గురు గ్రామ్, నూహ్ జిల్లాల విద్యుత్ పంపిణీని ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థతో పాటుగా(parallel distribution licence) “ఎలవెన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్” అనే ప్రైవేట్ సంస్థకు 25 సంవత్సరాలకు కాంట్రాక్ట్ ఇస్తూ హర్యానా రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అక్టోబర్ 19 న ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే రైతులు, వినిమయ దారులు, విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు అభ్యంతరాలు తెలియజేశారు. అయినా ఉత్తర్వులు రద్దు చేయకపోవడంతో విద్యుత్ ఉద్యోగులు, ఇంజీనీర్లు హర్యానా రాష్ట్ర వ్యాపితంగా అక్టోబర్ 22 నుండి 3 రోజుల సమ్మెకు పిలుపునిచ్చారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం (బిజేపి) సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి 6230 మంది పోలీసులను దించింది. ప్రభుత్వ నిర్బంధ కాండను లెక్క చేయక సమ్మె సంపూర్ణంగా జరిగింది. రైతులు, వినిమయ దారులు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
లైసెన్స్ రద్దు:
చివరకు సమ్మె రెండవ రోజున (23-11-2026) రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. హర్యానా రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రైవేట్ సంస్థ కు ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. భవిష్యత్‌లో కూడా ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థతో పాటు ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ పంపిణిని ఇవ్వబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఇది గొప్ప విజయం.
సిఐటియు అభినందనలు:
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు సమైక్యంగా సమ్మె చేసి విజయం సాధించినందుకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది. హర్యానా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో 40,000 మందికి పైగా విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు సమ్మెలో పాల్గొని రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేశారు. ఈ సమరశీల పోరాటం ఫలితంగా గురు గ్రామ్, నూహ్ ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ కోసం ఎలెవన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంజూరు చేసిన సమాంతర విద్యుత్ పంపిణీ లైసెన్స్‌కు వ్యతిరేకంగా, విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 108 ప్రకారం విధానపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంగీకరించేలా చేశారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా, హర్యానా రాష్ట్రంలో సమాంతర విద్యుత్ పంపిణీ లైసెన్స్‌లను అనుమతించబోమని స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ హామీల నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తమ సమ్మెను విరమించారు.
పోరాట పటిమ-విజయం:
ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో లాభదాయకమైన ప్రాంతాలను ప్రైవేట్ కంపెనీల లాభార్జనకు అప్పగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం ఇది. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తమ డిమాండ్ల సాధన కోసం ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా దృఢంగా నిలబడ్డారు. సమ్మె కారణంగా సుదీర్ఘ సమయం పాటు విద్యుత్ సరఫరా, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, రైతు సంఘాలు, ఇతర కార్మిక సంఘాలు, సాధారణ విద్యుత్ వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల పోరాటానికి సంఘీభావంగా నిలిచారు. ప్రైవేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ ప్రజా వినియోగ సేవలను బలహీన పరిచేందుకు కార్మికవర్గం, శ్రమజీవులు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోరని ఈ ఐక్య పోరాటం నిరూపించింది.
దేశ వ్యాపిత సంఘీభావం:
హర్యానా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి మద్దతుగా దేశవ్యాప్తంగా విజయోత్సవాలు, ప్రదర్శనలు, ఊరేగింపులు, సభలు నిర్వహించాలని సీఐటీయు అనుబంధం అన్ని కార్మిక సంఘాలు, సమాఖ్యలు, కమిటీలు, అలాగే సాధారణంగా కార్మికులందరికీ సీఐటీయూ పిలుపునిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి పరిశ్రమలో, ప్రతి అంతస్తులో, ప్రతి కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులందరూ ఈ విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని కోరింది. ఈ విజయం కేవలం హర్యానా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లకు మాత్రమే చెందినది కాదు. ఇది యావత్తు కార్మికవర్గానికి చెందిన విజయం. అందువల్ల ఈ విజయాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడంతోపాటు, ప్రజా సేవల ప్రైవేటీకరణను ఐక్య పోరాటాల ద్వారా ఓడించవచ్చనే సందేశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ విజయ స్ఫూర్తిని భవిష్యత్తు పోరాటాల్లోనూ కొనసాగించాలని సిఐటియూ పిలుపునిచ్చింది.
ఎలవన్ పవర్ కంపెనీ లిమిటెడ్:
ఈ ప్రైవేట్ కంపెనీ 2025 జూన్ లో కేవలం ఒక కోటి రూపాయల పైడ్ అప్ కాపిటల్ తో ప్రారంభమైంది. ఇలాంటి సంస్థకు గురు గ్రామ, నూహ్ జిల్లాలలోని గృహ వినియోగదారులు, రైతులు, దుకాణాలు, కార్యాలయాలు, పారిశ్రామిక యూనిట్లతో సహా 8.3 లక్షల మందికి పైగా వినియోగదారులు ప్రైవేట్ పంపిణీ సంస్థ ఎలవన్ పవర్ కంపెనీ లిమిటెడ్ లేదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పంపిణీ సంస్థలైన దక్షన్ హర్యానా బిజ్లీ విత్రణ్ నిగమ్, ఉత్తర్ హర్యానా బిజ్లీ విత్రణ్ నిగమ్ లలో ఏదో ఒకదాన్ని ఎంచుకునే వెసులుబాటు లభిస్తుంది.
ప్రైవేటికరణతో ముప్పు:
ప్రైవేట్ ఆపరేటర్లు ఎక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాలను గుత్తాధిపత్యం చేసుకోవడం వల్ల ప్రభుత్వ సంస్థ అయిన DHBVN తీవ్రంగా నష్టపోతుందని, చివరికి సాధారణ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయాన్ని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం అందించే విద్యుత్ సబ్సిడీలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వారు విమర్శించారు. ఇప్పటివరకు పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే లాభాల ద్వారా ప్రభుత్వం పేదలకు, రైతులకు రాయితీతో తక్కువ ధరకే విద్యుత్‌ను అందిస్తోంది (క్రాస్-సబ్సిడీ). ప్రైవేట్ పంపిణీ లైసెన్స్ వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగే ప్రమాదం ఉందని, సబ్సిడీలకు గ్యారెంటీ ఉండదని, ఇది వేలాది మంది జీవనోపాధిని దెబ్బతీస్తుందని వారు పేర్కొన్నారు.
విద్యుత్ సబ్సిడీల రక్షణపై భారతీయ కిసాన్ యూనియన్ (BKU) హర్యానా అధ్యక్షుడు రతన్ మాన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు ది హిందూ వార్త పేర్కొంది. గురు గ్రామ్, మానేసర్ లలో విద్యుత్ టారిఫ్‌ల పెంపు వల్ల పరిశ్రమలు, వ్యాపారాలపై భారం పెరుగుతుందని చెప్పారు.
ఒకే ప్రాంతంలో రెండు కంపెనీలకు విద్యుత్ పంపిణీకి అనుమతి ఇవ్వడం వల్ల వినియోగదారులతో పాటు ప్రభుత్వ విద్యుత్ రంగానికి కూడా ఊహించని నష్టాలు వాటిల్లుతాయని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ నేత సంపత్ సింగ్ పేర్కొన్నారు.
అనువాదం: కె.గంగాధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
