135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రంథాలయం సంస్థాగత కొనసాగింపునకు అవసరమైన ఏర్పాట్లు, ప్రస్తుత భవనాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించే ముందే ఎందుకు పక్కాగా చేయలేకపోయారు?
తన గత వైభవాన్ని స్మారక చిహ్నాల రూపంలో శాశ్వతం చేయాలని ప్రయత్నిస్తున్న ఒక దేశం, ఆ గతాన్ని భద్రపరిచే పుస్తకాలకే చోటు కల్పించలేని పరిస్థితిని ఎదుర్కొంటే దాని అర్థం ఏమిటి?
2026 సెప్టెంబరులో, 8.5 లక్షలకు పైగా పుస్తకాలు, పత్రాలను తనలో భద్రపరిచిన 135 ఏళ్ల చరిత్ర కలిగిన కేంద్ర సచివాలయ గ్రంథాలయం (Central Secretariat Library – CSL) తరలింపు ముప్పును ఎదుర్కొంది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన వివాదాస్పద సెంట్రల్ విస్టా పునర్వికాస ప్రాజెక్టులో భాగంగా, ఈ గ్రంథాలయం ఉన్న శాస్త్రి భవన్‌ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
1891లో ‘ఇంపీరియల్ సచివాలయ గ్రంథాలయం’గా ప్రారంభమైన ఈ సంస్థ, వలస పాలకులు తమ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చిన పరిణామాన్ని, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన చారిత్రక ఘట్టాన్ని, ఆ తర్వాత దేశంలో చోటుచేసుకున్న వరుస ప్రభుత్వ మార్పులను సైతం తట్టుకుని తన ప్రస్థానాన్ని కొనసాగించింది.
అయితే ఇప్పుడు అది మరోసారి రూపాంతరం చెందాల్సిన పరిస్థితి ఎదుర్కొంటుండగా ఆ ప్రక్రియ మాత్రం అంత సులభంగా సాగడం లేదు.
కర్తవ్య భవన్-2లో కేవలం రెండు గదులా?
‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం ప్రకారం ప్రస్తుతం ఈ గ్రంథాలయం నాలుగు అంతస్తుల్లో దాదాపు 5,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ పుస్తకాలన్నింటినీ భద్రపరిచేందుకు తొలుత కర్తవ్య భవన్-2లో రెండు గదులను కేటాయిస్తామని ప్రతిపాదించారు.
అయితే ఆ స్థలం గ్రంథాలయంలోని పుస్తకాలన్నింటినీ ఉంచడానికి సరిపోదని పేర్కొంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆ కథనం వెల్లడించింది.
ఆ తర్వాత కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. కర్తవ్య పథ్ పునర్వికాస ప్రణాళికలో భాగంగానే గ్రంథాలయం కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మించాలని నిర్ణయించామని, ఆ నిర్మాణ పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది.
అయితే ఈ హామీతో గ్రంథాలయం భవిష్యత్తుకు సంబంధించిన సందేహాలు తొలగిపోలేదు. అసలు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? గ్రంథాలయానికి కేటాయించబోయే స్థలం ఎంత? పుస్తకాలన్నింటినీ భద్రపరిచేందుకు తగిన సౌకర్యాలు ఉంటాయా? అనే ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.
సుప్రీంకోర్టు సుమోటో విచారణ
ఈ అంశాన్ని సుప్రీంకోర్టు స్వయంగా (సుమోటోగా) విచారణకు స్వీకరించింది. అక్టోబరు 5న ప్రతిపాదిత గ్రంథాలయ భవనానికి కేటాయించిన స్థలం ఎంత, దాని నిర్మాణ రూపకల్పన ఎలా ఉండబోతోంది అనే వివరాలతో కూడిన సమగ్ర అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతేకాకుండా శాస్త్రి భవన్లో ఉన్న పుస్తకాలతో పాటు ప్రస్తుతం ఆర్కే పురంలో అట్టపెట్టెల్లో భద్రపరిచిన సుమారు రెండు లక్షల పుస్తకాలను కూడా ఈ కొత్త భవనంలో ఉంచడానికి వీలుంటుందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరింది.
ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా వ్యవహరించేందుకు సీనియర్ న్యాయవాది హరిప్రియ పద్మనాభన్‌ను అమికస్ క్యూరీగా(Amicus Curiae) నియమించింది. అమికస్ క్యూరీ అంటే న్యాయస్థానానికి అవసరమైన న్యాయపరమైన, ఇతర సంబంధిత అంశాలపై సహాయం అందించే న్యాయ నిపుణుడు.
