చాలాకాలంగా దేశంలోని అల్పసంఖ్యాక వర్గాలకు ఈ దేశం పట్ల ఉండే పద్ధతి గురించి హిందుత్వ జాతీయ వాదులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అస్తిత్వ సమస్యలను ఎదుర్కొంటున్న క్రైస్తవ, ముస్లిం మైనారిటీలు “మేమూ ఈ దేశానికి చెందిన వారమే” అని పదేపదే నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు హిందుత్వ జాతీయవాదానికి పెద్దన్న లాంటి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తాజాగా ప్లేట్ ఫిరాయించింది.
ఒక దేశం పట్ల ప్రజల నిబద్ధత వారి మత విశ్వాసాలకు లోబడి ఉండదని ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తుంది.
కర్మభూమి పట్ల నిబద్ధత: మోహన్ భాగవత్..
ఒక హిందువు భారతీయుడిగా ఉంటూ మరో దేశంలో పౌరుడిగా ఉండటంలో వైరుధ్యం ఏమీ లేదని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు.
లండన్‌లో 2026 సెప్టెంబర్ 6న సెలబ్రేట్ వన్నెస్ పేరుతో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ భాగవత్ “బ్రిటిష్ పౌరులు అయిన భారతీయులు నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వారైతే బ్రిటిష్ ప్రయోజనాలు, భారత ప్రయోజనాల మధ్య వైరుధ్యం ఏమీ ఉండదు. అటువంటి వైరుధ్యం ఏమైనా ఏర్పడితే బ్రిటన్‌లో ఉన్న హిందువులంతా బ్రిటన్ విధానాన్ని బట్టి మసలుకుంటారు. అక్కడక్కడా మినహాయింపులు ఉంటాయి. ఈ విషయంలో హిందుత్వ అవగాహన స్పష్టంగానే ఉంది. నీ కర్మభూమి పట్ల నీకు నిబద్ధత ఉంటుంది. నీ జన్మభూమి లేదా పుణ్యభూమి నుంచే నీకు విలువలు దక్కుతాయి. ఆ విలువలతోనే నువ్వు కర్మభూమిలో జీవించాలి. కర్మభూమికి సేవ చేయాలి. అందుకే కర్మభూమిని మోసం చేయాలని హిందుత్వం ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే నువ్వు అక్కడే బతకాలి అక్కడే సంపాదించాలి” అన్నారు.
జాతీయవాదానికి రెండు రూపాలు..
జాతీయ వాదం అంటే ఒకే బృందంలో ఉంటున్న సభ్యులు తామందరూ ఒకే బృందం అన్న అవగాహన కలిగి ఉండటం. స్థూలంగా జాతీయవాదం రెండు రకాలు. ఒకటి భౌగోళిక పరమైనది అయితే రెండవది సాంస్కృతిక పరమైనది.
భౌగోళిక జాతీయవాదం అంటే ఒకే భూభాగంలో నివసిస్తున్న ప్రజలందరూ ఒకే జాతికి చెందినవారు అన్న అవగాహన.
ఈ అవగాహన ప్రకారం భారతదేశంలో నివసిస్తున్న వారు క్రైస్తవులైనా, హిందువులైనా లేక ముస్లింలైనా అందరూ భారతీయులే.
సాంస్కృతిక జాతీయవాదం అవగాహన ప్రకారం వారు ఎక్కడ నివసిస్తున్నా ఒకే సంస్కృతిని పాటించే వారంతా ఒకే జాతీయులు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలు అయినా ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా వారంతా ఒకే జాతికి చెందిన వారవుతారు.
సంస్కృతి, భౌగోళికత మధ్య వైరుధ్యాలు
నిజానికి దైనందిన జీవితంలో ఇంత స్పష్టమైన అవగాహన ప్రకారం గీతలు గీయటం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలైనా, వారి ఆలోచనలైనా సరిహద్దులు దాటి ప్రయాణిస్తూ ఉంటాయి.
కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. ఆలోచనలు ఆచరణ కలగాపులగం అవుతూ ఉంటాయి. భారతదేశ విషయానికొస్తే డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో భారత జాతీయతకు నెహ్రూ ఇచ్చిన నిర్వచనంలో సంస్కృతి కూడా అంతర్భాగంగా ఉంటుంది.
