‘మోటా భాయ్‘, ఆయన అనుచరుల బండారం బయట పడింది. కచ్చితంగా జెన్ జీ మన ప్రజాస్వామ్యాన్ని చేజిక్కించుకుంటుంది.
జీవితంలో అత్యంత కీలకమైన, చారిత్రాత్మక ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఇది సమీప భవిష్యత్తులో ఒక పెద్ద విప్లవాత్మక మార్పుకు సంకేతం.
గత మూడు నెలలుగా చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాలు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేశాయి.
మనం ఎటు ప్రయాణిస్తున్నామో ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారికి మాత్రం ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగదని మాత్రం తెలుసు.
అయితే, దేశ రాజకీయాలపై తమకు దైవ జ్ఞానం ఉందని భావించే నా ప్రియ మిత్రుడు లాంటి నిరాశావాదులు కూడా ఉన్నారు.
ప్రస్తుత గొడవంతా సమసిపోయి మళ్లీ మనం మొదటికే వస్తామని, నియంత మళ్లీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటాడని మిత్రుడు ధీమాగా ఉన్నాడు.
చరిత్ర పునరావృతం అవుతుందా?
చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే, భారతదేశ రాజకీయాల్లో ఇలాంటి మరొక కీలక ఘట్టం 1975లో చోటుచేసుకుంది. అది ఇందిరా గాంధీ కాలం.
తన నియంతృత్వ అత్యవసర పరిస్థితి పాలన దేశానికి మేలు చేసిందని, మెజారిటీ ప్రజలు దాన్ని సమర్థించారని ఆమె నమ్మి ఉండవచ్చు. లేదా తన సొంత నిరంకుశత్వం వల్ల ఆమె మనస్సాక్షి కలత చెంది ఉండవచ్చు.
ఏమైనా 1977 జనవరిలో ఆమె అకస్మాత్తుగా సార్వత్రిక ఎన్నికలకు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రత్యర్థులందరినీ జైలు నుండి విడుదల చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో దేశ సాధారణ పౌరులలో పెల్లుబికిన ప్రజాస్వామ్య కాంక్షతో బలపడిన ఐక్య ప్రతిపక్షం కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది. ఆ నియంతను ప్రజలు తరిమికొట్టారు.
కానీ నేడు మనల్ని వేధిస్తున్నది ఎమర్జెన్సీ నాటి ప్రత్యక్ష గుండా రాజ్యం కాదు. కంటికి కనపడకుండా చాలా ప్రమాదకరంగా, కాఫ్కాస్క్యూ (అర్థంకాని భయంకరమైన పీడకల) రూపంలో ఉన్న రాక్షసత్వం.
నేరం, తీవ్రవాదం, అన్యాయాలకు నిలయంగా మారి, ఎటువంటి కనికరం లేని మాఫియా పాలన గురించి ఏమనుకోవాలి? ఇటీవల జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై భద్రతా సిబ్బంది లాఠీలు ఝుళిపించి, పెల్లెట్ తుపాకులతో కాల్పులు జరిపారు. కానీ దానికి ధీటుగా భారీ నిరసన లేదా ఆగ్రహం వ్యక్తం కాకపోవడం భయం, ఆశ్చర్యం కలుగుతున్నది.
గత 12 సంవత్సరాలుగా, ఒక ఫాసిస్ట్ మోసగాడు, గారడీ వాడి చేతుల్లో ఈ దేశం చిక్కుకుంది. ఆ ‘ఫేకూ’, ప్రజలను భయపెట్టడానికి, బురిడీ కొట్టించడానికి అపరిమితమైన అధికారాన్ని ఉపయోగించాడు.
కేవలం అధికారంలో కొనసాగడం కోసం వివిధ వర్గాల మధ్య హత్యాయుతమైన ద్వేషాన్ని, అవిశ్వాసాన్ని ఉద్దేశపూర్వకంగా పెంపొందించారు.
