విశ్వవిద్యాలయాల అసలు లక్ష్యాన్ని పునరుద్ధరించాలి.
గతంలో జాతీయ స్థాయి పరీక్షకు స్పష్టమైన, పరిమితమైన లక్ష్యం దేశంలో ఉండేది. విశాలమైన దేశమంతటా న్యాయబద్ధంగా కొన్ని వేల మంది అధికారులు, సైనికులు, ఇంజినీర్లను ఎంపిక చేయడం దాని ఉద్దేశం. ఆ పద్ధతి ఇప్పుడు కనుమరుగైంది. భారత పరిపాలనా సేవ (IAS), భారతీయ సాంకేతిక విద్యాసంస్థల (IITs) ఎంపిక (తర్కాన్ని ) పద్దతిని, ప్రతి కళాశాలకూ, ప్రతి విభాగానికి (వృత్తికీ) విస్తరించాం. కొద్దిమందిని ఎంపిక చేసే విధానాన్ని, వేలమందిని ఎంపిక చేయుటకు ఉపయోగించుట వలన, దేశం భారీ మూల్యం చెల్లిస్తోంది.
జాతీయ అర్హతల ప్రవేశ పరీక్ష (NEET), ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE), యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్,జాతీయ అర్హత పరీక్ష (UGC NET) వంటి ఇతర పరీక్షలు ఇప్పుడు లక్షలాది అభ్యర్థులను పరీక్షిస్తున్నాయి. క్యాన్సర్ వైద్యశాస్త్రం (Oncology) నుంచి సేంద్రీయ రసాయనశాస్త్రం (Organic Chemistry) వరకు, చరిత్ర నుంచి పంజాబీ సాహిత్యం వరకు విభిన్న రంగాలకు చెందిన అభ్యర్థులందరినీ ఒకే రకమైన పరీక్ష పద్దతి లో కొలవడానికి (బహుళైచ్ఛిక ప్రశ్నలMultiple-choice) ప్రయత్నిస్తున్నాం.
అందరికీ ఒకే పద్ధతిలో పరీక్ష నిర్వహించుటకు ప్రవేశపెట్టినప్పటికీ, విద్యార్థులు తమ రంగంలో లోతైన జ్ఞానాన్ని సంపాదించడానికి బదులుగా పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం పైనే దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభ, తార్కిక ఆలోచన, విమర్శనాత్మక సామర్థ్యాన్ని కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
భారతదేశంలోని విశ్వవిద్యాలయా లన్నింటికీ ఒకే రకమైన పరీక్షలు, ప్రమాణాలు వలన విద్యార్థుల అసలైన ప్రతిభను అంచనా వేయడం, భిన్నమైన ఆలోచనలను ప్రోత్సహించడం, విశ్వవిద్యాలయాలు తమ అవసరాలకు అనుగుణంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోంది.
సంబంధిత విభాగాలకే నిర్ణయాధికారం ఇవ్వాలి:
దీనికి ప్రత్యామ్నాయం చాలా సులభం. విద్యాసంస్థలే తమకు అవసరమైన విద్యార్థులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలి. సాహిత్యం లేదా భౌతికశాస్త్రంలో ఒక మంచి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలేమిటో,ఆ విద్యార్థిని చేర్చుకోబోయే విభాగం కంటే మెరుగ్గా ఏ జాతీయ సంస్థా చెప్పలేదు. నిజానికి, విభాగాల స్థాయిలో నిర్వహించే పరీక్షలు అధ్యాపకులకు నిర్ణయాధికారాన్ని తిరిగి కల్పిస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభకు, ఆసక్తికి తగిన చోట దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను ఇస్తాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలో సాధించిన ర్యాంకు ద్వారా ఏ సంస్థలో చేర్చుకోవాలో నిర్ణయించే పరిస్థితిని నివారిస్తాయి. ఇది వెనక్కి వెళ్లాలనే ఆకాంక్ష కాదు. మనం ఆదర్శంగా భావించే పాశ్చాత్య దేశాల విద్యావ్యవస్థల్లో ఇదే సాధారణ పద్ధతి.
గతంలో ప్రొఫెసర్ల నియామకాలు, విషయ జ్ఞానం తెలిసిన వ్యక్తులతో చర్చలు జరిపిన తర్వాత జరిగేవి. మేధోపరమైన పరస్పర చర్చల ద్వారా అభ్యర్థి నిర్ణయ సామర్థ్యాన్ని అంచనా వేయడం. అది కేవలం వాస్తవాలను పరీక్షించడం కాదు! అత్యుత్తమ ఉపాధ్యాయులు తరచుగా పాఠ్యప్రణాళిక పరిధిని దాటి బోధించేవారు. చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. వారిలో ఎవరూ NET పరీక్ష వ్రాయలేదు.