ఆర్ఎస్ఎస్ ప్రాతినిధ్యం వహించే సాంస్కృతిక జాతీయ వాదం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా హిందువులందరూ ఒకే జాతి అని చెప్తూనే భౌగోళిక భారతం పట్ల స్పష్టమైన అవగాహనను కూడా కలిగి ఉంటుంది.
ఆర్ఎస్ఎస్ గీతం సంస్కృత భాషలో ఉన్న నమస్తే సదా వత్సలే మాతృభూమి అన్న గీతం. హిందూ సార్వత్రిక భావనకు పెద్దపీట వేస్తూనే, భౌగోళిక హద్దుల్లోని భారతదేశం గురించి నొక్కి చెప్తుంది. లౌకికవాదులు కూడా భారతమాత సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రవాస భారతీయుల అస్తిత్వ సంక్షోభం..
ఒక జాతిని నిర్వచించి, నిర్ధారించి, నిర్ణయించేటప్పుడు సంస్కృతికి, భౌగోళిక పరిధికి మధ్య ముడి పెట్టడం అంత తేలికైన విషయం కాదు. ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ, ప్రపంచ వ్యాప్తంగా తలెత్తుతున్న ప్రపంచీకరణ వ్యతిరేక ధోరణికి నడుమ ఇది మరింత సంక్లిష్టమైన పని.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్న మోహన్ భాగవత్ ఈ సంక్లిష్టతని అర్థం చేసుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.
ప్రతి ఏటా లక్షన్నర మంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకొని ఇతర దేశాలలో పౌరసత్వం పుచ్చుకుంటున్నారు.
వీరంతా మనస్తత్వ శాస్త్రవేత్తలు తరచూ ప్రస్తావించే ‘విడగొట్టుకునేటప్పుడు వచ్చే అస్తిత్వ సమస్యలు’ ఎదుర్కొంటున్న వారే. దాన్నే తేలికపాటి భాషలో చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. (ఈమధ్య ఈ రకమైన పర్సనాలిటీ డిసార్డర్ కథనాలతో అనేక తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. ఉదాహరణకు అపరిచితుడు- అను).
భారతదేశపు పాస్‌పోర్టులను వదులుకున్న తరువాత వీరు తాజాగా మోహన్ భాగవత్ ఏర్పాటు చేసిన సమావేశం లాంటివి, అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాలలో ఏర్పాటు చేసిన సభలకు హాజరై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు ఇస్తూ ఉంటారు.
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో ఉన్న భారతీయులు తరచూ క్రికెట్లో తాము నివసిస్తున్న దేశంతో భారత క్రికెట్ టీం తలపడుతున్నప్పుడు భారత క్రీడాకారులను సమర్థిస్తూ ఉంటారు. అవతల వైపు నిలబడాలా, పోషిస్తున్న తల్లి వైపు నిలబడాలా అన్న విషయంలో తలెత్తే ప్రశ్నలతో పాటు ఉపఖండంలో ఉన్న అన్ని రకాల వైరుధ్యాలను, వైవిధ్యాలను తాము నివసించే దేశానికి కూడా మోసుకెళ్తారు.
కులం, మతం, ప్రాంతం గురించి తమకున్న ఆలోచనలు, అభిప్రాయాలు, అంచనాలను యధాతథంగా కొనసాగిస్తూ ఉంటారు.
‘అంతర్గత శత్రువు’ వాదన..
ఒక భౌగోళిక ప్రదేశంలో నివసించే వారిలో తలెత్తుతున్న ఇటువంటి పరస్పర విరుద్ధమైన వైరుధ్యాలను, అంతర్గత వైరుధ్యాలను హిందూత్వ వ్యవస్థాపక సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ గమనించాడు.
తన “హిందుత్వ-హిందువు అంటే ఎవరు” అన్న రచనలో భారతదేశంలో జన్మించిన వారికి, భారతదేశాన్ని తమ పవిత్ర భూమిగా భావించే వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చర్చిస్తాడు.
