ఆయన విజ్ఞానాన్ని ప్రజా సంక్షేమానికి అంకితం చేసిన మహనీయుడు. సెప్టెంబర్ 15న వారి జయంతి. ఈ రోజు కేవలం ఇంజినీర్ల దినోత్సవం మాత్రమే కాదు. దేశ నిర్మాణ విలువలను గుర్తుచేసుకునే రోజు.
భారతదేశ ఆధునిక అభివృద్ధి చరిత్రలో కొంతమంది వ్యక్తుల కృషి కేవలం ఒక రంగానికే పరిమితం కాదు. వారి ఆలోచనలు, ప్రతిభ, దూరదృష్టి అనేక తరాల అభివృద్ధికి పునాదులుగా నిలిచాయి. అలాంటి మహనీయుల్లో సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒకరు.
1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జన్మించిన విశ్వేశ్వరయ్య భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సివిల్ ఇంజినీర్లలో ఒకరు. ఆయన ఇంజినీర్‌గా మాత్రమే కాకుండా పరిపాలకుడిగా, ఆర్థిక-పారిశ్రామిక అభివృద్ధి ఆలోచనాపరుడిగా, విద్యాభివృద్ధిని ఆకాంక్షించినవాడు.
ప్రజా సంక్షేమానికి కట్టుబడిన వ్యక్తిగా విశిష్ట సేవలు అందించారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15ను భారతదేశంలో జాతీయ ఇంజినీర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 15న ఆయన 165వ జయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని స్మరించుకోవడం అంటే ఒక గొప్ప ఇంజినీర్‌ను మాత్రమే గుర్తుచేసుకోవడం కాదు– విజ్ఞానం, సాంకేతికత, క్రమశిక్షణ, ప్రజా ప్రయోజనం, పారిశ్రామిక అభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి విలువలను గుర్తుచేసుకోవడం.
కష్టాలను అధిగమించిన విద్యార్థి..
మోక్షగుండం విశ్వేశ్వరయ్య తండ్రి మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి. సంస్కృత పండితుడు. చిన్న వయస్సులోనే విశ్వేశ్వరయ్య తండ్రిని కోల్పోవడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులలో పడింది. అయినప్పటికీ విద్యపై ఉన్న ఆసక్తిని విశ్వేశ్వరయ్య వదులుకోలేదు.
బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్‌లో, తరువాత పుణెలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో సివిల్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించారు. ఆ కాలంలో భారతీయులకు ఉన్న పరిమిత అవకాశాలను అధిగమించి ఉన్నత విద్యను పూర్తిచేసి ఇంజినీరింగ్ రంగంలో ప్రవేశించడం ఆయన పట్టుదల, ప్రతిభకు నిదర్శనం.
ప్రభుత్వ ఇంజినీర్‌గా తొలి అడుగులు..
విశ్వేశ్వరయ్య తన వృత్తి జీవితాన్ని బొంబాయి ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజినీర్‌గా ప్రారంభించారు. ఆయన ప్రధాన ఆసక్తి నీటి వనరుల నిర్వహణ, నీటిపారుదల, ఆనకట్టలు, వరద నియంత్రణ, తాగునీటి సరఫరా వంటి ప్రజల జీవనంతో నేరుగా సంబంధం ఉన్న రంగాలపై ఉండేది.
ఒక సమస్యను కేవలం తాత్కాలికంగా పరిష్కరించడం కాకుండా, దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని పరిశోధించి దీర్ఘకాలిక పరిష్కారాన్ని రూపొందించడం ఆయన ప్రత్యేకత.
ఆటోమేటిక్ వరద గేట్లు-ఆవిష్కరణ..
విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ ప్రతిభకు ప్రసిద్ధ ఉదాహరణ ఖడక్వాస్లా రిజర్వాయర్ వద్ద రూపొందించిన నీటి ఆటోమేటిక్ గేట్ల వ్యవస్థ. నీటి మట్టం ఒక నిర్దిష్ట స్థాయికి చేరినప్పుడు గేట్లు వాటంతట అవే తెరుచుకొని నీటిని విడుదల చేయడం ఆ కాలంలో వినూత్నం.