ఈ పరీక్ష ద్వారా గుర్తించే ప్రతిభ కంటే, ఎక్కువ ప్రతిభ కలిగిన విద్యార్థులు, నేడు చాలామంది ఉన్నారు. వారు ఆలోచించలేక విఫలమవడం లేదు. పరీక్ష పద్ధతి ఆలోచించే అవకాశమే ఇవ్వడం లేదు. పైగా, ఒక నిర్దిష్ట పరీక్షా పద్ధతిలో నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నామని చెప్పుకుంటూ నైపుణన్యాన్ని తిరస్కరించే వ్యవస్థను నిర్మించుకున్నాం.
పై వాస్తవాలను, కాదనే చారిత్రక, తులనాత్మక, అధ్యయనము, ఏ విద్యా వ్యవస్థ నిర్వహించలేదు.
దశాబ్దాలుగా ఈ మార్పులను దగ్గరగా గమనించిన వ్యక్తిగా, అలాంటి అధ్యయనంలో ఏమి తేలుతుందో నేను అంచనా వేయగలను. తరగతి గదిలో జరిగే చర్చల నాణ్యత, విద్యార్థుల అధ్యయనం లోని నాణ్యత, ఉపాధ్యాయులను కేవలం ఉదహరించడం కాకుండా… ఉపాధ్యాయులను ప్రశ్నించడం గణనీయంగా తగ్గిపోయాయి.
వాటి స్థానంలో, నేటి తరం, కంఠస్థం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం, ప్రశ్నలకు సమాధానంగా అధిక అవకాశలు(Heavy choice)ఇచ్చే పరీక్షల పద్దతి ద్వారా నేటి తరం విద్యార్థులు చేరుతున్నారు. ఒకప్పుడు తరగతి గదిలోకి అడుగుపెట్టే ప్రతి విద్యార్థిలో సహజంగా ఉండే విస్తృతమైన, ప్రణాళిక లేని పఠన అలవాటు చాలా తక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుత పరీక్షా విధానం తరగతి గది ఏ ప్రయోజనం కోసం ఉండాలనే ఆలోచనే మార్చేసింది.
విద్యార్థి జ్ఞానాన్ని పొందడానికి, ఆలోచనలను అభివృద్ధి చేసుకోవడానికి, అధ్యాపకులతో చర్చించడానికి విశ్వ విద్యాలయాలకు వెళ్తారు. విద్యార్థుల జ్ఞానాన్ని ఒకే విధమైన (మార్కులు, ర్యాంకులు) కొలమానాలతో అంచనా వేయడం వల్ల విద్య యొక్క అసలు లక్ష్యం దెబ్బతింటుంది.
పరిశోధనా పత్రాల సంఖ్యే ప్రతిభకు ప్రమాణం కాదు:
అధ్యాపకుల నియామక ప్రక్రియల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. గతంలో ఉపాధ్యాయుల ఎంపికలో పుస్తకాల్లోని విషయాలను అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, ప్రశ్నించడం వంటి సామర్థ్యాలను పరిశీలించేవారు. మంచి ఉపాధ్యాయుడు తెలిసిన విషయాలను విద్యార్థులకు చెప్పేవాడు మాత్రమే కాదు; విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే శక్తిని పెంపొందించేవాడు కూడా.
కానీ ఇప్పుడు, ఎంపిక కమిటీలు పరిశోధనా ప్రచురణల సంఖ్య, పరిశోధన స్కోర్లపై ఎక్కువగా ఆధార పడుతున్నాయి. పదోన్నతులు, నియామకాల కోసం కనీస పరిశోధనా ప్రచురణల సంఖ్యా నిబంధన , కొత్త ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే బదులుగా పరిశోధనా పత్రాల ప్రచురణ సంఖ్యకే ప్రాధాన్య మిచ్చే మార్కెట్‌ను సృష్టించాయి.
