ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తాజా పరిశోధనాత్మక కథనానికి వస్తే, ఇంతకుముందు భాగంలో చెప్పుకున్న అనుమానాలు, ఆరోపణలకే అది మరికొన్ని కొత్త అంశాలు జోడించింది.
కమిషన్‌లోని మిగతా ఇద్దరు కమిషనర్లు గత పదినెలల్లో 14 సార్లు ఆయా అంశాలపై తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా లేవనెత్తారనీ, వారిని సంప్రతించకుండానే, వారికి తెలియకుండానే కొన్ని నిర్ణయాలు జరిగాయనీ ఆ కథనం చెబుతోంది.
దానిపై ఎన్నికల కమిషన్ వివరణ ఇస్తూ, సంప్రదింపుల దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా చివరికి ఏకగ్రీవంగానే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పింది తప్ప ఆ కథనం మొత్తాన్ని నిరాధారమని చెప్పి తోసిపుచ్చలేదు; దాని మూలాన్ని ప్రశ్నించలేదు.
అంతేకాదు, ఆ కథనం ఎత్తిచూపిన ఫారం-6 విషయంలో తన నిర్ణయాన్ని సవరించుకుంటున్నట్టు చెప్పింది.
అయితే, ఆ వివరణ తర్వాత కూడా త్రిసభ్య ఎన్నికల కమిషన్ పనితీరుపై సందేహాలు అలాగే ఉండిపోయాయి.
ముగ్గురిలోనూ ఇద్దరు కమిషనర్లు 14 సార్లు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా వ్యక్తంచేసినప్పటికీ ఏకగ్రీవత ఎలా సాధ్యమైంది? వాటిలో కనీసం కొన్నిటికైనా ఆమోదయోగ్యత ఉండకుండా ఉంటుందా? తమ అన్ని అభ్యంతరాలనూ అంత తేలిగ్గా వదిలేసుకుని ఏకగ్రీవామోదం తెలిపారంటే కమిషనర్లుగా వారి అర్హత ప్రశ్నార్థకం కావడంలేదా?
లేదా, అంతకన్నా ముఖ్యంగా ఆ నిర్ణయాలన్నిటినీ మొదట ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థాయిలో తీసుకుని, ఆ తర్వాత మిగతా ఇద్దరి ముందు ఉంచారనుకోవాలా? అవి ముగ్గురూ కూర్చుని చర్చించుకుని తీసుకున్న నిర్ణయాలు కావా?
అసలు ఎన్నికల కమిషన్ పని చేసే తీరు ఎలాంటిది? అన్నిటికన్నా మౌలికమైన ప్రశ్న, ఓటర్ జాబితాల రివిజన్ రొటీనుగా జరిగేదే అయినా, ఈసారి మాత్రమే ఎందుకింత వివాదాస్పదమైంది? – ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు ఇప్పటికీ ఉత్పన్నమవుతూనే ఉన్నాయి.
కేంద్రీకృతమైన డేటా – దిద్దుబాటు చర్యలు
‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ప్రచురించిన మరో కథనం ప్రకారం, తాజాగా సెప్టెంబర్ 29న కూడా ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా లిఖితపూర్వకంగానూ, వీడియో సమావేశం ద్వారానూ చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు(సీఈఓ) కొన్ని ఆదేశాలిచ్చింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన 20 రాష్ట్రాలు-కేంద్రపాలితప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి ‘తొలగించిన’ పేర్లను తిరిగి చేర్చడానికి ‘స్పెషల్ డ్రైవ్’ చేపట్టాలనీ, అది ఫారం-6లో కొత్తగా చేర్చిన ప్రశ్నను తొలగించి జరగాలనీ ఆదేశించింది(అంతర్జాలంలో ఆ ఫారంలో చేర్చిన ప్రశ్న -వెనకటి ఎస్ఐఆర్ తర్వాత దరఖాస్తుదారు తల్లిదండ్రుల పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయా లేదా అని అడిగి; దానికి సమాధానం రాయని దరఖాస్తును తిరస్కరించిందనీ, ఫారం-6లో ఎలాంటి మార్పు చేయాలన్నా ప్రభుత్వమే చేయాలి తప్ప ఎన్నికల కమిషన్‌కు ఆ అధికారం లేదనీ, దానిని కమిషన్ ఉల్లంఘించిందనీ ఇక్కడ వివరణ. దీనినే మిగతా ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించారు), ఎస్ఐఆర్కు ముందున్న ఓటర్ జాబితాలతో ఎస్ఐఆర్ తర్వాతి జాబితాలను పోల్చి చూసి, ఎవరి పేర్లనైనా అన్యాయంగా తొలగించినట్టు కనిపిస్తే అసలైన రూపంలోని ఫారం-6 ద్వారా వారి పేర్లను తిరిగి ఓటర్ జాబితాలో చేర్చాలనీ ఆ ఆదేశాల సారాంశం.
