1917 నవంబరు 7న (పాత రష్యన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరు 25న) లెనిన్ నాయకత్వంలో రష్యా విప్లవం జయప్రదమైంది. కార్మికవర్గమే పాలకవర్గంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. ప్రపంచ చరిత్రలో ఇదే ప్రప్రథమం.
మార్క్స్, ఎంగెల్స్ తయారుచేసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను లెనిన్ రష్యా పరిస్థితులకు అన్వయించి విప్లవాన్ని జయప్రదం చేశారు. ఆ విధంగా మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది.
జార్ చక్రవర్తుల పాలన
1917 విప్లవానికి ముందు రష్యాను పాలించిన చివరి చక్రవర్తి నికోలస్-2. ఆయన 1894లో సింహాసనాన్ని అధిష్ఠించి 1917 ఫిబ్రవరి విప్లవం వరకు అధికారంలో కొనసాగాడు.
జార్ పాలనలో ప్రభుత్వాన్ని విమర్శించేవారిపై నిర్బంధం ఉండేది. పత్రికా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛ పరిమితంగా ఉండేవి. పోలీసు వ్యవస్థ, గూఢచారి వ్యవస్థ ద్వారా ప్రజా ఉద్యమాలను అణచివేసేవారు.
భూస్వాములు, రాజవంశీకులు, ఉన్నత వర్గాలు ప్రత్యేక హక్కులు అనుభవించేవారు. రైతులు అధిక పన్నులు, అప్పుల భారం, భూస్వాముల దోపిడీ, కరువు, పేదరికం, నిరక్షరాస్యత సమస్యలతో సతమతమయ్యేవారు. భూమి దున్నే రైతుకు భూమిపై హక్కులు లేకపోవడం సామాజిక అసంతృప్తికి ప్రధాన కారణమైంది.
19వ శతాబ్దం చివరి దశలో రష్యాలో పారిశ్రామికీకరణ ప్రారంభమైంది. సెయింట్ పీటర్స్బర్గ్, మాస్కో వంటి నగరాల్లో భారీ పరిశ్రమలు, రైల్వేలు, గనులు, ఉక్కు కర్మాగారాలు అభివృద్ధి చెందాయి. అయితే పారిశ్రామికంగా మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.
రోజుకు 10 నుంచి 12 గంటలకు పైగా పని, అతి తక్కువ వేతనాలు, ప్రమాదకరమైన పని వాతావరణం, సరైన నివాస సదుపాయాల కొరత, కార్మిక సంఘాలపై ఆంక్షలు ఉండేవి. సమ్మెలు, నిరసనలపై పోలీసుల అణచివేత సర్వసాధారణంగా ఉండేది.
అణచివేత
1905 జనవరి 22న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో కార్మికులు తమ సమస్యలను జార్‌కు తెలియజేయడానికి ఫాదర్ గాపోన్ నాయకత్వంలో కార్మికులు శాంతియుతంగా తమ కుటుంబాలతో కలిసి జార్ నివాసమైన వింటర్ ప్యాలెస్ వైపు కదిలారు.
సైన్యం వారిపై కాల్పులు జరిపింది. వందలాది మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ ఘటన చరిత్రలో బ్లడీ సండేగా ప్రసిద్ధి చెందింది.
ఫిబ్రవరి విప్లవం – జార్ పాలనకు ముగింపు
1917 ఫిబ్రవరిలో(గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి) పెట్రోగ్రాడ్‌లో మహిళలు, కార్మికులు ఆహార కొరతకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు.
ఈ ఉద్యమంలో కార్మికులతో పాటు సైనికులు కూడా చేరారు. సైన్యంలో ఒక వర్గం ప్రజలపై కాల్పులు జరపడానికి నిరాకరించింది. తిరుగుబాటు చేసిన సైనికులు ఉద్యమకారులకు మద్దతు పలికారు. చివరకు 1917 మార్చి 15న(పాత రష్యన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 2న) నికోలస్-2 సింహాసనాన్ని వదులుకున్నాడు. దీంతో రష్యాలో దాదాపు మూడు శతాబ్దాల రోమనోవ్ రాజవంశ పాలన ముగిసింది.
జార్ పాలన ముగిసినంత మాత్రాన ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదు. తాత్కాలిక ప్రభుత్వం యుద్ధాన్ని కొనసాగించింది. భూమి సమస్య, ఆహార కొరత, కార్మికుల సమస్యలు అలాగే కొనసాగాయి.
