ఈ పరిశోధన కేవలం ఆర్కైవ్లలో పాత పత్రాలను వెతకడంతోనే పరిమితం కాలేదు. అది క్షేత్రస్థాయిలో సాగిన అన్వేషణ, ఊహాశక్తి అవసరమైన ప్రక్రియ కూడా.
పర్షియన్ చరిత్ర గ్రంథాలు, ఉర్దూ నాటకాలు, దక్కనీ చిత్రకళ, పురావస్తు నివేదికలు, మౌఖిక సంప్రదాయాలు, స్థానిక గాథలు— ఇవన్నింటినీ అనుసరిస్తూ చాంద్ బీబీ జాడలను వెతికాను.
ఆమె పాలించిన, జీవించిన ప్రదేశాల్లోని చారిత్రక కట్టడాల చుట్టుపక్కల నివసించే ప్రజలను కలుసుకుని తరతరాలుగా వారు చెప్పుకుంటూ వచ్చిన కథలను కూడా సేకరించాను.
ఇలా పత్రాల్లో దొరికిన ఆధారాలతో పాటు ప్రదేశాలు, జ్ఞాపకాలు, స్థానిక కథనాలను ఒకదానితో ఒకటి కలుపుకుంటూ ఆమె జీవితాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేశాను.
ఆర్కైవ్లుగా మారిపోయిన ప్రదేశాలు..
పర్షియన్లో ఒక పదబంధం ఉంది- “సర్-ఎ-నఖ్”. పుస్తకంలో నేను ఈ పదాన్ని ఉపయోగించాను. అక్షరార్థంగా దీని అర్థం దారపు కొస కానీ భావంలో ఇది ఒక జాడ, ఒక కీలకమైన ఆధారం అని అర్థం.
నేను కూడా ఒక్కో ఆధారాన్ని పట్టుకుని దాని వెనుక ఉన్న దారాన్ని అనుసరిస్తూ వెళ్లాను. ఆ దారి నన్ను చెల్లాచెదురైన ఆధారాల మధ్యకు, పరస్పర విరుద్ధమైన కథనాల మధ్యకు తీసుకెళ్లింది.
ఈ అన్వేషణను ఇంత ఆసక్తికరంగా మార్చిన విషయం ఏమిటంటే ఆమె జీవించిన నేల, ఆ ప్రదేశాలే ఒక ఆర్కైవ్‌గా మారిపోయాయి.
ఉదాహరణకు గుల్బర్గాలో చాంద్ బీబీ సమాధి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం నన్ను దక్కన్‌లోని మహాసూఫీ సంత్ ఖ్వాజా బందే నవాజ్ గెసు దరాజ్ దర్గాకు తీసుకెళ్లింది. అక్కడ ఒక ఖాళీ సమాధి కనిపించింది. అంతేకాదు ఇప్పటికీ ఆమెను చాంద్ సుల్తానాగా గుర్తుచేసుకునే స్థానికులను కూడా కలిశాను.
అహ్మద్‌నగర్‌లో నాకు కోట శిథిలాలు, రాజభవనాల అవశేషాలు, ఒకప్పుడు జరిగిన ముట్టడి తాలూకు జ్ఞాపకాలు ఎదురయ్యాయి.
హైదరాబాద్‌లో మాత్రం కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న కథనాలు, దక్కనీ జ్ఞాపకాలు, అధికారిక ఆర్కైవ్లకు వెలుపల ముస్లిం మహిళల గురించి కొనసాగుతూ వచ్చిన చరిత్రలను ఆధారంగా చేసుకున్నాను.
ఈ అన్వేషణ అంటే అన్నింటికీ సమాధానం చెప్పగలిగే ఒకే ఒక్క కీలక పత్రాన్ని కనుగొనడం కాదు. చాంద్ బీబీ జీవితం మనకు చెల్లాచెదురైన ఆధారాలు, పరస్పర విరుద్ధమైన కథనాలు, కాలక్రమంలో ఆమెకు ఏర్పడిన భిన్నమైన రూపాల ద్వారా మాత్రమే మిగిలింది. అందుకే నేను ‘ఏం జరిగింది?’ అనే ప్రశ్నతో మాత్రమే ఆగిపోలేదు. ఆమెను ఇలా ఎందుకు గుర్తుంచుకున్నారు? ఆమె గురించి ఈ కథనాన్ని ఎవరు కాపాడారు? ఈ కథనం వెనుక ఎలాంటి భయాలు, ఆకాంక్షలు లేదా రాజకీయ హక్కుల వాదనలు దాగి ఉన్నాయి? అనే ప్రశ్నలను కూడా వేసుకున్నాను.