ఒక పేరు లేని ముప్పు, భయాందోళనల వాతావరణంలో నానబెట్టిన హిందుత్వ ఆధారిత ‘హిందూ రాష్ట్ర’ ప్రాజెక్ట్, సంపూర్ణంగా అమ్ముడుపోయిన న్యాయమూర్తులు, అధికారులు, మీడియా దాసులు, మధ్యతరగతి, కార్పొరేట్ల పూర్తి మద్దతుతో సామాజిక రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది.
ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాలలో మునిగిపోయిన పిరికిపందల దేశం ఆయన పాటకు తగ్గట్లు తాళం వేస్తున్నది.
సొంత ప్రయోజనాలు, తన ముఠా ప్రయోజనాల కోసం విలువలు, బంధుత్వాలు, వ్యవస్థలను నాశనం చేస్తూ వచ్చాడు.
పళ్ళాలు మోగించి, దీపాలు వెలిగించి కరోనా వైరస్‌ను తరిమికొట్టమని రాజసం ఒలకబోస్తూ ఆదేశిస్తే, దానికి లొంగిపోయిన అవమానాన్ని ఏ సమాజమైనా తుడిచిపెట్టుకోగలదా?
అసత్యం, అంధవిశ్వాసం నిస్సిగ్గుగా ప్రదర్శించే మూర్ఖత్వం ఇప్పటిలా చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ వ్యక్తం కాలేదు. అది రాజకీయంగా సురక్షితమైన మార్గం కనుక బాగా తెలిసిన వారు కూడా దాన్ని సమర్థించారు.
హిట్లర్ పాలనలో జర్మన్లకు ఏమైందో వివరించడానికి మార్టిన్ అమిస్ చెప్పినట్లు “గౌరవం, న్యాయం, స్వేచ్ఛ, సత్యం, విచక్షణ లేకుండా జీవించడానికి మనం అలవాటు పడ్డాం”.
మానవ స్వభావం గురించి ఫ్రాయిడియన్ స్థాయి అవగాహన ఉన్న మహాత్మా గాంధీ, ఈ మెరుపుల ‘విశ్వ గురువు’ మనపై చెలాయించిన అధికారం గురించి చెబుతూ “పిరికిపందలు ఎక్కడ ఉంటారో, అక్కడ దాష్టీకపరులు ఎప్పుడూ ఉంటారు” అని చెప్పారు.
విశ్వ గురువు ఆటలు, వ్యవస్థల ఆక్రమణ..
జెన్ జీ వచ్చి ఈ క్రీడను అల్లకల్లోలం చేసేంత వరకు, ఈ విశ్వ గురువు, ఆయన అనుచరులు పాలనా వ్యవస్థలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకోవడమే కాకుండా, దేశంలోని రాజకీయ వర్గంపై కూడా సంపూర్ణ నియంత్రణ సాధించడానికి పాటుపడ్డారు.
‘సామ, దాన, భేద, దండోపాయాలు’ పద్ధతిని ఉపయోగిస్తూ వరుసగా చేసిన ‘విలీనాలు, కొనుగోలు’ ప్రక్రియలో, అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను విడదీయడంలో, శివసేన (యూబీటీ)ని దెబ్బతీయడంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను విజయవంతంగా లాక్కోవడంలో సఫలమైంది.
ద్రవిడ మున్నేట్ర ఖజగం ఎన్డీయేలో చేరుతుందని, సమాజ్‌వాదీ పార్టీలో అసంతృప్తి ఉందనే నివేదికలు కూడా వచ్చాయి.