విద్యా ప్రమాణాలు లేని పరిశోధనా పత్రికలు, ఒకే ఉద్దేశంతో కొనసాగ తున్నాయి. నిర్ణీత గడువులో కావలసిన పరిశోధన మార్కులుతో తమ అవసరాలను తీర్చుకోవడానికి అభ్యర్థులు ప్రచురించాల్సిన పత్రాలలో, నాణ్యతతో సంబంధం లేకుండా అంగీకరించడమే.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (UGC)- 2018 నిబంధనలు, గతంలో అమల్లో ఉన్న అకడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (API) ద్వారా పనితీరు లెక్కించే వ్యవస్థను (Performance Based Appraisal System – PBAS) రద్దు చేసి, పరిశోధన స్కోర్లను కూడా తీసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టింది. అయినా అసలు సమస్య అలాగే కొనసాగు తోంది. విద్యాపరమైన విజయాలను ఇప్పటికీ చాలా సందర్భాల్లో లెక్కించ గలిగే సంఖ్యలకే పరిమితం చేస్తున్నారు.
ఇదే మార్కులు ఆధారిత మూల్యాంకన విధానం పీహెచ్డీ (PhD) ప్రాధాన్యాన్ని కూడా దెబ్బతీసింది. ఈ విషయాన్ని ఇతరులు చెప్పే సమాచారంతో కాకుండా, ప్రత్యక్ష పరిశీలనతో చెబుతున్నాను. విశ్వవిద్యాలయాల అసలు లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించడం.
అధ్యాపక నియామకాల్లో, డాక్టరేట్ అర్హతను లెక్కించే టప్పుడు, మార్కుల పట్టికలో సాధారణనంగా 30 మార్కులు కేటాయి స్తున్నారు. మొత్తం మార్కుల్లో ఇది గణనీయమైన వాటా. అయినా, ఆ మార్కులు పరిశోధనా సిద్ధాంత (థీసిస్) వెనుక ఉన్న మేధో సామర్థ్యాన్ని, అందులోని వాదనల శాస్త్రీయ దృఢత్వాన్ని లేదా ఆ పరిశోధన ఆధారంగా ప్రచురించిన పత్రాల నాణ్యతను దాదాపుగా ప్రతిబింబించడం లేదు.
అంతర్జాతీయ ప్రామాణిక పుస్తక సంఖ్య (International Standard Book Number – ISBN) లేదా అంతర్జాతీయ ప్రామాణిక సీరియల్ సంఖ్య (International Standard Serial Number – ISSN) పొందడం అనేది ఒక రచనకు విద్యాపరమైన లేదా పరిశోధనాపరమైన విలువ ఉందనడానికి ఎలాంటి ఆధారమూ కాదు.
ప్రామాణికమైనవిగా చెప్పుకునే కొన్ని పరిశోధనా పత్రికలు ఒకే పేరుతో ఏడు లేదా ఎనిమిది విభిన్న విద్యా విభాగాలకు సంబంధించిన పరిశోధనలను ప్రచురిస్తున్నాయి. ఉదాహరణకు, “జర్నల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్” పేరుతో వెలువడే పత్రిక ఒకే సంచికలో చరిత్ర, మేనేజ్మెంట్, సాహిత్యం, న్యాయశాస్త్రం వంటి విభిన్న రంగాల పరిశోధనా పత్రాలను ప్రచురిస్తుంది.
అయితే, సమర్పించిన పరిశోధనా పత్రాలను, ఆయా రంగాల నిపుణుల సమీక్షకు పంపే ప్రక్రియ అక్కడ ఉండదు. ఎవరు పరిశోధనా పత్రాన్ని పంపినా
అది ప్రచురితమవుతుంది.
అంతేకాకుండా, మరోవైపు పరిశోధన పర్యవేక్షణ అంతే బలహీనంగా మారింది. హడావుడిగా పూర్తిచేసిన డాక్టరేట్ సిద్ధాంత గ్రంథాన్ని సరిగా చదవకుండానే పరిశోధన పర్యవేక్షకుడు నివేదిక సమర్పించడం ద్వారా ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
విచారకరంగా, మౌఖిక పరీక్ష (Viva Voce) కూడా కేవలం నామమాత్రంగా మారిపోయింది. ఆ పరీక్షలో పాల్గొనేవారు సైతం హాస్యాస్పదమైన వ్యవహారంగా భావించేంతగా, దాని ప్రాధాన్యం తగ్గిపోయింది.
ఈ అసంబద్ధత విశ్వవిద్యాలయ ఉపకులపతి (Vice-Chancellor) ఎంపిక లో పరాకాష్ఠకు చేరుతోంది. ఉపకులపతి ఎంపిక కమిటీలు అభ్యర్థులను వారి పేరుపై ఎన్ని పేటెంట్లు ఉన్నాయని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అనువర్తిత శాస్త్రాల్లోని (Applied Sciences) కొన్ని పరిమిత రంగాలను మినహాయిస్తే, ఇతర విద్యా విభాగాలకు ఈ ప్రశ్నకు ఎలాంటి సంబంధమూ లేదు.
