1,500 మందికి పైగా విద్యావేత్తలు, ఆర్థికవేత్తల లేఖ— అత్యంత ధనికులు, పేదల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించే విధానపరమైన నిర్ణయంగా అభివర్ణన.
వచ్చే వారం న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు ముందు 1,500 మందికి పైగా నిపుణులు అసమానతపై అంతర్జాతీయ ప్యానెల్(ఐపీఐ)కు మద్దతు ప్రకటిస్తూ ఈ బహిరంగ లేఖపై సంతకాలు చేశారు.
ఈ లేఖపై సంతకం చేసిన ప్రముఖుల్లో అమెరికా మాజీ ఆర్థిక మంత్రి జానెట్ యెలెన్, నోబెల్ బహుమతి గ్రహీత డారన్ అసెమొగ్లూతో పాటు, థామస్ పికెట్టి, మరియానా మజ్జుకాటో, జయతి ఘోష్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు.
“ఆదాయం, సంపద కొద్దిమంది చేతుల్లో తీవ్రంగా కేంద్రీకృతం కావడం వల్ల అధికారం కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అదే కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. దీంతో సమాజంలో పరస్పర విశ్వాసం దెబ్బతింటుంది, రాజకీయాల్లో విభజనలు మరింత తీవ్రతరమవుతాయి”అని లేఖలో వారు పేర్కొన్నారు.
ఐపీఐ ఏర్పాటు, లక్ష్యాలు..
స్పెయిన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నార్వే దేశాల మద్దతుతో, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ చొరవతో ఐపీఐ ఏర్పాటవుతోంది.
వాతావరణ సంక్షోభం తీవ్రతను అంచనా వేసి, దాన్ని ఎదుర్కొనే చర్యలను సూచించే వాతావరణ మార్పుపై అంతర్జాతీయ ప్యానెల్(ఐపీసీసీ) తరహాలోనే ఐపీఐని రూపొందించాలన్నది దీని ఉద్దేశం.
ఈ ప్యానెల్‌కు నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త జోసెఫ్ స్టిగ్లిట్జ్ అధ్యక్షత వహించనున్నారు. అసమానత అంశంపై ఇది ప్రపంచంలోనే ప్రధాన ప్రామాణిక సంస్థగా ఎదగాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
“చాలా దేశాల్లో అత్యంత ధనికులకు, అత్యంత పేదలకు మధ్య అంతరం పెద్దదిగా ఉండటమే కాకుండా అది మరింత పెరుగుతోందన్న విషయం ఎవరికీ కొత్త కాదు. అసమానత సంక్షోభం వల్ల పరస్పరం ముడిపడి ఉన్న అనేక ప్రభావాలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వాటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, పర్యావరణ రంగాల్లో గణనీయమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి” అని పేర్కొన్నారు.
లేఖపై సంతకాలు చేసిన నిపుణులు చెబుతున్నదాని ప్రకారం, అంతర్జాతీయ అసమానత స్వభావం స్థాయి ఎంతవరకు ఉందన్న అంశంపై అందరూ పంచుకునే శాస్త్రీయ ఏకాభిప్రాయాన్ని రూపొందించే దిశగా ఐపీఐ పనిచేయవచ్చు.
అదే సమయంలో ఈ అసమానతను తగ్గించేందుకు అమలు చేయగల సాధ్యమైన విధాన పరిష్కారాలకు మార్గనిర్దేశం చేయవచ్చు.
ఇందుకోసం ప్రపంచంలోని ప్రముఖ నిపుణులు, భాగస్వామ్య ప్రభుత్వాలు, బహుపాక్షిక అంతర్జాతీయ సంస్థలను ఒకచోటికి తీసుకువచ్చి క్రమం తప్పకుండా నివేదికలు రూపొందించడంతో పాటు ఈ సమస్యకు మరింత ప్రాధాన్యత లభించేలా కృషి చేయడం ఐపీఐ లక్ష్యంగా పెట్టుకోనుంది.
అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అంతరాలు..
నిపుణులు సంపన్న దేశాలకు, పేద దేశాలకు మధ్య ఉన్న అంతరంతో పాటు, ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనే కొనసాగుతున్న అసమానతలపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలోని మసాచుసెట్స్ అమ్హర్స్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్న జయతి ఘోష్ మాట్లాడుతూ ఇలా అన్నారు.
