పంచాయతీ సహాయకుల నిరసన..
నైపుణ్యం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు నెలకు కేవలం ఆరు వేల రూపాయల వేతనంతో బతుకుతుండటం ఎంతో దురదృష్టకరమని యూనియన్ పేర్కొంది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ సహాయకులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం ఎంతో తెలుసా? కేవలం ఆరు వేల రూపాయలు.
ఆ కొద్దిపాటి మొత్తంతో ఇల్లు గడవడం, జీవితాన్ని నెట్టుకురావడం ఎలా సాధ్యమవుతుందని పంచాయతీ సహాయకుడు సతేంద్ర ది వైర్ పత్రికతో వాపోయారు.
ఉపాధి హామీ కార్మికుడు లేదా దినసరి కూలీ నెలకు ఆరు వేల రూపాయల కంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉందని, చదువుకున్న యువత ఈ ఉద్యోగంలో రోజుకు రెండు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తమ నెలవారీ గౌరవ వేతనాన్ని ఆరు వేల నుంచి ముప్పై వేల రూపాయలకు పెంచాలని, తమ సేవలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది పంచాయతీ సహాయకులు సెప్టెంబర్ 7న లక్నోలోని ఈకో గార్డెన్లో నిరవధిక నిరసన ప్రారంభించారు. అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి వారికి మద్దతు లభించింది.
ఈ ధర్నా ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది, అయినప్పటికీ సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు.
గ్రామ పంచాయతీల్లో పరిపాలనా కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2022లో సుమారు 57 వేల మంది పంచాయతీ సహాయకులను నియమించింది. వీరి అధికారిక హోదా పంచాయతీ సహాయకుడు లేదా అకౌంటెంట్-కమ్-డేటా ఎంట్రీ ఆపరేటర్.
విలేజ్ లెవల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా పనిచేయాల్సిన వీరు గ్రామీణ పౌరులకు నేరుగా 243కి పైగా ప్రభుత్వ సేవలను అందించే బాధ్యతను తీసుకున్నారు. సేవల పంపిణీని వికేంద్రీకరించడం, గ్రామీణ ప్రజలకు పరిపాలనా సేవలను అందుబాటులోకి తేవడం ఈ ప్రభుత్వ చొరవ ప్రధాన లక్ష్యం.
“పదో తరగతి, ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా పంచాయతీ సహాయకులను ఎంపిక చేస్తారు. గ్రామంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని మాత్రమే నియమిస్తారు. అభ్యర్థి అదే గ్రామ పంచాయతీ నివాసి అయి ఉండాలి, తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత గ్రామ పంచాయతీలకు వర్తించే రిజర్వేషన్ విధానానికి అనుగుణంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కోవిడ్-19 కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు” రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ తెలిపింది.

రాష్ట్ర గ్రామీణ పరిపాలనకు వెన్నెముక..
నిరుద్యోగం ప్రబలుతుండటంతో యువత దీనిని పూర్తి స్థాయి ఉద్యోగంగా భావించక తప్పలేదు, అయితే అవకాశం వస్తే కెరీర్ మార్చుకోవాలని చాలా మంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నెలకు ఆరు వేల రూపాయలతో కుటుంబాన్ని పోషించడం లేదా భవిష్యత్తును నిర్మించుకోవడం ఏమాత్రం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు.
లక్నో ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ పంచాయతీ సహాయక ఉద్యోగుల సంఘం మాట్లాడుతూ, పంచాయతీ సహాయకులు ఇకపై కేవలం కాంట్రాక్ట్ సిబ్బంది మాత్రమే కాదని, రాష్ట్రంలో గ్రామీణ పరిపాలనకు డిజిటల్, పరిపాలనా వెన్నెముకగా పరిణామం చెందారని పేర్కొంది.
డేటా నిర్వహణ, ఆన్లైన్ పథకాల అమలు నుంచి ప్రజా సేవల పంపిణీ, శాఖల మధ్య సమన్వయం వరకు దాదాపు అట్టడుగు స్థాయిలోని ప్రతి డిజిటల్ ఆపరేషన్ వారిపైనే ఆధారపడి ఉంది.
నైపుణ్యం కలిగిన ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు నెలకు కేవలం ఆరు వేల రూపాయల వేతనంతో బతుకుతుండటం అత్యంత దురదృష్టకరం అని సంఘం పేర్కొంది.
ప్రస్తుత కాలంలో ఈ మొత్తం ఆర్థికంగా సరిపోదు, సామాజికంగా గౌరవప్రదంగానూ ఉండదని తెలిపింది.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యాలయ రోజువారీ నిర్వహణ, ప్రజా సేవల పంపిణీకి పంచాయతీ సహాయకులు బాధ్యత వహిస్తారు.
జనన, మరణాల నమోదుకు సమాచారం అందించడం, పథకాల అమలుకు మద్దతు ఇవ్వడం, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను సులభతరం చేయడం, బహుళ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో రికార్డు నిర్వహణ, డేటా ఎంట్రీ పనుల్లో వారు సహాయం చేస్తారు.
వీటికి తోడు వారికి క్రమం తప్పకుండా అదనపు పరిపాలనా విధులు కూడా అప్పగిస్తుంటారు.
లక్ష్యాల నిర్దేశం, అదనపు పనుల భారం..
పంచాయతీ భవన్లో మొదట డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మాత్రమే తమను తీసుకున్నారని సంఘం సంస్థాగత కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న సతేంద్ర వివరించారు.
