శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి, సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుని హిందువులు భక్తిశ్రద్ధలతో దీపావళి జరుపుకుంటున్నారు. మన దేశంలో ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూ వస్తోంది.
‘రామాయణ, మహాభారతాలు కాల్పనిక రచనలు, వాటికి ఆధారాలేవీ ఉండవు’ అనే హేతువాదుల వాదనలు కాసేపు పక్కన పెడదాం. వారు రాసుకున్న సంప్రదాయ రచనల ప్రకారమే రాముడు అయోధ్యకు ఇదే రోజు వచ్చాడు అనడానికి ఆధారం ఏది? అంటే రామభక్తుడు తులసీదాస్ రాసిన ‘రామ్చరిత్ మానస్’లో జవాబు దొరుకుతుంది. అందులోని ఎనిమిదో పేజీలో ఈ విషయం స్పష్టంగా ఉంది. శ్రీరాముడు వైశాఖ మాసంలో అయోధ్యకు వచ్చాడు అని.
ఏప్రిల్లో జరగాల్సిన పండగ నవంబరులో ఎందుకు?
వైశాఖం అంటే అది ఏప్రిల్ నెల అవుతుంది. దాని ప్రకారం దీపావళి పండగ ఏప్రిల్ నెలలో జరుపుకోవాలి కదా? మరి నవంబరు నెలలో ఎందుకు జరుపుకుంటున్నారు? ముందు దసరా, తర్వాత దీపావళి జరుపుకోవడం సంప్రదాయమైపోయింది.
ఏప్రిల్ నెలలో జరుపుకోవాల్సిన పండగ ఆరు నెలల తర్వాత ఎందుకు జరుపుకుంటున్నారు? జరిగిన ఈ మార్పు గురించి మామూలు జనం కాదు కదా, విద్యావంతులే లోతుగా ఆలోచించలేకపోతున్నారు. ఎవరైనా బలవంతంగా ఈ మార్పులు చేశారా? ఆలోచించుకోవాలి కదా?
సరే, ఇది అలా ఉండనిస్తే.. ఈ దీపావళిని మరి బౌద్ధులు ఎందుకు జరుపుకుంటున్నారు? వారికేమి సంబంధం?
‘దీపదానోత్సవం’ ఎలా మొదలైంది?
దీపావళిని నవంబరు నెలలో వచ్చే కార్తీక అమావాస్య రోజు జరుపుకుంటున్నాం. ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యం ఏమంటే, జ్ఞానోదయమైన తర్వాత బుద్ధుడు తన సొంత నగరమైన కపిలవస్తుకు తిరిగి వచ్చిన రోజు. ఒక్కసారి వచ్చి కనపడి పోవాల్సిందిగా తండ్రి శుద్ధోదనుడు ఎంతోమందితో బుద్ధుడికి వర్తమానం పంపాడు.
అయితే తీసుకువస్తామని వెళ్లిన వాళ్లు బౌద్ధం స్వీకరించి అక్కడే బుద్ధుడి దగ్గర ఉండిపోతున్నారు. అలా అనేకసార్లు జరిగిన తర్వాత చివరకు ఎప్పుడో ఒకసారి బుద్ధుడికి వర్తమానం అందింది.
తను తన భిక్షు సంఘంతో కపిలవస్తుకు వస్తున్నానని బుద్ధుడు తండ్రికి కబురు పంపాడు. ఆ తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఘనంగా ఆహ్వానించాలని ఏర్పాట్లు చేశాడు.
బుద్ధుడు వస్తున్నది కార్తీక అమావాస్య. చిమ్మచీకటి ఉంటుంది. అందుకని వీధుల నిండా దీపాలు వెలిగించాలని ఆజ్ఞాపించాడు. ధనవంతులు తమ భవనాల్లోనూ, వీధుల్లోనూ దీపాలు వెలిగించారు. శ్రీమంతులు నిరుపేదలకు దీపాలు దానం చేశారు. అలా అది ‘దీపదానోత్సవం’ అయ్యింది.
అప్ప దీపో భవ
జ్ఞానోదయమైన తర్వాత బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి వచ్చిన రోజుని నగరవాసులంతా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. దీపం జ్ఞానానికి సంకేతం. బుద్ధుడికి జ్ఞానోదయమైందన్న దానికి సంకేతంగా రాజ్యమంతా దీపాల వెలుగులతో నింపేశారు.
బుద్ధుడి సందేశం కూడా అదే – ‘అప్ప దీపో భవ’. అంటే, నీకు నువ్వే దీపమై పో అని. నువ్వు జ్ఞాన దీపమై వెలుగుతూ ఉంటే.. నీ చుట్టూ ఉన్నవాళ్లు కూడా జ్ఞానవంతులవుతారు అని అందులోని అంతరార్థం.
అశోకుడి కాలంలో దీపాల పండగ
ఆ తర్వాతి కాలంలో అశోకుడు బౌద్ధాన్ని దేశవిదేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయించిన విషయం మనకు తెలుసు. తన రాజ్యమంతటా 84 వేల బౌద్ధ స్థూపాలు, స్తంభాలు ఏర్పాటు చేయించాడు. వాటి ప్రారంభోత్సవం అదే దీపదానోత్సవం రోజు చేయించాడు. ఆయా స్థూపాల మీద, స్తంభాల మీద, దీపాలు వెలిగించి – బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి వచ్చిన రోజు గుర్తుండేలా వాటన్నింటినీ అదే రోజు ప్రారంభించాడు. అలా మగధ సామ్రాజ్యమంతా దీపదానోత్సవం రోజు పెద్దఎత్తున వేడుకలు జరిగాయి.
ప్రాచీన భారత చరిత్ర తెలుసుకుంటే, భారతీయ మూలాల గురించి తెలుసుకుంటే తెలిసే విషయాలు ఇవి. దీపావళి బౌద్ధుల పండగ. బుద్ధుడు, అశోకుడు కల్పిత పాత్రలు కాదు. చారిత్రక పురుషులు అన్న విషయం మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
