From Armed Struggles to Democratic Consciousness: Warangal-Khammam-Nalgonda
వరంగల్, ఖమ్మం, నల్గొండ… ఈ మూడు పేర్లు వినగానే గుర్తుకు వచ్చేది కేవలం భౌగోళిక సరిహద్దులు లేదా కొన్ని జిల్లాల కలయిక మాత్రమే కాదు; అన్యాయాన్ని కండ్ల చూస్తే సహించని దిక్కార స్వరం, హక్కుల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎగసిన ఉద్యమ కెరటాల సముదాయం! ఏజెన్సీ అడవులలోని ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటాల నుంచి పల్లెల్లోని రచ్చబండల దగ్గర సాగే రాజకీయ చర్చల వరకు, కాకతీయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి చట్టసభల వేదికల వరకు; ఈ నేల సదా చైతన్య స్పూర్తితో ఉంటుంది. ఏ రకమైన అణచివేతకైనా, ఎంతటి అధికార దర్పానికైనా ఎదురొడ్డి నిలదీసే తత్వాన్ని తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకున్న గడ్డ ఇది. మార్పు కోసం నిరంతరం శ్రమించడం, ప్రజా ప్రయోజనాల కోసం స్వతంత్రంగా ఆలోచించి ప్రశ్నించే శక్తులకు పట్టం కట్టడం ఇక్కడి ప్రజాస్వామిక సంస్కృతికి మూలస్తంభం.
ఈ ప్రాంతపు చైతన్యం ఏ ఒక్క రోజులోనో లేదా ఏ ఒక్క సిద్ధాంతం వల్లనో పుట్టుకొచ్చింది కాదు. తరతరాలుగా అనుభవించిన దోపిడీ, సామాజిక అసమానతలు, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా సాగించిన రాజీలేని పోరాటాల నుంచి ఉద్భవించింది. నైజాం నిరంకుశత్వానికి, జమీందారీ, దొరల అరాచకాలకు వ్యతిరేకంగా ఈ నేల సాగించిన సుదీర్ఘ పోరాటాలు ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. చదువుకున్న విద్యావంతుడి నుంచి నాగలి పట్టిన రైతు వరకు, శ్రమ దోపిడీకి గురయ్యే కార్మికుడి నుంచి హక్కుల కోసం కలం పట్టిన కవి వరకు; ప్రతి ఒక్కరూ ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములవుతూ తమ రాజకీయ పరిణతిని నిరూపించుకున్నారు. అందుకే ఈ ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రజలు రాజకీయ ప్రక్రియలను కేవలం ఓటు వేసే క్రమంగా మాత్రమే చూడరు; అదొక సామాజిక బాధ్యతగా, ప్రశ్నించే హక్కుగా భావిస్తారు.
ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగవర్గాలు ప్రాతినిధ్యం వహించే స్థానిక సంస్థల లేదా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఈ ప్రాంతపు చైతన్యం మరింత విశిష్టమైన రూపాన్ని సంతరించుకుంటుంది. సంప్రదాయ రాజకీయ శక్తుల ప్రచార ఆర్భాటాలను, పార్టీల అధిష్టానాల ఆదేశాలను గుడ్డిగా నమ్మకుండా; అభ్యర్థి గుణగణాలు, వారి పోరాట నేపథ్యం, మేధోపరమైన నిబద్ధత, ప్రజా సమస్యలపై మాట్లాడే సాహసాన్ని బేరీజు వేయడం ఇక్కడి ఓటర్ల నైజం. అధికార పార్టీల ధనప్రభావానికి లొంగక, స్వతంత్ర ఆలోచనలతో ప్రజాపక్షం వహించే ప్రజాస్వామిక స్ఫూర్తి ఈ నేలకు సొంతం.