కాలక్రమేణా పని భారం విపరీతంగా పెరిగినప్పటికీ వారి గౌరవ వేతనం మాత్రం స్థిరంగా ఉండిపోయింది. అదనపు పని వేళలకు ఎలాంటి చెల్లింపులు లేవు. ఇతర ప్రభుత్వ శాఖల నుంచి కూడా వారికి పనులు అప్పగించారు.
తమ వేతనాలు అలాగే ఉన్నాయని, కానీ 2022 నాటి ద్రవ్యోల్బణ రేటు 2026 నాటికి లేదని సతేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు జారీ చేయడానికి తమకు కఠినమైన లక్ష్యాలు నిర్దేశిస్తున్నారని పంచాయతీ సహాయకులు చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ ఏడాదికి మూడుసార్లు పంటల సర్వే నిర్వహించే పనిని వారికి అప్పగిస్తుండగా, గ్రామస్తులకు భూ యాజమాన్య కార్డులు జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ స్వామిత్వ పథకం సర్వేలో వారిని భాగస్వాములను చేస్తోంది. అదనంగా వారిని బూత్ లెవల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నారు. ఫ్యామిలీ ఐడీలను రూపొందించే బాధ్యతను అప్పగించారు. గతంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ల కోసం కూడా వారిని మోహరించారు.
తాము చేసే పనికి తగినంత గౌరవ వేతనం రావడం లేదని, తమ బాధ్యతలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని సతేంద్ర అన్నారు.
నెలకు ముప్పై వేల రూపాయలు కావాలని నిరసన తెలుపుతున్న పంచాయతీ సహాయకులు వాదిస్తున్నారు, ఎందుకంటే అది గ్రామ పంచాయతీ కార్యదర్శి జీతంతో సమానంగా ఉంటుంది. ఒకవేళ రాజీ పడాల్సిన పరిస్థితి వచ్చినా, రాష్ట్రంలోని నైపుణ్యం కలిగిన కార్మికుల కనీస నెలవారీ వేతనం 15,224 రూపాయల కంటే తక్కువకు తాము అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు.
పంచాయతీ సహాయకులు క్రమం తప్పకుండా సిబ్బంది వలే శాఖాపరమైన బాధ్యతలు, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజా ఒత్తిడి, సాంకేతిక పనిభారాన్ని మోస్తున్నారని, కానీ వారికి ఎలాంటి ఆర్థిక భద్రత, ఉద్యోగ రక్షణ, గౌరవప్రదమైన వేతనాలు లేవని సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రతిపక్షాల మద్దతు..
సెప్టెంబర్ 11న పంచాయతీ సహాయకుల బృందం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది.
సెప్టెంబర్ 13న రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ లాల్ పాల్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ బృందం నిరసన స్థలంలో ఆందోళనకారులను కలిసి, తమ పార్టీ అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
ప్రతి ఒక్కరికీ సురక్షితమైన ఉపాధి కల్పిస్తామని, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని పాల్ చెప్పారు.
సెప్టెంబర్ 12న నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. పంచాయతీ సహాయకులతో వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ఆజాద్ కోరారు.
గ్రామాల్లోని సాధారణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, డిజిటల్ సేవలను అందించడంలో పంచాయతీ సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారని, అయినప్పటికీ వారు అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేయాల్సి వస్తోందని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియర్ ఓబీసీ నేత, మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కూడా నిరసన స్థలాన్ని సందర్శించి పంచాయతీ సహాయకుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మహిళల దుస్థితి..
వేతనాల పెంపుతో పాటు, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి శాశ్వత సేవా నిబంధనలను రూపొందించడం ద్వారా తమకు రాష్ట్ర ఉద్యోగులుగా అధికారిక హోదా కల్పించాలని పంచాయతీ సహాయకులు డిమాండ్ చేస్తున్నారు.
తమ క్షేత్రస్థాయి అనుభవాన్ని ఉటంకిస్తూ, రాబోయే గ్రామ అభివృద్ధి అధికారుల, గ్రామ పంచాయతీ అధికారుల నియామకాల్లో 50 శాతం సమాంతర రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు.
అంతేకాకుండా మహిళా కార్మికులకు ప్రసూతి సెలవుల సౌకర్యాలతో పాటు స్పష్టమైన బదిలీ, సర్దుబాటు విధానాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీ సహాయకుల్లో దాదాపు 60 శాతం మంది మహిళలే ఉన్నారని, వారు ఒక విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారని సతేంద్ర తెలిపారు.
ఒక మహిళా పంచాయతీ సహాయకురాలికి వివాహమై అత్తింటికి లేదా వేరే గ్రామానికి వెళితే, ఆమె ఉద్యోగం ఆటోమేటిక్‌గా రద్దవుతుందని, ఆమె స్థానంలో మరొకరిని తీసుకుంటారని ఆయన చెప్పారు.
మహిళా సహాయకులకు ప్రసూతి సెలవులు ఇవ్వడం లేదని పంచాయతీ సహాయకురాలు షంషీర్ బానో తెలిపారు.
తన సొంత ఉదాహరణను వివరిస్తూ, అత్తింటి గ్రామంలో పనిలో చేరే సమయానికి తాను ఐదు నెలల గర్భిణినని, అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనకు ఎలాంటి సెలవు మంజూరు చేయలేదని బానో ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం లేని సెలవు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.
వారం రోజులుగా నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని సతేంద్ర చెబుతున్నారు.
సహాయకులు నిరసన స్థలం నుంచి కదిలే ఆలోచనలో లేరు.
తమకు హామీలు వద్దని, ప్రభుత్వ ఉత్తర్వుల కాపీ కావాలని, అప్పటి వరకు కదిలేది లేదని సతేంద్ర స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