ఈ సాంకేతికత తరువాత ఇతర నీటి ప్రాజెక్టుల్లో కూడా ఉపయోగించారు. ప్రకృతిని అడ్డుకోవడానికి బదులుగా ప్రకృతి శక్తిని శాస్త్రీయంగా నియంత్రించి ప్రజల ప్రయోజనానికి ఉపయోగించుకోవడం ఆయన ఇంజినీరింగ్ దృక్పథంలో అత్యంత ప్రధానమైనది.
హైదరాబాద్ మూసీ వరదలు-నగర ప్రణాళికలో ముందుచూపు..
1908లో హైదరాబాద్ నగరం మూసీ నది భారీ వరదలకు గురై తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరిగాయి. ఈ విపత్తు తరువాత నాటి హైదరాబాద్ పాలకులు వరద నియంత్రణకు శాస్త్రీయ పరిష్కారాల కోసం విశ్వేశ్వరయ్యను సంప్రదించారు.
హైదరాబాద్‌లో వరద నియంత్రణ, నీటి నిర్వహణ, నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను రూపొందించడంలో ఆయన కీలకంగా పనిచేశారు.
కేవలం వరద వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టడం కాకుండా, వరద నీటిని ముందుగానే నియంత్రించడం, రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేయడం, నగర డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం వంటి దీర్ఘకాలిక చర్యలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. తరువాత నిర్మించబడిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి రిజర్వాయర్లు హైదరాబాద్ నీటి నిర్వహణ, వరద నియంత్రణ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
శతాబ్దం క్రితమే విశ్వేశ్వరయ్య ఆలోచించిన అంశాలు నేటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్కు ఎంత అవసరమో అర్థమవుతుంది.
కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట వారి ఇంజినీరింగ్ ప్రతిభకు చిహ్నం..
విశ్వేశ్వరయ్య పేరు భారతదేశంలో నీటిపారుదల చరిత్రతో అనుసంధానం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కృష్ణ రాజ సాగర్(కేఆర్ఎస్) ఆనకట్ట. కావేరీ నదిపై మైసూరు సమీపంలో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు వ్యవసాయం, తాగునీరు, విద్యుత్, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైనది. కేఆర్ఎస్ ద్వారా నీటిని నిల్వ చేసి విస్తారమైన వ్యవసాయ భూములకు నీటిపారుదల అందించే అవకాశం ఏర్పడింది.
మైసూరు, మండ్య ప్రాంతాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. విశ్వేశ్వరయ్య లక్ష్యం కేవలం ఒక ప్రాజెక్ట్‌ను నిర్మించడం కాదు.
నీటి నిల్వ, సాగునీరు, వ్యవసాయ ఉత్పత్తి, ఆహార భద్రత, ఉపాధి, పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధి అనే సమగ్ర అభివృద్ధి గొలుసులో ప్రాజెక్ట్ ఒక కీలకమైన భాగం.
విశాఖపట్నం పోర్టు సేవలు..
విశ్వేశ్వరయ్య సేవలు కేవలం ఆనకట్టలు, నీటిపారుదలకే పరిమితం కాలేదు. విశాఖపట్నం పోర్టుకు ఎదురైన సముద్రపు ఇసుక చేరిక, నౌకాశ్రయ నిర్వహణ వంటి సమస్యలకు ఇంజినీరింగ్ పరిష్కారాల రూపకల్పనలో ఆయన ఎంతో తోడ్పడ్డారు. దీంతో ఆయన ఇంజినీరింగ్ పరిజ్ఞానం నీటి వనరుల నుంచి సముద్ర తీర మౌలిక సదుపాయాల వరకు విస్తరించి ఉందని అర్థమవుతుంది.
మైసూరు దివాన్‌గా కొత్త అధ్యాయం..
విశ్వేశ్వరయ్య 1912లో మైసూరు సంస్థానానికి దివాన్‌గా నియమితులయ్యారు. 1912 నుంచి 1918-19 వరకు దివాన్‌గా పనిచేసిన కాలంలో ఆయన ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని పరిపాలన, ఆర్థికాభివృద్ధి, విద్య, పరిశ్రమల అభివృద్ధితో అనుసంధానం చేశారు. ఇక్కడ ఆయన గొప్పతనం మరింత స్పష్టమవుతుంది.
