2026 సెప్టెంబర్ 12-13వ తేదీలలో న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం సభ్య దేశాల మధ్య జరిగే వాణిజ్యాన్ని ఆయా దేశాల కరెన్సీలలో చేపట్టాలని, బ్రిక్స్ పే ద్వారా సభ్య దేశాల కరెన్సీ చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని నిర్ణయించింది.
డీ-డాలరైజేషన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చలలో భాగంగా బ్రిక్స్ దేశాలు డాలర్ స్థానంలో ప్రత్యామ్నాయ అంతర్జాతీయ కరెన్సీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తాయన్న చర్చలు కూడా ముందుకు వచ్చినా ప్రస్తుతానికి బ్రిక్స్ దేశాలు ఆ ఎజెండాను చేపట్టలేదు.
బ్రిక్స్ దేశాల రిజర్వు బ్యాంక్ గవర్నర్లు, ఆర్థిక మంత్రులు జారీ చేసిన ఉమ్మడి ప్రకటన ఈ మేరకు జాగ్రత్తలు తీసుకున్నది.
బ్రిక్స్ భాగస్వామ్య దేశాలు ఉమ్మడిగా తమ ద్రవ్య విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి 2022 నుంచి సాగిస్తున్న చర్చలు ఢిల్లీ డిక్లరేషన్‌తో ఒక కొలిక్కి వచ్చాయి.
ఉక్రెయిన్ – రష్యా, అమెరికా – ఇరాన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా ఏకపక్షంగా వివిధ దేశాలకు చెందిన డాలర్ రిజర్వులను స్తంభింప చేయడంతో అప్పటివరకు అంతర్జాతీయ లావాదేవీలకు సావకాశం కల్పించే డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ అమెరికా భౌగోళిక రాజకీయ లక్ష్యాల సాధనలో కీలక పనిముట్టుగా మారింది.
రష్యాకు చెందిన లక్షల కోట్ల రూబుల్స్ విలువైన ఆస్తులను తక్షణ వినియోగానికి అందుబాటులో లేకుండా అమెరికా చేసింది.
ఇరాన్‌తో చమురు వ్యాపారం సాగిస్తున్న దేశాలపై అమెరికా ఆంక్షలు విధించడంతో ఆయా దేశాల అంతర్జాతీయ వాణిజ్యం ప్రభావితం అయింది.
తగ్గుతున్న డాలర్ విశ్వసనీయత..
ఈ నేపథ్యంలో వివిధ దేశాలు తమ అంతర్జాతీయ ద్రవ్య నిల్వలను డాలర్ ఆధారిత నిల్వల స్థానంలో ప్రత్యామ్నాయ కరెన్సీ ఆధారిత ద్రవ్య నిల్వలుగా మార్చుకోవాల్సిన అవసరాన్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే డీ-డాలరైజేషన్ చర్చ ఉధృతం అయింది.
గత దశాబ్దానికి పైగా అమెరికా డాలర్ ఆధారిత నిల్వలను చైనా క్రమంగా వేరువేరు కరెన్సీల ఆధారిత నిల్వలుగా మార్చుకుంటూ వస్తోంది. అందువల్ల బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ విషయంలో గానీ, రష్యా నుండి చమురు కొనుగోలు చేసే విషయంలో గానీ, ఇరాన్‌కు ఆర్థిక, సాంకేతిక సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ అమెరికా వివిధ దేశాలపై విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న నిర్ణయాల తరహాలో చైనాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడానికి తటపటాయించింది.
వాణిజ్యాంశాల విషయంలో కూడా ఈ విషయం స్పష్టంగా బట్టబయలైంది. అమెరికా విధించిన ఆంక్షలకు భారతదేశం వంటి దేశాలు తలొగ్గినా చైనా, బ్రెజిల్, రష్యా వంటి దేశాలు ఆంక్షలను ధిక్కరించి నిలిచాయి.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంపై ఆసక్తి నెలకొన్నది.