చాంద్ బీబీ మరణంపై పరస్పర విరుద్ధ కథనాలు..
ది డైలీ స్టార్ (టీడీఎస్): శతాబ్దాలుగా పరిష్కారం కాని ఒక ప్రశ్న చుట్టూనే మీ పుస్తకం ప్రధానంగా సాగుతుంది — చాంద్ బీబీ అసలు ఎలా మరణించారు? కొందరు చరిత్ర కథనాలు ఆమెను సొంత సైనికులే హతమార్చారని చెబుతాయి. మరికొన్ని శత్రువులకు చిక్కడం కంటే మరణాన్నే ఆమె ఎంచుకున్నారని అంటాయి. ఇంకొన్ని కథనాల ప్రకారం ఆమె అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయారు. ఇలా పరస్పర విరుద్ధమైన కథనాలు శతాబ్దాలుగా కొనసాగుతుండటం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది. అధికారం, జ్ఞాపకం, లింగం— ఈ మూడు చరిత్రలో ఏది నమోదు కావాలి, ఏది మరుగునపడాలి అన్నదానిని ఎలా ప్రభావితం చేస్తాయి?
సారా వహీద్: చాంద్ బీబీ మరణం గురించి ఉన్న పరస్పర విరుద్ధమైన కథనాలే నా పుస్తకానికి కేంద్రబిందువు. ఆ కథనాలను నేను కేవలం ‘నిజం’ లేదా ‘అబద్ధం’ అని కొట్టి పారేయను. దానికి బదులుగా వాటిని చెప్పిన వ్యక్తులు, సమాజాల గురించి ఒక్కో కథనం ఏం చెబుతోందో పరిశీలిస్తాను.
ఆమెను హత్య చేశారనే కథనం దక్కన్ రాజదర్బార్లలోని వర్గపోరాట రాజకీయాలను, వాటి వెనుక దాగి ఉన్న అనేక ద్రోహాలను ప్రతిబింబిస్తుంది. ఇక ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే కథనం ఒక మహిళకు సంబంధించిన లైంగిక గౌరవం, పరువు అనేవి మనుగడతో కాకుండా మరణంతోనే ముడిపడి ఉంటాయనే స్థానిక సామాజిక ఊహను ప్రతిబింబిస్తుంది.
ఈ రెండు కథనాలూ ఎక్కువగా ఉన్నతవర్గ, పితృస్వామ్య దృక్కోణాల నుంచే రూపుదిద్దుకున్నవి.
సామాన్యుల జ్ఞాపకాల్లో తప్పించుకున్న చాంద్ బీబీ..
చాంద్ బీబీ తప్పించుకున్నారనే కథనం మరింత ఆసక్తికరమైనది. ఎందుకంటే ఇది మిగతా కథనాలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. ఈ కథనం అధికారిక రాజదర్బార్ల ఆర్కైవ్లకు వెలుపల ఉన్న మౌఖిక సంప్రదాయాలు, స్థానిక జ్ఞాపకాలు, ప్రజా సమాజాల నుంచి పుట్టుకొచ్చింది.
శతాబ్దాల పాటు రైతులు, సామాన్య ప్రజలు ఈ కథను ఒకరి నుంచి మరొకరికి చెబుతూ వచ్చారు. అట్టడుగు ప్రజల జ్ఞాపకాల్లో చాంద్ బీబీ ఓటమిని అంగీకరించరు. అక్కడి నుంచి బయటపడేందుకు ఒక మార్గాన్ని కనుగొని తప్పించుకుంటారు.
అయితే ఇలాంటి సొరంగ మార్గం ద్వారా తప్పించుకున్న కథనాలను కొందరు సందేహవాదులు కేవలం చారిత్రక కథనాల్లో పదేపదే కనిపించే ఒక మూసగా కొట్టిపారేస్తారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనికి సంబంధించిన లిఖిత ఆధారాలు కూడా పదిహేడో శతాబ్దం ఆరంభం నుంచే కనిపిస్తున్నాయి. మరి ఒక కథనం లిఖిత రూపంలోకి వచ్చినంత మాత్రాన అది మరింత విశ్వసనీయంగా మారుతుందా?