ఒక ఇంజినీర్‌గా ఆయన నీరు, ఆనకట్టలు, రహదారులు, నిర్మాణాలలో దిట్ట. కానీ దివాన్‌గా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే విద్య, పరిశ్రమ, వ్యవసాయం, నీరు, విద్యుత్, బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం అన్నీ కలిపి అభివృద్ధి చేయాలి. దీన్ని ఆయన విశేష ప్రతిభతో ఆచరణలో అమలు చేసి చూపించారు.
“ఆధునిక మైసూరు” నిర్మాణంలో పాత్ర..
విశ్వేశ్వరయ్య కాలంలో మైసూరు సంస్థానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు లభించింది. పరిశ్రమలను స్థాపించడం, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదల విస్తరణ వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్(భద్రావతి) వంటి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రోత్సహించారు. మైసూర్ శాండల్ సబ్బు అత్యంత ప్రసిద్ధి కాంచింది.
అలాగే ఉన్నత విద్య, సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఇందువల్ల ఆయనను “ఆధునిక మైసూరు నిర్మాణ కర్త”గా అభివర్ణిస్తారు.
పరిశ్రమల అభివృద్ధిపై ఆయన దృష్టి..
పారిశ్రామికీకరణకు విశ్వేశ్వరయ్య ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. భారతదేశం పేదరికం నుంచి బయటపడాలంటే ఉత్పాదకతను పెంచాలని, ఆధునిక పరిశ్రమలను అభివృద్ధి చేయాలని, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని ఆయన విశ్వసించారు. ఆయన ఆలోచనలో పరిశ్రమ అంటే కేవలం యంత్రాలు, ఫ్యాక్టరీలు కాదు.
పరిశ్రమల వల్ల ఉపాధి, నైపుణ్యం, ఉత్పత్తి, ఆదాయాలు పెరుగుతాయి. మార్కెట్లు విస్తరిస్తాయి, దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
ఈ కారణంగానే ఆయన భారతదేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి బలమైన మద్దతుదారుగా నిలిచారు.
నేడు ప్రపంచం మొత్తంలో నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్యగా ముందుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో విశ్వేశ్వరయ్య ఆలోచనలు, కార్యాచరణ ఎంతో అవసరం. విశ్వేశ్వరయ్య రచనలు, ప్రసంగాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది.
“ఇండస్ట్రియలైజ్ ఆర్ పెరిష్”(అంటే దేశం ఆధునిక పరిశ్రమలను అభివృద్ధి చేసుకోకపోతే ఆర్థికంగా వెనుకబడిపోతుందనే హెచ్చరిక) అత్యంత ప్రాధాన్యం కలిగిన ముందుచూపుకు నిదర్శనం. ఈ ఆలోచన ఆయన కాలంలో ఎంత ముఖ్యమో, నేటి ప్రపంచ ఆర్థిక పోటీ పరిస్థితుల్లో కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంది.
విద్య – దేశ నిర్మాణానికి పునాది..
విద్య ప్రాధాన్యం, ఆర్థిక వ్యవస్థకు, వ్యక్తిగత జీవితానికి విద్య ఎంతో అవసరమని ఆయన విశ్వాసం. ప్రత్యేకంగా సాంకేతిక విద్య, వృత్తి విద్య, ఇంజినీరింగ్ విద్య, శాస్త్రీయ పరిశోధన, నైపుణ్యాభివృద్ధి దేశ అభివృద్ధికి అవసరమని ఆయన భావించారు.
దేశంలో మౌలిక సదుపాయాలు నిర్మించడానికి ముందు వాటిని నిర్మించగల మానవ వనరులను సిద్ధం చేయాలని ఆయన భావించారు.
