‘ప్రజాస్వామ్యమంటే ఐదేళ్లకోసారి ఓటు వేయడం కాదు.. ప్రతి మనిషికి గౌరవంగా బతికే హక్కు కల్పించడం. మెజారిటీ పాలన మాత్రమే ప్రజాస్వామ్యం కాదు.. మైనారిటీల హక్కులకు, వ్యక్తి స్వేచ్ఛకు, సమానత్వానికి రక్షణ కల్పించడమే నిజమైన ప్రజాస్వామ్యం’ అని కాకలుదీరిన కార్మిక నేత, సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ భాల్ చంద్ర ఖందేరావ్ కాంగో స్పష్టం చేశారు.
విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ‘సి. రాఘవాచారి ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) ప్రధాన కార్యదర్శి డి. సోమసుందర్ అధ్యక్షతన జరిగిన చక్రవర్తుల రాఘవాచారి 7వ స్మారకోపన్యాస సభలో ‘సంక్షోభంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆయన ఆద్యంతం పదునైన, ఆలోచనాత్మకమైన ప్రసంగం చేశారు.
నైతిక విలువలకు, నిబద్ధతతో కూడిన పాత్రికేయానికి మారుపేరుగా నిలిచి తెలుగు ప్రజల హృదయాల్లో ‘నడిచే ఎన్సైక్లోపీడియా’గా కొలువైన రాఘవాచారి స్మృతికి నివాళులర్పించేందుకు మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ప్రారంభం నుంచి ముగింపు వరకు కాంగో తన అనర్గళమైన ప్రసంగంతో సభను అక్షరాలా ప్రజాస్వామ్య స్ఫూర్తితో రగిలించారు.
ఏమాత్రం తడుముకోకుండా, పూర్తి సాధికారతతో సభలోని ప్రతిఒక్కరి గుండెలను తాకేలా సమకాలీన దుస్థితుల్ని వివరించారు. దేశీయ, అంతర్జాతీయ రాజకీయాలను, పోకడలను లోతుగా విశ్లేషిస్తూ ఆయన చేసిన ఉపన్యాసం సభికులను మంత్రముగ్ధులను చేసింది.

విప్లవమంటే విధ్వంసం కాదు.. అన్యాయంపై పోరాటం..
విప్లవం అనే భావనపై పాలకులు అల్లుతున్న అపోహలను కాంగో తన పదునైన విశ్లేషణతో తిప్పికొట్టారు. ‘విప్లవం అంటే ప్రతీకారం తీర్చుకోవడం కాదు. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, సమాజంలో సమానత్వాన్ని నిర్మించే వివేకం, రాబోయే తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించే దార్శనికత కలబోతే నిజమైన విప్లవం’ అని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టులంటే కేవలం కార్మిక నాయకులే కాదు
కమ్యూనిస్టులను కేవలం కార్మిక పోరాటాలకే పరిమితం చేసి చూడడం సమాజం చేసే పెద్ద పొరపాటు అని కాంగో చెప్పారు.
‘చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, కళలు.. చివరికి చిత్రసీమ వరకు ప్రతి రంగంలోనూ కమ్యూనిస్టు మేధావుల చెరిగిపోని సంతకం ఉంది. సమాజ సర్వతోముఖ పరివర్తన కోసమే కమ్యూనిస్టులు నిరంతరం ఆరాటపడతారు. రాఘవాచారి కూడా అదే అరుదైన మేధో సంప్రదాయానికి చెందిన నిబద్ధత కలిగిన విప్లవకారుడు’ అని గుర్తుచేసుకున్నారు.
సంక్షోభంలో ప్రజాస్వామ్యం: 21వ శతాబ్దపు సవాలు
20వ శతాబ్దంలో విస్తరించి, శ్రేయస్కరంగా మారిన ప్రజాస్వామ్యం- 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టేసరికి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగో ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు ప్రజాస్వామ్యం ముసుగులో ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం, మెజారిటీ వర్గాల ఆధిపత్య ధోరణి పెచ్చరిల్లుతోందని, ఫలితంగా మైనారిటీల హక్కులు, ఉనికి ప్రమాదంలో పడుతున్నాయని ఆయన హెచ్చరించారు.
జాతీయవాదం ప్రజల కోసం.. రాజకీయ ప్రయోజనాలకు కాదు..
జాతీయవాదం తప్పు కాదు. దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల బాధ్యత, దేశ వనరుల పట్ల నిబద్ధత ప్రతి పౌరుడికి ఉండాల్సిన లక్షణాలే.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయవాదం దాస్య శృంఖలాల నుంచి ప్రజల విముక్తి కోసం, దేశ సమైక్యత కోసం, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం కోసం పనిచేసింది. కానీ, నేడు జాతీయవాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని కాంగో ధ్వజమెత్తారు.