నవంబర్ 7, 1917 – అక్టోబర్ విప్లవం: లెనిన్ నాయకత్వంలో కార్మిక, కర్షక ప్రభుత్వం
1917 నవంబరు 7న(పాత రష్యన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబరు 25న) పెట్రోగ్రాడ్‌లో బోల్షెవిక్ నాయకత్వంలో సాయుధ తిరుగుబాటు ప్రారంభమైంది.
విప్లవకారులు కీలక ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, సమాచార కేంద్రాలు, వంతెనలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. చివరకు వింటర్ ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూలదోశారు. అదే రోజు సమావేశమైన రెండవ ఆల్-రష్యా సోవియట్ల కాంగ్రెస్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
లెనిన్ నాయకత్వంలో కార్మికులు, రైతుల ప్రభుత్వంగా ప్రకటించబడిన పీపుల్స్ కమిసార్ల మండలి(Council of People’s Commissars) ఏర్పడింది.
విప్లవానంతరం
లెనిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి రష్యాను బయటకు తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది.
1918 మార్చి 3న జర్మనీతో బ్రెస్ట్-లిటోవ్స్క్ ఒప్పందం కుదుర్చుకుని యుద్ధం నుంచి వైదొలిగింది. ఈ ఒప్పందంలో రష్యా విస్తారమైన భూభాగాలను వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ యుద్ధం నుంచి బయటపడటానికి ప్రభుత్వం దీనిని అవసరమైన చర్యగా భావించింది.
భూమి శాసనం (Decree on Land): భూస్వాముల భూములను స్వాధీనం చేసుకుని రైతుల వినియోగానికి అందించే విధంగా భూమి శాసనం ప్రకటించింది. దీని ద్వారా పెద్ద భూస్వాముల భూములపై ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేయడానికి చర్యలు చేపట్టింది.
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మికులకు ఎనిమిది గంటల పని చట్టం చేసింది. పరిశ్రమల్లో కార్మికుల హక్కులు, పని పరిస్థితులను మెరుగుపరిచే చర్యలు తీసుకుంది. ప్రధాన బ్యాంకులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను బలోపేతం చేసింది.
పరిశ్రమల నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించింది. పెద్ద పరిశ్రమలను జాతీయం చేసింది. మత సంస్థల ఆధిపత్యం నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థను విడదీసి లౌకిక విద్యకు ప్రాధాన్యం ఇచ్చింది.
మహిళలకు చట్టపరమైన సమానత్వం, విడాకుల హక్కులు, పౌర వివాహ వ్యవస్థ వంటి మార్పులకు శ్రీకారం చుట్టింది. సార్వజనీన ఓటు హక్కు కల్పించింది. నాటికి అమెరికాలో కూడా స్త్రీలకు ఓటు హక్కు లేదు. 1918లో సోవియట్ రష్యాలో పౌర వివాహం, కుటుంబ చట్టాల్లో ముఖ్యమైన సంస్కరణలు జరిగాయి.
లెనిన్ ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం
విప్లవం తర్వాత రష్యా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1918 నుంచి 1921 వరకు అంతర్యుద్ధం, విదేశీ సైనిక జోక్యం, ఆహార కొరత, పారిశ్రామిక ఉత్పత్తి పతనం దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
ఈ సమయంలో ప్రభుత్వం “యుద్ధ కమ్యూనిజం” విధానాన్ని అనుసరించింది. ధాన్యం సేకరణ, పరిశ్రమలపై ప్రభుత్వ నియంత్రణ, ప్రైవేటు వాణిజ్యంపై ఆంక్షలు వంటి చర్యలు తీసుకుంది. అయినా ఆర్థిక వ్యవస్థలో సమస్యలు తలెత్తాయి. దీంతో 1921లో లెనిన్ నూతన ఆర్థిక విధానం(ఎన్ఈపీ) ప్రవేశపెట్టాడు.
దాని ముఖ్యాంశాలు: రైతుల నుంచి బలవంతంగా ధాన్యం సేకరించే విధానానికి బదులుగా పన్ను విధానం ప్రవేశపెట్టడం. రైతులు తమ మిగులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునేందుకు అనుమతించడం.
చిన్న పరిశ్రమలు, చిన్న వ్యాపారాలకు ప్రైవేటు నిర్వహణకు అవకాశం కల్పించడం. పెద్ద పరిశ్రమలు, బ్యాంకులు, రైల్వేలు, విదేశీ వాణిజ్యంపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగించడం.