నేడు ప్రభుత్వాధినేతలు మాట్లాడుతున్న స్కిల్ డెవలప్మెంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, రీసెర్చ్ వంటి అంశాలకు ముందుగానే విశ్వేశ్వరయ్య పునాదులు వేశారు. అయితే నేటి పాలకుల మాటలకు ఆచరణకు పొంతన లేదు. నైపుణ్య లోపానికి విద్యార్థులను నిందించడమే ప్రభుత్వాల అలవాటు అయింది.
బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థపై దృష్టి..
ఆర్థికాభివృద్ధికి పరిశ్రమలు మాత్రమే కాకుండా బలమైన ఆర్థిక సంస్థలు కూడా అవసరమని విశ్వేశ్వరయ్య గుర్తించారు. మైసూరు ప్రాంతంలో ఆధునిక బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధిని ఆయన ప్రోత్సహించారు.
బ్యాంక్ ఆఫ్ మైసూర్ ఏర్పాటు మైసూరు ఆర్థిక వ్యవస్థను ఆధునిక పరచడం ఒక ముఖ్యమైన ముందడుగు. విశ్వేశ్వరయ్య దృష్టిలో అభివృద్ధి నమూనా అంటే ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు చేపట్టడంతో పాటు, ఉత్పత్తి, పరిశ్రమ, ఆర్థిక సంస్థలు, విద్య, మౌలిక సదుపాయాలు పరస్పర సంబంధం కల అంశాలు.
వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదల..
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కీలకమని ఆయన గట్టిగా నమ్మారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల, నీటి నిల్వ, మెరుగైన సాంకేతికత, వ్యవసాయ పరిశోధన, మార్కెట్లు, రవాణా అవసరమని ఆయన భావించారు. ఆయన ఇంజినీరింగ్ సేవలు వ్యవసాయ ఉత్పాదకత పెంపుతో నేరుగా అనుసంధానం చేశారు.
సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దార్శనికత కలిగిన ఇంజనీరు మాత్రమే కాదు, ముందుచూపు కలిగిన ఆర్థికవేత్త కూడా.
1920లో భారత నైపుణ్య నిర్మాణం అను గ్రంథాన్ని, 1934లో భారతదేశానికి ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ అన్న గ్రంథాన్ని రచించారు.
1928 ఏప్రిల్‌లో భారతదేశంలో పేదరికం, దాని నిర్మూలన పేరుతో రాసిన ఒక కరపత్రంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వేశ్వరయ్య 1920లో రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. 1938లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన జాతీయ ప్రణాళికా సంఘంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రధాన పాత్రధారి. ఈ కమిటీలో ఉన్న మొత్తం 15 మంది సభ్యులు రూపొందించిన 27 నివేదికలే 1950 ఎన్నికల్లో వచ్చిన భారత ప్రణాళిక సంఘం ఏర్పాటుకు, కార్యాచరణకు పునాదులుగా పనిచేశాయి.
జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘానికి విశ్వేశ్వరయ్యని అధ్యక్షుడిగా పెట్టాలని సుభాష్ చంద్రబోస్ ప్రతిపాదించినప్పటికీ నెహ్రూ అధ్యక్షుడుగా ఉంటే దానికి వచ్చే ప్రాధాన్యం, జరిగే కృషి మరింత మెరుగ్గా ఉంటుంది అని ప్రముఖ శాస్త్రవేత్త మేఘనాథ్ సాహా ప్రతిపాదించడంతో ఈ ప్రతిపాదనకు విశ్వేశ్వరయ్య, సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ అంగీకరించారు.
1941లో విశ్వేశ్వరయ్య అఖిల భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను ప్రారంభించారు. ఈ సంస్థను ఉద్దేశించి 1947లో స్వయంగా అప్పటి ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ దేశాభివృద్ధి పట్ల విశ్వేశ్వరయ్యకు ఉన్న అవగాహన స్పష్టత దార్శనికతలను ప్రశంసించారు.
క్రమశిక్షణ – ఆయన వ్యక్తిత్వానికి గుర్తింపు..