తన మాటల్లో అసలైన హిందువు అంటే భారతదేశాన్ని జన్మభూమిగాను, పుణ్యభూమిగాను భావించే వ్యక్తి.
ఈ నిర్వచనం ద్వారా ఇతర దేశాలలో ఉన్న పుణ్యస్థలాలను తమకు విలువైనవిగా భావించే క్రైస్తవులు, ముస్లింలను వెలివేస్తుంది. ఇటువంటి పరాయివాళ్లు లేదా సంఘపరివారం భావజాలంలో నాటుకుపోయిన అంతర్గత శత్రువుల గురించి హిందుత్వ ఆలోచిస్తూ ఉంటుంది.
“ఈ యుద్ధం బయట ఉన్న వారి గురించి కాదు. దేశంలో అంతర్గతంగా ఉన్న వారి గురించి. అందువలన హిందూ ధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజాన్ని సంరక్షించే యుద్ధం జరుగుతుంది. దేశాన్ని ఆక్రమించుకోవడానికి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరూ ఇప్పుడు లేరు. కానీ విదేశీ ప్రభావాలు, విదేశీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి” అంటూ 2023లో ఆర్గనైజర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ భాగవత్ చెప్పారు.
హిందుత్వ జాతీయవాదాన్ని, దాని ప్రవక్తల ఆలోచనలను ఈ “అంతర్గత శత్రువు” అన్న భావన నిరంతరం నీడలా వెంటాడుతుంది.
ఆర్ఎస్ఎస్ ద్వంద్వ ప్రమాణాలు..
ప్రపంచవ్యాప్తంగా ఏకత్వం గురించిన సందేశాన్ని ప్రచారం చేస్తున్నాము అని ఆర్ఎస్ఎస్ చెప్పుకుంటున్నప్పుడు ఆర్ఎస్ఎస్ అవగాహనకు పునాది అయిన భౌగోళికత, ప్రజలు అన్న భావనలను ఎలా మేళవిస్తుంది?
ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్న హిందువులందరికీ ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉండాలనుకుంటున్నదా? లేక భారతదేశంలో ఉన్న వారందరినీ ఐక్యం చేసే సంస్థగా ఉండాలనుకుంటున్నదా?
ఈ ప్రశ్నకు తేలికైన సమాధానం కనుక్కునే ప్రయత్నం చేసే వాళ్లకు సంఘ్ ప్రతిపాదనలకు, ఆచరణకు మధ్య ఉన్న వైరుధ్యం ఎదురవుతుంది.
ఇది ప్రపంచాన్ని మార్చడానికి సంబంధించిన పోరాటం. ఎవరు ఏమనుకున్నా ప్రస్తుతం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది.
ఈ ఎదుగుదలకు వ్యూహాత్మక ప్రయత్నం, యాదృచ్ఛికత పాక్షికంగా తోడ్పడ్డాయి. భారతదేశంలో ఉంటూ ఒకే మూలపురుషుని కలిగిన వారందరూ హిందువులేనని భాగవత్ వక్కాణిస్తున్నారు.
ఒకే మూలాన్ని కలిగిన వారందరూ భారతదేశంలో నివసిస్తూ ఉంటే భారతీయులే అని ఆర్ఎస్ఎస్ చెప్పిన విషయాన్ని ఆర్ఎస్ఎస్ లేదా సంఘపరివారమే నమ్ముతూ ఉంటే ఉపఖండంలో ఉన్న పౌరులు ఎటు నుంచి ఎటు వెళ్లినా అభ్యంతరం ఉండకూడదు. కానీ ఆర్ఎస్ఎస్ అవగాహన అది కాదు.
భారతీయ సరిహద్దులను బలోపేతం చేయాలంటుంది. చొరబాటులను చిదిమేయాలి అంటుంది.
వలసవాద ప్రేరిత వలసలు భారతీయులను సుదూర తీరాలకు చేర్చాయి. భారతీయులు స్థిరపడిన అన్ని దేశాలలోనూ వలసవాదం వ్యతిరేక పోరాటాలు కూడా తలెత్తాయి.