వ్యవసాయ ఉత్పత్తి, వాణిజ్యం, పారిశ్రామిక కార్యకలాపాలను తిరిగి పునరుద్ధరించడం. ఎన్ఈపీ ఫలితంగా 1920ల మధ్య నాటికి రష్యా ఆర్థిక వ్యవస్థ గణనీయంగా కోలుకుంది. 1928 నాటికి తలసరి ఆదాయం యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి చేరుకుంది.
సోవియట్ యూనియన్ ఆవిర్భావం
1917 విప్లవం తర్వాత రష్యాలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అయితే అంతర్యుద్ధం, రాజకీయ ఘర్షణలు, వివిధ ప్రాంతాల్లో అధికార పోరాటాల తర్వాత అనేక సోవియట్ రిపబ్లిక్లు ఏర్పడ్డాయి. వీటిని ఒకే సమాఖ్యగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.
1922 డిసెంబరు 30న సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ల సమాఖ్య (Union of Soviet Socialist Republics – USSR) అధికారికంగా ఏర్పడింది.
ప్రారంభంలో నాలుగు సమాఖ్య భాగస్వాములు ఉన్నాయి. అవి: రష్యన్ సోవియట్ ఫెడరేటివ్ సోషలిస్టు రిపబ్లిక్, ఉక్రేనియన్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్, బెలారసియన్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్, ట్రాన్స్‌కాకేసియన్ సోవియట్ ఫెడరేటివ్ రిపబ్లిక్(అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా). తర్వాత ఈ సమాఖ్య విస్తరించి 15 యూనియన్ రిపబ్లిక్‌లుగా మారింది.
1924లో మొదటి సోవియట్ రాజ్యాంగం
సోవియట్ యూనియన్ సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను, సమాఖ్య రాజకీయ వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో పనిచేసింది.
ముఖ్యంగా ఉత్పత్తి సాధనాలపై ప్రభుత్వ, సామూహిక యాజమాన్యం, భారీ పరిశ్రమలు, గనులు, రైల్వేలు, బ్యాంకులు, ఇంధన వనరులు ప్రధానంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి.
దేశ ఆర్థికాభివృద్ధికి ఐదేళ్ల ప్రణాళికలు ప్రవేశపెట్టారు. పరిశ్రమల ఉత్పత్తి, వ్యవసాయం, విద్యుత్తు, రవాణా, మౌలిక సదుపాయాలకు లక్ష్యాలు నిర్దేశించేవారు.
సామాజిక సమానత్వం: సంపద, ఆదాయ అసమానతలను తగ్గించి ప్రతి ఒక్కరికీ ఉపాధి, విద్య, వైద్యం, నివాసం వంటి సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశారు.
నిరక్షరాస్యత నిర్మూలనకు భారీ కార్యక్రమాలు చేపట్టారు. అందరికీ ఉచిత విద్య విధానాన్ని అమలు చేశారు. అందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే విధానం అమలు చేశారు.
మహిళలకు విద్య, ఉపాధి, రాజకీయ భాగస్వామ్యంలో అవకాశాలు పెంచారు. ప్రసూతి సెలవులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు వంటి సదుపాయాలను అభివృద్ధి చేశారు.
వివిధ జాతులు, భాషలు, ప్రాంతాలకు చెందిన రిపబ్లిక్లను ఒకే సమాఖ్యలో భాగస్వాములుగా చేర్చారు. రాజ్యాంగపరంగా రిపబ్లిక్లకు స్వయం నిర్ణయ హక్కు, సమాఖ్య నుంచి విడిపోయే హక్కు కూడా ప్రకటించబడింది.
సోవియట్ యూనియన్ సాధించిన విజయాలు
1917 విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ప్రపంచంలోని ప్రధాన పారిశ్రామిక, శాస్త్రీయ, సైనిక శక్తుల్లో ఒకటిగా ఎదిగింది. అనేక రంగాల్లో అది సాధించిన విజయాలు ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి.
కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌లో లెనిన్ ప్రతిపాదన
1920లో కమ్యూనిస్టు మూడవ ఇంటర్నేషనల్ రెండవ మహాసభలో లెనిన్ “జాతీయ, వలస ప్రశ్నలపై థీసిస్” (Theses on the National and Colonial Question) ప్రవేశపెట్టాడు. అది ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న వలసవాద వ్యతిరేక పోరాటాలకు ఒక కీలకమైన రాజకీయ మార్గదర్శకంగా నిలిచింది.
“సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వలస దేశాల ప్రజలు సాగించే జాతీయ విముక్తి ఉద్యమాలకు కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వాలి. కార్మికవర్గ ఉద్యమాలు, జాతీయ బూర్జువా నాయకత్వంలోని సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తుల మధ్య అవసరమైన సందర్భాల్లో ఐక్య సంఘటన(United Front) నిర్మించాలి” అని లెనిన్ ప్రతిపాదించారు.
“జాతీయ బూర్జువా నాయకత్వాన్ని షరతులు లేకుండా అనుసరించకూడదు. కార్మికులు, రైతులు, పీడిత ప్రజల స్వతంత్ర వర్గ సంఘటనలను బలోపేతం చేయాలని, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో ఐక్యతతో పాటు వర్గ స్వతంత్రతను కూడా కాపాడుకోవాలి” అని ఆయన నొక్కిచెప్పారు.
ఈ విధంగా వలస దేశాల స్వాతంత్ర్య పోరాటాలను ప్రపంచ కార్మికవర్గ విప్లవోద్యమంతో అనుసంధానించడం ఆయన థీసిస్ ప్రధాన లక్ష్యం.
లెనిన్ మరణానంతరం అలెక్సి రికొవ్ ప్రభుత్వ అధిపతిగా, మీఖాయిల్ కలినిన్ దేశాధినేతకు సమానమైన పదవిలో కొనసాగారు.
1928 నుంచి స్టాలిన్ నాయకత్వంలో ఐదేళ్ల ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. మొదటి ఐదేళ్ల ప్రణాళిక 1928–1932 మధ్య అమలైంది. ఉక్కు పరిశ్రమను విస్తరించారు. బొగ్గు, ఇనుము, చమురు ఉత్పత్తిని పెంచారు.
భారీ యంత్రాల పరిశ్రమలను నిర్మించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. రైల్వేలు, రవాణా వ్యవస్థను విస్తరించారు.
ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు, పారిశ్రామిక సామగ్రి తయారీని అభివృద్ధి చేశారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కొన్ని దశాబ్దాల్లోనే భారీ పారిశ్రామిక శక్తిగా మారింది.
రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం
1941లో హిట్లర్ నాయకత్వంలో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్‌పై దాడి చేసింది. సోవియట్ ప్రజలు, సైన్యం అపారమైన త్యాగాలు చేసి జర్మనీని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు.
సుమారు 2 కోట్ల 70 లక్షల మంది సోవియట్ సైనికులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1945లో బెర్లిన్ను స్వాధీనం చేసుకోవడంతో నాజీ జర్మనీ పరాజయం పాలైంది. తూర్పు జర్మనీలోని పలు దేశాలు సోషలిస్ట్ వ్యవస్థ దిశగా మార్పు జరిగాయి.
అంతరిక్ష పరిశోధనల్లో చారిత్రక విజయాలు
సోవియట్ యూనియన్ శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచానికి అనేక కొత్త మైలురాళ్లను పరిచయం చేసింది. 1957లో ప్రపంచంలో తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్-1 ప్రయోగం విజయవంతమైంది.
లైకా అనే కుక్కను అంతరిక్షంలోకి పంపారు. 1961లో ప్రపంచంలో మొట్టమొదటిసారి యూరీ గగారిన్ మానవ అంతరిక్ష యాత్ర చేశారు. 1963లో వాలెంటినా తెరెష్కోవా తొలి మహిళా అంతరిక్ష యాత్ర చేశారు.
విద్య, శాస్త్ర విజ్ఞానం, సాంకేతిక రంగం
విప్లవానికి ముందు రష్యాలో నిరక్షరాస్యత అధికంగా ఉండేది. సోవియట్ ప్రభుత్వం విద్యను సామాజిక అభివృద్ధిలో ప్రధాన సాధనంగా గుర్తించింది.
ప్రాథమిక విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. ఉన్నత విద్యకు ప్రభుత్వ మద్దతు పెంచింది. ఇంజనీరింగ్, వైద్యం, విజ్ఞాన శాస్త్రాల్లో విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేసింది.
పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలను స్థాపించింది. మహిళలు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు విద్యావకాశాలను విస్తరించింది.
ఫాసిజం, వలసవాదం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా
రెండవ ప్రపంచ యుద్ధంలో ఫాసిజంపై సాధించిన విజయం తర్వాత ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో జాతీయ విముక్తి ఉద్యమాలు బలపడ్డాయి.