విశ్వేశ్వరయ్య గురించి తెలుసుకోవడమంటే ఆయన ఇంజినీరింగ్ ప్రతిభతో పాటు ఆయన వ్యక్తిగత క్రమశిక్షణను కూడా అర్థం చేసుకోవాలి. సమయపాలన, పనిలో నాణ్యత, నిరంతర అధ్యయనం, బాధ్యతాయుతమైన పని విధానం ఆయన వ్యక్తిత్వంలో ముఖ్యమైన లక్షణాలు. ఆయన జీవితంలోని ప్రధాన సందేశాలలో ఒకటి పని పట్ల నిబద్ధత లేకుండా ప్రతిభకు విలువ ఉండదు.
ప్రజాధనంతో జరిగే ప్రతి పనిలో నాణ్యత, సామర్థ్యం, బాధ్యతలను ఆయన ఆచరించి చూపించారు. నేటి సమాజంలో ఇంజినీరింగ్‌ను ఉద్యోగం, వృత్తిగా మాత్రమే పరిగణిస్తున్నాం. కానీ విశ్వేశ్వరయ్య జీవితాన్ని పరిశీలిస్తే ఇంజినీరింగ్‌కు విస్తృతమైన అర్థం కనిపిస్తుంది.
ఒక ఇంజినీర్ నిర్మించే ఆనకట్ట నీటిని అందిస్తుంది. కాలువ రైతు పొలానికి నీటిని తీసుకెళ్తుంది. వంతెన ప్రజలను, మార్కెట్లను కలుపుతుంది. రోడ్డు ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుంది.
విద్యుత్ ప్రాజెక్టు పరిశ్రమలకు శక్తిని అందిస్తుంది. నీటి శుద్ధి కేంద్రం ప్రజారోగ్యాన్ని కాపాడుతుంది. డ్రైనేజీ వ్యవస్థ నగరాలను వరదల నుంచి రక్షిస్తుంది. అందువల్ల ఇంజినీరింగ్ అనేది కేవలం నిర్మాణాల శాస్త్రం కాదు. అది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సామాజిక బాధ్యత.
నేటి నీటి సంక్షోభానికి ఆయన ఆలోచనలు ఒక పాఠం..
భారతదేశం నేడు ఒకవైపు తీవ్రమైన వరదలను, మరోవైపు కరువును ఎదుర్కొంటున్నది. నగరాల్లో ఆకస్మిక వరదలు, భూగర్భజలాలు పడిపోవడం, తాగునీటి కొరత, చెరువుల ఆక్రమణ, డ్రైనేజీ వ్యవస్థల ధ్వంసం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
ఒక శతాబ్దం క్రితమే నీటిని శాస్త్రీయంగా నిల్వ చేయడం, నియంత్రించడం, వినియోగించడం, వరదలను ముందుగానే అంచనా వేసి నివారించడం వంటి అంశాలకు విశ్వేశ్వరయ్య ఇచ్చిన ప్రాధాన్యం నేడు అత్యవసరం అయింది.
వర్షపు నీటిని వృథా చేయకుండా నిల్వ చేయడం, చెరువులు, కాలువలను రక్షించడం, పట్టణ డ్రైనేజీని శాస్త్రీయంగా రూపొందించడం, వరద మైదానాలను ఆక్రమణల నుంచి కాపాడడం వంటి అంశాల్లో ఆయన దృక్పథం మనకు గొప్ప విలువైన పాఠం.
అభివృద్ధి అంటే కేవలం భారీ నిర్మాణాలు కాదు..
విశ్వేశ్వరయ్య దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం భారీ భవనాలు, రహదారులు, ఆనకట్టలు, పరిశ్రమలు నిర్మించడం మాత్రమే కాదు.
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? ఉపాధి పెరుగుతున్నదా? వ్యవసాయం అభివృద్ధి అవుతున్నదా? విద్య అందరికీ అందుబాటులో ఉందా? సాంకేతిక నైపుణ్యం పెరుగుతున్నదా? నీరు, విద్యుత్, రవాణా వంటి మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు అభివృద్ధిలో భాగం.
ఈ సమగ్ర దృక్పథమే విశ్వేశ్వరయ్యను కేవలం ఒక గొప్ప ఇంజినీర్గానే కాకుండా దేశ నిర్మాణ ఆలోచనాపరుడిగా నిలబెట్టింది.
బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం..