చరిత్రకారులు ఆధారాలను విస్మరించకూడదన్నది స్పష్టమే. అయితే అదే సమయంలో కొన్ని రకాల జ్ఞాపకాలను మాత్రం గంభీరమైన చరిత్రగా పరిగణిస్తూ మరికొన్నింటిని కేవలం కల్పితగాథలుగా ఎందుకు కొట్టిపారేస్తున్నాం? అనే ప్రశ్నను కూడా మనం వేసుకోవాలి.
జానపద గాథలు చరిత్రకు వ్యతిరేకమైనవి కావు. ముఖ్యంగా చారిత్రక గ్రంథాల్లో తమ గొంతు నమోదు కాని అట్టడుగు, ఉన్నతవర్గాలకు చెందని ప్రజల విషయంలో ఆ గాథలు వేదనను, ఆకాంక్షను, ప్రతిఘటనను, రాజకీయ జ్ఞాపకాలను తరతరాలకు మోసుకెళ్తాయి.
నా దృష్టిలో హత్య, ఆత్మహత్య, తప్పించుకోవడం— ఈ మూడు భిన్నమైన ముగింపులూ ఇప్పటికీ కొనసాగుతుండటం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది.
శక్తివంతమైన మహిళలను చరిత్ర తరచుగా అస్థిరమైన, మారుతూ ఉండే రూపాల్లోనే గుర్తుంచుకుంటుంది. వారిని అమరవీరులుగా, పవిత్ర వ్యక్తులుగా లేదా ఏదో ఒక ప్రతీకగా మలుస్తుంది. కానీ చరిత్రకు మరింత కష్టమైనది— ఒక మహిళను సార్వభౌమ పాలకురాలిగా చూడటం. అంటే ఆశయాలు, సంక్లిష్టతలు, వ్యూహాత్మక ఆలోచన, మేధస్సు, లోపాలు అన్నీ కలిగిన, పూర్తిస్థాయి రాజకీయ నాయకురాలిగా ఆమెను గుర్తించడం. చాంద్ బీబీని పూర్తి రాజకీయ చైతన్యం ఉన్న వ్యక్తిగా చరిత్ర అంగీకరించడమంటే మరింత కష్టం.
చరిత్రలో అంచులకు నెట్టివేయబడిన ముస్లిం మహిళలు..
ఈ పుస్తకాన్ని ముందుగా చదివినవారు, మీరు ముస్లిం మహిళల రాజకీయ అధికారాన్ని చరిత్రలో తిరిగి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని అభిప్రాయపడ్డారు.
ఒక సమీక్షలో చెప్పినట్లుగా ‘ముస్లిం మహిళా పాలకులను చరిత్ర అంచులకు నెట్టివేస్తున్న’ సమయంలో ఈ ప్రయత్నం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. చాంద్ బీబీ కథకు మాత్రమే పరిమితం కాకుండా చూస్తే దక్షిణాసియా చారిత్రక జ్ఞాపకం నుంచి ముస్లిం మహిళల రాజకీయ అధికారాన్ని క్రమంగా ఎలా చెరిపివేశారో ఆమె కథ మనకు ఏం చెబుతుంది?
చాంద్ బీబీ కథ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. దక్షిణాసియా చరిత్రలో ముస్లిం మహిళల రాజకీయ అధికారం లేనిది కాదు. దాన్ని మనకు కనిపించకుండా చేశారు. ఆమె రాజకీయ అధికారానికి దూరంగా ఉండటానికి కారణం ఆమె ధరించిన ముసుగు కాదు.
ఆమెను చరిత్రలో ఎంతవరకు, ఏ రూపంలో చూడాలి అన్న పరిధిని కుదించి వేసిన చరిత్రకారులే ఆమెను కనిపించకుండా చేశారు.
ముస్లిం మహిళలు అంతఃపురానికే పరిమితమై ఉండేవారని, రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం వారికి లేదనే ఓరియంటలిస్టు కల్పనను చాంద్ బీబీ కథ సవాలు చేస్తుంది. అది వాస్తవం కాదు.