అలాగే, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అన్ని బాధ్యతలూ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్ఓ), జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ)లకే ఉంటాయనీ, అయినా సరే, ఓటర్ జాబితాలకు సంబంధించిన డేటా బేస్ మొత్తాన్ని డైరెక్టరల్ జనరల్(ఐటీ) అందుబాటులోనూ, నియంత్రణలోనూ ఉంచి కేంద్రీకరించారనీ, పైన పేర్కొన్న అధికారులకు అందుబాటులో లేకుండా చేశారనీ కమిషనర్లలో ఒకరైన సుఖ్ బీర్ సింగ్ సాంధు పేర్కొంటూ దానిపై ఆగస్టు 14న లిఖితపూర్వకంగా తన అభ్యంతరాన్ని నమోదుచేశారని ఎక్స్ ప్రెస్ కథనం చెబుతోంది.
డైరెక్టర్ జనరల్(ఐటీ)కు అలా చేసేందుకు ఎలాంటి అధికారమూ లేదని సాంధు అన్నట్టు అది చెబుతోంది.
మరో కమిషనర్ వివేక్ జోషి కూడా ఈ కేంద్రీకరణను తప్పు పట్టి, దానిపై ఆడిట్ జరగాలని లిఖితపూర్వకంగా కోరారనీ, కానీ సెప్టెంబర్ 26న కమిషన్ సమావేశమయ్యే వరకూ ఈ ఇరువురి అభ్యంతరాలకూ కమిషన్ జవాబు ఇవ్వలేదని కూడా ఎక్స్ ప్రెస్ కథనం చెబుతోంది.
తాజా ఆదేశాల ద్వారా ఎన్నికల కమిషన్ ఆ పొరపాటును దిద్దుకుంది.
ఓటర్ల పాట్లు – మేధావుల మౌనం
ఈ దిద్దుబాటు హడావుడిని చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏడాదికాలంగా జరుగుతున్న ఎస్ఐఆర్ కసరత్తులో పొరపాట్లు దొర్లిన మాట నిజం; మొదటి నుంచి అనుమానించినట్టు కమిషన్ వ్యవహరణలో తొందరపాటు ఉన్న సంగతి నిజం; మిగతా ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన మాట నిజం; ప్రత్యేకించి మయన్మార్ నుంచి(రోహింగ్యాలు), బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా లక్షల సంఖ్యలో వలస వచ్చినట్టు చెబుతున్న ఒక మతానికి చెందినవారిని ఓటర్ల జాబితాలనుంచి ఏరివేయడం ఎస్ఐఆర్ కసరత్తు లక్ష్యాలలో ఒకటిగా మొదటి నుంచీ ప్రచారంలో ఉన్నమాట నిజం; బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనైతే అక్కడి ప్రభుత్వాలూ, పార్టీశ్రేణులూ ఎస్ఐఆర్ పై ప్రత్యేక ఆసక్తి చూపుతూ ఎన్నికల కమిషన్ కు ఉపాంగంగా వ్యవహరించిన మాట నిజం.
అటువంటిది, 13 కోట్లమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తున్న ప్రస్తుత సందర్భంలో ఈ అక్రమ విదేశీయుల వలస ప్రస్తావనే లేకుండా కేవలం ఓటర్ జాబితాలనుంచి మృతుల పేర్లను, నకిలీ పేర్లను, వేరొక చోటికి బదిలీ అయిన వారి పేర్లను తొలగించడం కోసమే- సాధారణపద్ధతిలోనే- ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అమలు చేయడం జరిగిందని ఎన్నికల కమిషన్ తాజా సంజాయిషీ.
ఏతావతా ఏం తేలుతోంది? తెరవెనుక ఉద్దేశాలు, దురుద్దేశాల ఆరోపణలకు సంబంధించిన నిజానిజాల్లోకి తలదూర్చాల్సిన అవసరం లేకుండానే, ఎన్నికల కమిషన్ వ్యవహరణలో పొరపాట్లు దొర్లినట్టు మామూలు చూపులకే తెలిసిపోతోంది.