ఈ విధమైన ప్రశ్నల వల్ల సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మరియు మ్యాథమెటిక్స్ (STEM) రంగాలకు చెందిన అభ్యర్థులకు, వ్యవస్థాగతం గానే అనుకూలత ఉంటుంది.
ఎందుకంటే, ఒక పెద్ద ప్రయోగశాలను నిర్వహించే శాస్త్రవేత్తకు తన ప్రయోగశాలలోని ప్రతి పరిశోధకుడి పరిశోధనా పత్రంలో తన పేరును కూడా చేర్చుకోగలడు. తద్వారా తన పేరుతో ఉన్న పరిశోధనా ప్రచురణల సంఖ్యను పెంచుకోగలడు.
స్వతంత్రంగా పరిశోధన చేసే మానవీయ శాస్త్రాల (Humanities) పరిశోధకులు, అటువంటి (Applied science) ప్రచురణల సంఖ్యను ఎప్పటికీ అందుకోలేరు.
అలాంటి అభ్యర్థి, తన వృత్తి జీవితాన్ని ప్రయోగశాలలో గడిపి, వెలుపల ఉన్న విశ్వవిద్యాలయ ప్రపంచంతో ఎలాంటి పరిచయం లేకుండానే ఉపకులపతి కార్యాలయానికి చేరుకుంటాడు. అటువంటి వారిలో చాలా మంది ఒక నవలగానీ, కవితగానీ చదివి ఉండకపోవచ్చని చెప్పడంలో ఏమాత్రం తప్పు లేదు. అలాంటి వ్యక్తులు, ప్రయోగశాలను దాటి విద్యార్థుల మేధస్సును పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా కలిగిన విద్యాసంస్థకు నాయకత్వం వహించాల్సి వస్తోంది.
ఇవేవీ కేవలం,మూల్యాంకన (మార్కులు )ప్రమాణాలను సవరించడం ద్వారా పరిష్కరించలేం. ఎందుకంటే అనేక ఎంపికల్లో, అసలు నిర్ణయాలు ఈ ప్రమాణాల ఆధారంగానే జరగడం లేదు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో చాలా నియామకాలు అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా ద్వారా కాకుండా, పరిచయాలు సంబంధాల, ఆధారంగా జరుగు తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రతిభ అనేది ప్రమాణమే కాదు.
వ్యక్తిగత అనుభవం: ఇంటర్వ్యూల ప్రాముఖ్యత
ఈ రచయితకు అసోసియేట్ ప్రొఫెసర్ పదవికి జరిగిన ఇంటర్వ్యూలో, దేశంలోని అత్యంత ప్రసిద్ధులైన నలుగురు ప్రొఫెసర్లతో కూడిన ఎంపిక కమిటీ పాల్గొంది. నిజాయితీ పరుడైన మేధావి వైస్ ఛాన్సెలర్ ఆ కమిటీకి అధ్యక్షత వహించారు. ఆ ఇంటర్వ్యూ 40 నిమిషాలకు పైగా కొనసాగింది. అది తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, లోతైన చర్చతో సాగిన కఠినమైన ఇంటర్వ్యూ. అనంతరం జరిగిన ఎంపిక నిష్పక్షపాతంగా జరిగింది. ఎవరి తరఫునా ఎలాంటి పలుకుబడిని ఉపయోగించలేదు. నేటి నియామకాలు , ప్రవేశాల ప్రక్రియలు ఈ ప్రమాణంతోనే ఉండాలి.
కఠినమైన నియమాలు మాత్రమే వ్యవస్థను బాగుచేయలేవు.
ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. దెబ్బతిన్న వ్యవస్థను, కఠినమైన చట్టాలు బాగుచేయలేవు. పరీక్షకులు, పరీక్షా నిర్వహణ సంస్థలు చేసిన తప్పులకు శిక్షించవచ్చు. కానీ, అలాంటి తప్పులు జరగకుండా నిరోధించడంలో అవి పెద్దగా సహాయపడవు.
ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల విశ్వవిద్యాలయా లను నిర్మించాలంటే, నాణ్యత నిజంగా ఎక్కడ రూపుదిద్దు కుంటుందో అక్కడి నుంచే మనం ప్రారంభించాలి. విశ్వవిద్యాలయ విభాగాల్లో, తమ నిర్ణయాలకు జవాబు దారీగా ఉండే తోటి విద్యావేత్తల నియామకాలు జరిగి నప్పుడు సాధ్యమవు తుంది. ఉన్నత విద్యను అందించే అనేక విశ్వ విద్యాలయాల్లో ఇదే కార్యాచరణ సూత్రం అమలవుతున్నట్లు గమనించవచ్చు.
గతాన్ని వెనక్కి తీసుకురావాలనే కోరిక కాదు:
పరీక్షలను తిరిగి విద్యా విభాగాల ఆధీనంలోకి తీసుకురావడం, అలాగే నియామకాల్లో పాయింట్ల ఆధారిత ఎంపిక బదులుగా తోటి విద్యావేత్తల పరిశీలనకు ప్రాధాన్య మివ్వడం గత వైభవాన్ని తలచుకుంటూ వెనక్కి వెళ్లాలనే ప్రయత్నం కాదు. విశ్వ విద్యాలయం దేనికోసం ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్నకు సంబంధించిన వాదన.
ఈ విధానం అమలుకు, ఎక్కువ సమయం, మరింత జవాబుదారీతనం అవసరం. అంతేకాకుండా, సంఖ్యల వెనుక దాక్కునే అవకాశం లేకుండా, తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించగల ధైర్యం కూడా కావాలి.
దానికి ప్రతిఫలంగా, పరీక్షలో నైపుణ్యం కేవలం స్కోర్లు, ర్యాంకులు, సంఖ్యల ఆధారంగా మాత్రమే అంచనా వేయకూడదు. మేధోపరమైన సామర్థ్యం కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను విద్యాసంస్థలకు తిరిగి అప్పగిస్తుంది.
మేధస్సును పెంపొందించే విశ్వవిద్యాలయాలు కావాలా, లేక కేవలం స్కోర్లను (మార్కులు, ర్యాంకులు) లెక్కించే సంస్థలు కావాలా అనేది నిర్ణయించుకోవాలి. మేధస్సును పెంపొందించే విశ్వవిద్యాలయాలు కావాలంటే, వాటిలో పనిచేసే విద్యావేత్తల విద్యాపరమైన నిర్ణయ సామర్థ్యంపై మనం విశ్వాసం ఉంచాలి.
వారి నిర్ణయాల్లో నిజాయితీ, నిబద్ధత ప్రధాన ప్రమాణాలుగా ఉండాలి. అంతిమంగా, విశ్వవిద్యాలయాలు అంతిమంగా సమాజానికే జవాబుదారీతనం ఉండాలి. ఆ జవాబుదారీతనం కేవలం సంఖ్యల (మార్కులు ర్యాంకులు) కోసం కాకుండా, అవి తీసుకునే నిర్ణయాల నాణ్యత కోసం ఉండాలి.
1)విద్యను కేవలం ఉద్యోగ అర్హతలు, పరీక్షల్లో మార్కులు, పరిశోధనా స్కోర్లు, ర్యాంకింగ్‌లకు పరిమితం చేయకూడదు.
2)విద్య సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, దాని వైరుధ్యాలను ప్రశ్నించడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, మానవ మేధస్సు అభివృద్ధి చేయడానికి ఉపయోగపడాలి.
3)అయితే, సంఖ్యాపరమైన ప్రమాణాలన్నింటినీ తొలగించడం పరిష్కారం కాదు. వాటిని పారదర్శకమైన, న్యాయమైన, బహుముఖ మూల్యాంకన వ్యవస్థలో భాగంగా ఉపయోగించాలి.
విద్యా వ్యవస్థను నిజంగా ప్రజాస్వామికం చేయాలంటే మూడు అంశాలు కీలకం:
1)విద్యకు ప్రభుత్వ బాధ్యత,
2)విద్యాసంస్థలకు తగిన స్వయం ప్రతిపత్తి,
3)సమాజానికి జవాబుదారీతనం.
పై మూడు అంశాల సమతుల్యత ద్వారానే విద్యను మార్కెట్ పోటీకి పరిమితమైన వ్యవస్థ నుంచి ప్రజల జ్ఞానాభివృద్ధికి ఉపయోగపడే సామాజిక సంస్థగా బలోపేతం చేయవచ్చు.
వ్యాస రచయిత: షెల్లీ వాలియా (Shelley Walia),
చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్త.
ది హిందూ సౌజన్యంతో.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