బ్రిక్స్ దేశాలు ఏకంగా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ ఉమ్మడి కరెన్సీని తెరమీదకు తేవటం కంటే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు డాలర్ ఆధారిత లావాదేవీలపై ఆధారపడే మోతాదులను క్రమక్రమంగా తగ్గించుకుంటూ ద్రవ్య రంగంలో స్వయం ప్రతిపత్తికి స్వావలంబనకు మార్గం సిద్ధం చేసుకోవాలని నిర్ణయించాయి.
తద్వారా వివిధ దేశాల మధ్య మారుతున్న దౌత్య సంబంధాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాయి.
అయితే బ్రిక్స్ దేశాల మధ్య పూర్తిస్థాయి ద్రవ్య లావాదేవీల సమన్వయం జరగాలంటే ఆయా దేశాల మధ్య ఉన్న వాణిజ్య లావాదేవీలు, కరెన్సీ మారకానికి ఉన్న పరిమితులు, ద్రవ్య మార్కెట్లో నిర్వహణలో ఉన్న గందరగోళం వంటి సమస్యలు పరిష్కారం కావాలి. న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో వీటి గురించి పెద్దగా ప్రస్తావన లేదు.
రిజర్వ్ కరెన్సీకి, మారకపు కరెన్సీకి తేడా..
బ్రిక్స్ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే మారకపు కరెన్సీకి రిజర్వు కరెన్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.
అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ నిలకడగా స్వయం సమృద్ధంగా ముందుకు సాగాలంటే ఒక ఉమ్మడి రిజర్వ్ కరెన్సీ అవసరం.
మారకపు కరెన్సీ విషయంలో రెండు దేశాల మధ్య జరిగే లావాదేవీలను ఆయా దేశాల స్థానిక కరెన్సీలో నిర్వహించుకోవడానికి సిద్ధం కావటం ద్వారా ఈ రెండు దేశాల ఆర్థిక లావాదేవీలు డాలర్‌పై ఆధారపడకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.
అయితే ఇటువంటి మారకపు కరెన్సీ వెసులుబాటు దానంతట అదే అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ ఏర్పాటుకు దారి తీయదు.
ఏదైనా ఒక కరెన్సీ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా ఉండాలంటే లోతైన పరపతి మార్కెట్లు, ఆరమరికలు లేని మారకం, వివిధ దేశాల చేతుల్లో విస్తృతమైన రిజర్వు కరెన్సీ నిధులు వంటివి కనీస ప్రమాణాలు. దాంతోపాటు రిజర్వ్ కరెన్సీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ గతిశీలతకు అనుగుణంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, నిధులు అందుబాటులో ఉండాలి.
ఆర్థిక వ్యవస్థకు అవసరమైనప్పుడు కావలసిన నిధులు అందుబాటులో లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. బ్రిక్స్ దేశాలు ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధి దశాదిశలను దృష్టిలో పెట్టుకుంటే అటువంటి శాశ్వత సరఫరాకు కావలసిన వనరులను సమకూర్చలేవు అన్నది వాస్తవం.
ఈ వాస్తవాన్ని గుర్తించినందునే బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం ఇప్పటికిప్పుడు డాలర్‌కు ప్రత్యామ్నాయంగా అంతర్జాతీయ రిజర్వు కరెన్సీని తెరమీదకు తెచ్చే ప్రయత్నాలను చేపట్టలేదు.
2022 తర్వాత భారత్, రష్యా చమురు వాణిజ్యం ఈ సమస్యలను మరింత స్పష్టంగా ముందుకు తెచ్చింది. 2022 తర్వాత రష్యా నుంచి భారతదేశం కొనుగోలు చేసిన చమురు నిల్వల నిమిత్తం చెల్లించాల్సిన మొత్తం సుమారు 39 బిలియన్ రూపాయలు భారతీయ బ్యాంకుల్లో జమ పడ్డాయి.
ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ నిధులను రష్యా వినియోగించుకోవాలంటే మరేదైనా కరెన్సీ మాధ్యమంతో రష్యన్ రూబుల్ కిందకు మార్చుకోవాల్సి ఉంటుంది అని గుర్తు చేశారు. ఆ నిధులను రూబుల్‌గా మార్చుకునేంత వరకు ఆ నిధులను దేశీయ ఆర్థిక వ్యవస్థలో కూడా రష్యా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి.
రష్యాతో జరిగే అంతర్జాతీయ వాణిజ్యంలో భారతదేశం లోటులో ఉండటం వల్ల రష్యాకు చెల్లించాల్సిన నగదును ఇతర వాణిజ్య అవసరాలకు సర్దుబాటు చేయడం కూడా సాధ్యం కావడం లేదు.
ఈ పరిణామం మరో సమస్యను ముందుకు తెస్తుంది. మారకపు కరెన్సీగా డాలర్‌ను పక్కన పెట్టినంతమాత్రాన చెల్లింపులు ఖరారు చేసుకోవటానికి మార్గం అంత తేలికగా దొరకదు. ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని మారకపు కరెన్సీకి రిజర్వ్ కరెన్సీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వ్యవస్థాగత స్వయం ప్రతిపత్తి..
బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ వంటివి ఆయా దేశాలకు వ్యవస్థాగతమైన స్వయంప్రతిపత్తి అవకాశాలను మెరుగు పరుస్తాయి.
అయితే ద్రవ్య స్వయం ప్రతిపత్తి ఉన్నంత మాత్రాన ఆయా దేశాలు అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థ పరిధికి బయట ఉండి ఆర్థిక లావాదేవీలు నడపటం సాధ్యం కాదు.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి వ్యవస్థల ద్వారా పాశ్చాత్య దేశాల నియంత్రణలో ఉన్న ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ వంటి సంస్థల నుండి భారీ షరతులకు లోబడి అప్పు తీసుకోవడం కంటే మెరుగైన అంతర్జాతీయ పరపతి మార్కెట్ సభ్య దేశాలకు అందుబాటులో ఉంటుంది.
అదే సమయంలో ఈ బ్యాంక్ మరింత మన్నికైన వ్యవస్థగా ఎదగాలంటే కేవలం సభ్య దేశాలకు మాత్రమే రుణాలు ఇవ్వటానికి పరిమితం అయితే సరిపోదు. ఇతర దేశాలకు కూడా రుణాలు ఇవ్వటానికి సిద్ధం కావాలి. అంతర్జాతీయ మార్కెట్లో ఆ మేరకు అవకాశం కూడా ఉండాలి. అలా సిద్ధం కావలసినప్పుడు అంతర్జాతీయ మార్కెట్ ప్రమాణాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా కార్యాచరణలోకి దిగాలి.
ఉక్రెయిన్, రష్యాల యుద్ధం నడుమ న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు కూడా ఇటువంటి సమస్యలు తలెత్తాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ నియంత్రణలు, అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ అవసరాల మధ్య ఘర్షణ ఏర్పడినప్పుడు ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. వీటన్నింటిని అధిగమించగలిగిన సందర్భం వచ్చినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో డాలర్ స్థానంలో మరొక ప్రత్యామ్నాయ రిజర్వు కరెన్సీ తెరమీదకు వస్తుంది.
సంశయంలో భారతదేశం..
ఒకవైపు డాలర్ ఆధారిత మారకపు కరెన్సీ వ్యవస్థకు ప్రత్యామ్నాయాన్ని రూపొందించేందుకు ఉద్దేశించిన బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి అధ్యక్షత వహిస్తూనే భారతదేశం మరొకవైపు డాలర్‌ను బలహీన పరచటంలో భారతదేశానికి ఏమి ప్రత్యేకమైన ఆసక్తి లేదని ప్రకటించింది.
భారత విదేశాంగనీతి అమెరికా అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలతో మమేకమైన తీవ్రతను ఈ ప్రకటన స్పష్టం చేస్తుంది. భారత్ చైనాతో వాణిజ్యరంగంలో ఉమ్మడి ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశపు మిగిలిన ప్రయోజనాలు ఎక్కువగా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలతో ముడిపడి ఉన్నాయి.