దీని నుంచి తలెత్తే ప్రశ్న నిస్సందేహంగా పుస్తకాల భవిష్యత్తుకు సంబంధించినది. కానీ ఈ ప్రణాళికాబద్ధమైన తరలింపు తర్వాత ఏ విధమైన చారిత్రక సంస్థ మనుగడ సాగిస్తుంది, గతాన్ని పరిరక్షించడానికీ వర్తమానంలో అది ప్రజల ముందుకు వచ్చే విధానాన్ని నియంత్రించడానికీ మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఈ సంఘటన మనకు ఏమి వెల్లడిస్తుంది అనే దాని గురించి కూడా ఇది ప్రశ్నిస్తుంది.
సెంట్రల్ విస్టా ఒక చారిత్రక వారసత్వం
న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా భారతదేశ రాజకీయ భావజాలంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. ఎందుకంటే దానికి చరిత్రలో ఎప్పుడూ ఒకే చారిత్రక అర్థం లేదు. ఎడ్విన్ లుట్యెన్స్ రూపొందించిన ప్రణాళిక ప్రకారం బ్రిటిష్ సామ్రాజ్య రాజధానికి ఉత్సవాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించే కేంద్రంగా దీనిని నిర్మించారు.
అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ రాజ్ స్థానంలో ఏర్పడిన భారత గణతంత్రం అదే నిర్మాణాలను తన అవసరాలకు అనుగుణంగా స్వీకరించుకుంది.
ఒకప్పుడు ‘కింగ్స్‌వే’గా పిలిచిన మార్గానికి ‘రాజ్‌పథ్’గా పేరు మార్చారు. బ్రిటిష్ సామ్రాజ్య పాలన కోసం నిర్మించిన భవనాలే ప్రజాస్వామ్య భారతదేశ పరిపాలనా కేంద్రాలుగా మారాయి.
వలస పాలకుల సార్వభౌమాధికారాన్ని చాటిచెప్పేందుకు రూపొందించిన ఈ ప్రదేశమే స్వతంత్ర భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచింది.
రాజకీయ అధికారాన్ని స్థాపించడంలో, దాని ప్రాభవాన్ని చాటి చెప్పడంలో నిర్మాణ కళ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తూనే ఉంది. అందువల్ల 1947లో నూతన భారతదేశం ఆవిర్భవించిన తొలినాళ్ల నుంచే సెంట్రల్ విస్టా ఒక చారిత్రక వారసత్వానికి ప్రతీకగానూ, ఆ వారసత్వాన్ని కొత్త అర్థాలతో పునర్వ్యాఖ్యానించే ప్రదేశంగానూ నిలిచింది.
ప్రస్తుతం చేపడుతున్న పునర్వికాస ప్రాజెక్టు కూడా సెంట్రల్ విస్టా చారిత్రక అర్థాన్ని మరోసారి మార్చే ప్రయత్నంలో భాగమే.
కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం, రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చడం, కొత్త ప్రభుత్వ సముదాయాల నిర్మాణం వంటివి కేవలం పరిపాలనా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి మాత్రమే ఉద్దేశించినవి కావు.
గతంలో జరిగినట్లుగానే దేశం తనను తాను ప్రపంచానికి ఎలా ప్రతిబింబించుకోవాలనే దానికి ఒక కొత్త భాష్యాన్ని, కొత్త రూపాన్ని ఈ నిర్మాణాలు ఆవిష్కరిస్తున్నాయి.
అయితే ఈసారి కేవలం పేర్లు మార్చడం, ఉన్న నిర్మాణాల అమరికను మార్చడం మాత్రమే జరగడం లేదు. పాత భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలో కొత్త నిర్మాణాలను చేపడుతున్నారు. తద్వారా దేశం తనను తాను ఎలా ప్రతిబింబించుకోవాలనే దానికి ఒక సరికొత్త దృశ్యరూపాన్ని, కొత్త నిర్మాణ శైలిని అందిస్తున్నారు.
యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియంగా
ఈ పునర్వికాస ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఉపయోగిస్తున్న భాషలోనూ ఈ లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. 2026 ఫిబ్రవరిలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌ల నుంచి కొత్త ప్రభుత్వ కార్యాలయాలైన ‘సేవా తీర్థ్’, ‘కర్తవ్య భవన్’లకు మారడాన్ని మోదీ మంత్రివర్గం ఒక ప్రతీకాత్మక పరిణామంగా అభివర్ణించింది.