అసమానతపై అంతర్జాతీయ ప్యానెల్ ఎందుకు అవసరమో తెలుసుకోవడానికి భారతదేశ అనుభవమే మనకు కావాల్సిన మొత్తం విషయాన్ని చెబుతోంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్ అదే సమయంలో అత్యంత అసమానతలు ఉన్న దేశాల్లో ఒకటిగా కూడా ఉంది.
ఇక్కడ అపారమైన సంపద ఒకవైపు ఉంటే దాని పక్కనే తీవ్ర స్థాయిలో పేదరికం, కొరత, వంచన కూడా కొనసాగుతున్నాయి.
ఇటీవల ప్రపంచ బ్యాంకు తీవ్ర హెచ్చరిక చేసింది. అద్భుతం జరిగితే తప్ప 2020ల దశకం అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోల్పోయిన దశకంగా మారబోతోందని పేర్కొంది.
భారత్, చైనాలను మినహాయిస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతో ఉన్న ఆర్థిక అంతరాన్ని తగ్గించడంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు వెనుకబడిపోతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపన్న దేశాలకు, పేద దేశాలకు మధ్య ఉన్న అంతరం తగ్గకపోగా మరింత పెరిగే ప్రమాదం ఉందన్నమాట.
ప్రపంచ నేతల మద్దతు..
జర్మనీ మాజీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, ఐర్లాండ్ మాజీ ప్రధానమంత్రి లియో వరాద్కర్, న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి హెలెన్ క్లార్క్ తదితర మాజీ ప్రపంచ నేతలు కూడా ఈ వారం విడుదల చేసిన ప్రత్యేక ప్రకటనలో ఐపీఐ ఏర్పాటుకు తమ మద్దతు తెలిపారు.
బ్రిటన్ విషయానికి వస్తే ఐపీఐలో చేరేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా ప్రకటించలేదు.
అయితే బ్రిటన్ విదేశాంగ మంత్రి ఎడ్ మిలిబాండ్ ఇతర దేశాలతో కలిసి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఉమ్మడి అంతర్జాతీయ సమస్యలపై పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికా ప్రభుత్వం చూపుతున్న విముఖత ఈ ప్రయత్నాలకు ఒక అడ్డంకిగా ఉంది.
వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు ఆండీ బర్న్‌హామ్ హాజరుకానున్నారు. జూలైలో డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతర్జాతీయ వేదికపై ఆయన పాల్గొంటున్న అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇది ఒకటి.
న్యూయార్క్‌లో జరిగే ఈ సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో బర్న్‌హామ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
బ్రిటన్ పాత్ర, భవిష్యత్ కార్యాచరణ..
బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి చెందిన స్టీవర్ట్ వుడ్ మాట్లాడుతూ ఇలా అన్నారు.
మన ఆర్థిక వ్యవస్థ మరింత న్యాయంగా, మరింత ఉత్పాదకంగా పనిచేసేలా మార్పులు తీసుకురావడం అంటే కేవలం మన దేశంలో మనం చేసే పనులకు మాత్రమే పరిమితం కాదు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడం కూడా అవసరం.
అందుకే ఆర్థిక మార్పులకు అవసరమైన అంతర్జాతీయ కూటమిని నిర్మించేందుకు ఈ ప్రభుత్వం తన మిత్రదేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వృద్ధిని పెంచడం, అసమానతలను తగ్గించడం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను మరింత సమర్థవంతంగా మార్చడం, సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలకు, వాతావరణ చర్యలకు మరింత మద్దతు ఇవ్వడం ఈ కూటమి లక్ష్యాల్లో ఉంటాయని తెలిపారు.
ఇదిలా ఉండగా బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల దేశ జాతీయ ఆదాయంలో 0.7 శాతాన్ని విదేశీ సహాయానికి కేటాయిస్తామని లేబర్ పార్టీ ఇచ్చిన హామీని మళ్లీ ధృవీకరించింది.
అయితే ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి గడువును ప్రకటించలేదు.
ఈ హామీని లేబర్ పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. అయితే ఆ తర్వాత కీర్ స్టార్మర్ ప్రభుత్వం పెరుగుతున్న రక్షణ వ్యయాన్ని భర్తీ చేసేందుకు విదేశీ సహాయ నిధులను భారీగా తగ్గించింది.
అనువాదం: మనోహర రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