సోవియట్ యూనియన్ అనేక వలస పాలిత దేశాల స్వాతంత్ర్య ఉద్యమాలకు రాజకీయ, దౌత్య, ఆర్థిక, సైనిక సహకారం అందించింది.
వలస పాలనకు వ్యతిరేకంగా వివిధ దేశాల్లో జరుగుతున్న స్వాతంత్ర్య ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది. కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారత్ లాంటి దేశాలకు పారిశ్రామిక, సాంకేతిక సహాయం, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు శిక్షణ, అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు, భారీ పరిశ్రమలు, విద్యుత్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహకారం అందించింది.
నిరుద్యోగ నిర్మూలన
సోవియట్ వ్యవస్థలో అందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా ఉండేది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాలు, రైల్వేలు, విద్యుత్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉపాధి కల్పించేవి.
పనిచేయగలిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్న విధానం అమలుచేసి నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపింది. చిట్టచివరి నిరుద్యోగికి ఉపాధి కల్పించి సన్మానించిన ఏకైక దేశం ప్రపంచంలో సోవియట్ యూనియన్. దీని వల్ల కుటుంబాలకు నిరంతర ఆదాయం లభించేది.
నిరుద్యోగ భయంతో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి పోయింది. కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండేది. సామాజిక భద్రతా వ్యవస్థ బలపడింది.
ధరల నియంత్రణ
సోవియట్ ఆర్థిక వ్యవస్థలో నిత్యావసర వస్తువుల ధరలను ప్రభుత్వం నిర్ణయించేది. ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.
ఆహార పదార్థాలు, రవాణా, అద్దెలు, విద్యుత్తు, ఇతర ప్రాథమిక సేవలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉండేది. దీని వల్ల ప్రజలపై ధరల పెరుగుదల ప్రభావం నియంత్రించబడింది. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు గరిష్టంగా మెరుగుపడ్డాయి.
అందరికీ విద్య
సోవియట్ యూనియన్‌లో విద్యను ప్రభుత్వ బాధ్యతగా స్వీకరించింది. పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత విద్య అందించారు. నిరక్షరాస్యతను నిర్మూలించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు నిర్మించారు. మహిళలకు విద్యలో సమాన అవకాశాలు కల్పించారు. ఇంజనీరింగ్, వైద్యం, విజ్ఞాన శాస్త్రాల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేశారు.
సాంకేతిక విద్య, వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యను ధనికులకే పరిమితం చేయకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విజయం.
అందరికీ వైద్యం
సోవియట్ యూనియన్‌లో సెమాష్కో ఆరోగ్య విధానం(Semashko Model) అమలులో ఉండేది. దీని ప్రకారం ప్రభుత్వమే వైద్య సేవలను నిర్వహించి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేది.
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ వైద్య సేవలను గణనీయంగా అభివృద్ధి చేసింది.
టీకా కార్యక్రమాలు, ప్రసూతి, శిశు సంరక్షణ చర్యలు చేపట్టింది. వైద్య విద్య, వైద్య పరిశోధనను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసింది. ప్రజల ఆదాయంతో సంబంధం లేకుండా వైద్య సేవలు అందించాలనే సూత్రం ఈ వ్యవస్థకు పునాది.
అందరికీ గృహ సదుపాయం
సోవియట్ ప్రభుత్వం ప్రజలకు నివాస సదుపాయం కల్పించడాన్ని సంక్షేమ బాధ్యతగా తీసుకుంది. ప్రభుత్వం భారీ స్థాయిలో అపార్ట్మెంట్ భవనాలు నిర్మించింది.
కార్మికులు, ఉద్యోగులు, కుటుంబాలకు తక్కువ అద్దెతో గృహాలు కేటాయించేవారు. దీని వల్ల లక్షలాది కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో నివాస సదుపాయం లభించింది.
ప్రపంచ మానవ కల్యాణానికి సోవియట్ యూనియన్ మార్గదర్శి
సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాల సోషలిస్ట్ నిర్మాణ దేశాలు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అభివృద్ధి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వణుకుపుట్టింది.