బానిసత్వ గతం నుంచి బయటపడి అభివృద్ధి చెందిన భారతదేశం వైపు అడుగులు వేయడంగా ఈ మార్పును ప్రభుత్వం పేర్కొంది.
ఈ పునరాభివృద్ధి, పునర్వ్యవస్థీకరణలో భాగంగా నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లకు కూడా కొత్త అర్థం రాబోతోంది. అవి ఖాళీ అయ్యాక “యుగే యుగీన్ భారత్ నేషనల్ మ్యూజియం”గా మారుతాయి.
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది భారతదేశపు “వేల సంవత్సరాల నాగరికత, సాంస్కృతిక వారసత్వాన్ని” ప్రదర్శించే మెగా మ్యూజియం.
ఒకప్పుడు సామ్రాజ్య పాలనకు, ఆ తర్వాత స్వతంత్ర భారత పరిపాలనకు చిహ్నాలుగా ఉన్న ఈ రెండు భవనాలను జాతీయ చరిత్ర విశాల భాండాగారంగా మార్చడం నిస్సందేహంగా ఒక ప్రతిష్ఠాత్మక ప్రయత్నమే.
అయినా ఇక్కడ ఒక వైరుధ్యం ఉంది. భారతదేశ గతాన్ని చెప్పే కొత్త స్థలాన్ని సృష్టించడానికి వాస్తుపరంగా, ప్రదర్శనపరంగా ఎంతో శ్రద్ధ పెడుతున్నారు.
అదే సమయంలో, దేశ రాజకీయ, పరిపాలనా చరిత్రను పరిశోధించడానికి అవసరమైన సామగ్రి ఉన్న ఒక సంస్థ భవిష్యత్ స్థలం కోసం న్యాయస్థానం పరిశీలన అవసరమైంది. ఇక్కడ కనిపించే తేడా ఇది: దేశం మెచ్చుకునేలా తీర్చిదిద్దిన చరిత్ర ఒకవైపు, పౌరులు స్వేచ్ఛగా గతాన్ని ప్రశ్నించగలిగేలా అందుబాటులో ఉండాల్సిన మేధో చరిత్ర మరోవైపు.
సరళంగా చెప్పాలంటే, దేశాన్ని ఒక స్మారక చిహ్నంగా చూపడానికీ, ప్రజల జీవన చరిత్రల భాండాగారంగా చూడటానికీ మధ్య ఉన్న తేడా ఇది.
![[ఫైల్ చిత్రం: సెంట్రల్ విస్టా పునర్వికాస ప్రాజెక్టులో భాగంగా కొత్త 'కర్తవ్య భవన్' భవనాల నిర్మాణానికి మార్గం సుగమం చేసేందుకు, శాస్త్రి భవన్‌ను కూల్చివేయడానికి ముందు దానిని ఖాళీ చేసే ప్రక్రియను కేంద్ర ప్రజాపనుల శాఖ ప్రారంభించింది. ఇందులో భాగంగా, 2026 సెప్టెంబరు 22, మంగళవారం నాడు న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ వెలుపల కార్మికులు ఎయిర్ కండిషనింగ్ యంత్రాలను ఒక ట్రక్కులోకి ఎక్కిస్తున్నారు. ఫోటో: పీటీఐ / సల్మాన్ అలీ]](https://i0.wp.com/thewiretelugu.co.in/wp-content/uploads/2026/11/Untitled-7-copy-5.jpg?resize=640%2C416&ssl=1)
నా వాదన చారిత్రక కథనాన్ని తీర్చిదిద్దడానికీ, చారిత్రక కథనాలను నిర్మించుకోవడానికి వీలు కల్పించే సామగ్రిని అందుబాటులో ఉంచడానికీ మధ్య ఉన్న తేడా గురించి.
చరిత్రను మూటగట్టడం
సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీలో ప్రభుత్వ ప్రచురణలు, గెజిటీర్లు, పరిపాలనా నివేదికలు, అరుదైన పుస్తకాలు, చారిత్రక పత్రాలు ఉన్నాయి. ఇవి మారుతున్న రాజకీయ పాలనల కాలంలో పేరుకుపోయినవి. ఈ సామగ్రి అమూల్యం కావడానికి కారణం దీని అర్థాలను ముందే నిర్ణయించలేకపోవడం. ఇది అధికారిక గత కథనాన్ని ధ్రువీకరించవచ్చు లేదా అందులోని లోపాలను బయటపెట్టవచ్చు. విధానానికీ ఆచరణకీ మధ్య ప్రభుత్వాలు చెప్పినదానికీ, చేసినదానికీ మధ్య ఉన్న దూరాన్ని పరిశోధకులు గుర్తించడానికి ఇది తోడ్పడుతుంది.