దక్కన్లో ముస్లిం మహిళలు రాజప్రతినిధులుగా, కళలు –నిర్మాణాలకు ప్రోత్సాహకులుగా, సలహాదారులుగా, సైనిక వ్యవహారాల్లో కీలక పాత్రధారులుగా, నిర్మాణకర్తలుగా, విద్యావేత్తలుగా, రాజకీయ చర్చలు –చర్చోపచర్చలు సాగించే దౌత్యవేత్తలుగా వ్యవహరించారు.
దక్కన్ పాలకులు ఒకే చోట స్థిరంగా ఉండే వారు కాదు. వారి రాజదర్బార్లు, రాజధానులు కూడా అవసరాన్ని బట్టి మారుతూ ఉండేవి. వారితో పాటు ఈ రాజకీయ ప్రపంచంలోని మహిళల జీవితం కూడా చలనశీలంగానే ఉండేది. అందువల్ల చాంద్ బీబీ అంతఃపురం కూడా గోడల మధ్య పూర్తిగా మూసుకుపోయిన ప్రదేశం కాదు. అది కూడా పాలకుల ప్రయాణాలతో పాటు కదులుతూ ఉండే వ్యవస్థలో భాగమే.
అంతేకాదు చాంద్ బీబీ ఏకైక ఉదాహరణ కూడా కాదు. ఆమె ఆ ప్రాంతంలో అధికారాన్ని చలాయించిన బలమైన మహిళా పాలకుల సుదీర్ఘ పరంపరలో ఒక భాగం.
దక్కన్ చరిత్రలో మహిళా పాలకుల పరంపర..
వాస్తవానికి దక్షిణాసియాలోని మరే ప్రాంతంతో పోల్చినా దక్కన్లో మహిళా పాలకులు ఎక్కువగా ఉండి ఉండవచ్చు. చాంద్ బీబీకి ముందు, ఆ తర్వాత కూడా ముస్లిం మహిళలు పాలించారు, సైన్యాలకు నాయకత్వం వహించారు, పాలకులకు సలహాలు ఇచ్చారు, నగరాలను రక్షించారు, రాజవంశాల రాజకీయ అధికారాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.
పదిహేనో శతాబ్దంలో బహమనీ సుల్తానత్‌ను దశాబ్దానికి పైగా పాలించిన ఆఘా నర్గిస్ బాను ఇందుకు ఒక ఉదాహరణ. సైనికాధికారులకు సలహాలు ఇస్తూ, బెలగావి సమీపంలోని ఒక సైనిక శిబిరంలోనే ఆమె మరణించారు.
చాంద్ బీబీ తల్లి ఖున్జా హుమాయూన్ కూడా అహ్మద్‌నగర్ రాణి-రాజప్రతినిధిగా వ్యవహరించారు. రాజదర్బారు వ్యవహారాలను పర్యవేక్షించడమే కాకుండా సైనిక యాత్రల్లోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు. అలాగే కుతుబ్‌షాహీ వంశానికి చెందిన హయాత్ బక్షీ బేగం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో రాజకీయ చర్చలు, దౌత్య వ్యవహారాలు నడిపారు.
ఆదిల్షాహీ వంశానికి చెందిన దిల్షాద్ ఆఘా తన సైనిక జోక్యంతో యుద్ధ గమనాన్నే మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. దక్కన్లో రాజకీయ రాజవంశాల నిర్మాణంలోనూ, వాటి మనుగడలోనూ మహిళలు కేంద్ర పాత్ర పోషించారు.
అందువల్ల చాంద్ బీబీ ఆవిర్భవించింది మహిళలు రాజకీయ, సైనిక, సాంస్కృతిక, మతపరమైన అధికారాన్ని చలాయించగలిగిన, నిజంగానే చలాయించిన దక్కన్ ప్రపంచం నుంచి. సమస్య ఏమిటంటే ఆ తర్వాతి కాలంలో రాయబడిన చరిత్రలు—వలసవాద, జాతీయవాద, మతపరమైన విభజనలతో కూడిన చరిత్ర రచనలు—చాలాసార్లు ఈ మహిళల అధికారాన్ని, వారి రాజకీయ పాత్రను గుర్తించడంలో విఫలమయ్యాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