చారిత్రక పోరాటాలు-రైతాంగ ఉద్యమాలు:
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల రాజకీయ చైతన్యానికి, ఇక్కడి ప్రజల నిరంతర ప్రతిఘటనా స్ఫూర్తికి ప్రధాన పునాది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951). నైజాం నవాబుల నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాలు, దొరలు, దేశ్ముఖ్ల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ఈ నేల రగిలించిన తిరుగుబాటు జ్వాలలు ప్రపంచ చరిత్రలోనే అరుదైన రైతాంగ విప్లవంగా నిలిచాయి. కడవెండి గ్రామంలో దొరల అరాచకాలను ఎదుర్కొని ప్రాణాలర్పించిన దొడ్డి కొమురయ్య బలిదానం ఈ ప్రాంతంలో పల్లెపల్లెనా పోరాట అగ్గిని రగల్చగా, విస్నూర్ దేశ్ముఖ్ ఆగడాలకు భయపడక తన భూమిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న చాకలి ఐలమ్మ సాహసం ఇక్కడి మహిళల విప్లవ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. అలాగే పత్రికా స్వేచ్ఛ కోసం కలం పట్టి నైజాం గుండాల చేతిలో హత్యకు గురైన షోయబుల్లా ఖాన్ వంటి యోధులు ప్రజాస్వామిక భావప్రకటన స్వేచ్ఛకు తమ ప్రాణాలనే పునాదులుగా వేశారు.
రజాకార్ల తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఈ ప్రాంతపు పల్లెలు కేవలం ఆవేశంతో కూడిన సాయుధ తిరుగుబాటుకే పరిమితం కాలేదు. ప్రతి గ్రామంలోనూ స్వయంపాలనను చాటుతూ ‘గ్రామ సంఘాలను’ ఏర్పరుచుకుని, భూస్వాముల గుప్పెట ఉన్న వేలాది ఎకరాల భూములను పేద రైతులకు పంచిపెట్టాయి. ఈ చారిత్రక పరిణామం “దున్నేవాడికే భూమి” అనే సిద్ధాంతాన్ని కేవలం ఒక రాజకీయ నినాదంగా మిగిల్చకుండా, సామాజిక న్యాయానికి, ఆర్థిక సమానత్వానికి ఆచరణాత్మక కొలమానంగా మార్చింది. ఈ పోరాటాల ద్వారానే ఇక్కడి ప్రజలకు తమ భూమిని, భుక్తిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం తమ ప్రాథమిక హక్కు అనే స్పృహ నరనరాల్లో అలవడింది.
నైజాం పాలన ముగిసి భారతదేశంలో విలీనమైనప్పటికీ, రైతు హక్కుల పరిరక్షణలో ఈ ప్రాంతపు పోరాట పటిమ ఏమాత్రం సడలలేదు. దశాబ్దాలుగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు నీటి పంపిణీ కోసం, పంటలకు గిట్టుబాటు ధర సాధించడం కోసం, విద్యుత్, వ్యవసాయ ఎరువుల పంపిణీ కోసం సాగిన అనేక రైతు ఉద్యమాలలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ రైతాంగం ఎల్లప్పుడూ ముందువరుసలోనే నిలిచింది. ఈ సుదీర్ఘమైన పోరాటాల అనుభవం ద్వారానే ఇక్కడి సమాజానికి పాలకులను నిలదీయడం, ప్రభుత్వం ఏదైనా సరే దాని జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం ఒక సామాజిక అలవాటుగా, జీవిత విధానంగా మారిపోయింది.
విప్లవ భావజాల ప్రవాహం:
1960ల చివరలో ఉత్తరాంధ్ర తీరప్రాంతంలో ఎగసిన శ్రీకాకుళం రైతు తిరుగుబాటు, పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ పోరాటాల భావజాల తరంగాలు ఈ ప్రాంతపు యువత, మేధావులు మరియు గ్రామీణ ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. శ్రీకాకుళ విప్లవ పోరాటంలో ప్రాణాలర్పించిన సుబ్బారావు పాణిగ్రాహి, వర్గనిష్ఠుల త్యాగాలు వరంగల్, ఖమ్మం ఏజెన్సీ ప్రాంతాలలోనూ, గోదావరి లోయ పరివాహక పల్లెల్లోనూ కొత్త విప్లవ చైతన్యాన్ని రగిలించాయి. అడవులలోని గిరిజనులపై సాగుతున్న దోపిడీకి, పల్లెల్లో నడుస్తున్న భూస్వామ్య అరాచకాలాకి వ్యతిరేకంగా ఈ నేల విప్లవ భావజాలాన్ని గుండెలకు హత్తుకుంది. విద్యాధికులు, విద్యార్థులు తమ భవిష్యత్తును, ఆశయాలను పక్కనబెట్టి సమాజంలో సామాజిక న్యాయం, మార్పు కోసం విప్లవాత్మక ఉద్యమాల బాట పట్టారు.