మ్యూజియం సందర్శకులకు చరిత్రకు ఒక వ్యాఖ్యానాన్ని అందిస్తుంది. కానీ గ్రంథాలయం చాలాసార్లు (ఈ సందర్భంలో కచ్చితంగా) తన సంరక్షకులు ఊహించని వ్యాఖ్యానాలకు అవకాశం కల్పించే స్థలంగా పనిచేస్తుంది.
రాజ్యం తన చారిత్రక భూభాగాన్ని భారీ స్థాయిలో పునర్నిర్మించడంలో నిమగ్నమైనప్పుడు ఈ తేడా మామూలు కంటే మరింత కీలకమవుతుంది.
నిజానికి జాతీయ స్థాయి చారిత్రక పత్రాల భాండాగారాలను తరలించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే వాటిలో భద్రపరిచిన వస్తువులు, కళాఖండాలు, సాంస్కృతిక పత్రాలు వీలైనంత వరకు ఎలాంటి నష్టం, ప్రమాదం వాటిల్లకుండా రక్షించాల్సిన విలువైన చారిత్రక సంపద.
భవనాన్ని లేదా ఆ సంపదను కాపాడటానికి అత్యవసరంగా తరలించాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్ప సాధారణంగా ఇలాంటి సంస్థలను మరోచోటికి మార్చరు. ఎందుకంటే అత్యంత జాగ్రత్తగా తరలింపు ప్రక్రియను చేపట్టినప్పటికీ ఆ క్రమంలో వాటికి ఎలాంటి నష్టం జరగదనే పూర్తి హామీ ఉండదు.
చరిత్రకారులు లేవనెత్తిన ఆందోళనలకు సమాధానంగా వారసత్వ భవనాన్ని యథాతథంగా కొనసాగిస్తామని, సంస్థను ఆధునీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ వివాదం ఒక మౌలికమైన సమస్యను బయటపెట్టింది.
ఒక చారిత్రక భవనాన్ని పరిరక్షించడం వేరు, ఆ భవనంలో ఉన్న సమస్త చారిత్రక సంపదను ప్రజలకు, పరిశోధకులకు నిరంతరం అందుబాటులో ఉంచడం వేరు.
పదిహేనేళ్ల తర్వాత ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం ఆ పుస్తకాల విభాగాల్లో కొన్ని తిరిగి ప్రారంభమైనప్పటికీ పుస్తకాలలో అత్యధిక భాగం ఇప్పటికీ ఆర్.కె పురంలోని అట్టపెట్టెల్లోనే మూలుగుతున్నాయి. ఆ కథనం ద్వారా నాకు అర్థమైనంతవరకు ఆ పుస్తకాలు ధ్వంసం కాలేదు. ప్రమాదవశాత్తూ ఎలాంటి నష్టం కూడా వాటిల్లినట్లు కనిపించడం లేదు. అవి భౌతికంగా సురక్షితంగానే ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలను ప్రజలు వినియోగించుకునే అవకాశం మాత్రం అలాగే ఉందని చెప్పలేం.
ఒక పుస్తకం అట్టపెట్టెలో భద్రంగా ఉండవచ్చు. ఒక గదిలో అది భౌతికంగా ఉనికిలో ఉండవచ్చు. కానీ గ్రంథాలయానికి వచ్చి ఆ పుస్తకాన్ని ఒక విజ్ఞాన వనరుగా ఉపయోగించుకునే వ్యక్తికి మాత్రం అది అందుబాటులో లేకపోతే అతని ప్రపంచంలో ఆ పుస్తకం కనుమరుగైనట్లే. పుస్తకం భద్రంగా ఉన్నంత మాత్రాన దాని విజ్ఞానం ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు కాదు.
ఆర్.కె. పురంలోని పుస్తకాలన్నింటినీ కొత్త కేంద్ర సచివాలయ గ్రంథాలయ భవనంలో ఉంచడానికి తగినంత స్థలం ఉంటుందా లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం వల్ల, తులసీ సదన్ ఉదంతం కేవలం గతంలో జరిగిన ఒక సంఘటనకు ఉదాహరణగా మాత్రమే మిగిలిపోలేదు.