ప్రశ్నించే గొంతులను జాతీయవాదం పేరిట అణచివేయడం, భిన్నాభిప్రాయాలను దేశద్రోహంగా చిత్రించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
దేశం అంటే కేవలం భూభాగం కాదు. ఆ భూభాగంలో నివసించే ప్రజలే దేశానికి అసలైన బలం. ప్రజల సంక్షేమం లేని జాతీయవాదానికి అర్థం లేదని కాంగో స్పష్టం చేశారు.

‘ప్రజాస్వామ్యం పేరుతోనే అధికార కేంద్రీకరణ, మెజారిటీ ఆధిపత్యం, మైనారిటీల అణచివేత పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మితవాద, మతతత్వ, జాతీయవాద రాజకీయాలు బలపడుతూ ప్రజల అసలు సమస్యలను పక్కనపెట్టి గుర్తింపు ఆధారిత రాజకీయాలను ముందుకు తెస్తున్నాయి’ అని వివరించారు.
మైనారిటీల హక్కుల పరిరక్షణా ప్రధానమే..
‘ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించి అధికారంలోకి రావడం, ఆ అధికారంతో సమాజంపై తమ అభిప్రాయాలను రుద్దడం మాత్రమే ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మెజారిటీకి నచ్చని వ్యక్తులు, సమూహాలు తమ హక్కులను కోల్పోవాలా? మైనారిటీలు మెజారిటీ అభిప్రాయాలకు తలవంచి బతకాలా? ఇవే నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక ప్రశ్నలు’ అని కాంగో చెప్పారు.
రాజ్యంలో ఉన్న చిట్టచివరి మైనారిటీకి సైతం సమాన హక్కులు, రక్షణ, గౌరవం కల్పించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
మెజారిటీ పాలనకు ఎంత ప్రాధాన్యం ఉందో, మైనారిటీల హక్కుల పరిరక్షణకూ అంతే ప్రాధాన్యం ఉండాలి. మెజారిటీ ఆధిపత్యాన్ని సమాజంపై రుద్దడం ప్రజాస్వామ్యం కాదు, అది ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయడమే అని కాంగో స్పష్టం చేశారు.
జాతీయవాదం ప్రజల కోసమా? రాజకీయ లబ్ధి కోసమా?
నేటి పాలకులు జాతీయవాదాన్ని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు.
జాతీయవాదం, ఆర్థిక వనరులు అనేవి ప్రజల సంక్షేమం కోసమే ఉపయోగపడాలి తప్ప, పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను కులమతాల పేరిట విభజించే సాధనంగా మారకూడదని తేల్చిచెప్పారు.
‘అర్బన్ నక్సల్స్’ ముద్రలతో అణచివేత ధోరణులు
మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ‘అర్బన్ నక్సల్స్’ పేరిట వామపక్ష నాయకులను, హక్కుల పోరాట కార్యకర్తలను అరెస్టు చేస్తున్న తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ప్రశ్నించే గొంతులను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను కాలరాస్తున్నారని, ప్రజా సాధికారత ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ఆయన స్పష్టం చేశారు.
అశాస్త్రీయ ఆలోచనలపై దాడి: సాంకేతికత దుర్వినియోగం
ప్రధాని మోదీ అవలంబిస్తున్న అశాస్త్రీయ విధానాలపై కాంగో పదునైన విమర్శలు చేశారు. 33 ఏళ్ల క్రితం మరణించిన చిన్మయానంద స్వామితో సంభాషించినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా అశాస్త్రీయ ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
వినాయకుడి రూపం ప్రాచీన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీకి నిదర్శనమంటూ మాట్లాడడం ద్వారా మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ అజ్ఞానానికి కరతాళధ్వనులతో వైద్యులు సైతం వత్తాసు పలకటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.
ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తిపై దెబ్బ
ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వైఖరిని, ఆయనను తొలగించకుండా కాలయాపన చేస్తున్న పాలకుల తీరును కాంగో ఎండగట్టారు.
నియామక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని తొలగించి హోంమంత్రిని చేర్చడం ద్వారా ఎన్నికల వ్యవస్థల స్వయంప్రతిపత్తిని పాలకులు దెబ్బతీశారని ఆక్షేపించారు.
కార్పొరేట్ల చేతిలో సోషల్ మీడియా బందీ
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన మీడియాపై ఆంక్షలు పెరుగుతున్న వేళ, సోషల్ మీడియా కొంతవరకూ ప్రజల గొంతుకగా మారినప్పటికీ- గూగుల్, ఫేస్బుక్ వంటి కార్పొరేట్ సంస్థలు డేటాను నియంత్రిస్తూ ప్రజాస్వామ్య స్వేచ్ఛను హరిస్తున్నాయని కాంగో ఆందోళన వ్యక్తం చేశారు.
