ఈ ఏడాది ప్రారంభంలో, అమెరికా రాయబారి సెర్గియో గోర్.. వాన్ డ్యూక్ జైలు శిక్ష గురించి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలతో చర్చించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద విధించిన ఆరు నెలల రిమాండ్ వ్యవధిలోగా అధికారులు తమ విచారణను పూర్తి చేయనందున, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నమోదు చేసిన కేసులో అమెరికా పౌరుడు మాథ్యూ వాన్ డ్యూక్‌కు ఢిల్లీ న్యాయస్థానం సెప్టెంబర్ 18న బెయిల్ మంజూరు చేసిందని వార్తా నివేదికలు తెలిపాయి.
మార్చిలో వాన్ డ్యూక్‌తో పాటు అరెస్టయిన ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులకు కూడా తన ఉత్తర్వుల్లోని కారణాలు వర్తిస్తాయని రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ తెలిపారు.
వారు కూడా తమ సొంత బెయిల్ దరఖాస్తులను దాఖలు చేసుకునేలా ఈ తీర్పు కాపీలను వారికి అందించాలని ఆయన ఆదేశించినట్లు ది హిందూ పత్రిక నివేదించింది.
మయన్మార్ మిలిటెంట్లకు శిక్షణ ఆరోపణలు..
తప్పనిసరి అనుమతి లేకుండా మిజోరంలోకి ప్రవేశించి, అక్కడి సాయుధ మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు మయన్మార్‌లోకి చొరబడ్డారనే ఆరోపణలతో వాన్ డ్యూక్‌తో పాటు ఆరుగురు ఉక్రేనియన్లు – పెట్రో హుర్బా, తారాస్ స్లివియాక్, ఇవాన్ సుక్మనోవ్స్కీ, మరియన్ స్టెఫాంకివ్, మాక్సిమ్ హొంచారుక్, విక్టర్ కమిన్స్కీలను ఎన్ఐఏ అధికారులు మార్చిలో అరెస్టు చేశారు.
ఈ ఏడుగురిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎన్ఐఏ ఉపా చట్టాన్ని ప్రయోగించినప్పటికీ, ఈ నెల ప్రారంభంలో కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్లో మాత్రం ఆ చట్టాన్ని చేర్చలేదు. అందులో కేవలం 2005 నాటి ఇమ్మిగ్రేషన్, ఫారినర్స్ చట్టాన్ని మాత్రమే పేర్కొన్నారు.
ఉగ్రవాద నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే వాస్తవాలను ధృవీకరించేందుకు తమకు మరింత సమయం కావాలని దర్యాప్తు సంస్థ చెప్పినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఉపా చట్టం ప్రకారం, విచారణను పూర్తి చేయడానికి అధికారులు నిందితులను 180 రోజుల వరకు నిర్బంధించవచ్చు. అలా చేయడంలో విఫలమైతే నిందితులు బెయిల్ పొందేందుకు అర్హులు అవుతారు.
“దరఖాస్తుదారు, నిందితుడైన మాథ్యూ ఆరోన్ వాన్ డ్యూక్‌కు డిఫాల్ట్ బెయిల్ నిరాకరించాలనే ఉద్దేశ్యంతో అసంపూర్ణ చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా దర్యాప్తు సంస్థ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187(3) ని తప్పించుకోజాలదు” అని న్యాయమూర్తి శర్మ శుక్రవారం వ్యాఖ్యానించినట్లు బార్ అండ్ బెంచ్ తెలిపింది.
వాన్ డ్యూక్‌కు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి శర్మ బెయిల్ మంజూరు చేశారని, ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించారని ద హిందూ పత్రిక తెలిపింది.
అదే సమయంలో, భారతదేశం విడిచి వెళ్లేందుకు అనుమతించాలని ఆయన పెట్టుకున్న దరఖాస్తును న్యాయస్థానం మంగళవారం విచారించనుందని పత్రిక పేర్కొంది.
సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడే ఈ వాన్ డ్యూక్..
నిరంకుశ పాలకులపై పోరాడుతున్న దళాలకు సైనిక శిక్షణ, సామాగ్రిని అందించే లక్ష్యంతో పనిచేస్తున్న సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ (ఎస్ఓఎల్ఐ) సంస్థ వ్యవస్థాపకుడే ఈ వాన్ డ్యూక్.
అరెస్టు అయ్యే సమయానికి ఆయన 2022 నుంచి ఉక్రెయిన్‌లో పనిచేస్తున్నారని, ఉక్రెయిన్ సాయుధ దళాలలో చేరారని తెలిసింది.
మే నెలలో అమెరికా అధికారి ఢిల్లీ పర్యటన సందర్భంగా భారతీయ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోలకు వాన్ డ్యూక్ పరిస్థితి గురించి భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వివరించారని ఎస్ఓఎల్ఐ సూచించింది.
ఆ సమయంలో వాన్ డ్యూక్ తనకు వైద్య సహాయం అందడం లేదని, దౌత్యపరమైన ప్రవేశాన్ని నిరాకరిస్తున్నారని ఆరోపిస్తూ కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుంటూ నిరాహార దీక్ష చేస్తున్నారు.
రూబియో, మిస్రీలతో గోర్ వాన్ డ్యూక్ గురించి చర్చించారన్న వాదనపై, అలాగే న్యూఢిల్లీ అమెరికా అధికారులకు ఏదైనా హామీ ఇచ్చిందా అని అడిగినప్పుడు- ఈ వ్యవహారం “చట్టపరమైన విషయమని, ఇది కోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు సాగుతుందని” విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల ప్రారంభంలో తెలిపింది.
భారత్‌కు ఉక్రెయిన్ నిరసన..
తమ ఆరుగురు జాతీయుల అరెస్టుపై ఈ వ్యక్తుల అరెస్టు జరిగిన వెంటనే ఉక్రెయిన్ భారతదేశానికి అధికారికంగా నిరసన తెలియజేసింది.
ఎన్ఐఏ కేసు “ఉద్దేశపూర్వకంగా అల్లినదిగా, రాజకీయ ప్రేరేపితమైనదిగా” కనిపిస్తోందని పేర్కొంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