గతంలో తాత్కాలికమంటూ చేపట్టిన తరలింపు వల్ల ఎదురైన పరిణామాలు ఇప్పుడు గ్రంథాలయం ప్రస్తుత పరిస్థితికి, భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ప్రశ్నగా మారాయి.
వ్యవస్థీకృత సాంస్కృతిక విస్మృతి
ఈ పరిణామాలేవీ శాస్త్రి భవన్‌ను యథాతథంగా పరిరక్షించాలనే నిర్ణయానికి మనల్ని తీసుకురావు. అలాగే ప్రభుత్వ భవనాలను ఎప్పటికీ పునర్వికసించకూడదని గానీ, ఆధునీకరణకు, చారిత్రక పరిరక్షణకు మధ్య ఏదో పొంతన కుదరదని గానీ దీని అర్థం కాదు.
ఇక్కడ అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గ్రంథాలయం తన ప్రస్తుత భవనాన్ని ఖాళీ చేయాల్సి వస్తుందని నిర్ణయించే ముందే ఆ సంస్థ నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎందుకు పక్కాగా చేయలేదు?
ఎందుకంటే గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను నిల్వ చేసే గోదాములు కావు. వాటిలోని పుస్తకాలు, పత్రాలు ప్రజలకు ఉపయోగపడాలంటే వాటికి సంబంధించిన సూచికలు, వర్గీకరణ వ్యవస్థలు, పరిరక్షణ పద్ధతులు, వాటి గురించి అవగాహన కలిగిన సిబ్బంది, పాఠకులు కూర్చుని వాటిని అధ్యయనం చేయడానికి తగిన ప్రదేశాలు అవసరం.
ఈ ఏర్పాట్లన్నీ ఉన్నప్పుడే గ్రంథాలయంలోని విజ్ఞాన సంపద ప్రజలకు నిజంగా ఉపయోగపడుతుంది.
అందుకే ప్రస్తుత పరిస్థితి వల్ల పొంచి ఉన్న ప్రమాదం చారిత్రక పత్రాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం కంటే కూడా మరింత సూక్ష్మమైనది, ఆందోళనకరమైనది. ఎందుకంటే ఇది గతాన్ని మరచిపోయేలా చేసే ఒక వ్యవస్థీకృత నిర్మాణానికి దారితీస్తుంది.
ఫలితంగా గత చరిత్రకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు, వాటిలో నిక్షిప్తమైన సంక్లిష్టమైన వాస్తవాలు క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడతాయి.
ఒక గ్రంథాలయాన్ని నిరవధికంగా మూసివేయడం, ఒక చారిత్రక పత్రాల భాండాగారాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం లేదా అక్కడి పుస్తకాలు, పత్రాలను ఎంతకాలమైనా తాత్కాలిక నిల్వ కేంద్రాలకు చెదరగొట్టి ఉంచడం వల్ల అవి సాంకేతికంగా ‘పరిరక్షించబడినట్లే’ కనిపించవచ్చు. కానీ వాస్తవానికి అవి ప్రజల విజ్ఞాన, మేధో జీవితంలో నుంచి అదృశ్యమైనట్లే.
దేశ రాజకీయ, పరిపాలనా వ్యవస్థలో ఇలాంటి పరిణామం ఒక రకమైన సాంస్కృతిక విస్మృతికి, అంటే చరిత్రను క్రమంగా మరచిపోయే పరిస్థితికి దారితీస్తుంది.
జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు
సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చరిత్రకు సంబంధించిన అంశాలపైనే అత్యంత స్పష్టంగా దృష్టి సారిస్తున్నందున ఈ సమస్య మరింత ప్రస్ఫుటంగా మన ముందుకొస్తోంది.
సమకాలీన భారతదేశం తనను తాను ఎలా అర్థం చేసుకుంటోంది, తన చారిత్రక వారసత్వాన్ని ఎలా ప్రతిబింబించుకోవాలనుకుంటోంది అనే విషయాలను చాటిచెప్పేందుకు వారసత్వంగా లభించిన భవనాలు, చిహ్నాలు, ప్రదేశాల స్వరూపాన్ని మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
అలాంటి సందర్భంలో స్మారక చిహ్నాల మాదిరిగా అందరి దృష్టినీ ఆకర్షించని చారిత్రక విజ్ఞాన సంపదను భద్రపరిచే మౌలిక వ్యవస్థల ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. అంటే గ్రంథాలయాలు, చారిత్రక పత్రాల భాండాగారాలు వంటి సంస్థలు.