బ్రిక్స్ దేశాల సమన్వయంతో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు రావడం అంటే అది అనివార్యంగా చైనా కరెన్సీ చుట్టూనే తిరుగుతుంది. ఇటువంటి పరిణామం ఇప్పుడున్న రాజకీయ ప్రయోజనాలు, అమెరికాతో ఉన్న బాంధవ్యం, అవసరాల రీత్యా భారతదేశం ఇప్పటికిప్పుడు ఈ పరిణామాన్ని స్వాగతించడానికి సిద్ధం కాకపోవచ్చు.
డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మరో కొత్త రిజర్వు కరెన్సీని తెరమీదకు తేవడానికి చేస్తున్న ప్రయత్నాలు బ్రిక్స్‌ను అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలలో ఒక ప్రత్యర్థి శిబిరంగా మారుస్తుందనే అభిప్రాయానికి తావిస్తుంది.
భారతదేశం ఎంచుకున్న రాజకీయ భౌగోళిక ప్రయోజనాల రీత్యా ఈ అభిప్రాయం భారతదేశానికి ఇబ్బందులను తెచ్చి పెట్టవచ్చు.
ఈ పరిస్థితుల్లో భారతదేశం ముందున్న ప్రత్యామ్నాయం ఒకటే. బ్రిక్స్ తరపున ప్రత్యేక ప్రతిపాదనకు భారతదేశం మొగ్గు చూపకపోవడం.
అదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో భారత్ తన ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నం చేయడం.
ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలోనే భారతదేశం కరెన్సీ రూపాయిని ఇతర దేశాలు కూడా మారకపు కరెన్సీగా ఉపయోగించుకునేలా ఒప్పించడం, సీమాంతర డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేసుకోవడం, నిర్దిష్ట లావాదేవీల సందర్భంలో డాలర్‌పై ఆధారపడకుండా చూడటం వంటివి అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో భారతదేశానికి ఉన్న స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి.
బ్రిక్స్ దేశాలు కూడా ఒక ఉమ్మడి రాజకీయ ఆర్థిక వ్యవస్థలో భాగం కావు. ఈ దేశాలు ప్రధానంగా ఉత్పత్తిదారులు, ఇంధన ఉత్పత్తిదారులు, సరుకుల ఎగుమతిదారులు, సేవారంగంలో ప్రతిభా పాటవాలు చూపిస్తున్న దేశాలే.
ఈ రంగాలన్నీ దేనికి అదే స్వతంత్రంగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ వ్యవస్థతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో హడావిడిగా తీసుకునే ఏ నిర్ణయం అయినా ఆయా రంగాలలో పైచేయి సాధించిన బ్రిక్స్ సభ్య దేశాలకు నష్టదాయకంగా మారుతుంది.
అందువల్లనే బ్రిక్స్ దేశాలు తమ మధ్య జరిగే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఆయా దేశాల కరెన్సీలలోనే నిర్వహించుకోవాలని, సభ్య దేశాల రిజర్వ్ బ్యాంకులో తమ నిల్వలను విస్తరించుకోవచ్చని, బ్రిక్స్ పే వంటి చెల్లింపుల వ్యవస్థల ద్వారా ఎప్పటి వరకో అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో చెల్లింపులపై పూర్తిస్థాయి ఆధిపత్యం కలిగిన పాశ్చాత్య దేశాల సాధనాలను, వ్యవస్థలను అధిగమించాలని ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా నిర్ణయించాయి. తద్వారా భవిష్యత్తులో మారనున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏరోజైనా డాలర్ రాజకీయ ప్రయోజనాల సాధన పనిముట్టుగా తమ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపకుండా ఈ దేశాలు జాగ్రత్త పడుతున్నట్లు ఢిల్లీ డిక్లరేషన్ పరిశీలిస్తే అర్థమవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