ఎన్నికల కమిషన్ తమ జేబులో ఉండటంతో, పార్లమెంటులో పూర్తి మెజారిటీ సాధించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, ఉమ్మడి సివిల్ కోడ్ వంటి అంశాలపై ప్రధాన రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించడం, అంతిమంగా హిందూ ఆధిపత్య పాలనను, మైనారిటీలు దయాదాక్షిణ్యాలపై జీవించే ‘హిందూ రాష్ట్ర’ కలల ప్రాజెక్టును శాశ్వతంగా స్థాపించాలనేది ఈ పాలక వర్గ పక్కా ప్రణాళిక.
జెన్ జీ విప్లవాత్మక ప్రవేశం..
కానీ ఈ రాక్షసులు జెన్ జీని లెక్కలోకి తీసుకోలేదు. వారు వచ్చి వీరి పథకాలపై నీళ్లు చల్లారు. గాంధీ, అంబేడ్కర్, మార్క్స్ భాష మాట్లాడే ఈ విప్లవాత్మక, నిర్భయమైన ఆదర్శవాదులు, ఈ మోసగాళ్ల బండారాన్ని ఎలా బయటపెట్టారో చూడండి.
సమర్థత లేని ధర్మేంద్ర ప్రధాన్‌ను పక్కనబెట్టడం ఒక ఎత్తయితే, అత్యంత నైపుణ్యంతో రూపొందించిన మీమ్‌లు, నినాదాలు, వీడియోలు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ల ద్వారా హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ఉపయోగించి ప్రధాని హోదాను ‘విశ్వ గురువు’ నుంచి ‘ఛోటా బందర్’ స్థాయికి మానసికంగా దిగజార్చడమే జెన్ జీ సాధించిన అతిపెద్ద విజయం.
కార్పొరేట్ డిజైన్లతో ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దిన ఆ ‘సూపర్ మ్యాన్’ ఇమేజ్ను విచ్ఛిన్నం చేయడంలో వారు చాలా సమర్థవంతంగా పనిచేశారు.
అర్ధరాత్రి వేళ విడుదల చేసే ఆక్రోశపూరిత ఇన్స్టాగ్రామ్ వీడియోల ద్వారా సానుభూతి, మంచి పేరు కోసం ప్రాధేయపడే, జాలిపడాల్సిన ముసలి వ్యక్తిగా, తనను, తన తల్లిని దూషించిన అమ్మాయిలను క్షమిస్తూ, పేపర్ లీక్‌లకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తానని మాటిచ్చే ఒక “నారాజ్ ఫూఫా”(అలుగుడు బాబాయి)గా ఆయనను మార్చేశారు.
ఇది 56 అంగుళాల ‘ఘర్ మే ఘుస్కే మారూంగా'(ఇంట్లోకి దూరి కొడతా) అనే బలవంతుడి ఇమేజ్ను పూర్తిగా కూలిపోవడానికి నిదర్శనం.
“అహంకారులు ఎదురుదాడి కంటే వెటకారాన్ని, పరిహాసాన్ని చూసి ఎక్కువ భయపడతారు” అనే పాత సామెత నిజమైనట్లు ఉంది. ఎందుకంటే హింస లేకుండా తమను చిన్నచూపు చూడటం కంటే అహాన్ని దెబ్బతీసేది మరొకటి లేదు”.
మారిన స్వరం, భయపడిన అధికార యంత్రాంగం..
జెన్ జీ ఈ నిరంకుశ పాలనకు సహకరించిన అనేక మంది ఇతర ఉన్నత స్థాయి వ్యక్తుల ముసుగులను కూడా తొలగించింది. ఈ నిందల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది తీవ్ర కోమలత్వంతో కూడిన మోహన్ భగవత్. ఆయన ద్విపాత్రాభినయం, రెండు నాలుకల ధోరణి ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి.
జెన్ జీ ఆయనను ప్రాధేయపడేలా చేసి, తమ రక్షణకు వచ్చేలా, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేలా చేసింది.