ఎందుకంటే ఇవే చరిత్రను కేవలం ప్రదర్శనకు పరిమితం చేయకుండా దానిని అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి, ప్రశ్నించడానికి అవసరమైన ఆధారాలను అందిస్తాయి.
ప్రభుత్వం చెబుతున్నట్లుగా కేంద్ర సచివాలయ గ్రంథాలయం కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని నిర్మిస్తున్నట్లయితే ఆ నిర్మాణం విషయంలో తగినంత స్థలం, పుస్తకాలు, పత్రాల పరిరక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన సిబ్బంది, పుస్తకాలన్నింటినీ క్రమబద్ధంగా భద్రపరిచే ఏర్పాట్లు, ప్రజలకు అర్థవంతమైన రీతిలో అందుబాటులో ఉండే సౌకర్యాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంది.
ఒక పరిశోధకురాలిగా నా ముందుకు కొన్ని సహజమైన ప్రశ్నలు వస్తున్నాయి. కొత్త భవనంలో గ్రంథాలయంలోని పుస్తకాలు, పత్రాలన్నింటికీ చోటు కల్పిస్తారా? వాటి పరిరక్షణ కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు?
తరలింపు ప్రక్రియలో భాగంగా ఎంతకాలం పాటు ఈ పుస్తకాలు, పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉండవు? పాఠకులు మళ్లీ వాటిని ఎప్పటి నుంచి వినియోగించుకోగలుగుతారు?
గ్రంథాలయ తరలింపునకు సంబంధించిన ప్రణాళికతో పాటు దాని కాలపరిమితిని కూడా పారదర్శకంగా ప్రకటించాలి.
అంతేకాకుండా గ్రంథాలయాన్ని సుదీర్ఘకాలం పాటు మూసివేయకుండా ఉండేందుకు అవసరమైన రక్షణాత్మక చర్యలు చేపట్టాలి. తులసీ సదన్ గత అనుభవం నాలో ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఈ ప్రశ్నలు మరింత అత్యవసరమైనవిగా నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ‘తాత్కాలికం’ అని చెప్పి చేపట్టిన ఒక తరలింపు, పుస్తకాలు మరో దశాబ్దం పాటు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయే పరిస్థితికి దారితీయవచ్చు.
గ్రంథాలయాలు, స్మారకాలు
ఇక్కడ మరింత విస్తృతమైన సమస్య చరిత్రకు, ప్రజాస్వామ్య పౌరసత్వానికి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించినది.
ఒక దేశం తన గత చరిత్రను కేవలం స్మారక చిహ్నాలు, చరిత్రను ప్రదర్శించే ప్రదేశాల ద్వారానే పరిరక్షించుకోలేదు. అలాంటి ప్రదేశాలు తప్పనిసరిగా అవసరమే.
అయితే ఆ చరిత్రను పరిశోధించడానికి, నిశితంగా పరిశీలించడానికి, ప్రశ్నించడానికి వీలు కల్పించే సంస్థలు కూడా దేశానికి అవసరం.
దేశ చరిత్రను పరిరక్షించడంలో ఈ రెండూ పరస్పరం ప్రత్యామ్నాయాలు కావు. ఒకదానికొకటి తోడ్పడే రెండు పరిపూరకమైన మార్గాలు.
కాబట్టి తన గత చరిత్ర పరిరక్షణ కోసం భారతదేశం చేస్తున్న కృషిని కేవలం నిర్మిస్తున్న మ్యూజియంలు, స్మారక చిహ్నాల ఆధారంగానే అంచనా వేయలేం. అంతకంటే ఆర్భాటం లేని, సాధారణంగా కనిపించే మరో అంశం ఆధారంగా కూడా అంచనా వేయాలి.
అదేమిటంటే ఆ స్మారక చిహ్నాలు చెబుతున్న చరిత్రను ప్రశ్నించడానికి అవసరమైన పుస్తకం ఒక పాఠకుడికి ఇప్పటికీ అందుబాటులో ఉందా? దానిని అతను గ్రంథాలయంలో వెతికి చదవగలుగుతున్నాడా? అన్నది.
అనువాదం: కె మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