ఒకవైపు సోషలిజాన్ని రూపుమాపాలనే కసి, మరోవైపు ప్రజలకు కొన్ని సదుపాయాలు కల్పించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. లేకపోతే మిగిలిన చాలా దేశాలు కూడా సోవియట్ మార్గం అనుసరిస్తాయనే భయం పట్టుకుంది. దాని ఫలితమే యూరప్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఉచిత విద్య, సార్వజనీన వైద్యం, వృద్ధుల సంరక్షణ లాంటి పథకాలను ప్రభుత్వాలు చేపట్టాయి. ఆ విధంగా ప్రపంచ మానవ కల్యాణానికి సోవియట్ ఆదర్శంగా నిలిచింది.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు సోవియట్ ఏమి నేర్పింది?
1917 రష్యా విప్లవం, సోవియట్ యూనియన్ నిర్మించి చూపిన పలు అంశాలు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మార్గదర్శి అయ్యాయి.
పారిశ్రామిక స్వావలంబన (భారీ పరిశ్రమలు, ఉక్కు, యంత్ర పరికరాలు, విద్యుత్తు, రవాణా వంటి రంగాలు) అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ రంగ ప్రాధాన్యత (దేశానికి అవసరమైన కీలక రంగాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు బలంగా ఉండాలి), ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి. విద్య, వైద్యం ప్రజల హక్కులు (పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదు. ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ప్రజలు వైద్యానికి దూరం కాకూడదు), ఉపాధి, సామాజిక భద్రత (ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు తగిన ఉపాధి, కనీస ఆదాయ భద్రత ఉండాలి), ఆర్థిక సమానత్వం (దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలి), ప్రజాస్వామ్యం, పౌర స్వేచ్ఛలు (ఆర్థిక సమానత్వంతో పాటు రాజకీయ స్వేచ్ఛ, ప్రజాస్వామిక హక్కులు కూడా అవసరం).
భారతదేశ అభివృద్ధికి సోవియట్ యూనియన్ సహకారం
స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం పారిశ్రామికంగా వెనుకబడిన దేశం. భారీ యంత్రాల పరిశ్రమలు, ఉక్కు, విద్యుత్తు, చమురు అన్వేషణ, రక్షణ ఉత్పత్తి వంటి రంగాల్లో దేశీయ సామర్థ్యం పరిమితంగా ఉండేది.
పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని భారత ప్రభుత్వం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ రంగ పారిశ్రామిక అభివృద్ధిని ప్రధాన లక్ష్యాలుగా తీసుకుంది. ఈ దిశగా సోవియట్ యూనియన్ అందించిన సాంకేతిక, ఆర్థిక సహకారం అత్యంత కీలకమైనది.
భిలాయ్ ఉక్కు కర్మాగారం: 1955లో భారత్–సోవియట్ ఒప్పందం కుదిరింది. దాని ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌లో భిలాయ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోవియట్ సాంకేతిక, పారిశ్రామిక సహాయం అందింది.
1959లో అప్పటి సోవియట్ నాయకుడు నికిటా క్రుష్చెవ్ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో కర్మాగారాన్ని ప్రారంభించారు. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ ప్లాంట్ కూడా సోవియట్ సహకారంతో ఏర్పడిన ప్రముఖ భారీ పరిశ్రమ. ఇది భారతదేశ ఉక్కు పరిశ్రమలో కీలక పాత్ర పోషించింది.
రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్(HEC) వంటి భారీ యంత్రాల తయారీ రంగాలకు సోవియట్ సాంకేతిక సహకారం అందింది.
ఈ పరిశ్రమల ద్వారా ఉక్కు కర్మాగారాలకు అవసరమైన యంత్రాలు, గనుల తవ్వకాలకు ఉపయోగించే పరికరాలు, భారీ పారిశ్రామిక యంత్రాలు, విద్యుత్ ఉత్పత్తి రంగాలకు అవసరమైన పరికరాలను దేశంలోనే తయారుచేసే సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడింది.
భారతదేశంలో చమురు అన్వేషణ, భౌగోళిక పరిశోధన, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిలో సోవియట్ నిపుణుల సహకారం అందింది. ఓఎన్జీసీ వంటి సంస్థల అభివృద్ధి దశలో సోవియట్ సాంకేతిక సహకారం ముఖ్యమైనది. భారతదేశానికి సోవియట్ యూనియన్ విమానాలు, యుద్ధ విమానాల సాంకేతిక పరిజ్ఞానం, హెలికాప్టర్లు, రక్షణ పరికరాలు అందించింది. భారతదేశంలో రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరగడానికి కూడా ఈ సహకారం తోడ్పడింది.