20వ శతాబ్ది ఆరంభంలో భారత స్వాతంత్య్ర పోరాటానికి తోడ్పాటు అందించిన మేధోపరమైన కృషి, కార్యాచరణలకు సంబంధించిన ప్రతిరూపాలు అనేక దేశాలలో కూడా వ్యక్తం అయ్యాయి.
నిజానికి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, వినాయక దామోదర్ సావర్కర్ ఇద్దరూ ఇంగ్లాండ్ భూభాగంలో ఉండగానే భారతీయులకు నిర్వచనం గురించి ఆలోచించారు, రచనలు చేశారు.
ప్రవాస భారతీయుల సంశయం..
పశ్చిమ దేశాలలో హిందువులు ఒక క్రియాశీలకమైన రాజకీయ సమూహంగా ఆవిర్భవించటం హిందుత్వ చేతిలో రెండంచుల పదునున్న కత్తి లాగా మారింది.
ఇంగ్లాండ్‌లో హిందూయిజం మూలాలున్న రిషి సునక్ ప్రధానమంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ ఏకం చేసేందుకు ఉద్దేశించిన ఒక ప్రభుత్వ పథకాన్ని రూపొందించారు. ఆ సమయంలోనే కర్మభూమి, జన్మభూమి అన్న ద్వంద్వ పదాలను ప్రవాస భారతీయులకు పరిచయం చేశారు.
పాశ్చాత్య దేశాలకు చెందిన జాతీయవాదులు ప్రవాసుల పట్ల అనుమానాస్పద దృక్పథం అలవాటు చేసుకునే అంతవరకు వాజ్‌పేయి ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం సజావుగానే సాగింది.
మోదీ ప్రభుత్వం హయాంలో ప్రవాస భారతీయులందరినీ సమీకరించాలన్న పరివారం వ్యూహం మరింత పుంజుకున్నది. భారీ ఈవెంట్లకు తెరతీసింది.
అదే సమయంలో పశ్చిమ దేశాలలో స్థానికత, స్థానిక జాతీయత గురించిన అవగాహనలు మరింతగా వేళ్ళూనుకోవటం కూడా పెరిగింది.
విదేశీ మతాలను విశ్వసించి, ఆరాధించే వ్యక్తి మరొక దేశం పట్ల తన లాయల్టీని కలిగి ఉండగలడా అన్న ప్రశ్నకు మోహన్ భాగవత్ లండన్‌లో జరిగిన సమావేశంలో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు.
లండన్‌లో ఒకలా.. లక్నోలో మరోలా..
శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే ప్రపంచంలోని పౌరులందరి పట్ల ఒకే ప్రమాణాన్ని పాటించాలి.
లండన్‌లో చెల్లుబాటయ్యే ప్రాతిపదిక లక్నోలో కూడా చెల్లుబాటు కావాలి. లండన్‌లో వాస్తవం అయినది లక్నోలో కూడా వాస్తవం కావాలి.
ప్రజలు తమ దేశం పట్ల విశ్వాసంతో ఉన్నారా లేదా అన్నది వారు పాటించే మత విశ్వాసాలను బట్టి నిర్ణయం కాకూడదు.
పౌరసత్వానికి సంబంధించిన ఆధునిక భావనల ఆధారంగానే నిర్ణయం కావాలి. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులైనా సరే వారు నివసిస్తున్న దేశానికి తగ్గట్టుగానే వ్యవహరించాలి అని సూత్రీకరించడం ద్వారా భాగవత్ ఈ విషయంపై జవహర్లాల్ నెహ్రూ భావనలను పునర్ వ్యక్తపరిచినట్లు అయ్యింది.
అయితే మోహన్ భాగవత్ మాటలను భారతదేశంలో జరిగే పరిణామాల నేపథ్యంలో కూడా పరీక్షించాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్ఎస్ఎస్ ఆలోచనలు పరిణతి చెందాయా లేదా అన్నది అర్థమవుతుంది.
అనువాదం: కొండూరి వీరయ్య
(ఈ వ్యాసం మూల ప్రతి సెప్టెంబర్ 17వ తేదీ ది హిందూలో ప్రచురించబడింది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