“తాను జెన్ జీని గుడ్డిగా నమ్ముతానని”, వారి ఆవేదన నిజమైనదని, దేశద్రోహం కాదని, వారు గత తరాల యువత కంటే ఎక్కువ ప్రామాణికమైనవారని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
“భిన్నత్వంలో ఏకత్వమే భారత గుర్తింపుకు కేంద్ర బిందువని”, భారత్‌లో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా భావిస్తే, అతడు హిందువే కాడు” అని హిందూత్వ మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఆయన ప్రకటించడం విడ్డూరం, బూటకం.
ఈ వ్యక్తి అత్యంత మోసపూరితమైనవాడు, కానీ అదృష్టవశాత్తూ, ఆయన మాటలను ఎవరూ నమ్మరు.
ఒకప్పుడు జెన్ జీని ‘బొద్దింకలు’ అని సంబోధించి, పోలీసుల దౌర్జన్యాలపై పిటిషన్లను వినడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని తిరస్కరించిన నాటి అహంకారి సీజేఐ, ఇప్పుడు జెన్ జీ డిమాండ్లన్నింటినీ, ఎఫ్ఐఆర్ల సంపూర్ణ ఉపసంహరణతో సహా ఆమోదించడానికి చాలా కష్టపడుతున్నాడు.
ఇటీవల, నిరసనల్లో పాల్గొన్న ఒక విద్యార్థికి నోటీసు ఇచ్చిన నోయిడా అధికారులను(ముఖ్య ఎన్నికల కమిషనర్ కుమార్తె అక్కడ జిల్లా మేజిస్ట్రేట్) సీజేఐ వివరణ కోరారు. ఒక్కసారిగా, న్యాయమూర్తులు న్యాయం వైపు నిలబడ్డారు.
మునిగిపోతున్న నౌక నుంచి పారిపోయే ఎలుకలలాగా, విలేకరులలోని అనేక మంది మోదీ భక్తులు ఇప్పుడు విమర్శకులుగా మారారు.
రాజకీయ చైతన్యం ఉన్న మెజారిటీ పౌరులు నిజమైన వార్తల కోసం సోషల్ మీడియా వైపు మళ్ళే విధంగా ప్రధాన స్రవంతి మీడియా అమ్ముడుపోయింది.
ఈ పాలకవర్గం మళ్లీ నియంత్రణ సాధించడానికి తిరిగి పోరాడుతోంది. కానీ అది ప్రణాళిక ప్రకారం జరగడం లేదు. మోటా భాయ్, ఆయన అనుచరుల కుట్ర బయటపడటమే ప్రధాన అవరోధం అయింది.
నిరసనల సమయంలో ప్రభుత్వం ప్రయోగించిన హింసపై పెద్ద ఎత్తున వచ్చిన వ్యతిరేకత ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించడం,(ఒక నివేదిక ప్రకారం జంతర్ మంతర్ ‘అల్లరి మూకలలో’ చాలామంది నిరసనల సమయంలో జైలులోనే ఉన్నారని దీనిద్వారా తేలింది) జెన్ జీ ఉద్యమాన్ని చీల్చడానికి, రిజర్వేషన్ వ్యతిరేక కదలికలను రెచ్చగొట్టడానికి చేసిన మోసపూరిత కుట్ర విఫలమయింది.
చివరకు ఒక రిటైర్డ్ అధికారి పాలకుల అంతర్గత గుట్టును బయటపెట్టినందుకు ఆయనను వేధించడం, దానికి ఆయన ధీటైన సమాధానం ఇవ్వడం ఇవన్నీ మోటా భాయ్ ఇకపై “భయపెట్టి పాలించలేడు” అనడానికి స్పష్టమైన ఆధారాలు.
గతి తప్పిన ప్రభుత్వ ప్రచారం..
జెన్ జీ భాషను అనుకరిస్తూ వారిని ఆకట్టుకోవడానికి విశ్వ గురువు నిరంతరం చేస్తున్న హాస్యాస్పద ప్రయత్నాలను వారు ఈసడించుకున్నారు. ఆయన “ఫ్రెండ్స్” అని పలకరించగానే, నేటి యువత “మేము నీ స్నేహితులం కాదు” అని అరుస్తూ, బూతులు తిడుతూ సమాధానం ఇస్తున్నారు.