భారతీయ విద్యార్థులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు సోవియట్ యూనియన్ విద్యా, సాంకేతిక శిక్షణా అవకాశాలు కల్పించింది. భారతదేశానికి తక్కువ వడ్డీ రుణాలు, రూపాయిల్లో తిరిగి చెల్లించే ఆర్థిక ఒప్పందాలు కూడా సోవియట్ సహకారంలో భాగంగా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే, భారతదేశంలో ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమల నిర్మాణం, స్వావలంబన, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి సోవియట్ సహకారం గణనీయమైన తోడ్పాటు అందించింది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం
ప్రపంచంలోని అనేక దేశాలు స్వాతంత్ర్యం సాధించడం, ప్రజల సంక్షేమ చర్యలు అమలు చేయడం సామ్రాజ్యవాదానికి మింగుడుపడలేదు. ఎలాగైనా సోవియట్ యూనియన్ను, సోషలిస్ట్ వ్యవస్థను నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. కుట్రలు, కుతంత్రాలు పన్ని, సోవియట్‌తో పాటు తూర్పు యూరప్‌లోని సోషలిస్ట్ దేశాల్లో సీఐఏ ఏజెంట్ల ద్వారా సంస్కరణవాద భావాలను వ్యాప్తి చేసింది.
అదే సందర్భంలో సోషలిజం నిర్మాణంలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. ఫలితంగా సోవియట్ విచ్ఛిన్నం, తూర్పు యూరప్ దేశాల సోషలిస్ట్ ప్రభుత్వాల పతనానికి నాంది మొదలైంది.
1991 డిసెంబరు 8న రష్యా, ఉక్రెయిన్, బెలారస్ నాయకులు బెలోవెజా ఒప్పందంపై సంతకాలు చేశారు. డిసెంబరు 25న గోర్బచెవ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు.
డిసెంబరు 26, 1991న సోవియట్ యూనియన్ అధికారికంగా రద్దయింది. దీంతో 15 స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం ప్రపంచ రాజకీయాల్లో ఒక యుగానికి ముగింపుగా నిలిచింది.
సోవియట్ యూనియన్, సోషలిస్ట్ శిబిరం విచ్ఛిన్నం – ప్రజల ఇక్కట్లు
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత 15 దేశాలు వేర్వేరు రాజకీయ, ఆర్థిక విధానాలను అనుసరించాయి.
గతంలో ఒకే ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఉన్న ఈ దేశాలు మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా మారడం ప్రారంభించాయి. ఈ మార్పు ప్రజలందరికీ ఒకే విధమైన ఫలితాలను ఇవ్వలేదు. 1991 తర్వాత బోరిస్ యెల్ట్సిన్ నాయకత్వంలోని రష్యా ప్రభుత్వం వేగంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ధరల నియంత్రణ తొలగింపు, మార్కెట్ స్వేచ్ఛ వంటి చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు.
సరుకుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రజల పొదుపు గణనీయంగా తగ్గింది. ప్రభుత్వ పరిశ్రమలు మూతపడ్డాయి, ప్రైవేటీకరించబడ్డాయి. ఉద్యోగ భద్రత పోయింది. నిరుద్యోగం పెరిగింది. పెన్షన్లు, వేతనాలు సకాలంలో అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిమంది చేతుల్లో అపారమైన సంపద కేంద్రీకృతమైంది.
1991లో పురుషుల సగటు ఆయుర్దాయం 63.5 సంవత్సరాలు ఉండగా, 1994 నాటికి 57.6 సంవత్సరాలకు పడిపోయింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న జనాభా శాతం పెరిగింది.
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత మార్కెట్ ఆర్థిక వ్యవస్థలు కొన్ని అవకాశాలను సృష్టించినప్పటికీ, కోట్లాది మంది ప్రజలు పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక భద్రత కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ వృద్ధితోనో, సంపన్నుల సంఖ్యతోనో కొలవకూడదు. ఆ దేశంలో సాధారణ ప్రజలకు ఉపాధి ఉందా? పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? ప్రతి ఒక్కరికీ వైద్యం లభిస్తోందా? ప్రజలకు గౌరవప్రదమైన నివాసం ఉందా? ఆర్థిక అసమానతలు తగ్గుతున్నాయా? ప్రజాస్వామిక స్వేచ్ఛలు ఉన్నాయా? అనే అంశాల ఆధారంగా అభివృద్ధిని అంచనా వేయాలి.