ఆయన అసాధారణ మేధోశక్తి, ప్రజా సేవలకు గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్ (కేసీఐఈ) బిరుదుతో సత్కరించింది. దాంతో ఆయన పేరు “సర్ ఎం విశ్వేశ్వరయ్య”గా ప్రసిద్ధి చెందింది.
ఆయనకు 1955లో భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవం “భారత రత్న” ప్రదానం చేసింది. ఇంజినీరింగ్, ప్రజా సేవ, పరిపాలన, విద్య, పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధి వంటి అనేక రంగాలలో ఆయన చేసిన సేవలకు ఇది జాతీయ స్థాయి గుర్తింపు.
శతాయుష్షును దాటిన జీవితం..
విశ్వేశ్వరయ్య 1962 ఏప్రిల్ 14న బెంగళూరులో మరణించారు. ఆయన 100 సంవత్సరాలకు పైగా జీవించారు. ఆయన జీవితకాలం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మార్పు జరిగింది. ఆయన బ్రిటిష్ పాలనలో ప్రభుత్వ ఇంజినీర్‌గా పనిచేశారు. మైసూరు దివాన్‌గా సేవలందించారు.
స్వాతంత్ర్యోద్యమ కాలాన్ని చూశారు. స్వతంత్ర భారతదేశ ఆవిర్భావాన్ని చూశారు. దేశ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేశారు. మార్గదర్శకం చేశారు.
నేటి తరం విశ్వేశ్వరయ్య నుంచి నేర్చుకోవలసింది..
సమస్యను శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. సమస్యను దాటవేయకుండా దాని మూల కారణాన్ని గుర్తించాలి. సాంకేతికత ప్రజల ప్రయోజనం కోసం వినియోగించాలి. సాంకేతిక అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. ప్రజాధనానికి విలువ ఇవ్వాలి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో నాణ్యత, పారదర్శకత, సామర్థ్యం అత్యంత ముఖ్యం. నీటిని సంరక్షించాలి. నీటి భద్రత దేశ భవిష్యత్తుకు పునాది.
పరిశ్రమలను అభివృద్ధి చేయాలి. ఉపాధి, ఉత్పాదకత, ఆర్థిక స్వావలంబనలకు పరిశ్రమలు అవసరం. విద్యతో పాటు నైపుణ్యం అవసరం.
కేవలం డిగ్రీలు కాకుండా శాస్త్రీయ, సాంకేతిక, వృత్తి నైపుణ్యాలు అవసరం. నిరంతరం నేర్చుకోవాలి. విజ్ఞానం అభివృద్ధి అయ్యే కొద్దీ మనిషి కూడా తన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
అభివృద్ధిని సమగ్రంగా చూడాలి. వ్యవసాయం, పరిశ్రమ, విద్య, నీరు, విద్యుత్, రవాణా, ఉపాధి ఇవన్నీ పరస్పరం ఒకదానికొకటి అనుబంధమైన రంగాలు.
క్రమశిక్షణను పాటించాలి..
వ్యక్తిగత క్రమశిక్షణ, పని పట్ల నిబద్ధత విజయానికి పునాది. దేశ ప్రయోజనం ప్రధానంగా ఉండాలి. వ్యక్తిగత ప్రతిభకు అసలైన విలువ అది సమాజానికి ఎంత వరకు ఉపయోగపడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగాలంటే భారీ మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే సరిపోదు. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత సార్వత్రిక ప్రజా ఆరోగ్యం, పరిశోధన, స్వదేశీ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గౌరవప్రదమైన ఉపాధి, నీటి భద్రత, స్థిరమైన పారిశ్రామికీకరణ, పర్యావరణ పరిరక్షణ విధానాలు అవసరం.
ఇవన్నీ విశ్వేశ్వరయ్య ఆలోచనల్లో ప్రతిబింబించాయి. అందువల్ల ఆయనను స్మరించుకోవడం అంటే గతాన్ని గుర్తుచేసుకోవడం మాత్రమే సరిపోదు. దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో, అందుకు విశ్వేశ్వరయ్య ఆలోచనలు, విధానాలు ఎలా అమలు చేయాలనేది అత్యంత కీలకం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
