దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు, ఆఫీసర్లు శుక్రవారం ఒక్క రోజు సమ్మె చేశారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకుల్లో లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని, బ్యాంకుల పని తీరు ఆధారంగా ఉద్యోగులకు చెల్లించే ప్రోత్సాహకాలను సమీక్షించాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు, ఆఫీసర్ల జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశారు.
ఏడు బ్యాంక్ ఉద్యోగులు, ఆఫీసర్ల సంఘాలతో ఏర్పడిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ల(యుఎఫ్‌బీయు) పిలుపు మేరకు సమ్మె జరిపారు.
సమ్మె కారణంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలతో పాటు సైబరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ శాఖలు మూతపడ్డాయి.
నిరవధిక సమ్మె హెచ్చరికలు..
కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 28, 29, 30వ తేదీలలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా మరోసారి సమ్మె చేస్తామని, అయినప్పటికీ ప్రభుత్వం తన మొండి వైఖరికి స్వస్తి చెప్పకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెను ప్రారంభించగలమని ఏఐబీఈఏ, ఏఐబీఓసీ, ఎన్సీబీఈ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ, ఐఎన్‌బీఈఎఫ్, ఐఎన్‌బీఓసీ సంఘాలతో ఏర్పాటైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయు) నాయకులు ప్రకటించారు.
సమ్మెలో భాగంగా ఉద్యోగులు, ఆఫీసర్లు కోఠీ బ్యాంక్ స్ట్రీట్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్థానిక ప్రధాన కార్యాలయానికి వేల సంఖ్యలో చేరుకొని తమ డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.
ప్రభుత్వ మొండి వైఖరిపై నిరసన..
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్లు(యుఎఫ్‌బీయు) తెలంగాణ శాఖ కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్ అధ్యక్షతన సభ జరిగింది.
సభలో తొలుత ఎన్సీబీఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచంలో 140 దేశాలలో బ్యాంక్ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.
మన దేశంలో కూడా ఐదు రోజుల పని విధానం అమలుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సుముఖతను వ్యక్తం చేస్తూ ద్వైపాక్షిక ఒప్పందంలో కూడా అంగీకరించారని, అయినప్పటికీ ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని అమలు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు.
ఏఐబీఈఏ జాతీయ అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ, తమ డిమాండ్లను సాధించే వరకు ఇదే పట్టుదల, ఐక్యతను కొనసాగించాలని కోరారు.
కొత్త పెన్షన్ స్థానంలో పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, వేతన సవరణ చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
బీఈఎఫ్ఐ నాయకులు వెంకట్రామయ్య, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణ కుమార్, ఆర్బీఐ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హరీష్‌తో పాటు బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు రాజ్ కుమార్ నాయక్ కూడా ప్రసంగించారు.
కార్మికులకు ఘన సన్మానం..
ఇదిలా ఉండగా, ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు కాలినడకన వచ్చిన 120 మంది కెనరా బ్యాంక్ ఉద్యోగులు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను మినహాయించి తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్ర జరిపిన ఉమామహేశ్వర్ రావు అనే ఉద్యోగికి సభలో ఘనంగా సన్మానించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
