10,470 ఓటరు వివరాల్లో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తింపు.
ఇద్దరు ఎస్డీఎంలు, కంప్యూటర్ ఆపరేటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఎన్నికల సంఘం జరిపిన విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు ప్రభుత్వ అధికారులతో పాటు ఒక కంప్యూటర్ ఆపరేటర్పై గురువారం, అక్టోబర్ 22న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కొంతమంది ఓటర్ల ఓటరు గుర్తింపు కార్డు నంబర్లను (EPIC నంబర్లు) ఆన్లైన్లో వెతికినప్పుడు, వారి వివరాలకు బదులుగా వేరే వ్యక్తుల వివరాలు కనిపించాయని విచారణలో తేలింది.
పిలిభిత్ జిల్లా ఎన్నికల అధికారి సమర్పించిన సమగ్ర విచారణ నివేదిక ప్రకారం, పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు జాబితాలో 10,470 ఎంట్రీలలో అక్రమాలు గుర్తించారు.
ఇద్దరు ఎస్డీఎంలపై చర్యలు:
ఈ కేసులో మయాంక్ గోస్వామి, హేమంత్ చౌధరి అనే ఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లను బాధ్యులుగా గుర్తించారు.
మయాంక్ గోస్వామి పూరన్పూర్ ప్రాంతానికి ఎస్డీఎంగా పనిచేశారు.
హేమంత్ చౌధరి అమరియా ప్రాంతానికి ఎస్డీఎంగా పనిచేశారు.
వీరిద్దరూ ఓటర్ల నమోదు అధికారులుగా (EROలు) కూడా విధులు నిర్వహించారు.
వారిని ప్రస్తుత పరిపాలనా బాధ్యతల నుంచి తొలగించి జిల్లా ప్రధాన కార్యాలయా నికి అటాచ్ చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించారు.
పిలిభిత్ నియోజకవర్గ ఓటరు నమోదు కేంద్రంలో పనిచేసిన కంప్యూటర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ను విధుల నుండి తప్పించారు.
ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. విచారణలో ఈ ముగ్గురు అక్రమాలకు బాధ్యులుగా తేలినట్లు అధికారులు తెలిపారు.
ఏ చట్టాల కింద కేసు నమోదు చేశారు?
ఎఫ్ఐఆర్ పూర్తి కాపి ఇంకా బయటకు వెల్లడి కాలేదు. అయితే, ఈ కేసులో ముగ్గురి పేర్లను చేర్చినట్లు పిలిభిత్ జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ తెలిపారు.
ఈ వ్యవహారం తీవ్రమైనదని పేర్కొంటూ, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 32తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
అయితే, BNSలోని ఏయే నిర్దిష్ట సెక్షన్లను మోపారో, నిందితుల్లో ఒక్కొక్కరిపై ఉన్న ఆరోపణలు ఏమిటో స్పష్టంగా తెలియలేదు.
“ఓటర్ల నమోదులో అక్రమాల వ్యవహారాన్ని
ప్రతిపక్ష పార్టీలు బయటపెట్టాయి.”
అక్టోబర్ 21న కాంగ్రెస్ పార్టీ పిలిభిత్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో 16,000కు పైగా ఎంట్రీలలో తీవ్రమైన అక్రమాలు ఉన్నాయని ఆరోపించింది.
ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా తుది ముసాయిదాను ఏప్రిల్ 10న విడుదల చేసిన తర్వాత కూడా, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 13,510 మంది ఓటర్లకు సంబంధించిన పేర్లను మార్చారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు (EPIC), ఓటర్ల జాబితాలోని క్రమ సంఖ్యలు మాత్రం మారకుండా ఉన్నాయని పార్టీ పేర్కొంది.
అంటే, ఒక ఓటరుకు చెందిన గుర్తింపు నంబర్ అలాగే ఉన్నప్పటికీ, దానికి అనుసంధానమైన పేరు లేదా ఇతర వివరాలు వేరే వ్యక్తివిగా మారినట్లు ఆరోపణలు వచ్చాయి.