జెన్ జీ, “దిమాగీ నక్సల్స్” పై దాడి చేస్తూ ఆయన చేసిన వికారమైన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది.
తన పాలనపై వస్తున్న ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి మార్గాలు లేక తల్లడిల్లుతూ, ఆయన ఇప్పుడు తన ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సగం నిజాలు, సగం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
జీడీపీ 7.8% పెరిగిందని చెప్పడం శుద్ధ అబద్ధం. యూపీఏ ప్రభుత్వం రూపకల్పన చేసి ప్రారంభించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పూర్తయినందుకు తన క్రెడిట్‌గా ప్రకటించుకోవడం తెలిసి చేస్తున్న మోసం.
దండగమారి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, పటిష్టంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలను కూల్చి, వాటి స్థానంలో మెరిసే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే సెంట్రల్ విస్టా పునర్వికాస ప్రాజెక్ట్ వంటి తన ‘తుగ్లక్’ పథకాల గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు.
తమ పార్టీ అక్రమ ఖజానాను నింపడానికి ప్రాథమిక వనరుగా ఉన్న “కాంట్రాక్ట్ రాజ్”ను విస్తరించడం వీటి ఏకైక ఉద్దేశం అని, దీన్ని ప్రోత్సహించడం మాత్రమేనని భయపడాల్సి వస్తున్నది.
దేశ రుణ భారం 2014లో రూ 55 లక్షల కోట్ల నుండి నేడు రూ 200 లక్షల కోట్లకు పెరగడం ఆశ్చర్యకరం. దేశం అత్యంత దయనీయ స్థితిలో ఉంది.
దేశ భవిష్యత్తు జెన్ జీ చేతుల్లోనే..
ఇలాంటి విపత్కర సమయంలో, చదువుకుంటూ సరదాగా గడపాల్సిన జెన్ జీపై ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే భారాన్ని మనం మోపడం ఎంతో సిగ్గుచేటు. కానీ వారు స్వయంగా ఈ పనిలో నిమగ్నమయ్యారు. వారు చేపట్టిన “స్కూల్ థీక్ కరో”(పాఠశాలలను బాగుచేయండి) ప్రచారం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉరుకులు పరుగులు తీస్తున్నాయి.
ఢిల్లీలో ఏడుగురు విద్యార్థులను బలిగొని, పలువురిని గాయపరిచిన భవనం కూలిన ఘటన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీ శోధించి తయారు చేసిన ఏడు డిమాండ్ల జాబితాతో జోక్యం చేసుకుంది.
ఇది ఎప్పుడో కూల్చివేసి ఉండాల్సిన, సురక్షితం కాని నిర్మాణాలను సీల్ చేయడానికి, కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాయత్తం చేయాలి.
ఈ అద్భుతమైన యువతీ యువకులు నా మనసుకు నచ్చిన వ్యక్తులు. మనలో మిగిలిన వారు మేధోపరంగా దిగజారి, నైతికత లేకుండా సహకరించడం లేదా మౌనంగా ఉండటం ద్వారా భాగస్వాములయ్యాము. కానీ వారి ధైర్యం, పవిత్రమైన సంకల్పం మనలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
మన చుట్టూ అలుముకుంటున్న ఈ అంధకారాన్ని వారు ఛేదించి, దేశం తన ప్రజాస్వామ్య చైతన్యాన్ని తిరిగి పొందేలా సహాయపడతారా? అవును కచ్చితంగా చేస్తారు.
రచయిత మ్యాథ్యూ జాన్ మాజీ సివిల్ సర్వెంట్. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు. వారు ది వైర్ ఇంగ్లిష్‌లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