దాదాపు ఎనిమిది దశాబ్దాల ప్రజాస్వామిక స్వతంత్రభారత చరిత్రలో అనేకసార్లు ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఉన్న ఎన్నికల కమిషన్ స్థాయిలో దొర్లవలసిన పొరపాట్లు కావవి. అదీ ఈ దేశపౌరులను ఎక్కువ ఆందోళన పరిచే విషయం.
ఓటు హక్కును చలాయించుకోగలగడం ద్వారా ప్రజలకే ప్రభుస్థానం కల్పించే ప్రజాస్వామ్యంలో- ఇన్నేళ్ళ స్వతంత్రభారత ఎన్నికల చరిత్రలో మొదటిసారి- ఆ ప్రజాప్రభువులే తమ హక్కును కాపాడుకోవడం కోసం పరుగులు తీయవలసి రావడం, తమ హక్కుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగవలసి రావడం, ఈలోపల కొందరు ఎన్నికలలో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవలసి రావడం వంటి అనేకానేక వైపరీత్యాలు చోటుచేసుకున్నాయి.
తెరవెనుక కారణాలలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండానే చెప్పుకుంటే, ఎన్నికల కమిషన్ అసమర్థ వ్యవహరణకు ఓటర్లు మూల్యం చెల్లించుకోవలసివచ్చింది.
కమిషన్ గురించిన మొత్తం చర్చలో ప్రస్తావనకు రాని అతి ముఖ్య కోణాలలో ఇది ఒకటి.
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్లతో సహా ఎన్నికల సంఘంలో పనిచేసిన ఎందరో కమిషన్ పనితీరును తప్పుపడుతున్నారు. వారందరికీ రాజకీయపక్షపాతాన్ని అంటగట్టగలమా?
అదలా ఉంచితే, పైకే కనిపించిపోతున్న కమిషన్ వైఫల్యాలు, పొరపాట్లవైపు అసలు చూడనే చూడకుండా ప్రభుత్వపక్షంతో గొంతుకలిపి ప్రతిపక్షంపై కత్తులు నూరే కార్యక్రమంలో, ఇంతకుముందు చెప్పుకున్నట్టు, గత పదిహేను, ఇరవయ్యేళ్ళలో కొత్తగా ‘మేలుకున్న’ విద్యాధికవర్గం భాగస్వామి అయింది. దాంతో దేశంలో భావజాల, రాజకీయపాక్షితలకు అతీతంగా తప్పును తప్పుగా ఎత్తిచూపే వర్గం క్రమంగా మైనారిటీ అయింది.
కొత్తగా ‘మేలుకున్న’ వర్గంలో పాత్రికేయులతో సహా వివిధారంగాలకు చెందిన మేధావులు ఉన్నారు.
చివరికి ఒకప్పుడు ఇండియన్ ఎక్స్ ప్రెస్, హిందూలాంటి పత్రికల్లో, అనేక ప్రసిద్ధ భాషాపత్రికల్లో పనిచేసిన, ఇప్పటికీ పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఎక్స్ ప్రెస్ కథనాన్ని తప్పుపడుతూ, దాని మూలాన్ని, దాని విశ్వసనీయతను ప్రశ్నిస్తూ, ఎన్నికల కమిషన్‌ను, కేంద్రప్రభుత్వాన్ని వెనకేసుకువస్తూ ప్రతిపక్షాలపై మేకులు చెక్కడం దేశం తిరిగిన ప్రమాదకరమైన మలుపును అత్యంత ప్రస్ఫుటంగా కళ్ళకు కట్టిస్తుంది.
కారణం, అన్ని రకాల విలువలను, ఔచిత్యలను, ప్రజాహితంతో పెనవేసుకున్న పరిపాలనా లక్ష్యాలనూ వెనక్కి నెట్టేసి, భావోద్వేగాలను రెచ్చగొట్టే మతాధారిత అజెండా అమలు ఒక్కటే ఉన్నతోన్నత లక్ష్యంగా మారడమే.
ఈ క్రమంలో ఒక్క ఎన్నికల కమిషనే ఏమిటి, చట్టసభలు, ప్రజాస్వామ్యం సహా సమస్త అంగాలూ ఆరోవేలు కావడం ఒకటైతే, ప్రస్తుతానికి మతాధారిత అజెండా అమలులో అదనపు వేళ్ళు కావడం అనివార్య పరిణామంలానే కనిపిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