ఈ విప్లవ ప్రవాహంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు సాంస్కృతిక రంగాన్ని ఒక శక్తివంతమైన పోరాట ఆయుధంగా మార్చుకున్నాయి. జననాట్య మండలి ఆట-పాటలు పల్లెపల్లెనా, గల్లీగల్లీనా నిద్రపోతున్న ప్రజలను చైతన్యపరిచాయి. ప్రజాకవులు, గాయకులు తమ గొంతుకలతో శ్రమదోపిడీని, సామాజిక అసమానతలను నిలదీస్తూ ఊరూరా విప్లవ గీతాలను వినిపించారు. అదే సమయంలో విప్లవ రచయితల సంఘం (విరసం) నేతృత్వంలో వచ్చిన సాహిత్యం ఈ ప్రాంతపు విద్యావంతులను, యువతను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇక్కడ పాట లేదా కవిత అనేది కేవలం వినోదం కోసం పుట్టింది కాదు; అదొక నిరసన స్వరం, సామాజిక చైతన్యానికి మూలకారణం మరియు రాజకీయ బోధనా సాధనంగా మారింది.
అణచివేతలు, నిర్బంధాలు ఏ స్థాయిలో ఎదురైనప్పటికీ, ఈ నేలలో రూపుదిద్దుకున్న ప్రశ్నించే నైజం ఎన్నడూ వెనకడుగు వేయలేదు. గిరిజనుల భూహక్కులు, దళితుల ఆత్మగౌరవం, కార్మికుల కనీస వేతనాలు, పేదల హక్కుల కోసం సాగిన ఈ ఉద్యమాలు ఇక్కడి పల్లెల్లో ఒక బలమైన రాజకీయ విచక్షణను నూరిపోశాయి. అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అక్రమాలను శ్రమ దోపిడిని ఎండగట్టడం ఇక్కడి ప్రజల నైజంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. ఈ విప్లవాత్మక నేపథ్యమే నేటికీ వరంగల్-ఖమ్మం-నల్గొండ ప్రాంత ప్రజలను రాజకీయంగా అత్యంత జాగరూకులను చేస్తూ, తమ హక్కుల కోసం స్వతంత్రంగా ఆలోచించేలా తీర్చిదిద్దింది.
మలిదశ తెలంగాణ ఉద్యమం:
మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఉద్యమానికి ఆలోచనా విధానానికి, కార్యాచరణకు ప్రధాన కేంద్రాలుగా విలసిల్లాయి. ముఖ్యంగా వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఈ ఉద్యమానికి ప్రధాన చైతన్య శక్తిగా వ్యవహరించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏకమై ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బలమైన పునాదిని అందించారు. నల్గొండ జిల్లాను పీడిస్తున్న నీటి కాలుష్యం, ఖమ్మం మన్యం నీటి వనరుల పంపిణీలో జరిగిన అన్యాయాలు, వరంగల్ విద్యావంతుల ఆలోచనా మధనం కలిసి మలిదశ పోరాటానికి అసలైన ఆత్మగా మారాయి.
ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు నడిపిన ‘సకల జనుల సమ్మె’, సమరశీల ప్రదర్శనలు, వంటా-వార్పూ నిరసన కార్యక్రమాలు ఇక్కడి విద్యావంతుల సంఘటిత శక్తికి నిలువుటద్దంగా నిలిచాయి. రాజకీయ పక్షాల స్వార్థ పరిధులను దాటి కేవలం ప్రాంతీయ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ఉపాధి అవకాశాల సాధన కోసం వీరంతా వీధుల్లోకి వచ్చారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతుల్లో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూనే, మరోవైపు మేధోపరమైన సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించారు.