సోవియట్ పతనం-భారతదేశ ప్రజల పరిస్థితి
1950 నుంచి 1980ల వరకు భారతదేశానికి స్వర్ణయుగం అని చెబుతారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల అభివృద్ధి, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. విద్య, వైద్యం ప్రధానంగా ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా అందించింది.
సోవియట్ పతనం తర్వాత ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌లు సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగం నీరుగార్చబడింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు. ఎలాంటి భద్రత, సరైన వేతనాలు లేని తాత్కాలిక ఉపాధి పద్ధతి అమలులోకి వచ్చింది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రారంభించిన సరళీకృత విధానాల అమలు వేగాన్ని అనూహ్యంగా పెంచింది. కొద్దిమందికి ప్రకృతి వనరులను, ప్రజల ఆస్తులను ధారాదత్తం చేస్తోంది.
స్వాతంత్ర్యానికి పూర్వం కూడా లేనంతగా ఆర్థిక అసమానతలు శరవేగంగా పెరిగాయి. పేదరికం, నిరుద్యోగం పెరిగాయి. ప్రజల మధ్య మతం ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టారు. ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వీధుల్లోకి వస్తున్నారు. ఇది శుభ పరిణామం.
అభివృద్ధి బండారం బట్టబయలు-ప్రజలు అవస్థల పాలు
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో పెట్టుబడిదారీ విధానం తప్ప మరో మార్గం లేదనే నినాదం TINA (There is no alternative) ప్రపంచంలో మారుమోగింది.
అమెరికా నేతృత్వంలో ఏకఛత్రాధిపత్యం ప్రపంచంలో నెలకొంది. కానీ అది ఎంతోకాలం నిలవలేదు. సోవియట్ విచ్ఛిన్నానికి, మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడానికి 72 సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టింది. కానీ అందులో సగం కేవలం 36 సంవత్సరాలకే అమెరికాతో సహా ప్రపంచంలోని పెట్టుబడిదారీ దేశాలన్నీ తీవ్ర సంక్షోభంలో కూరుకున్నాయి. ఆయా దేశాల్లో ప్రజల సమస్యలు ఇబ్బడిముబ్బడి అయ్యాయి.
దాదాపు రెండు దశాబ్దాల పాటు సంక్షోభాల నుంచి బయటపడుతున్నామని కొన్ని చిట్కా ప్రయోగాలు ప్రభుత్వాలు చేశాయి. ప్రజల్లో ఆశలు, భ్రమలు కల్పించాయి. కానీ అవన్నీ మోసపూరితమని, గాలి బుడగలని క్రమంగా ప్రజలు గుర్తిస్తున్నారు.
సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతోంది. క్రోనీ క్యాపిటలిజం, ప్రకృతి వనరులను ప్రభుత్వాలు కొద్దిమందికి స్వాధీనం చేస్తున్నాయి.
అభివృద్ధి ముసుగులో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం, గృహ వసతి, విద్య, వైద్యం సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. ఎన్నికల్లో బుద్ధి చెబుతున్నారు.
ఇటీవలి పరిణామాలు
గత కొన్ని నెలలుగా ప్రపంచంలోని పలు దేశాల్లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ బండారాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
హంగేరీ, బల్గేరియా, అల్బేనియా, జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, అమెరికా, ఇజ్రాయెల్, బ్రెజిల్ దేశాల్లో జరిగిన ఎన్నికల ద్వారా ప్రజలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు తగిన బుద్ధి చెప్పారు.
ఇదే సందర్భంలో వామపక్ష, సోషలిస్ట్, కమ్యూనిస్ట్ అభ్యర్థులు అనేక దేశాల్లో విజయాలు సాధిస్తున్నారు. మార్కెట్ ఆధారిత పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఉందని రుజువు అవుతోంది.
1917 రష్యా విప్లవం, సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ సోషలిస్ట్ దేశాలు ప్రపంచానికి అందించిన ప్రధాన సందేశం ఇదే- ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక సమానత్వాన్ని సాధించడం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడటం ఏ దేశానికైనా ముఖ్యమైన లక్ష్యాలు కావాలి. అందుకే నవంబరు 7ను కేవలం ఒక చారిత్రక దినంగా కాకుండా, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం, మానవ గౌరవం వంటి విలువలను పునరాలోచించుకునే రోజుగా పాటించాలి.
సమాజ అభివృద్ధికి సంపద సృష్టి ఎంత అవసరమో, ఆ సంపద ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చూడటం కూడా అంతే అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