ఉచితాల రాజకీయం కాదు… మూల సమస్యలపై పోరాటం
పాలకులు కేవలం ‘సంక్షేమ రాజకీయం’ పేరుతో ఓట్ల కోసమే డబ్బులు పంచడం, ఉచితాలు ఇవ్వడం చేస్తున్నారని, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వంటి మూల సమస్యలను పక్కనబెడుతున్నారని చెప్పారు.
80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తూనే పేదరికం తగ్గిందని ప్రచారం చేయడం పరస్పర విరుద్ధ వాదన అని కాంగో దుయ్యబట్టారు.
సోషలిజం వైపు ప్రపంచ దేశాల అడుగులు
విద్య, వైద్యం, నివాస హక్కుల కోసం ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో యువత పెద్దఎత్తున వీధుల్లోకి వస్తున్నారని కాంగో వివరించారు.
అమెరికా ఎన్నికల్లో సైతం సోషలిస్టు భావజాలం కలిగిన నాయకులు గెలుపొందడం, ప్రపంచం క్రమంగా ‘సోషలిజం’ వైపు అడుగులు వేస్తోందనడానికి నిదర్శనమని విశ్లేషించారు.

గాంధీ-అంబేద్కర్లపై తప్పుడు ప్రచారం
గాంధీ, అంబేద్కర్ల మధ్య విరోధం ఉందనే ప్రచారాన్ని ఖండిస్తూ, కులాంతర వివాహాలే కుల నిర్మూలనకు మార్గమని ఇద్దరూ నమ్మారని గుర్తుచేశారు.
రాఘవాచారి కూడా అనేక కులాంతర వివాహాలకు మద్దతుగా నిలిచారని, తమ విద్యార్థి ఉద్యమంలో 50 మంది కులాంతర వివాహాలకు ప్రతిజ్ఞ చేశారని, వారిలో 49 మంది కులాంతర వివాహాలు చేసుకుని ఆ నిబద్ధతను చాటారని ఉదహరించారు. వారి కుటుంబాలు నేటికీ దివ్యంగా సాగుతున్నాయని కాంగో చమత్కరించారు.
ప్రజల సంక్షేమమే ప్రధానం
‘ప్రజల కోసం లాభాలు.. ప్రజలపై లాభాలు కాదు’ అనే ఆలోచనను ఆచరణలోకి తీసుకురావాలి. ‘లాభాపేక్ష కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యం. లాభం అనేది ప్రజల ప్రయోజనం కోసమే తప్ప, ప్రజలను దోచుకోవడానికి కాదు’ అనే సూత్రంతోనే ప్రజాస్వామ్య సంక్షోభానికి పరిష్కారం లభిస్తుంది.
ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే ఆర్థిక వ్యవస్థ, ప్రజల హక్కులను గౌరవించే రాజకీయ వ్యవస్థ, భిన్నాభిప్రాయాలను ఆదరించే సామాజిక వ్యవస్థ నిర్మాణమే ప్రజాస్వామ్య సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం- అంటూ ప్రపంచం సోషలిజం వైపు అడుగులు వేస్తోందన్న తన విశ్లేషణను కాంగో ఈ సందేశంతో ముగించారు.
అక్షర నివాళుల ఆత్మీయ సమయం
స్మారకోపన్యాసానికి ముందు సి. రాఘవాచారి చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
అభ్యాస విద్యాలయం ఉపాధ్యాయినులు ఆలపించిన మహాకవి గురజాడ గేయం ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’.. సభలో దేశాభిమాన వాతావరణాన్ని నింపింది.
రాఘవాచారి జీవిత విశేషాల ‘ఏవీ’ ప్రదర్శన
కార్యక్రమంలో రాఘవాచారి జీవిత విశేషాలను, ఆయన పత్రికారంగ ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రదర్శించిన ఆడియో విజువల్(ఏవీ) వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కెవి కృష్ణ రాయగా, మాలతి అందించిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సమాజ శ్రేయస్సే ధ్యేయంగా రాఘవాచారి ట్రస్ట్ సేవలు
సి రాఘవాచారి మేనేజింగ్ ట్రస్టీ కె జ్యోత్స్న మాట్లాడుతూ.. పాత్రికేయుల్లో నైతిక విలువలు, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, వృద్ధాప్యంలో ఉన్న సామాజిక ఉద్యమకారులకు చేయూత అందించడమే లక్ష్యంగా ట్రస్ట్ పనిచేస్తోందని వివరించారు.
సభలో సీపీఐ సీనియర్ నేత కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు అక్కినేని వనజ, పారిశ్రామికవేత్త చుక్కపల్లి అరుణకుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఘనంగా ముగిసిన స్మారక సదస్సు
బి జమీందార్ అతిథులకు స్వాగతం పలకగా, అభ్యాస విద్యాలయ ప్రిన్సిపాల్ కృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. డాక్టర్ సి అనుపమ వందన సమర్పణ చేయడంతో రాఘవాచారి 7వ స్మారకోపన్యాస సభ దిగ్విజయంగా ముగిసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