“సమాజ్వాదీ పార్టీ ఫిర్యాదు”
అక్టోబర్ 19న సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ లాల్ పాల్, ఓటర్ల లిస్టులో అక్రమాలు జరిగాయని ప్రధాన ఎన్నికల అధికారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
నియోజకవర్గంలోని అనేక మంది ఓటర్ల EPIC నంబర్లను ఆన్లైన్లో వెతికినప్పుడు, అసలు ఓటర్లకు సంబంధం లేని ఇతర వ్యక్తుల వివరాలు కనిపించాయని ఆయన ఫిర్యాదులో తెలిపారు.
ఈ అక్రమాల వల్ల నష్టపోయిన ఓటర్లలో ఎక్కువమంది ముస్లింలేనని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ నాయకులు ఆరోపించారు.
” విచారణలో బయటపడిన వివరాలు”
ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి నవదీప్ రిన్వా తెలిపిన వివరాల ప్రకారం, ఓటర్ల వివరాలను సరిచేయ డానికి ఉపయోగించే ఫారం-8 ఎంట్రీ లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి.
మే 31 నుంచి ఆగస్టు 29, 2026 వరకు పిలిభిత్ ఓటరు నమోదు కేంద్రంలో కంప్యూటర్ అసిస్టెంట్ మొత్తం 13,779 ఫారం-8 నమోదులు చేశారు.
వాటిలో:
జూలై 16 వరకు చేసిన ఎంట్రీలు: 4,717
జూలై 17 నుంచి ఆగస్టు 29 వరకు చేసిన : ఎంట్రీలు 9,062
ఆమోదించిన ఫారాలు: 10,470
తిరస్కరించిన ఫారాలు: 3,309
ఈ ఎంట్రీలకు సంబంధించిన ఫారాలు లేదా ఇతర రికార్డులు కార్యాలయంలో అందుబాటులో లేవని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
ఈ ఎంట్రీలలో అక్రమాలు జరగడానికి, జూలై 16 వరకు పనిచేసిన ఎన్నికల నమోదు అధికారి, అలాగే జూలై 17 నుంచి ఆగస్టు 29 వరకు పనిచేసిన అధికారి పాత్ర ఉందని విచారణలో తేలినట్లు చెప్పారు.
ఈ వ్యవహారంలో సంబంధిత సహాయ ఎన్నికల నమోదు అధికారుల పాత్రపైనా సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఓటర్ల జాబితాలో కొత్త పేర్లు చేర్చడానికి ఉపయోగించే ఫారం-6, పేర్లను తొలగించడానికి ఉపయోగించే ఫారం-7 ఎంట్రీలను కూడా పరిశీలించాలని పిలిభిత్ జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించారు.
2026 ఏప్రిల్ 10న ముగిసిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నుంచి అక్టోబర్ 21 వరకు చేసిన సంబంధిత ఎంట్రీలన్నీ పరిశీలించ నున్నారు.
అక్రమాలు గుర్తించిన ప్రతి నమోదును సరిచేసే పని కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
పిలిభిత్ సదర్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ఒకటి లేదా రెండు రోజుల్లో సరిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పిలిభిత్ జిల్లా మేజిస్ట్రేట్ అలోక్ కుమార్ తెలియజేశారు.
ఈ అక్రమాల విషయాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి, పిలిభిత్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్న హేమరాజ్ వర్మ, “ఓట్ల దొంగల”కు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ:
“నిజాన్ని ఇబ్బందులకు గురిచేయవచ్చు, కానీ దాన్ని ఎప్పటికీ ఓడించలేరు. ఓట్ల దొంగలపై చర్యలు ప్రారంభమయ్యాయి! ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ తీవ్రమైన తప్పులో భాగమైన ఏ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారి లేదా ఉద్యోగినీ వదిలిపెట్ట కూడదు” అని అన్నారు.
“గత ఎన్నికల ఫలితాల ప్రాధాన్యం”
2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సంజయ్ సింగ్ గంగ్వార్ పిలిభిత్ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.
ఆ ఎన్నికల్లో ఆయన 7,000 ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలిచారు.
అందువల్ల ఓటర్ల జాబితాలోని అక్రమాలపై వచ్చిన ఆరోపణలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రచయిత: ఓమర్ రషీద్
తెలుగు అనువాదం: డి.వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