రాజకీయ చైతన్యం – ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ప్రాముఖ్యత
ఇప్పుడు కూడా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల ఉపాధ్యాయులు, చదువుకున్న పట్టభద్రులు, శ్రామిక వర్గాలు అదే చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఈ రోజుల్లో సంప్రదాయ రాజకీయ పక్షాలు చేసే ఆర్భాటపు ప్రచారాలు, పార్టీల అధినేతల ఉపన్యాసాలు లేదా ధనప్రభావాలు ఇక్కడి చదువుకున్న వారి ఆలోచనలను లొంగదీసుకోలేవు. శాసనమండలి ఎన్నికలు అనేవి కేవలం ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునే నిత్య క్రమం మాత్రమే కాదు; చట్టసభల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పే ఒక నిజాయితీ కలిగిన విద్యావంతుడిని, హక్కుల కోసం పోరాడే యోధుడిని ఎన్నుకునే కీలక సందర్భమని ఈ ప్రాంత ప్రజలు గట్టిగా నమ్ముతారు. ఇటువంటి ఉన్నతమైన ఆలోచనా పటిమ కలిగిన గడ్డపై ఒక స్వతంత్ర అభ్యర్థి నిలబడటం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. రాజకీయ పక్షాల అభ్యర్థులు తమ పార్టీల అధిపతుల ఆదేశాలకు, నియమాలకు కట్టుబడి ఉండి ప్రజా సమస్యలపై నిష్పక్షపాతంగా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే ఎలాంటి పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గకుండా, ప్రజల తరఫున నిజాయితీగా సభలో ప్రశ్నించే స్వేచ్ఛను కలిగి ఉంటారు.
అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ చదువుకున్న వారి సమస్యలను, ఉద్యోగుల విశ్రాంతి వేతన హక్కులను మరియు పల్లెల అభివృద్ధిని నిరంతరం నిలదీసే ధైర్యం కేవలం ప్రజా పక్షాన నిలబడే అభ్యర్థికే ఉంటుంది. పార్టీల స్వార్థ రాజకీయాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో, చదువుకున్న ఓటర్లు తమ ప్రతినిధిగా ఒక స్వతంత్ర గొంతుకను ఎన్నుకోవడం ప్రజాస్వామ్యానికి ఎంతో బలాన్నిస్తుంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ నేల ఎల్లప్పుడూ ఆత్మగౌరవానికి, ప్రశ్నించే తత్వానికి పట్టం కడుతూ వచ్చింది. కాబట్టి రాబోయే శాసనమండలి ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం రాజీలేని పోరాటం చేసే అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతపు చారిత్రక చైతన్యానికి నిజమైన గౌరవం దక్కుతుంది.
మొత్తం మీద చూస్తే, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాల చరిత్ర అనేది అణచివేతపై తిరుగుబాటు చేసిన చరిత్ర, మార్గదర్శక ఆలోచనలతో సమాజాన్ని జాగురుకం చేసిన చరిత్ర, నాటి నుంచి నేటి వరకు హక్కుల సాధన కోసం స్వీయ త్యాగాలు చేసిన విద్యావంతుల ప్రస్థానం. ఈ నేలలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టులోనూ, పల్లెల్లో ఎగసే ప్రతి పాటలోనూ ప్రశ్నించే తత్వం నిరంతరం సజీవంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రజల ఆలోచనా చైతన్యం అనేది కేవలం గతానికి సంబంధించిన జ్ఞాపకం మాత్రమే కాదు; అది నేటికీ వెలుగుతున్న ప్రజాస్వామిక అగ్నిశిఖ.
రాబోయే శాసనమండలి ఎన్నికలలో ఈ చైతన్యవంతమైన సమాజం మరోసారి తన విచక్షణను, ఆలోచనా పరిణతిని స్పష్టం చేయబోతుంది. సంప్రదాయ రాజకీయ పక్షాల పరిధులను దాటి, ఈ పోరాటాల గడ్డపై ప్రజల గొంతుకగా, ఉపాధ్యాయులు, చదువుకున్న పట్టభద్రులు, శ్రామికుల ప్రతినిధిగా నిలబడే స్వతంత్ర శక్తికి మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ ప్రాంతపు చారిత్రక నేపత్యానికి సరైన గౌరవం దక్కుతుంది. ఈ పోరాటాల నేల ఎల్లప్పుడూ నిస్వార్థంగా ప్రజల పక్షాన నిలబడే నాయకులకే బాసటగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
* * *
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
